నీవు నాకు ఎరగా వేసిన
మాటల మూటలన్నీ విప్పుతూ
వాటి ఆశా పరిమళాలను
రేపంతా ఆస్వాదిస్తున్న భ్రమలో
నిన్ను గెలిపించిన ప్రతీసారి
నేను ఓడిపోతూనే ఉంటా!
నీ అసత్య ప్రమాణ వశీకరణలో
నాకు నేనుగా బందీనవుతుంటా!
ఒళ్ళంతా నిక్కబొడుచుకొని
ఇంతింత కళ్ళతో
చేటంత చెవులు చేసుకొని
ఐదేళ్ల భవితవ్యం కోసం
నీవిచ్చిన భరోసాను ధరించి
విజయ దుందుభి నాదాలతో
నీకు పల్లకీలు మోస్తూ
వాడవాడలా తిరుగుతుంటా!
అధికార పీఠంపై పాలకునిగా నీవు
అన్యాయపు పంజా విసురుతుంటావు
నిన్ను ఎన్నుకున్న దౌర్బల్యానికి
పచ్చిముద్దగా నెత్తురోడుతూ నేను
శూన్యంలో ఊరడిల్లుతుంటాను
దశాబ్దాలుగా నా ప్రజాచరిత్ర నిండా
గాయాల మరకల పేజీలే!
ధనపిపాసులుగా
ఏక లక్షణం కలిగిన
బహురూప నాయకులు మీరు!
పాలనా నియమాలను ఏమార్చి
అస్తిత్వాన్నే అమ్ముకునే వేషధారులు!
మీ అప్రయోజనవాద సామ్రాజ్యంలో
మా తలరాతలెప్పుడూ వక్రగీతలే !!
మారని బతుకు వెతల చిత్రాలే !!
2026న తెలంగాణా రచయితల సంఘం 12వ వార్షికోత్సవ (నవంబర్ 1వ తేదీ) సందర్భంగా చదివిన కవిత