ప్రియాతి ప్రియమైన అమ్మకు,
నీకిలా లేఖ వ్రాయాల్సి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నువ్వున్నప్పుడు చెప్పలేని నా భావాలను, నువ్వు పంచభూతాల్లో కలిసిపోయాక చెప్పడంలో అర్థం లేదని నాకే అనిపిస్తుంది. కాని, ఇది వ్రాస్తున్నది నీకోసం కాదు, నాకోసం. నా భావాలను లిఖించకపోతే, గమ్యం తెలియకుండానే జీవితం వెంట పరుగులిడుతున్న నాకు, కొన్నాళ్లకు నీ జ్ఞాపకమే నాలో మరుగున పడిపోతుందేమోనన్న భయంతో నీపై నా ప్రేమను అక్షరాలుగా పేర్చుకుంటున్నాను. ఈ లేఖను చూసినప్పుడు, నువ్వు నాతో ఉన్నావనే భావన కోసం వ్రాసుకుంటున్నాను.
నువ్వీ లోకంలో ఉన్నప్పుడు నీతో ఎన్నో ఊసులను పంచుకోవాలనుకునే దానిని. నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పాలనుకునే దానిని. గాని, అవేవీ నా పెదవి దాటి బయటకు వచ్చేవి కావు. ఎందుకంటే, భాషతో అవసరం లేకుండానే నీ చేతలలోనే నేనంటే నీకెంత ప్రేమో చూపించే నీ ముందు, నీపై నా భావాలను ఎంత చక్కని పదాలలో ఏరి కూర్చినా, పెదవి దాటి బయటకు వస్తే ఆ మాటలు వెలతెలా పోతాయని, నా మనసులోని మాటను నీతో పంచుకునే ధైర్యం ఏనాడూ చెయ్యలేకపోయాను.
నీకు నేనెప్పుడూ చెప్పలేదు గాని, ప్రత్యేకించి నువ్వేమీ చెప్పకపోయినా, నీ చేతల ద్వారానే నీ నుండి నేనెన్నో నేర్చుకున్నాను. మా చిన్నప్పుడు, ఏ సమయంలో, ఇంటికెవరొచ్చినా, విసుగన్నది లేకుండా వారికి కడుపు నిండా పెట్టేదానివి. ఎప్పుడు స్కూలు నుండి వచ్చినా, నాకు తెలియని ఎవరో ఒకరు ఇంట్లో. ప్రైవసీ ఉండడం లేదని, ఒకరోజు నేను చిరాకు పడినందుకు, “తప్పమ్మా! అలా అనుకోకూడదు. ఇల్లన్నాక చుట్టాలు ఉంటారన్న” నీ మాటల్లో ఇల్లంటే ఏమిటో, ఇల్లాలెలా ఉండాలో, చెప్పకుండానే చెప్పావు. అమ్మమ్మ నాకిలా చెప్పిందని, నా పిల్లలకిప్పుడు నేను చెప్తుంటాను. గాని, వేళ కాని వేళలో వచ్చిన, వారి ఆకలిని తీర్చడానికి నీ ఆకలిని త్యాగం చేసేదానివని, అప్పుడు నేను ఊహించుకోలేకపోయాను. నువ్వు తిన్నావా, లేదా, అని ఏ రోజూ నిన్నడగనందుకు నన్ను క్షమించగలవా అమ్మా?
నువ్వు పెద్దగా చదువుకోలేదు. పల్లెటూరు దాటి బయటికి వెళ్లలేదు. గాని, జీవితంపై నీకున్న అవగాహన, విమర్శనైనా చిరునవ్వుతో స్వీకరించే నీ తత్వం, తరతమ బేధాలు లేని నీ హృదయ వైశాల్యం, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే నీ గుణం… ఇవన్నీ, ఎంతోమందికి నిన్ను సన్నిహితం చేశాయి. నీ లక్షణాల్లో సహస్రాంశం వచ్చినా బాగుండునని నేనెప్పుడూ అనుకుంటాను.
నాకిది కావాలని నేనేనాడూ నిన్నడగలేదు. ఎందుకంటే ఆ అవసరం నువ్వు నాకు రానివ్వలేదు. నేనడగకుండానే, నాకు కావలసినవన్నీ అమర్చి పెట్టేదానివి. అటువంటిది, నేను పెద్దయ్యాక కూడా, నువ్వెలా ఉన్నావని ఏ రోజూ నిన్నడగనందుకు నన్ను క్షమించగలవా అమ్మా! వరాలిచ్చే దేవుడికి, అడగకుండానే అన్నీ అమర్చిపెట్టే అమ్మకు తేడా లేదని ఇప్పుడు తెలుస్తుంది. దేవుడన్ని చోట్లా ఉండలేడు కాబట్టే అమ్మను సృష్టించాడని ఎందుకంటారో అర్థమౌతుంది.
నేనెన్ని రోజులు నీ దగ్గరున్నా, బయలుదేరుతానంటే, ఇంకొక్క రోజుండకూడదా అని నువ్వంటే, నేనెంత కాలమున్నా నువ్వలాగే అంటావని విసుక్కున్నాను గాని, నిన్ను విడిచి వెళ్తున్నానన్న బెంగతో అలా అంటున్నావని ఎందుకు తెలుసుకోలేకపోయాను? ఇప్పుడు నా కూతురు హాస్టలుకి వెళ్తానంటున్నప్పుడు… నువ్వుపడే బాధ అర్థమౌతుంది. నా కుటుంబం, నా పిల్లలు అనుకుంటూ ఎంతసేపూ అందులోనే కొట్టుమిట్టాడాను గాని, నీతోనే నా జీవితం మొదలైందని, నువ్వే నా మొదటి కుటుంబమనే సత్యాన్ని ఎలా మర్చిపోయాను? ఇలా తలచుకుంటుంటే, నేను నీకేమీ చెయ్యలేదనే నగ్నసత్యం కళ్ళముందు కనిపిస్తుంది. నువ్వు లేవనే నిజం కన్నా, నువ్వు ఉన్నప్పుడు నేనేమీ చెయ్యలేదనే బాధే నన్ను దహించి వేస్తుంది.
నేను చెప్పిన ఏ విషయానికైనా, అది మంచైనా, చెడైనా, నీకు నచ్చినా, నచ్చకపోయినా, నువ్వా పని చేసినా, చెయ్యకపోయినా… “ఓకే. అలాగే” అంటూ నన్ను ఎంకరేజ్ చేసే దానివి. గాని, నేనెందుకమ్మా, ‘ఇలా ఉంటే బిపి పెరుగుతుంది, అవి తింటే షుగరున్నవాళ్లకు మంచిది కాదు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఇటువంటివి ఆరోగ్యానికి మంచిది కాదు… అంటూ ఎప్పుడూ నీకు వద్దని చెప్పడమే గాని, నీలాగే, “అలాగే, ఓకే” అని ముందు చెప్పి, ఆ తర్వాత అది తింటే మంచిదికాదేమో అని సున్నితంగా నీకెందుకు నచ్చచెప్పుకోలేక పోయాను? అలాగే అని అంటే, నా కూతురు నా మాట కొట్టెయ్యలేదని సంతోషపడే దానివి కదా! ఆ సంతోషాన్ని నీకెందుకు ఇవ్వలేకపోయాను?
తొలిసారిగా నేనెప్పుడు నిలబడ్డానో, అడుగులేసానో, మాట్లాడానో… ఇలా… తొలిసారిగా నేనేమి చేసినా టైంతో సహా రాసుకుని, అవి మరల మరల చదువుకొని… నా పసితనపు ముచ్చట్లను, చిన్ననాటి జ్ఞాపకాలను నాతో పంచుకుని మురిసిపోయేదానివి.
మరి నేనో! ఆలోచిస్తే… నేను పెద్దయ్యాక, తొలిసారిగా నిన్నెక్కడికైనా తీసుకెళ్లానా? బహుమతి ఏమైనా కొనిచ్చానా? హాస్పిటల్ కు తోడొచ్చానా? నీకేమైనా చేసి పెట్టానా… జ్ఞాపకం చేసుకుందామంటే ఒక్కటీ జప్తికి రావడం లేదు. ఇంతకాలం నిన్ను టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకున్నానంటే నా మీద నాకే కోపమొస్తుందమ్మా! నన్ను క్షమించవూ?
నేను నీ దగ్గరకొచ్చినా వంటంతా నువ్వే చేసేదానివి. నువ్వు నా దగ్గరికొచ్చినా నువ్వే చేసేదానివి. రెస్ట్ తీసుకోకుండా ఏమిటమ్మా అని నేన్నిన్ను కోప్పడితే, రెస్ట్ లేకుండా ఎప్పుడూ కష్టపడతావు. నేనున్న ఈ నాలుగు రోజులైనా రెస్ట్ తీసుకో అని తిరిగి నాకు చెప్పేదానివి. అవి గుర్తొస్తే నీలా నన్నెవరు చూసుకుంటారన్న బెంగ ఎక్కువైపోయింది. ఇప్పుడు తెలుస్తుంది అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరని.
ఎప్పుడూ కుటుంబం, పిల్లలు, ఉద్యోగమంటూ… వీటి గురించిన ఆలోచనలతోనే కొట్టుకుపోయే దానిని. గాని, ఆ ఆలోచనల్లో నువ్వుండే దానివి కావు. మరిప్పుడేమిటి? నువ్వు లేవన్న విషయం గుర్తుకొచ్చేసరికి… బ్లాక్ హోల్ లా శూన్యం, నన్ను తన లోపలికి లాగేసుకుంటుంది. చుట్టూ ఎంతమందున్నా ఒంటరితనం నన్నావరించుకుంటుంది. త్రోవ తెలియని పథికురాలిలా అయిపోయానిప్పుడు. అమ్మ అన్న ఒక్క మనిషుంటే జీవితానికెంత నిండుతనమొస్తుందో ఇప్పుడర్థమౌతుంది.
నాకేమి కష్టముందో అనే ఆలోచించావు గాని, నీ కష్టాన్నెప్పుడూ నాతో పంచుకోలేదు. అన్నీ చెప్పినదానివి కష్టముంటే చెప్పవా అనుకున్నాను గాని, గరళాన్ని నీ మనసులో దాచుకొని, అమృతాన్ని నాకు పంచావని ఏనాడూ ఊహించుకోలేకపోయాను. అందుకు నన్ను క్షమించవా అమ్మా! చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నింటికి నువ్వు నన్ను క్షమించాల్సి వస్తుందో?
అర్ధాంతరంగా, చెప్పాపెట్టకుండా, మాకు తెలియని లోకానికి ప్రయాణమైపోతావని ముందే తెలిసుంటే, నా మనసులోని భావాలను, నీకు వ్యక్తపరచుకునే దానిని కదమ్మా! ఏ ఊరైనా వెళ్తే వంద జాగ్రత్తలు చెప్పేదానివి. అటువంటిది తిరిగి రాని లోకాలకు వెళ్తూ, ఒక మాటైనా చెప్పకుండా ఎలా వెళ్లిపోయావమ్మా? ఈ నిమిషం మనది గాని, మరు నిమిషం కాదన్న సత్యాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నందుకు నన్ను మన్నించవా!
ఎదుటివారు ఇష్టమని అనిపించినప్పుడు వెంటనే చెప్పండి. లేకపోతే నాకు లాగ, చెప్పే అవకాశం మీ నుండి జారిపోతుందేమో! తర్వాత నాలా బాధపడతారేమో! అని నాలాంటి వారికి, గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. నిన్ను తలుచుకుంటుంటే, నేను నీకు చేసినవాటికన్నా, నేను చెయ్యలేనివే ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకని జన్మజన్మలకీ నువ్వే నాకు అమ్మగా పుట్టవా? నీకు, నేను చెయ్యాలనుకున్నవి, చెయ్యలేకపోయినవి… ఒక్కో జన్మలో నెమ్మది నెమ్మదిగా తీర్చుకుంటాను. ఋణశేషం ఉంచుకొని మళ్ళీ మళ్ళీ నీ కూతురుగా పుట్టాలని నా ఆశ. నా ఈ కోరికను తీరుస్తావని, మరీ మరీ కోరుకుంటూ,
నీ
తనూజ