ఈసారి ఓ అపురూపమైన ,అపూర్వమైన పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను . దొరికితే ఆనందాన్ని ,చదివితే ఆత్మవిశ్వాసాన్ని అందించే పుస్తకం ఈ మంచి పుస్తకం .దీన్ని ఎప్పటినుంచో చదవాలి అనుకున్నాను కానీ దొరకలేదు .ఈ మధ్యకాలంలోనే దొరికింది . పుస్తకం పూర్తిగా చదవకుండానే నచ్చింది . పీఠిక , విషయ సూచిక లను చదవగానే అద్భుతం అనిపించింది .

దశాబ్దాల క్రిందట పరిమితమైన వనరులతో , అపరిమితమైన శ్రద్ధతో సేకరించి ,ప్రచురించిన గ్రంథం .ఇన్ని విశేషాలు చెప్పినా , అసలు వివరాలు వెల్లడించలేదని ఆలోచిస్తున్నారా? ఆగండా గండి .
పుస్తకం పేరు ఆంధ్ర కవయిత్రులు .రచన శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ . ఇది మద్రాసు ప్రభుత్వ పక్షాన ,తెలుగు భాషా సమితి బహుమతి పొందిన సాహితీ విమర్శ గ్రంథం . ఫిబ్రవరి 1953లో తొలిసారి ,సెప్టెంబర్ 1980లో మలి సారి ముద్రింపబడింది .ప్రచురణ కర్తలు దీన్ని రమణీ రమణీ య సాహితీ విమర్శ గ్రంథం అని ప్రశంసించారు .ఈ మాట అక్షరాల నిజం .ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ప్రఖ్యాత కవి ,రచయిత శ్రీ నాళం కృష్ణారావు గారి పుత్రిక .తల్లి పేరు శ్రీమతి సుశీలమ్మ .1917 వ సంవత్సరంలో జన్మించారు .రాజమండ్రిలో సంస్కృత కళాశాలలో సంస్కృతాం ధ్రాలను నేర్చారు .1935లో ఉభయ భాషా ప్రవీణ పరీక్షలో ప్రథమ తరగతిలో పాసయ్యారు . అప్పటికే హిందీ ,ఇంగ్లీష్ భాషలతో మంచి పరిచయం ఏర్పడింది .
సాహితీ వ్యవసాయానికి గుర్తుగా విద్వత్ కవయిత్రి ,ఆంధ్రవిదు షీ కుమారి ,ఆంధ్ర సరస్వతి , కవయిత్రి తిలక అనే బిరుదులు వరించి వచ్చాయి .

పుస్తకంలో విషయ విభాగం ,విస్తృతి మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి .
ఇందులో తొలితరం ,మలితరం , మూడవ తరం , నాలుగవ తరం ,ఐదవ తరం విభాగాలతో బాటు అనుబంధంలో మరికొందరు కవయిత్రుల వివరాలను పొందుపరిచారు .చరిత్ర తెలియని కవయిత్రులను మరో 31 మంది పేర్లను మాత్రం పేర్కొన్నారు .
తొలి తరంలో చాన మ్మ ,ప్రోలమ మొదలు తరిగొండ వెంగమాంబ వరకు 26 మంది వివరాలు రచనా శైలికి ఉదాహరణలతో ఇచ్చారు .
మలితరం అంటే వీరేశలింగం యుగములో బండారు అచ్చమాంబ మొదలు దొంతి రాజరత్నమ్మ గారి వరకు 29 మంది రచనల విశేషాలను పేర్కొన్నారు .
మూడవ తరం అంటే ఆధునికాంధ్ర వాంగ్మయం అనే పేరుతో గుడిపూడి ఇందుమతి దేవి మొదలుకొని దేశిరాజు భారతీదేవి వరకు 19 మంది కవయిత్రుల పరిచయాలు ఉన్నవి .
నాల్గవ తరం అద్యత నాంధ్ర యుగం పేరుతో స్థానాపతి రుక్మిణమ్మ గారు మొదలుకొని నాళం సుశీలమ్మ గారు అంటే రచయిత్రి తల్లి గారి వరకు 11 మంది చరిత్రలను చేర్చారు .
ఇక ఐదవ తరం నవ్యాంధ్ర యుగం పేరుతో తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మొదలు చేజర్ల రామరత్నమ్మ వరకు 41 మంది సంగ్రహ జీవిత విశేషాలు ఉన్నాయి .ఈ విభాగంలోనే వివరాలు తెలియనందున కేవలం పేర్లను మాత్రం చరిత్ర తెలియని కవయిత్రులు అనే పేరుతో 31 మందికవయిత్రుల పట్టికను ఇచ్చారు .
ఇవన్నీ ఒక ఎత్తు . అనుబంధం పేరుతో మరొక ఏడు మంది వివరాలను క్లుప్తంగా పేర్కొన్నారు . గ్రంధాన్ని స మ గ్రం చేయాలని దొరికినంత వరకు చేర్చినట్లు కనిపిస్తున్నది .
దాదాపు 200 మంది కవయిత్రుల జీవిత విశేషాలను సేకరించి ,వ్యయ ప్రయాసలకోర్చి గ్రంథ రూపంలో అందించడం ఆనాటికే కాదు నేటికీ కష్టమే . ఆ రోజుల్లో ప్రముఖ పత్రికలన్నీ పతాక శీర్షికలలో ఈ గ్రంథ విశేషాలను ప్రచురించారని పీఠికలో రచయిత్రి స్వయంగా రాశారు .
తొలి తరంలో చాన మ్మతో మొదలైన ఈ మణిహారం అనుబంధంలోని చోరగుడి హనుమత్ శేషమ్మ గారితో ముగిసింది .
