శ్యామలతో మాట్లాడుతున్న రామ్ ప్రసాద్ తలతిప్పి, గుమ్మంలో నిలబడిన వ్యక్తిని చూసి, లేచి నిలబడ్డాడు.
“మా అత్తయ్య…. తాయారమ్మగారు… అత్తయ్యా!ఇతను హరి గారు. బెంగళూర్ లో…..” శ్యామల మాటలు వారికి వినిపించడం లేదు.
రాంప్రసాద్… రెండడుగులు ముందుకి వేసి….. “అమ్మా మంగా “!పిలిచాడు. అందరూ అయోమయం గా వారిని మార్చి మార్చి చూస్తున్నారు.
చందనకి అర్ధమైంది. అక్కడ చనిపోయిందని దండ వేసి ఉన్న వ్యక్తి ఈవిడేనని.
అక్కడ అందాల బొమ్మలా ఉన్న అమ్మాయి .. ఇక్కడ….. కళావిహీనంగా నుదుట బొట్టు లేకుండా….ముదురురంగు నేతచీరలో, అక్కడక్కడా నెరిసిన జుట్టు…. ముడితో…
“అమ్మా మంగా!” దగ్గరకు వెళ్ళబోయిన రామ్ ప్రసాద్ “ఆగు! చచ్చిన శవాన్ని వెతుక్కుంటూ ఎందుకొచ్చారు?”అరుపుతో ఆగిపోయాడు.
“అప్పుడు సమాజ కట్టుబాటుకి కట్టుబడి ఏదో కోపంతో అలా చేశారు నాన్న. తరువాత చాలా బాధ పడ్డారు. నీకోసం వెతికించారు కూడా…ఆచూకీ తెలియలేదు. అప్పుడు మీ ఆయన పని చేసిన పేపరు మిల్లుకి వెళ్ళి, నేనే ఎంక్వరీ చేశాను. ఉద్యోగం వదిలి వెళ్లిపోయాడన్నారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదన్నారు. ”
“తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పుకి ముప్పై ఏళ్ళు శిక్ష అనుభవించాను. కొడుకురూపంలో ఇంకా అనుభవిస్తున్నాను.
నా కొడుకుని నమ్మి మోసపోయిన… నా వంటి, మరో అమాయకపు ఆడపిల్లకోసం, ఈ పసివాడిని వదల్లేక.. జీవచ్చవంలా బ్రతుకుతున్నాను…”
“చెల్లెమ్మా! ఆ రోజుల్లో కట్టుబాటు ఎలా ఉండేవో నీకూ తెలుసు… ఆ రోజుల్లో ఏంటీ… ఈ రోజుల్లోనూ… పరువు పోయిందని, కులాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నారని హత్య చేస్తున్న సంఘటనలు చూస్తూ వింటూనే ఉన్నాం…. కానీ, నాన్నగారు ఆరోజుల్లోనే ఎంతో ఉన్నతంగా ఆలోచించి, బాబాయిలు ఆవేశ పడుతున్నా, “వాళ్ళమానాన్న వాళ్ళని బ్రతకానిద్దాం” అని వారిని వారించారు. మనవరకు మనం అది లేదనుకుందాం అన్నారే కానీ, మీ జోలికి రాలేదు. పుట్టిన పిల్లలు ఒక్కొక్కళ్ళే దూరం అవుతుంటే పశ్చాత్తాపం మొదలైంది. నీ కోసం వెతికారు. నువ్వయినా….”
“కులం చెరిపేవాడేగానీ కూడెట్టేవాడు లేడని తెలిసేసరికి
సమయంమించిపోయింది.మీ అందరి ముందుకి రావడానికి మొహం చెల్లక అజ్ఞాతంలోనే ఉండిపోయాను ”
హరి తాతగారికి వీడియో కాల్ చేసి “తాతయ్యా!అత్త… మంగ అత్త కనిపించింది. ఇదిగో మాట్లాడండి “తయారమ్మ ఎదురుగా సెల్ పెట్టాడు.
“అమ్మా! మంగతల్లీ!నీ కోసమే…ఈ ముసలి ప్రాణాలు ఎదురుచూస్తున్నాయి.” తల్లి రుద్దకంఠం విని, అందరితోపాటు తాయారమ్మ కూడా కరిగిపోయింది.అయినా పైకి కనపడనీయకుండా
“ఇప్పుడు కాదు తరువాత వస్తాను మీరు వెళ్ళండి. నా కొడుకుని నమ్మి మోసపోయిన ఈ పిచ్చిది మరో తాయారమ్మ అయింది. దాన్ని, ఆ పసివాడిని ఒంటరిగా వదిలి రాలేను “.అంది, కొంగులో మొహం దాచుకుని.
“ఇప్పుడునవ్వు ఒంటరిదానివి కాదు వదినా , నీ వెనుక పెద్ద కుటుంబం ఉంది. ఆరోజులు మారాయి మనుషుల మనస్థత్వాల్లోనూ మార్పు వచ్చింది. కొన్ని చోట్ల ఇంకా జరగ కూడనివి జరుగుతూనే ఉన్నా, పశ్చాత్తాపంతో మావయ్య మారారు”. అంది సీతమ్మ.
“అవునత్తయ్య!మురళీని మార్చి వారికాపురం..”
“దౌర్భాగ్యుడు మారడు….. వాడు….మరో పెళ్లి…. హు!పెళ్లి ఏంటీలే
…. ఏదో …చేసుకున్నాడు. దీనికి మరోదారి చూపించాక,, ఆ పిల్లవాడిని…”
“అమ్మా మంగా!ఇక్కడ నువ్వున్నావని తెలియక ముందే…. వీడు.. మన పెద్దన్నయ్య కొడుకు జగదీశ్…. కారణం ఏదైతేనేమి భార్యా భర్తలు విడిపోయారు.పిల్లవాడు తల్లి లేనివాడయ్యాడు.
. చందన చెప్పింది ఈ అమ్మాయి గురించి. పెద్దావిడ వాళ్ళ అత్తయ్య ఉన్నారు అని చెప్పింది..ఆ అమ్మాయితో, పెద్దలతో మాట్లాడి పెళ్ళికి ఒప్పిద్దామనే మేము ఊరి నుంచి వచ్చాం.అనుకోకుండా నువ్వు కలవడం అదృష్టం “.అన్నాడు రాంప్రసాద్.
“అవునూ వదినా! అమ్మాయి మంచి పిల్ల. అని చెప్పింది.” చెప్పింది సీతమ్మ. కాసేపు ఎవరూ మాట్లాడలేదు.
జగదీశ్ లేచి ” అత్తయ్యా! మన ఉమ్మడికుటుంబంలో కలిసి మెలిసి ఉండడానికి ఇప్పటికాలం పిల్లలు ఇష్టపడరు. నా భార్య అందుకే నాతో విడిపోయింది., వారికి స్వేచ్ఛ కావాలి ఆస్తులు కావాలి బాధ్యతలు వద్దు.ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టవద్దు. మనo తనకి ఇష్టమైన ఏదో ఒకదారి చూపిద్దాం”. చందనతో ఆడుతున్న చిన్నూని ఎత్తుకుని, “వీడిని నేను దత్తత తీసుకుని, నా కొడుకుతో పాటు చిన్నకొడుకుగా చూసుకుంటాను.మంచి చదువు చెప్పిస్తాను.పిల్లవాడి బాధ్యత లేకపోతే తనని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు..మనం చూసి చేద్దాం.లేదంటే ఇంకా చదువుకుంటానంటే చదివిద్దాం…..ముందు మీరు పదండి.అక్కడ తాతయ్య, నాన్నమ్మ ఎదురు చూస్తుంటారు ”
అన్నాడు జగదీశ్.
“వెళ్ళమ్మా.. మీవి అత్తయ్యవీ బట్టలు సర్దు. కారులో వెడదాం తెల్లారే సరికి వెళ్ళిపోతాం “అన్నాడు రామ్ ప్రసాద్, శ్యామలతో.
“చందూ!అమ్మాయిని లోపలికి తీసికెళ్లి మాట్లాడు. తనకి ఇష్టం లేకపోతే ఎంత మాత్రం బలవంతంగా ఏదీ జరగదు.”చెప్పింది సీతమ్మ.
“పద శ్యాము! “శ్యామలభుజాల చుట్టూ చెయ్యి వేసి,గదిలోకి తీసికెళ్ళింది.
లోపలికెళ్ళగానే బెడ్ మీదకూలబడి “అసలేం జరుగుతోంది చందూ, నాకేమి అర్ధం కావడం లేదు ” అంది, వేదనాపూరితస్వరంతో.
“అర్ధం కాకపోదానికేముంది శ్యాము, ఇందాకా ఆవిడ మాటల్ని బట్టి చూస్తే,మీ అత్తగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నా,భర్తతో సుఖపడింది లేదు.కొడుకు అయినా సుఖపెడతాడనుకుంటే… నీకు తెలిసిందే… ఆవిడ ఇంకా చాలా మంచి మనిషి కనుక, తన కొడుకు వల్ల నీ బ్రతుకు నాశనం అయిపోయిందని జాలితో నీకు అండగా నిలబడ్డారు.ఇప్పుడు ఆవిడకి తల్లిదండ్రులతో శేషజీవితం గడిపే అవకాశం వచ్చింది. ఇప్పుడు నువ్వు రానంటే ఆవిడ కూడా రారు. నీకు ఇష్టం లేకపోతే జగదీశ్ ని పెళ్లి చేసుకోవద్దు. మురళీ తిరిగి వస్తాడని ఆశ పెట్టుకోడానికి అతనికి మరో పెళ్లి జరిగిపోయిందనినువ్వే చెప్తున్నావు.రెండు రోజులు అక్కడ ఉండి గమనించాను. ఆ కుటుంబంలో “మనం” అనే భావo తప్ప నేను, నాది అని ఎవరూ అనుకోరు. జగదీశ్ చెప్పారు, విన్నావుగా, బాబు బాధ్యత నాది అని. ఎందుకంటే వాడు తనమేనత్త మనవడు అని. తల్లి లేని తన కొడుకుని తన పినతల్లుల దగ్గర వదిలి నిశ్చింతగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాడికి తల్లి లేని లోటు తెలియకుండా చూస్తున్నారని. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం పిల్లలజీవితాలకి పెద్ద లోటు అని నాకు అనిపిస్తుంటుంది.అది సరేలే గానీ, మీ అత్తగారి గురించి,, ముఖ్యంగా ఆ వృద్ధతల్లిదండ్రుల గురించి ఆలోచించి,ముందు తయారవ్వు.తరువాత ఏం చెయ్యాలో ఆలోచించుకుందువుగాని “బీరువా మీదున్న బేగ్ తీసి,శ్యామల ముందు పెట్టింది.
తప్పదన్నట్లు లేచి తనవి, పిల్లాడివి, అత్తగారివి బట్టలు సర్దింది.
బ్యాగ్ తీసుకుని వచ్చిన శ్యామల ముఖం చూడగానే ఆమెకి ఈ ప్రయాణం ఇష్టం లేదని అందరికీ అర్ధం అయింది.వచ్చినప్పటికి, ఇప్పటికీ ముఖ కవళికల్లో తేడా స్పష్టంగా తెలుస్తోంది.
జగదీశ్ ముందుకి వచ్చి “శ్యామల గారు!చందన మిమ్మల్ని బలవంతపెట్టి ప్రయాణానికి సిద్ధం చేయించిందని మీ ముఖం చూస్తే అర్ధం అవుతోంది. ఇంతమంది ముందు చెప్తున్నా, మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఇది మా అత్తయ్య కుటుంబం… ఆదుకోవడం మా బాధ్యత.ముందు అత్తయ్య తన తల్లిదండ్రుల్ని
కలవనీయండి. తరువాత మీరు ఏం చెయ్యాలనుకున్నా మీ ఇష్టం ” చెప్పాడు జగదీశ్. శ్యామల మాట్లాడలేదు.
“మీరుమాట్లాడుతుండండి. ఒక కారు చాలదు. నేను ఇంటికి వెళ్ళి డాడీకి చెప్పి మా కారు తీసుకొస్తాను “అంది చందన.
” పద,నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను “హరి బయలుదేరాడు.
“జగదీష్ గారూ! మీరు కూడా రండి. ఇద్దరూ చెరో కారు డ్రైవ్ చేసుకెళ్లవచ్చు. నేను ఇంటి దగ్గర డ్రాప్ అయిపోతాను “అంది.
చందన బయలు దేరుతూoటే…బయటికి వెళ్ళి… చందనా! ఆగమ్మా…….