ఇప్పటికైనా ….

2026 జనవరి తరుణి పత్రిక సంపాదకీయం

పాత నీరు పోగానే కొత్త నీరు వస్తుంది. శిశిరంలో చెట్లు మోడు వారి పోతాయి వసంతంలో కొత్త చిగుళ్ళు వేస్తాయి. యంత్రాలు పాతవి అరిగిపోగానే కొత్త యంత్రాలను ఉపయోగిస్తారు. కలం లో సిరా అయిపోగానే నూతన కలాన్ని చేతికి అందుకుంటారు. ఇవన్నీ కొత్తవి ఈ కొత్తదనాన్ని, కొత్త ధనాన్ని ఆహ్వానించే మానవజాతి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలకు కూడా కొత్తగా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది.

ఇలా అనగానే పండుగ నాడు పాత మొగుడేనా? కారు కొత్తది, ఇల్లు కొత్తది, మరి… కొత్త పెళ్ళాం రావద్దు … అంటూ అనవసరమైన ప్రేలాపనలు  చేస్తూ ఉంటారు . అసలు… పండగనాడు పాత ‘ఉడుపేనా’ అనే మాటను కాస్త మొగుడేనా అని చేసి విపరీతార్థంలో వాడుతున్నారు. ఉడుపులు అంటే బట్టలు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా! పనిలేక ఊరికే ఉండే వాళ్ళు ఇలాంటివి సృష్టిస్తున్నారు. హాయిగా మూతి ముందు కు తిండి వస్తోంది.. ఇంకే టైం పాస్ ఇలా చేస్తున్నారు కొందరు. ప్రొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి, వంట చేసి పెడుతుంటే తిని కూర్చుని తిన్నది అరగక ఇలాంటి “జోకులు” ” జోకుతున్నారు” . ఇవే వచ్చేవాళ్ళు వాటినే ‘ఎంజాయ్ చేస్తున్నామనుకుంటూ నువ్వులుపోతున్నారు. భరించేవాళ్ళు భరిస్తున్నారు, భరించలేని వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఇవన్నీ చిన్నారి మనసు లపై ఎంతటి చెడు ను చూపించిందో !!

తల్లి పాతదేనా? తండ్రి పాతవాడేనా? అని అన్నప్పుడు… నువ్వు కూడా నీ పిల్లలకు పాత తండ్రివో పాత తల్లివో అవుతావు అనే జ్ఞానం ఉండదా?  ఉంటుంది … ఎందుకుండదు! అయినా సరే ఇలాంటి మాటలు మాట్లాడి అసలు విషయాన్ని పక్క దానికి పట్టిస్తూ ఉంటారు కొందరు ప్రబుద్ధులు!!

వస్తువులను మార్చినంత సులభంగా మనుషులను మార్చుకోమని కాదు! ప్రకృతి కొత్తదనాన్ని చూపించినంత సులభంగా అందంగా నీ ఆలోచనలను మార్చుకొని చెప్పడం..!! ఇలా అనగానే మళ్లీ పెడార్థాలే తీస్తారు పనికిమాలిన వాళ్ళు!! అవి పట్టించుకోనవసరం లేదు. మూడు పూటలా

తిండి ముందు వచ్చిపడుతోంది.. అదేనండీ తిండి తెచ్చిపెడుతోంటే పనీపాటా లేని చేతులు సెల్ ఫోన్ తో ముచ్చట్లు చెప్పిస్తారు. ఇలాంటివి కాని అసలుసిసలైన మనుషుల ను దృష్టిలో పెట్టుకొని స్థూలంగా చెప్పాలంటే

New decisions …

 New work s …

Progressive thoughts..

 కొన్ని నియమాలకు కొన్ని కట్టుబాట్లకు కొన్ని నీవైన వ్యక్తిత్వ వికాస సముద్ధరణకు మంచి మనసున్న ఆలోచనలు రావాలి! అదే కొత్త సంవత్సరం కాంక్ష!!

భార్య ను అవమాన పరచకుండా, అనగానే “గౌరవం ఇవ్వకున్నా అవమాపరచకుంటే చాలు అనీ, మేలు చేయకున్నా కీడు చేయకుంటే చాలు ! అనుకునే సభ్య సమాజం లో మనుగడ సాగిస్తున్న సందర్భం ఇది! మనుషులంతా విలువలకు విలువిస్తుంటే తప్ప యవతలో మార్పు రాదు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తూనో, పిల్లలను కనడం మానుకుంటునో అన్నింటికీ  “నో ” చెప్పేస్తూ, బ్రతికేస్తూ స్వేచ్ఛ తో ఉన్నామనుకుంటున్న వాళ్ళ కూ కాస్త నైనా అసలు జీవిత మాధుర్య విలువ తెలిసివస్తుందేమో? అసలు చదువు విలువ అసలు డబ్బు విలువ ఇలా అసలు అని చెప్పుకునే విలువల పై మమకారం పెరుగుతుందేమోనని ఆశ!!

2025 సంవత్సరం వెళ్ళిపోయింది మామూలుగా…. ఎప్పటిలాగే.. చాలా సాధారణంగా…

కొత్త క్యాలెండర్… కొత్త సంవత్సరం…  కొత్త కళను సంతరించుకుని గుండె గోడకు వేళాడుతూనే ఉంది. మారాల్సినదేంటో ? మార్చుకోవాల్సినదేంటో

ఇలా మాటలే కొడవళ్ళైనవి ఏంటో !!

కొత్త తరం వాళ్లు పెళ్లి కి “నో ” ఎందుకు చెబుతున్నారో కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇన్ని విపరీతాలు చేసి చేసి ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళే పెద్దలు. ఇప్పటికైనా వాళ్ళ ఆలోచనలు మారి మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకుంటే అలవర్చుకుంటే పిల్లలు కూడా మారుతారు.

కోడలుగా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తాను అనుభవించిన కష్టాలను కసిగా తన కోడలిపై చూపించిన అత్తగార్లను చూసాం , చూస్తున్నాం తానుపడిన బాధలు తన కోడలు పడకూడదు అనుకుని సహృదయంతో ఆలోచించే అత్తగార్లను చూసాం, చూస్తున్నాం.

మామగారిగా అవతారమెత్తిన మరు క్షణం నుండి తాను ముందు నుండి చెలాయించే ఆధిపత్య ధోరణిని ఇంకా పెంచి పోషించుకుంటూ ఉంటున్న మామగార్లను చూస్తున్నాం. ఇవన్నీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎంతటి ప్రభావం చూపిస్తాయి అనే ఆలోచన చేయని వాళ్లే వీళ్ళు. ఇదంతా తరతరాలుగా వచ్చిన పురుషాధిక్య సమాజం చేసిన నిర్వాకం. కనీసం మారుతున్న కాలాన్ని అనుసరించి జనరేషన్ మారిన వాళ్లు కూడా పాటించి బాగుపరచుకోని జీవితాల వల్లనే ఇవాళ ఇంతటి విపరీతానికి దారి తీయడానికి కారణాలు అయ్యాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కానీ, కనీసం ఇప్పటికయినా మారిపోయి మంచి ఆలోచనలు చేస్తే కనీసం ఈ జెనరేషన్ ఇవన్నీ గమనిస్తారు కాబట్టి, నెక్స్ట్ జెనరేషన్ వాళ్ళ లోని భయం తొలగిపోయి పెళ్లి పై సదాభిప్రాయం కలిగే అవకాశం ఉంది.

     సహజీవనం చేస్తున్నారట ఇప్పటి యువత! ఇవన్నీ బాధ్యత లను తప్పించుకోవడానికే. కానీ ఇది సరైన విధానం కాదు. విచ్చలవిడి తనం వల్ల కలిగే నష్టం ఇంతా అంతా కాదు. మనసుకూ, శరీరానికి అనారోగ్యం పట్టుకుంటుంది. దీనివల్ల సమాజం మొత్తం చెడిపోతుంది.

  ఈ విపత్తు సంభవించకుండా ఉండాలంటే ఇకనైనా ఆధిపత్య ధోరణిని వదిలి సుహృద్భావ వాతావరణం ఇంట్లో ఉండేలా చూసుకోవాలి, పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే యువతరం కూడా ఎంతసేపూ తప్పులనూ, కష్టలనూ ఎత్తి చూపుతూ అసలు విషయానికి ఎసరు పెడుతున్నారు. ఇది చాలా విపరీతంగా తయారయ్యిందంటే మాడ్రన్ మాడ్రన్ అంటూ మంచిని జారవిడుచుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత మనకున్నది. తస్మాత్ జాగ్రత్త!

ఇదే ఈ కొత్త సంవత్సరం నిర్ణయం అని అందరూ అనుకోవాలి. అప్పుడే విజయాన్ని సాధిస్తాము. చక్కని కుటుంబ వ్యవస్థ కు మళ్లీ మంచి రోజులు వస్తాయి.

 ____***____

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అయితే మీరే… (భుజాలు తడుముకుంటున్నారుగా!)- 10వ భాగం

ఒడిపిళ్ళు 27వ భాగం