వాక్ శుద్ది – The Tongue.

 తరుణి పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి సంపాదకులు

మొన్న కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఎనిమిది గంటల పని,ఎనిమిది గంటల వినోదం, ఎనిమిది గంటల విశ్రాంతి కావాలని ఎప్పుడో 1858 లోనే ఆస్ట్రేలియా దేశం కార్మికులు ఉద్యమాన్ని తీసుకువచ్చారు. అప్పుడు అమెరికాలోని చికాగోలో వీళ్ళకి మద్దతు కూడా లభించింది. ఇలా ఎన్నో ఎన్నో ఉద్యమాలు జరగగా జరగగా క్రమంగా మే ఒకటిని కార్మిక దినోత్సవం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇది లాయల్టీ డే గా అమెరికా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు.
మనకందరికీ తెలిసిందే పెట్టుబడిదారీ విధానాన్ని ఖండించడం దానివల్ల శ్రామికులకు కొంతనైనా ఊరట కలగడం చూసాం.
ఈ వారంలోనే, మే 12న అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. ఇప్పుడైనా సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే తప్పకుండా విజయం సాధిస్తాం కొంత సమయం ఎక్కువ తీసుకున్నా జయం మన పక్షాన నిలుస్తుంది అనడానికి స్త్రీల సాధికారత కోసం వచ్చిన ఈరోజుకు గుర్తింపు ఉంది. స్త్రీల హక్కులు ఆత్మగౌరవ రక్షణ వంటి ఉన్నతమైన విలువల కొరకు కూడా దేశ విదేశాలలో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నాం.

మదర్ ఆఫ్ గాడ్ అని పిలువబడేటువంటి ‘రియా‘ దేవతకు నివాళులు ఇవ్వడం కొరకు గ్రీస్ దేశస్తులు మే నెలలోని రెండవ ఆదివారాన్ని ప్రత్యేకమైన రోజుగా నిర్ణయించి, శ్రద్ధగా జరుపడం గురించి తెలుసు. అమెరికాలో మొట్టమొదటిసారిగా 1910లో మాతృ దినోత్సవాన్ని వర్జీనియా రాష్ట్రంలో జరపడం గురించి విన్నాం . కాలక్రమేనా విశ్వవ్యాప్తమైన మాతృ దినోత్సవం చాలా ప్రాచుర్యతను సంపాదించుకున్నది.

అయితే, భారతదేశంలో తల్లిదండ్రులను “మాతృదేవోభవ పితృదేవోభవ ” అంటూ గౌరవాన్ని ఇవ్వడం చూస్తున్నాం. అందరిలోనూ “అమ్మ” ప్రత్యేకమైన వ్యక్తిగా పూజనీయమైనదిగా దైవసమానురాలిగా చెప్పడం చూస్తున్నాం. అయినా కూడా కొత్త కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులను తెచ్చుకునే మానవ సమాజం ఏదైనా మంచిది ఉంటే దాన్ని స్వీకరించే అలవాటు చేసుకున్నది. ఈ క్రమంలో వచ్చిందే మన దేశస్థులు కూడా మాతృ దినోత్సవం జరుపుకోవడం. కన్నతల్లి కోసం ఒక్క రోజా,! అన్ని రోజులు అమవే కదా ? అనే ఒక సిన్సియర్ ఒపీనియన్ అందరిలో ఉన్నా కూడా, రెక్కలు వచ్చిన పక్షి గూడును వదిలి వెళ్ళినట్టు పిల్లలు పెరిగిన తర్వాత తల్లికి దూరం అవుతూ ఉంటారు. ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే గడపలో ఉన్నా కన్నతల్లికి చెప్పుకోలేని, కన్నతల్లితో షేర్ చేసుకోలేని విషయాలు కూతురికి, కొడుకుకి ఉంటాయి. ఇక్కడే తొలి బీజం పడుతుంది, తల్లికి బిడ్డకి మధ్యన ఒక గ్యాప్ రావడం చూస్తాం. ఇలా మార్పు వచ్చినంత మాత్రాన అమ్మని ఎవరు ద్వేషించరు. దూరం పెడతారు కావచ్చు.రోజూ దగ్గర గా ఉండడం సాధ్యం కాదు కాబట్టి, ఒక్క రోజు ను అమ్మ కోసం వేడుకగా చేయాలని మాతృ దినోత్సవం వచ్చింది.

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత చాలా వాడుకలో ఉన్నది. తనకు తెలిసిందే నిజమనో,గొప్ప అనో,సత్యం అనుకొనో ఏదైతే ఏమవుతుంది అని, సరిగ్గా ఏమీ ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు కొందరు. ఆ…ఇదేంటి ,?ఇది మన దేశం పద్ధతే కాదు !అమ్మకు ఒక్కరోజు ఏంటి? ఇలాంటి మాటలు అంటుంటారు. కానీ అమ్మకు ఒక రోజు అవసరం ఒక ప్రత్యేకమైన రోజు అవసరం. మనసుకు మనిషికి ఉన్న లింక్ తెలియని వాళ్ళం కాదు. ఏదైనా విషయం పైన మెదడుకు హృదయానికి మధ్యన సంఘర్షణ, ఫైటింగ్ కలిగినప్పుడు హృదయం చెప్పిందే అనుసరించాలి. కానీ దాన్ని కప్పిపుచ్చి అహం భావం తో అట్లా మాట్లాడుతుంటారు. ఎక్కడైనా సరే ఆడవాళ్లు ఉద్ధరించబడితే వాళ్ల పిల్లలు ఉద్ధరించబడతారు ఆ సమాజము ఉద్ధరించబడుతుంది అన్నప్పుడు అమ్మ మాటతో సంస్కృతి జ్ఞానము శక్తి భక్తి వంటివన్నీ కూడా కావాలి కదా. అసలు తను తన సమస్యను తానే పరిష్కరించుకోలేని దీనస్థితిలో స్త్రీ ఉన్నప్పుడు తన పిల్లలకి ఏం చెప్పగలుగుతుంది? ఉన్నత తరగతి , మధ్యతరగతి ఆడవాళ్లు కాస్త మెరుగైన జీవితాన్ని గడుపుతారు. బీద స్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉండదు. పూట గడవడం కష్టమైన వాళ్ళు కూడా నీతి సూత్రాలు నేర్పిస్తారు కానీ అందరూ అలా ఉంటారు అనడానికి కూడా వీలు లేదు. ఈ తల్లి కూడా చెడు చేయడానికి వెళ్లే తన సంతానాన్ని ప్రోత్సహించదు.

ప్రపంచమంతా మత విశ్వాసాలు పాటించే వాళ్లే ఉన్నారు. కాబట్టి ఎంతో కొంత వాళ్ళు ఏ మతంలో ఉంటారో ఆ మతం లో సంప్రదాయాలను నేర్పుతుంటారు. కళలను,విజ్ఞాన శాస్త్ర విషయాలను తల్లులు ఆచరణలో చూపిస్తూ ఉంటారు. అందుకే తల్లి మొదటి గురువు అయింది.

స్త్రీల విషయం వచ్చేసరికి అందరూ సర్వహక్కులు మావే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఆమె కట్టు బొట్టు వ్యవహారాల విషయాలపై జోక్యం చేసుకుంటున్నారు ఆర్థిక స్వేచ్ఛను హరించి వేస్తుంటారు. అందుకే ఏ చిన్న కష్టం కలిగినా తట్టుకోలేరు. ఆడవాళ్ళకు సపోర్ట్ ఉండదు కాబట్టి కన్నీళ్లు పెట్టుకోవడం ఒకటే వాళ్ల పనవుతుంది. ఇదే పురుషులకి ఆధిపత్యాన్ని చూపడానికి ఒక ఆమోదముద్రగ దొరుకుతుంది. దాన్ని పట్టుకొని మరింతగా రెచ్చిపోయి వాళ్ళ అధికారాన్ని నియంతృత్వ ధోరణిని చూపిస్తారు.

ఎంతసేపు భర్త మీదనో, కొడుకు మీదనో ఆధారపడి ఉండడం తప్పని పరిస్థితి అయినప్పుడు స్త్రీలు లొంగిపోక ఏం చేస్తారు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనడానికి ఇంతకన్నా రుజువేం కావాలి?
పెళ్లయిన కొత్తలో ఎంత బాగా పిలుస్తున్నావు అని కితాబులు ఇచ్చిన భర్తనే క్రమంగా పిల్లలు పుట్టిన తర్వాత ఎంత గట్టిగా అరుస్తున్నావు అని అంటాడు. ఈ తేడా గురించి వివరించాల్సిన పనిలేదు. అయితే ఇంట్లోనే కాదు స్త్రీలకు ఎక్కడికి వెళ్ళినా సమస్యలే ఆఫీసులో బాస్ తో, సభాడినట్స్ తో కొలీగ్స్ సమస్యలే ! వింతలో వింత ఏమిటంటే ….
కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఆడవాళ్లే పడరు. ఇవన్నీ కూడా మాట వల్ల నే వస్తున్నాయి అనడంలో ఏవైనా సందేహమా ? వాక్ శుద్ధి ఉంటే ఈ చిన్న చిన్న సమస్యలు పెరిగి పెరిగి వటవృక్షంలా కాదు. Tongue control !! ఇది కదా కావాల్సింది!

చాలావరకు మనంతట మనం ఏ గొప్ప పనులు చెయ్యం. ఎవరైనా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళని చేయనీయం. లూప్ హోల్స్ వెతుకుతూ వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాం. వేరే వాళ్ళ వి అవహేళన చేసేటప్పుడు నేను కూడా…….. అని ఎవరి మనసు ల లో వాళ్ళు అనుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగవు.

జీవితాన్ని సముద్రంతోను యుద్ధరంగంతోను ఎందుకు పోలుస్తారు ఇదిగో ఇందుకే ! ధైర్యంతో ముందడుగు వేసేప్పుడు చుట్టుపక్కల నీ వాళ్ళు ఉంటారు అనే సత్యాన్ని మరవద్దు. ఫిరంగుల నుండి గుండ్లు వేగంగా దూసుకుపోయినట్టే , మాట లు అనే ఈ గుండ్లు అంతకన్నా వేగంగా హృదయాలను గాయపరుస్తాయి. ఇది గుర్తుంచుకుంటే చాలు ఎవరెన్ని చెప్పినా ఎన్ని ఆటంకాలు కలిగించినా మాతృ దినోత్సవాన్ని నిర్విఘ్నంగా జరుపకోగలం.

ఏ ఇంట్లో అయితే విజ్ఞానవతి, విద్యావంతురాలు, తెలివైన స్త్రీలు , మంచి స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో మహానుభావులు పుడతారు. కాస్త తెగువ కూడా ఉన్న ఆడవాళ్లు తన భర్తను, సంఘాన్నీ ఎదిరించైనాసరే తన సంతానంలో చెడును ప్రవేశించకుండా మార్గాలు వెతుకుతారు, సాధిస్తారు. All the best for good time , and good tongue.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“విడువరాదు భగవంతుని భజన…..”

అపురూప చిత్రాలు