ఆత్మగౌరవ కేతనం వకుళాదేవీ..  

చైతన్యమే ఆ రూపం

ఆమె చదివింది హోం సైన్సు. తండ్రి పెద్ద ఆఫీసర్,  అన్న అడ్వకేట్! తమ్ముడు పెద్ద ప్రభుత్వ ఉద్యోగి. ఇవేవీ ఆమెకు ఆకర్షణలసలేకాదు. ఆమె ఏర్పరుచుకున్న లక్ష్యం కోసం వరంగల్ దగ్గర పల్లెటూరులో ఉండి, తనను తాను పరిస్థితులకు తగినట్టుగా మలుచుకొని, ఆధునిక నాగరిక జీవనాన్ని వదులుకొని, తాను అనుకున్నది సాధించడానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొని, సమైక్య కుటుంబ విలువలను కాపాడుతూ వృద్ధులైన అత్తమామలను కంటికి రెప్పలా కాపాడుతూ, తన పిల్లలను సక్రమంగా పెంచి పెద్ద చేసిన గృహిణిగాను, దేవాలయ ధర్మ కర్తల వంశంలో కోడలిగా అడుగుపెట్టిన వకుళ గారు తనదైన ఆధ్యాత్మిక మార్గంలో కోవెల సంప్రదాయ ధర్మాన్ని కాపాడుతూ, దేవాలయ పునరుద్ధరణ చేస్తూ…మహిళా సాధికారత సాధించిన తరుణీ మణిని రేపటి తరానికి ప్రేరణామూర్తిగా….తరుణీ  పాఠకులకు పరిచయం చేస్తున్నది.

     ఇంకెందుకాలస్యం? రండి కూనూరు వెడదాం! ఎంతో దూరంలేదండీ! ఆ ఊరు…. హన్మకొండకు కారులో 40 నిమిషాల ప్రయాణం….   ఛలో!! ఛలోరే! కూనూర్….

                     వకుళాదేవీ

1ప్ర:— మీ నేపథ్యం గురించి మా తరుణి పత్రిక పాఠకులకు చెప్తారా?

జ:— నేను మా నాన్నగారి ఊరైన చిట్యాలలో 5 – 12 – 1952 లో పుట్టాను. చిట్యాల మానాన్న గారి స్వగ్రామమం నాన్న యెఱ్ఱవల్లి కేశవరావు- అమ్మ కౌసల్యాదేవి. బాల్యం కొంతకాలం అక్కడే గడిచింది.

2 ప్రశ్న  :—  మీ విద్యాభ్యాసం ఎలా జరిగిందో వివరిస్తారా?

జ :— నా విద్యాభ్యాసం బాల్యం నుంచి చాలాచోట్ల జరిగింది. మా నాన్నగారు ఇంజనీర్ కావడం వల్ల వారు ఎక్కడెక్కడ తిరిగితే అక్కడ చదువుకోవడమైంది.  ప్రైమరీ ఎడ్యుకేషన్ నాగార్జున సాగర్ , భద్రాచలం, హన్మకొండ  లో జరిగింది కానీ హయ్యర్ ఎడ్యుకేషన్  హైదరాబాద్ లోని మాడపాటి హనుమంతరావు గారి స్కూల్ లో జరిగింది. తరువాత కాలేజ్ చదువులు లక్డీ కా పూల్ లోని హోమ్ సైన్స్ కాలేజీలో జరిగింది.

అప్పుడుఆ కాలేజ్ లో సెమిస్టర్ సిస్టం ఉండింది. నేను సెకండ్ ఇయర్ ఎండింగ్ లో చదువు మానేసాను కానీ అదే సంవత్సరం BA రెండవ సంవత్సరం ( ఎక్సటర్నల్) పరీక్ష రాసి తరువాత మూడవ సంవత్సరం పరీక్షలు రాసి డిగ్రీ పూర్తి చేసినాను. పది సంవత్సరాల తరువాత  MA తెలుగు  అది కూడా ఎక్సటర్నల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి  MA లో పోతన భాగవతం నా స్పెషల్ స్టడీగా పూర్తి చేసాను.

3ప్ర :—- మీరేమీ అనుకోనంటే? మిమ్మల్ని చూస్తుంటే ఆధునిక భావాలున్నట్టు కనబడుతున్నారు. దేవాలయ నిర్వహణ చేపట్టారు. దానికి ఏదైనా ప్రత్యేక కారణాలున్నాయా?

జ:- ఆధునిక భావాలంటే కులమతాలకు అతీతంగా మానవులంతా సమానమే! అందరూ దేవాలయ ప్రవేశానికి అర్హులే అన్న మన రామానుజాచార్యుల  సిద్ధాంతమే నాది!  కానీ ఆధునిక విద్యతో  గ్రామంలోని విద్యార్థులు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు. నావద్దకు వచ్చి చదువుకున్న హరిజన విద్యార్థులు కూడా మంచి విద్యాధికులై ఇంజనీర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం.

వకుళాదేవిగారితో రంగరాజు పద్మజ

ఆ రోజుల్లో అంటే 1984 లో ఆడపిల్లలని పదవి తరగతి వరకు చదివితే చాలు అని అనుకొనే మా గ్రామస్తులను అలా కాదని, వారిని వారించి ఆడపిల్లలను ఇంకా పై చదువులు చదివించండని వారి తల్లి తండ్రులకు చెప్పి, వారిని ఒప్పించే దాన్ని. అందువల్ల వారు మంచి చదువులు చదువులు చదివి చాలామంది మంచి ఉద్యోగాలలో స్థిరపడడం నాకు మిక్కిలి సంతృప్తిని ఇచ్చింది  .

4ప్ర:- మీరు చదివిన చదువుకు సరిపోయే ఉద్యోగం చేయకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని దేవాలయ పునరుద్ధరణ చేపట్టడంలో మీకు స్ఫూర్తి ఎవరు ?

జ :- BA  కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య శిక్షణా తరగతులు బోధించాను.  కానీ తరువాత మా వూరికి హన్మకొండకు రాకపోకలకి చాలా ఇబ్బందిగా వుండేది. ఇంట్లో వృద్ధులైన మా అత్తగారు, మామగారు, అత్త గారి తల్లివాళ్ళను చూసుకోవడం శ్రమగా అనిపించి, బోధన వదులు కోవాల్సివచ్చింది.

ఆధ్యాత్మిక మార్గమంటే అది నాకు మనోనిబ్బరాన్ని , ప్రశాంత తను ఇచ్చేది కనుక  అది మా వారసత్వ దేవాలయం కనుక దాన్ని కాపాడడం నా బాధ్యత అనిపించి, దాన్ని పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. నేను అది కూడా భగవత్ అనుగ్రహం అని అనుకుంటా! ఆ రంగనాథుడే నన్ను ఒక ఉపకరణంగా వినియోగించు కుంటున్నాడు. మన చేతిలో ఏమీ లేదు. నాకు స్ఫూర్తి ఆ దేవాలయఝ నిర్మాణ కర్త   పూజ్యులు  నెల్లుట్ల వెంకటేశ్వర రావు గారే! వారు నాకు కూడా తాతగారు మా నానమ్మ వారి మొదటి సంతానం , ఆ తాతయ్య తన చివరి క్షణాలలో “నా రంగనాథుడిని ఎవరు చూస్తారో” అని విలపించారట! అది విని నా మనసు చాలా బాధ పడింది.

5ప్ర:—  భగవంతుడి సేవతో పాటు గ్రామ అభివృద్ధికి ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా? మీరు మహిళగా ఈ కుగ్రామంలో దేవాలయ నిర్వహణలో  ఇబ్బందులు ఎదుర్కొన్నారా?

జ : —  అవును  , దేవాలయ భూములు మరియు దేవాలయావరణలను కాపాడాలనే నా తపన నాకు చాలా కష్టాన్నే కలిగించింది. ప్రతి ఒక్కరికి దేవాలయ ఆస్తులపైనే దృష్టి. గ్రామానికి ఏది కావాలన్నా ఆ స్థలాలనే ఆక్రమించడం, చివరికి దేవాలయావరణలో గృహాలు కూడా నిర్మించుకున్నారు. ఇకపైన దేవుని భూములు ఆక్రమించకుండా దేవాలయావరణకు ప్రహరీ నిర్మించాము. ఎవరూ ఇట్టి వాటిని ఆపే ప్రయత్నానికి సహకరించ లేదు. కానీ ఇప్పుడు  కొంత మంది నాకు సహాయంగా నా విద్యార్థులు వస్తున్నారు.

6ప్ర :— కోడలిగా, భార్యగా, తల్లిగా, సమాజంలో పౌరురాలిగా మీ బాధ్యతలు ఇన్ని రకాలు ఎలా నిర్వహించగలిగారు?

జ:— నాకు ఎంత సేపు ఏదో ఒక పని చేయడం చాలా ఇష్టమైన విషయం. అందులో పెద్దల విషయంలో బాధ్యత మరియు మానవత్వముతో ఉండాలని నా అభిప్రాయం. మనం ప్రేమను పంచితే తిరిగి అదే మనకు లభిస్తుందని నేను నమ్ముతాను. మనం పెద్దలకు ఇచ్చిన గౌరవం మనపిల్లల నుంచి తప్పక మనకు లభిస్తుందని అనుకొనే దాన్ని . నా  విద్యార్థులకు నేనొక  మార్గదర్శిగా ఉండాలని అనుకున్నా అది సాధించింనాను.

7ప్ర:—  భగవంతుడి సేవతో పాటు గ్రామాభివృద్ధికి ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా?

జ  : —- నేను నాకుగా గ్రామాభివృద్ధి ఏమీ చేయలేక పోయినా గ్రామంలోని హాస్పిటల్, పంచాయతీ ఆఫీస్,   వాటర్ ట్యాంక్లు  , ప్రభుత్వ పాఠశాలలకు స్థలాలు ఇచ్చాను.

8ప్ర : —  మగవారికే కష్టసాధ్యమైన వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న మీరు అందులో ఏమైనా ప్రతిబంధకాలు ఎదుర్కొన్నారా? వ్యవసాయంలో కొత్తపద్ధతులేమైనా అవలంబించారా?

జ:— వ్యవసాయం చేయడం నాకొక వ్యసనం కావచ్చు! నాకే కాదు భూములున్న రైతులకు ఆది ఒక మంచి వ్యసనం. ఎన్ని విధాలుగా నష్టపోయినా తిరిగి అదే పని చేస్తారు రైతులు. ఈసారైన పంటలు పండకపోతాయా? అని రైతుల తపన! నాకు అంతే కానీ   నేను పండించే పంట ఎక్కువగా వరి కావడం చేత, నాకు నీటి వసతులు ఉన్నాయి కనుక వరి పంట బాగానే పండుతుంది. ఎక్కువగా రసాయన ఎరువులు వాడను. పశువులు ఉన్నాయి కనుక వాటి ఎరువులు వేస్తాను. పచ్చి రొట్ట ఎరువులు వాడుతాను.

మా భూములు కూడా చాలా మంచి సారం కలవి కాబట్టి కొత్త పద్ధతులంటే ఎక్కువ రసాయన ఎరువులు వాడక పోవడమే!

9ప్ర:- మీ ఆధ్యాత్మిక గురువు ఎవరు?

జ:- ఆధ్యాత్మిక గురువు అంటే రామానుజాచార్యుల వారికి ఉన్నట్లే నాకు చాలా మంది గురువులు ఉన్నారు. నా మొదటి గురువు మా నాన్న గారు. వారు నన్ను ఎన్నో విధాలుగా గైడ్ చేసినారు.  వారు నాకిచ్చిన ఆధ్యాత్మిక శిక్షణ జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకునేలా నన్ను చేసింది. ఈ కాలగమనంలో మన జీవితం చాలా చిన్నది. దీనికోసం బాధ పడడం అవసరం లేదు. మన ముందున్న బాధ్యతలు నెరవేర్చడం మన ముఖ్య కర్తవ్యమని బోధించి, నన్ను  నడిపించారు.

ఇక రెండవ గురువు నా సమాశ్రయణ గురువు గారు శ్రీమాన్ న. చ తిరుమలాచార్యుల వారు. వారికి నా మీద అపార కరుణ. నాకు వారు శ్రీ రామానుజ చార్యులవారు రచించిన గద్య త్రయాన్ని బోధించారు. అలాగే వారు  వాల్మీకి రామాయణాన్ని కూడా బోధించారు. నాకు సుందరకాండ చాలా ఇష్టమైనది. నేను దాన్ని ఎప్పడూ పారాయణం చేస్తుంటాను.

ఇక మూడవ గురువు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్యులవారు. వారికి కూడా నాయందు మిక్కిలి కరుణ. ఆచార్యుల కటాక్షం లభించడం మన పూర్వ జన్మ సుకృతం. వారి చివరి రోజుల్లో నాకు రాసిన లేఖ నాకు  దక్కిన పెద్ద నిధి. దాన్ని లామినేషన్ చేసుకొని దాచుకున్నాను.

ఇక నాలుగవ గురువు  జగదాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారు. వారు మా గ్రామానికి రావడం  చాలా గొప్ప విషయం. దేన్నయినా దృఢంగా సంకల్పించితే తప్పక జరిగి తీరుతుంది అన్న నా నమ్మకానికి ఒక దృష్టాంతం వారు మా ఆహ్వానాన్ని మన్నించి మా కూనూరు గ్రామంలోని శ్రీ రంగనాథ దేవాలయానికి వచ్చి శ్రీ రంగనాథునిపై చేసిన మంగళాశాసనంతో మమ్మల్ని అనుగ్రహించారు. అది నాజీవితంలో ఊహించని అద్భుతం.

ఇక అయిదవ గురువు నాకు భగవద్విషయాన్ని ప్రస్తుతం ( నమ్మాళ్వర్ల తిరువాయి మొజి వ్యాఖ్యానాన్ని) బోధిస్తున్న ఉభయ వేదాంత పండితురాలు శ్రీ మతి T. K చూడామణి గారు.

10ప్ర :—- మీరెంచుకున్న ఆధ్యాత్మిక రంగం ద్వారా రోజురోజుకు సాంకేతికంగా ఎదుగుతున్న సమాజంలో ఏమైనా మార్పు తేగలననుకుంటున్నారా?

జ :—  మానసికంగా  దృఢంగా వుండాలనుకొనే వారికి ఈ ఆధ్యాత్మిక రంగం ఉపయోగ పడుతుందని నేను నమ్ముతాను.

11ప్ర :— మీ మెట్టింట ఉంటూ దేవాలయ నిర్వహణ- వ్యసాయం రెండింటిలో ఎక్కువ సంతృప్తి నిచ్చేది ఏది?

జ :— దేనికదే సంతృప్తినిస్తుంది. పట్టణాలలోని దేవాలయాల కంటే గ్రామాలలోని దేవాలయాలు చాలా ప్రశాంతతను కలుగ చేస్తాయి. ఇక్కడ ఆ రద్దీ వుండదు. ఆ పెరుమాళ్ళను చూస్తూ ఎంతసేపైనా అలా గడిపవచ్చును. వ్యవసాయం కూడా ఒక  యజ్ఞం లాంటిదే. ఆ పొలాల మధ్య చక్కని ప్రశాంతత లభిస్తుంది. వయసు రీత్యా పొలాల దగ్గరికి వెళ్ళడం చాలా తగ్గింది.

12ప్ర :—- ఆధునిక విద్య మరియు ఆధ్యాత్మిక విద్య లాంటి రెండు విరుద్ధ రంగాలకు చెందిన విద్యలను నేర్చుకోవడంలో ఏవిధంగా సమతుల్యం లేదా సమన్యాయం చేయగలిగారు?

జ :— ఆధునిక విద్య మనం చిన్నతనంలో నేర్చుకొన్నది. ఆధ్యాత్మిక విద్య మనం పరిణితి చెందిన తరువాత నేర్చుకున్నది కదా! నా విషయంలో  ఈ 72 సంవత్సరాల వయసులో కూడా నేర్చు కొంటున్నది నేర్చు కోవాలనే తపన ఉంటే ఏది అసాధ్యం కాదు కదా !

13ప్ర:– ఆధ్యాత్మికతతో పాటు ఊరు బాగుకోసం తపిస్తూ సమాజానికి ఉపయోగపడే పనులు కూడా చేశారని విన్నాం. వాటి గురించి చెప్పండి.

జ:–  ” ఒకప్పుడు ఈ ఊరిలో చిన్నా- పెద్దా తేడా లేకుండా వేరే దారుల్లో వెళుతూ సంఘానికి వ్యతిరేకంగా పోరాడుతుండడం చూసి ఆవేదన చెందాను. దానివల్ల ఎంత సాధిస్తున్నారో? తెలియదు కానీ, బాలబాలికలు సరైన చదువులు చదవక,  ఉద్యోగాలు చేయడం లేదని తల్లిదండ్రులు పడే ఆవేదన చూసి, పిల్లల్లో మార్పు తేవాలని, వారంతా చదువుకొని ఉన్నత స్థానాలు చేరుకోవాలనే తపన వాళ్ళలో కలగాలని పిల్లలకు చదువు ఆవశ్యకత రోజూ నూరిపోసాను. దాదాపు 15 సంవత్సరాల పాటు… రెండు వేల నుండి  రెండువేల ఐదు వందల మంది వరకు పిల్లలను మార్చగలిగాను!

రోజూ వంద మంది పిల్లలు మా ఇంటికి వచ్చి చదువుకునేవారు. వాళ్లకు ఉద్యమంలో తిరగడం వల్ల కుటుంబ సౌఖ్యం పోతుందని, విద్య పోతుందని; పోలీసుల వేధింపులు ఎక్కువ అవుతాయని, ముసలివారయ్యాక చాలా ఇబ్బందులు కలుగుతాయని, అని ఇలా లాభనష్టాలను వివరించి చెప్పి, ఆ పిల్లలను విద్య వైపు…. క్రమశిక్షణగా జీవించే విధానం వైపు మరల్చగలిగాను” అని వకుళ చెప్పారు.

అంతేగాక “ఆ పిల్లలలో చాలామంది ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు. ఒక్క అన్నానికి మాత్రమే వాళ్ళ ఇళ్లళ్లకు పోయేవారు. మా ఇల్లు చతురశాల భవంతి, దాని నిండా విద్యార్థులు చదువుకుంటూ  స్థలం సరిపోకపోతే ఒకరి మీద మరొకరు అప్పడాల గుఱ్ఱాలవలె పడుకునేవారు.

నేను  వాళ్లను తెల్లవారు జామున 5 గంటలకి నిద్ర లేపి, నీతి కథలు చెప్పి, అలా చదువు మీద ఆసక్తి కలిగిస్తే ఇప్పుడు అందరూ పెద్దపెద్ద చదువులు చదువుకొని,  మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.

14ప్ర:–  అంతగా విద్యార్థుల కొరకు పాటుపడిన మీకు వారి నుండి పొందిన మరపురాని అనుభూతి ఏమైనా ఉంటే చెప్పండి.

జ :–  ఈమధ్య మా కూనూరు పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అయింది. అందరు పిల్లలు  మనందరం కలిసి వకుళ టీచర్ గారికి  సన్మానం చేద్దామని  తలపెట్టారట!   అయితే ప్రమోద్ అనే విద్యార్ధి  మాత్రము టీచరు ఒప్పుకోదు! అని టీచర్ కి ఇవన్నీ ఇష్టం ఉండదు! ఆమెను పరేషాన్ చేయొద్దని అన్నాడట!

కానీ వారంతా  మనందరం ఇంత మంచి స్థితిలో ఉండడానికి  వకుళ టీచరే కారణం కదా! అని నన్ను స్కూల్ కు రమ్మని పట్టు పట్టి రమ్మంటే…   మీకు చదువు చెప్పిన స్కూల్ గవర్నమెంట్ టీచర్స్ కు సన్మానం చేయండి నాకెందుకు” అని నేను అన్నాను!.

ఈ స్కూల్ పెట్టినప్పుడు కొన్ని సబ్జెక్టులు చెప్పడానికి టీచర్లు లేకుంటే మా వారు కోదండ రామారావు గారిని సైన్సు సబ్జెక్టు  ఉచితంగా చెప్పమని అంటే సరేనని ఎనిమిది, పది తరగతులకు సైన్స్ పాఠాలు చెప్పారు.

కాబట్టి వారికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి అని వాళ్ళు అన్నారు. అందుకే వారి పేరు మీద సన్మానం అనగానే సరే! నాకు నిజమే! అనిపించింది, ఆయన ఊర్లో ఆయనను గుర్తుంచుకొని సన్మానించాలనుకుంటే వద్దనకూడదు! అనుకుని సరే అన్నాను” అని సుచిత్ర అనే టీచర్ గారి ప్రోద్బలంతో తప్పక పాఠశాలకు పోవాల్సి వచ్చింది. కొంతమంది పిల్లలను మానవతా

ధోరణిలో పెరిగేలా చేసాననే  గొప్ప ఆత్మ తృప్తి కలిగించింది.

15ప్ర :— చివరగా అన్ని రంగాలలో నిష్ణాతులైన మహిళల జీవిత విశేషాలను వెలుగులోనికి తెచ్చే కార్యక్రమాలను నిర్వహిస్తున్న మా ( మన)  తరుణి పత్రిక గురించి మీ అభిప్రాయం చెప్పండి!

జ : —-  ఈ పత్రిక బాగా విస్తరించి, జనాన్ని చైతన్యవంతం చేయాలని కోరుతూ… మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ఆడవాళ్ళ సమస్యలు చర్చించి, పరిష్కారాలు చూపే విధంగా రచనలను ఆహ్వానిస్తూనే… సమాజ హితం కోరేవారిని గుర్తించి ప్రోత్సహించాలి! అలాగే  తమకు గృహ హింసలు నెపంతో మగవారిని మానసిక, శారీరక, సామాజికంగా శిక్షలకు గురిచేస్తున్నారు (కొంతమంది) కానీ, అందరూ మగవారు అలాంటి వారు కాదనే ఒక  అవగాహన తెప్పించాలి! ఇదే కాక మరొకటి కానీ వాళ్ళ మనస్తత్వాన్ని మార్చడం కోసం ఒక సాధనగా ఉపయోగించేలా పత్రిక ఉండాలి! అందరికీ శుభాకాంక్షలు.

కొంతమంది పిల్లలను మానవతా ధోరణిలో పెరిగేలా చేసాననే గొప్ప ఆత్మ సంతృప్తి  కలిగించిందని పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఇలా సమాజ సేవతో ఇహంలోనూ…భగవంతుని సేవతో పరంలోనూ ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు నెల్లుట్ల వకుళాదేవిగారు.

  తను చూసిన జీవితానుభవం కావచ్చు! ఎప్పుడూ , ఎక్కడా తాను వెనుకడుగు వేయలేదు. వకుళ అంటే వేంకటేశ్వరుడికి తల్లి. దేవుడి గురించి చెప్పేటప్పుడు తల్లి వలె పరవశించిపోయిన ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించే ఒక మల్టీ టాలెంటెడ్ బెంచ్ మార్క్! తనని గురించి రాయడం అంటే నా చదువు సరిపోదు! ఆమె ఆదర్శాల ముందు నా అక్షరాలు వెలవెల పోతాయేమోనని భయం. ఎందుకంటే? ఆధునికతలో… ఆధునిక మహిళ! సంప్రదాయ చదువులో అమోఘమైన జ్ఞానం ఉన్న ఆమెతో ఎలా మాట్లాడాలో అనే చిన్న జంకు… సరే! నా భయాలెలా ఉన్నా అడిగిన వాటికంతా ఓపికతో చక్కని సమాధానాలిచ్చి, చక్కని భోజనం పెట్టి; నాతో మాట్లాడుతూనే ఎరువుల దుకాణదారునితో మాట్లాడి 20 బస్తాల ఎరువు పంపమని చెప్పడం విన్న నాకు వకుళ గారికి సమయం వృధా చేయడం నచ్చదని అర్ధమైంది. ఆ సమయపాలనే సింగిల్ మదర్ గా తనకు ఎదురైన ఛాలెంజ్ లను ఎదుర్కోగలిగారు.ఆ అనుభవాల వల్లనే ఆమె జీవితంలో అంత క్రమశిక్షణగా ఉంటుందనిపించింది. చావు పుట్టుకల గతుకుల్నీ- గమనాలనీ తట్టుకుంటూ తన ఉనికికి ఒక అర్ధం కల్పించుకుంటూ… జీవన వ్యవసాయాన్ని చేసిన కర్షకురాలు!  ఆమె సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ….

జీవితం పొలిమేరల నుండి పోరాడి గెలిచిన మానవి …. వకుళ గారు! ఎవరిమీదా ఆధారపడని తన “స్వాభిమానం” అంటే నాకు ఎనలేని గౌరవం!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి విషయసూచిక

స్వశక్తి