ఏది సాధికారత

సిరిపురం అనే గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, గ్రామ పంచాయతీ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు….
గ్రామ సర్పంచ్ గోపాల్ రావ్ ఆ సమావేశానికి అధ్యక్షత వహించారు…..
ఆ కార్యక్రమానికి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి వనజ గారిని మరియు ప్రాథమిక హెల్త్ సెంటర్ లో పనిచేసే వైద్యురాలు శ్రీమతి డాక్టర్ జ్యోతి గారిని మరియు వార్డు మెంబర్లు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు మొదలగు వారిని ఆహ్వానించారు……..

ముందుగా జ్యోతి ప్రజ్వలన తర్వాత ప్రార్థన గీతం తో ప్రోగ్రాం మొదలైంది…. మొదట అధ్యక్షుల వారైనా గోపాల్ రావు గారు నేటి ప్రోగ్రాం గురించి వివరించారు …. ఆ తర్వాత ప్రధాన వక్త అయినా శ్రీమతి వనజ గారిని, మహిళా దినోత్సవం గురించి….. దాని పుట్టుపూర్వోత్తరాలు వివరించమని ……అధ్యక్షులవారు కోరగా వనజ గారు మాట్లాడుతూ………
ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…… సభలోని వారందరికీ నమస్కారములు…… ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం …..ఎప్పుడు? ఎందుకు? ఎలా ?దీని చరిత్ర ఏమిటి ? మీకు వివరించే ప్రయత్నం చేస్తాను……..
ఇది ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదో తేదీన జరుపుకుంటున్నాము… మరి మార్చి 8వ తేదీన ఎందుకు జరుపుకుంటున్నాం? అంటే, మహిళా సాధికారతకు గుర్తుగా…….
మహిళలకు హక్కుల పట్ల అవగాహన కల్పించడం……
మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు వ్యతిరేకంగా…….

దీనిని జరుపుకుంటున్నాము…. ఇది కార్మిక ఉద్యమం నుంచి పుట్టింది…
దీని చరిత్రలోకి వెళితే 1908 సంవత్సరంలో, తక్కువ పని గంటలు, మెరుగైన జీతం…… ఓటు వేసే హక్కు కోసం, న్యూయార్కులో 15వేల మంది మహిళల ప్రదర్శన మొదటిసారిగా చేశారు……
ఆ తర్వాత 1909లో
సోషలిస్టు పార్టీ అమెరికా వారు ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది………
1910లో ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజున అంతర్జాతీయ స్థాయిలో మహిళా దినోత్సవం జరుపుకోవాలని సూచించిన మహిళా క్లారా జెట్కిస్……
1910లో కోపెన్హాగెన్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ సదస్సులో ప్రతిపాదన చేశారు….
దీనికి వందమంది మహిళలు 17 దేశాలకు చెందిన వారు ఏకగ్రీవంగా అంగీకరించారు…..
1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం తొలిసారిగా ,మార్చి 19న ఆస్ట్రీయా, డెన్మార్క్, జర్మనీ , స్విట్జర్లాండ్ దేశాల్లో జరుపుకున్నారు……. దీనికి పది లక్షల మంది ప్రజల మద్దతు లభించింది……….

1913లో మార్చి 8న జరుపుకోవాలని నిర్ణయం చేశారు……
కొన్ని దేశాల్లో సివిల్ అవేర్నెస్ డే ,మరికొన్ని దేశాల్లో ఆంటీ సెక్సీజం డే ,ఇంకొన్ని దేశాల్లో వివక్ష వ్యతిరేక దినోత్సవం గా జరుపుకున్నారు….

మరి మార్చి ఎనిమిదో తేదీన ఎందుకు జరుపుకోవాలి? అంటే 1917 వ సంవత్సరంలో రష్యా మహిళలు ఆహారం- శాంతి నినాదం చేస్తూ, సమ్మె ప్రారంభించారు…… రష్యా సామ్రాట్ నికోలస్ జూనియర్-2 సింహాసనం వదులుకున్నారు…. తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు కల్పించింది…….

అప్పట్లో రష్యా అనుసరించే జూలియస్ క్యాలండర్ ప్రకారం సమ్మె ప్రారంభించిన రోజు…. ఫిబ్రవరి -23. ఆదివారం……
ఇప్పుడు అమలులో ఉన్న గ్రెగోరియస్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి- 8……
అందుకే 19 75 వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు మార్చి 8వ తేదీ ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గా ప్రకటించింది…….
మరి ఇప్పుడు ఇంకా ఎందుకు జరుపుకుంటున్నాం ?

దానికి కారణాలు:
మహిళలు పూర్తిగా లింగ సమానత్వాన్ని సాధించలేదు.
వ్యాపారం రాజకీయాల్లో మహిళలు ఇప్పటికీ సమాన సంఖ్యలో లేరు……..
విద్య ఆరోగ్యం విషయాల్లో పురుషులకంటే వెనుకంజ ఉన్నారు…….

బ్రిటన్లోని కొన్ని ప్రధాన సంస్థల్లో పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనం లభిస్తుంది….. మహిళల పట్ల అత్యాచారాలు, హింసలు ,వేధింపులు, పెరుగుతున్నాయి…….
చలనచిత్ర ఫ్యాషన్ సంగీతం రాజకీయ రంగాల్లో ఉన్న కొందరు మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు అనుభవించిన బాధను మీ టు ఉద్యమం ద్వారా తెలియజేశారు…….
సమానత్వం సాధించాలంటే మనం మన హక్కుల కోసం పోరాడాలి……

అమ్మని పూజించు .
భార్యను ప్రేమించు
సోదరిని దీవించు
ముఖ్యంగా మహిళలను గౌరవించు……..
మరొక మాట మా పాఠశాల అభివృద్ధిలో, పాలు పంచుకుంటూ, మాకు అనేక విషయాలలో సహాయ సహకారాలు అందిస్తున్న, గ్రామ సర్పంచ్ గారికి మరియు వార్డు మెంబర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు…….. అలాగే డాక్టర్ జ్యోతి గారికి నాయొక్క మనవి ఏమనగా !మీకు కుదిరినప్పుడు ఒకసారి మా పాఠశాలకు విచ్చేసి వ్యాధుల పట్ల అవగాహన -నివారణ పై విద్యార్థులకు తెలియజేయాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను….. ఈ ప్రోగ్రాం కు నన్ను ఆహ్వానించి ,నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ……. ముగిస్తున్నాను…… అని వనజ గారు ఉపన్యాసాన్ని ముగించారు …….తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ….. అధ్యక్షులవారు డాక్టర్ జ్యోతి గారిని, మహిళలు- ఆరోగ్య సమస్యలు గురించి మాట్లాడవలసిందిగా కోరడంతో డాక్టర్ జ్యోతి గారు మాట్లాడుతూ……..

సభకు నమస్కారములు! మహిళా మణులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…….
మహిళలు అనుక్షణం వారి కుటుంబం పిల్లల గురించి ఆలోచిస్తూ…… వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు…….
కానీ మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాన్ని చూసుకో గలుగుతారు …… పోషకాహారం లోపం వల్ల చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు….. గైనిక్ సంబంధించిన సమస్యలు చాలా మందిని బాధిస్తున్నాయి….. వీరంతా ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి…. పాలు ,పండ్లు, ఆకుకూరలు ,కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవాలి…..
అంతేకాకుండా ఏ సమస్య అయినా ముందుగా గుర్తించి, సకాలంలో వైద్యం తీసుకుంటే నయమవుతుంది….. కొంతమంది సిగ్గుతో కొంతమంది భయంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి తన జబ్బుల గురించి చెప్పటానికి ఆలోచిస్తున్నారు…….. ఈ సమయంలో జబ్బులు ముదిరి పోతున్నాయి …..ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి…. కనీసం రెండు సంవత్సరములకు ఒకసారి మీరు హెల్త్ చెకప్ చేయించుకోవాలి ……ఆరోగ్యమే మహాభాగ్యం మీలో ఎవరికీ ఆరోగ్య సమస్యలు వచ్చినా, ప్రైమరీ హెల్త్ సెంటర్ కి రాగలరు….. మీకందరికీ నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను …..మేడం గారు చెప్పినట్టుగా వీలు చూసుకుని తప్పకుండా పాఠశాలకు వస్తాను ……నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ……. ముగిస్తున్నాను….. అంటూ డాక్టర్ జ్యోతి గారు వారి ఉపన్యాసాన్ని ముగించారు…..

ఆ తర్వాత కొంతమంది వార్డు మెంబర్లు ఆశా కార్యకర్తలు ప్రసంగించిన తర్వాత చివరగా అధ్యక్షత వహించిన సర్పంచ్ గోపాల్ రావు గారు మాట్లాడుతూ……..

సభలోని వారందరికీ నమస్కారములు ముందుగా మహిళా మణులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…… స్త్రీ అబల కాదు సబల ……స్త్రీ శక్తి స్వరూపిణి.
నేటి మహిళ అన్నిరంగాల్లో ముందున్నది ….సమాజంలో ముందుకు దూసుకెళ్తున్న ది….. పురుషులతో సమానంగా దేని లో తీసిపోకుండా, మహిళలు నిలదొక్క కో గలుగు తున్నారు……
అయినా ఈ మధ్య మహిళా సాధికారత అనేది ఎక్కువగా వినిపిస్తున్నది…… అసలు సాధికారత అంటే ఏమిటి? మహిళలు స్వయం నిర్ణయాలు తీసుకోవడం ….వేటి గురించి అంటే, తాను ఎంచుకున్న రంగంలో కానీ, తన కుటుంబం లో కానీ ,తన చదువు విషయంలో కానీ ,మంచి- చెడు విచక్షణ తో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగితే ,అదే సాధికారత సాధించినట్లు ….అని నా అభిప్రాయం .దీని కావలసినది విద్య, ఆత్మవిశ్వాసం ,పాజిటివ్ గా ఆలోచనలు పెంపొందించుకోవడం….. మానసికంగా ,శారీరకంగా దృఢంగా ఉండాలి…… ప్రతి చిన్న విషయానికి కుంగిపోకూడదు……

సమస్యలు వస్తే గందరగోళ పడకూడదు….. అవి మనం సాధించాల్సిన విజయాలు గా భావించి, ఎదుర్కోవాలి…. మన పూర్వ కాలంలో స్త్రీలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ,తమ కుటుంబాన్ని ముందు ముందుకు నడిపించ లేదా? పిల్లల్ని తీర్చిదిద్దే లేదా? అప్పుడు స్త్రీలు, పురుషుడితో సమానంగా కాయకష్టం చేసే వారు…. వారు ఏ విషయాన్ని కూడా భారంగా భావించే వారు కాదు…… ఉమ్మడి కుటుంబాలలో ఉన్న సమస్యలను ఎంతో అవలీలగా పరిష్కరించుకునే వారు…….

నా ఉద్దేశంలో మనదేశంలో మహిళలు పూర్వకాలం నుండి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయిలోనే ఉన్నారు…… సాధికారత సాధించారని చెప్పవచ్చు……..
నేడు కూడా రాజకీయ, విద్య, వైద్య ,పోలీసు, శాస్త్ర ఒక్కటేమిటి అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు……. ఇంటా-బయట అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు నేటి మహిళలు…..
యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః
ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడే ఉన్నారో అక్కడ దేవతలు సంచరిస్తారు ….. త్రిమూర్తులు వారి భార్యలకు సముచిత స్థానాన్ని ఇచ్చారనే విషయాన్ని పురాణాల్లో తెలుపబడింది…. విష్ణుమూర్తి హృదయంలోనూ, శివుడు తన దేహం లో సగభాగం ఇచ్చాడు…. బ్రహ్మ నాలుకపైన స్థానం ఇచ్చాడు….. అనాదిగా మనదేశంలో స్త్రీలు గౌరవింప బడుతున్నారు…. అదే ఆచారాన్ని కొనసాగిస్తూ…. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, మన గ్రామానికి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన మహిళా మణులు అందరిని సన్మానించు కుందాం….. అంటూ వారి ఉపన్యాసాన్ని ముగించారు……

వివిధ రంగాలలో కృషిచేసిన మహిళలు అందరినీ ఘనంగా సన్మానం చేశారు….
చివరగా వందన సమర్పణ ఉపసర్పంచ్ మల్లేశం గారు చేశారు….. మహిళా దినోత్సవం రోజున మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సోదరీమణులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ….అలాగే మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించి నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము….. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ…. ఈ కార్యక్రమం ముగిసింది అని తెలియజేశాడు…….
సర్పంచ్ గోపాల్ రావు గారు హుందాగా అడుగులు వేస్తూ కొంతమంది అనుచరులు వెంటరాగా తన ఇంటికి చేరుకున్నాడు….. వసారాలో కాసేపు కూర్చొని ఆ రోజు జరిగిన సమావేశం గురించి చర్చించుకున్నారు …..ఎంతో బాగా కార్యక్రమం జరుపుకున్నామని, మహిళలను సన్మానించు కున్నామని గొప్పగా వారికి వారే చెప్పుకున్నారు….. అటుపిమ్మట అందరూ ఎవరి ఇళ్లకు ,వాళ్లు వెళ్లిపోయారు…..

గోపాల్ రావు ఇంటి లోపలికి వస్తూనే రాధా !రాధా !అని పిలుస్తూ వచ్చారు….. హాల్లో ఏదో రాసుకుంటూ కూర్చున్నా భార్యను చూసి కాస్త టీ పెట్టు….. చాలా అలసటగా ఉన్నది .అని అన్నాడు…..

ఏం ? ఏమైంది? అని రాధ అడిగింది…. నీకు ఏం చెప్పినా అర్థం కాదులే ముందు టీ పెట్టు అని అన్నాడు విసుగ్గా……
చెప్తే కదా !తెలిసేది అని అన్నది రాధ…..
ఆమెను ఒకసారి ఎగాదిగా చూసి, మళ్లీ ఏదో రాయడం మొదలు పెట్టినట్టు ఉన్నావు కదా !అని వ్యంగ్యంగా అన్నాడు గోపాల్ రావు……. అవును !ఇంకో కొత్త కథ మొదలు పెట్టాను…. అన్నది రాధ ……ఓహో !అలాగా రాయి రాయి పిచ్చి రాతలు రాసి పంపు అని ఎంతో హేళనగా అన్నాడు…….
మొదటి నుండి గోపాల్ రావు కు ఆడవారి పట్ల చులకన భావం …..భార్యను చెప్పు చేతుల్లో వుంచుకోవాలి అని. ఆమెకు ఇల్లు ,పిల్లలు తప్ప వేరే వ్యాపకం ఉండకూడదని అతని ఆలోచన…….
కానీ రాధకు చిన్నప్పటినుండి తనకు ఎలాంటి ఆలోచన భావాలు కలిగిన వెంటనే పేపర్ మీద పెట్టడం అలవాటు….. చిన్నప్పటినుండి చిన్న చిన్న కథలు గేయాలు రాసేది…… భర్త ఆలోచనలు వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే పసిగట్టింది…… కానీ అతని ఆలోచనలు అభిప్రాయాలు మార్చడం తన వల్ల కాదని అర్థం చేసుకొని, సంసారాన్ని బయట పెట్టడం ఇష్టం లేక, అతనికి అనుకూలంగా ఉండటం అలవాటు చేసుకున్నది….. అతను లేని సమయంలో తన రచనా వ్యాసంగం కొనసాగించేది…… పిల్లల్ని తన అభిరుచులకు అనుగుణంగా పెంచింది ….ఒక అమ్మాయి ఒక అబ్బాయి…. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు…. తనకు తీరిక దొరికినప్పుడు ,ఈ మధ్య కాస్త ధైర్యం గా తనకు ఇష్టమైన పనులు చేయడం అలవాటు చేసుకున్నది…….
గోపాల్ రావు పంచాయతీ ఆఫీసు లో ఇచ్చిన ఊకదంపుడు ఉపన్యాసం అంతా మైకు ద్వారా రాధ కు కూడా వినిపించింది….. ఆఫీసు వీరి ఇంటి పక్కనే…..
మహిళల గొప్పతనం…. సాధికారత గురించి….. చెప్పేదొకటి, చేసేదొకటి ఏదైనా ఇంటి నుండే మొదలు కావాలి…. ఇంట గెలిచి రచ్చ గెలవాలి…. ఇంట్లో ఉన్న స్త్రీలను గౌరవించడం, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం చేతకాదు కానీ, మహిళా సాధికారత గురించి నలుగురి ముందు గొప్పగా మాట్లాడుతారు ఇలాంటివారు…..
ఇలా ఆలోచిస్తున్న రాధతో గోపాల్ రావు, ఏమిటి ఆలోచిస్తున్నావు ?అని అడిగాడు……
రాధ వెంటనే ,అబ్బే !ఏం లేదండీ ?ఇందాక మహిళా దినోత్సవం సందర్భంగా చాలా బాగా ఉపన్యాసం ఇచ్చారు…. కానీ, నాకు ఒకటి అర్థం కాలేదండీ…. ఏమిటి ?అర్థం కాలేదు. అని అడిగాడు గోపాల్ రావు……. రాధ వెంటనే మహిళా సాధికారత అంటే ఏమిటండి? అని ఎంతో అమాయకంగా అడిగిన భార్య మాటలకు ,గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది….. గోపాల్ రావు కు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి చిత్రం

తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక ఊహా చిత్రం