క్రూరత్వం కోరలు జాపి
మనిషి అస్తిత్వాన్ని మరిచిపోతున్నరు
ఉన్మాదంతో ఉరకలు వేస్తున్న
వయసుతో ఆగడాలకు తెగబడుతున్నరు
ప్రాణాలకు విలువనిస్తలేరు
మనిషి ప్రాణాన్ని
పశువు ప్రాణంతో ముడిగట్టి
కత్తులు, గొడ్డళ్లు,
రంపాలతో బదులిస్తుండ్రు..
సమాజంలో ఆడదానికి
విలువ లేదా..?
మానవత్వానికి చోటే లేదా..?
సమాజమా..ఎక్కడ స్వేచ్ఛ..?
కన్నవారి దగ్గర భద్రత లేదు
కట్టుకున్నోడింట భద్రత లేదు
చదువు చెప్పే ఉపాధ్యాయుల
దగ్గర భద్రత లేదు
చదువుకునే తరగతిలో భద్రత లేదు
చేసే ఉద్యోగంలో భద్రత లేదు
నడిచే దారిలో భద్రత లేదు
మరి ఎక్కడ భద్రత..?
కొన్నిసార్లు కాలం గాయం చేస్తే
మనుషులు మందు రాస్తారు
మరికొన్నిసార్లు మనుషులు
గాయం చేస్తే కాలం మందు రాస్తుంది
మరి ఇప్పుడు కాలం మనుషులు
ఒకేలా ప్రవర్తిస్తూ మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నరు..
నవ సమాజమా…
ఒక్కసారి గీ విషయాల
పైన మాట్లాడరా
ఓ నవతరమా..
ఒక్కసారి గీ క్రూరత్వాకోరలపై మీ
అక్షర రూపం దాల్చారా..
ప్రశ్నించే గొంతులు గీవాళ
జరుగుతున్న అన్యాయాలను
ఎత్తిచూపాలే
భావి భారత పౌరుల
ప్రాణాలను ఒక్కొక్కరు ఒక్కొక్క
విధంగా తీస్తుంటే
మనుషులమైన మనం
మౌనంగా ఉండొద్దు
మౌనం కాదు, మాట కావాలి
భయం కాదు, భరోసా కావాలి
ఆడబిడ్డకు భద్రత ఇచ్చే
కొత్త సమాజాన్ని మనమే నిర్మించాలి..!!