సోయి…!
శనార్తులు
“అరే భాయ్! నీళ్లు లేక ట్యాంకర్ల దిక్కు కళ్లు కాయలు కాసేటట్లు సూస్తుంటే, పొద్దుగాల్నే లేచి పెద్ద పైపు పట్టి కారుకు స్నానం చేయిస్తున్నవేంది? గింత సోయి లేకపోతే ఎట్ల రా బై?”
ఒక దిక్కు చుక్క నీళ్ళకు తనకలాడుతుంటే ఒకదిక్కు గిట్ల ఖరారు జేసేటోళ్ళు దాపురమయ్యింరు. ఏం సోయి లేదు. అర్థమైత లేదు జనాలకు ఏమైతది మన గతి అని!
వాన చినుకు జాడ లేక భూమి తల్లి నెర్రెలు బారి ‘నీళ్లు లేవే’ అని గుండెలు బాదుకుంటుంటే.. మనోళ్లు మాత్రం పొద్దుగాల్నే లేచి పెద్ద పెద్ద పైపులు పట్టి రోడ్ల మీద నదులు పారిస్తుంటే, చూసేటోళ్లకు మతి పోతలేదు గనీ, అసలు మనకు గింతనన్న సోయి ఉన్నదా?”
ఆకాశం వైపు ఆశగా చూస్తుంటే ఒక్క వాన చినుకు రాలుతలేదు. చెరువులు, కుంటలు బీటలు వారి “అయ్యో నీళ్లు లేవే” అని మొత్తుకుంటుంటే.. మనకు ఇంకా ఎర్కయితలేదు . “ఇట్లనే నడిస్తే ముందున్నది ముసళ్ల పండుగ, కరువు కాటకాలు ఖాయం” అని అందరూ నెత్తీనోరూ బాదుకుంటున్నా, మన తీరు మాత్రం “నా ఇష్టం, నా నల్లా, నా పైపు” అన్నట్లే నడుస్తున్నది.
పొద్దున్నే లేచి మన అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగుల దిక్కు ఒక్కసారి తొంగి చూస్తే చాలు, నీళ్ల జాతర ఏ రేంజ్ల నడుస్తద కళ్లకు కట్టినట్లు కనిపిస్తది. వాకిట్ల దుమ్ము లేవకుండా నీళ్లు సల్లమంటే, ఏకంగ రోడ్డు మీద నదులు పారేటట్లు పైపులు పెట్టి వదిలేస్తుంటరు. ఆ నీళ్లన్నీ మోరీలల్లకి పోతుంటే, ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్లు మురిసిపోవుడు. ఇగ కారు కడుగుడు అంటే మన దగ్గర ఒక పెద్ద పండుగ లెక్క తయారైంది. ఒక్క బకెట్ నీళ్లతోని తుడిస్తే మెరిసిపోయే కారుకు, బైకుకు గంటల తరబడి పెద్ద పెద్ద పైపులు పెట్టి నీళ్లు కొడుతనే ఉంటరు. ఆ కారు అద్దం లెక్క మెరవాలి కానీ, పక్కన ఉన్నోడి గొంతు ఎండిపోయిన సుత మనకు పట్టింపు ఉండదు. ఇంగ బాత్రూమ్లల్లకి పోతే చిన్న మగ్గు పక్కన పెట్టి, పెద్ద పెద్ద బకెట్లు, చెంబులు, మగ్గులు పెట్టుకుని ఒంటి మీద కుమ్మరించుకుంట….సగం నీళ్లను ఒట్టిగ కింద పారబోసుడు మనకు అలవాటైపోయింది. ఇట్ల అయితే ఎట్లని ఎవరైనా అడిగితే, “మేము బిల్లు కడుతున్నం కదా, మా ఇష్టం” అని ఎదురు మాట్లాడేటోళ్లు కూడా మోపయ్యింరు
అసలు నీళ్లు అంటే ఏందో మనకు తెల్వదా? నీళ్లు అంటే కేవలం నల్లా తిప్పితే వచ్చే ద్రవం కాదు, అది మన ప్రాణం, మన బతుకు! మనిషి తిండి లేకుండ సుత కొన్ని వారాలైనా ప్రాణాలు నిలబెట్టుకుంటడేమో కానీ, నీళ్లు లేకుండా మూడు రోజులు సుత బతకలేడు. మనం ఇప్పుడు గిట్లనే సోయి లేకుండా నీళ్లను వృథా చేసుకుంట…. పోతే, రేపటి రోజున జరిగే నష్టం మామూలుగ ఉండదు. ఇప్పుడే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నయి, ఇంకా ఇట్లనే తోడేస్తే రేపు బోర్లు ఏసినా చుక్క నీరు రాని పరిస్థితి వస్తది. తాగడానికే గుక్కెడు నీళ్లు లేకపోతే, ఇక పంటలకు ఎక్కడి నుండి వస్తయి? పంటలు పండకపోతే తినడానికి మెతుకు దొరకక ఆకలి కేకలు మొదలైతయి, ధరలు ఆకాశాన్ని తాకుతయి. అంతేకాదు, ఇప్పుడు మనం పైపులతో రోడ్లు కడుగుతున్నట్లే కొనసాగితే, రాబోయే రోజుల్లో బిందెడు నీళ్ల కోసం గల్లీ గల్లీల కొట్లాటలు జరిగే ప్రమాదం ఉంది. ట్యాంకర్ల చుట్టూ పడిగాపులు కాస్తూ, డబ్బులు కట్టలు కట్టలుగా ఉన్నా గుక్కెడు నీళ్లు కొనలేని దుస్థితి దాపురిస్తది.
“నా ఒక్కడి వల్ల ఏం మారుతది?” అని ప్రతి ఒక్కరూ అనుకుంటే, రేపు ఎవరికీ చుక్క నీరు మిగలదు. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అమూల్యమైన సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇప్పటికైన కండ్లు తెరుద్దాం, కారు కడగడానికి పైపులు పక్కన పెట్టి బకెట్ నీళ్లతో తుడుద్దాం, వాకిలిని ఊడ్చి పొదుపుగా నీళ్లు చల్లుకుందాం, అవసరమైనంత వరకే నీటిని వాడుకుందాం. మనకు సోయి ఉంటేనే రేపటి తరాలకు ప్రాణం నిలుస్తది, లేదంటే మన నిర్లక్ష్యానికి మనమే బలైపోయే రోజులు ఎంతో దూరంలో లేవు!
వర్షాలు పడకపోతే రైతులు ఎట్ల పంటలు పండిస్తరు? మనమేం తింటము! మన బతికేంది!.ఎన్ని కోట్ల పైసలు ఉన్నా
ఏం చేస్తము? ఒకసారి ఆలోచన చెయ్యుండి. చాలా బాధాకరమైన ముచ్చట తమ్మీ ఇది!
అందరు మంచిగ మనసుపెట్టి ఆలోచించాలి. రైతురాజు అంటం. కానీ, నిజంగ రైతు బతుకు రాజు లెక్క ఉన్నదా? వర్షం పడకపోతే రాజులేడు, రాజ్యం లేదు. ఏం తింటం చెప్పండి!? బువ్వ కావాలి కదా బతకాలంటే,భూతల్లి తడవాలి.భూమాత గుండె తడుపుకోవాలంటే వర్షం కురవాలి. అంటే…. ప్రకృతి మాత పచ్చగ ఉండాలి. పర్యావరణ పరిరక్షణ జరుగాలి.నీటి చక్రం నడవాలి. ఇట్ల ఒకదానితో ఒకటి లంకె ఉంటది. అర్థం చేసుకుంటరని ఆశిస్తున్న ఉంట మరి పైలం.