కొత్త లోకాలు (కాలమ్-4)

Online shopping-

ఓ వర్కింగ్ డే నాడు మధ్యాహ్నం పూట భోజనం అయ్యాక నా ప్రియ సఖి సుమ ఇంటికి బయలుదేరాను. ఈ మధ్య ఏదో ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ చాలా రోజులయింది కలిసి. అందుకే నెచ్చెలిని కలవబోతున్నందుకు ఉత్సాహంగా తన ఇంటి డోర్ బెల్ రింగ్ చేసాను. లోపల నుంచి కమిన్ తలుపు తెరిచే ఉంది అన్న గొంతు వినిపించింది. వెంటనే తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళాను. చూద్దును కదా సుమ హాల్లో సోఫాలో కూర్చుని ఫోన్లో ఏదో సీరియస్ గా చేస్తోంది. నన్ను చూడగానే “ అరే సవీ నువ్వా , వాటె ప్లెజంట్ సర్ప్రైజ్..?” అంటూ నన్ను వాటేసుకుంది. ఎన్నాళ్ళైందే మనం కలుసుకుని అనుకుంటూ ఇద్దరం కబుర్లలో పడ్డాం. కొంచెం సేపైనాక నాకు సడన్గా గుర్తొచ్చి అడిగాను అది కాదే సుమా నువ్వు మీ పిల్లలు పెళ్లి చేసుకుని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మీకు బోర్ కొట్టటం లేదూ..? అన్నాను.” ఓ అదా నువ్వన్నది నిజమేనే .. మీ అన్నయ్య గారైతే ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తారు. మధ్యాహ్నం లంచ్ చేసి ఇంట్లోంచి బయటపడ్డారంటే మళ్ళీ ఏ రాత్రికోనే ఇల్లు చేరేది, ఆయనకేం కాలక్షేపం బాగానే అయిపోతుంది, ఎటొచ్చీ నాకేనే! నేను రోజంతా ఖాళీ కదే ఊరికే ఉంటే బోర్ కొట్టదూ..అందుకే ఈ మధ్య కొత్త పాస్టైం కనిపెట్టా..” అవునా ఏంటే అది..!”అన్నాను ఆసక్తిగా. “ ఏంలేదే మనకి చేతిలో డబ్బు ఉండి కొనాలే కానీ గడప దాటక్కరలేకుండా బోలెడు అవకాశాలు.. అదేనే ఆన్ లైన్ షాపింగ్…ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందనుకున్నావు..? చీరలూ , వన్ గ్రామ్ గోల్డ్ జువెలరీ, కిచెన్ వేర్..ఓహ్ ఎన్ని వెరైటీలో..మనకి కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోవటం ఎంత టైం పాసో, ఆర్డర్ ఇచ్చాక వాటి కోసం ఎదురు చూడటం అంతే టైం పాస్ అనుకో..పైగా తక్కువ ధరలోనే మనకు అందుబాటులో ఉంటాయి తెలుసా..? “ అన్నది ఎంతో ఉత్సాహంగా! దాంతో నాకు కూడా ఆశక్తి కలిగింది. “ ఏవీ నువ్వు ఆన్లైన్ లో కొన్నవి చూపించు “ అన్నాను. అడగడమే తరువాయి వెంటనే బెడ్రూమ్ లోంచి మచ్చుకి కొన్ని తీసుకొచ్చి చూపించింది. వాటిల్లో కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ చెయిన్లు, నెక్లెస్ లూ కూడా ఉన్నాయి. ఇక చీరలైతే కంచిపట్టుట కానీ చూడటానికి మాత్రం నాసిగాను జరీ వెలవెలబోతూ ఉన్నాయి. “ కొన్నావు సరేగానీ వాటిని ఎప్పుడు పెట్టుకుని, ఎప్పుడు కట్టుకుని ఏ ఫంక్షన్ కో ఎప్పుడు వెళ్తావే అన్నాను..?” ఇంకా ఇలా అన్నాను, “ మనకా అరవై ఏళ్ళు దాటాయి. మనం వెళ్లే ఫంక్షన్స్ కూడా ఏముంటాయని…అటువంటప్పుడు ఇవన్నీ కొనడం శుద్ధ వేస్ట్ నన్నడుగుతే..!”
“ అది కాదే పిల్లలు కూడ మాతో లేరు కదే, మేము ఇద్దరమే లింగు లిటుక్కుమంటూ ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నామో నీకు తెలీదే.. పైగా నేనైతే మరీ ఒంటరిగా ఫీల్ అవుతున్నాను ఆయన రోజంతా ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేయడం వల్ల. అప్పుడప్పుడు నేను ఎంత ఒంటరిగా ఫీల్ అవుతానంటే వేరే పిచ్చి పిచ్చి థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. మన ప్రాణం కన్నా విలువైనవయితే కావు కదా ఈ అణాకానీ వస్తువులు… నన్ను నేను కాపాడుకోవటం కోసమే ఈ హాబీని డెవలప్ చేసుకున్నాను ఏం తప్పా.?”“తప్పని ఎవరంటారుగానీ, ఇంత కన్నా బెటర్ హబీస్ డెవలప్ చేసుకోవచ్చు కదా అని…నా ఉద్దేశం “ అన్నాను నా గొంతులో తీవ్రతను కాస్త తగ్గిస్తూ..!
“ ఈ వయసులో ఇంకేం డెవలప్ చేసుకోమంటావే…” అని తిరిగి, “అయినా ఇన్ని రోజుల తర్వాత మనం కలిసాం, కాస్త నీకు కాఫీ కూడా ఇవ్వకుండా నిన్ను మాటల్లో పెట్టేసాను”అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ లేచింది నాకు కాఫీ ఇవ్వడానికి. కాఫీ తాగుతూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడి సుమకి వీడ్కోలు చెప్పి ఇంటికి వచ్చేసాను.
***
చూసారా సుమలాంటివారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. టైమ్ కిల్ చేయడం కోసం వారు ఎన్నుకున్న ఈ మార్గం ఎంతవరకూ ఆమోదయోగ్యం అన్నది మనం ఆలోచించాలి. ఒక్క ఆన్ లైనే కాదు చాలా మంది గృహిణులు ఫెస్టివల్ సేల్స్ అంటూ డిస్కౌంట్లు, బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటూ ఒకటే ఆఫర్లు గుప్పించే షాప్ లను పోషిస్తున్నారు. వీరు ఆ డిస్కౌంట్ లకు ఆకర్షితులై అవసరం ఉన్నా లేకపోయినా కొనడమే పరమావధిగా పెట్టుకున్నారు అంటే అతిశయోక్తి కాదేమో!
పెద్ద తనం లో టైం పాస్ కోసం ఇలాంటి ఎందుకూ పనికిరాని హాబీలు డెవలప్ చేసుకొనే బదులు చిన్నతనంనుంచే ముఖ్యంగా హోమ్ మేకర్స్ అయిన అతివలు తమ తెలివితేటలు ఉపయోగించి సమ్ ప్రొడక్టివ్ హాబీలు నేర్చుకుని అవి కనుక అమలులో పెడితే ఎంతో కొంత సంపాదించవచ్చు కూడా కదా!
ఉదాహరణకు, ప్రతిభ ఉన్న వారు ఏ రచయిత్రిగానో, సింగర్ గానో రాణించవచ్చు. ఇక కుట్లు అల్లికల్లో టాలెంట్ ఉంటే అందులోనూ రాణించి నలుగురితో శభాష్ అనిపించుకోవచ్చు. ఫైన్ ఆర్ట్స్, కుకింగ్ లాంటి రంగాలలో ఆసక్తి ఉన్నవారు వాటిని కూడా హాబీగా మార్చుకోవచ్చు. చిన్న వయసులోనే ఇవి అలవాటు చేసుకుంటే పెద్దైనాక కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇక ఒంటరితనమన్నమాటే ఉండదు. ఏమంటారు?

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హరి చందన-15