సూర్యుడు ఆకాశంలోకి ఎగబాకుతూ ఉన్నాడు. వాయిద్యాల ప్రతి ధ్వనులతో భూక్యాకి మెలుకువ వచ్చింది. అతడు ఒళ్ళు విరుచుకుని చుట్టూ చూశాడు. మైదానం అంతా నిర్మానుష్యంగా ఉంది. రాత్రి జరిగిన సంఘటనలు కొద్దికొద్దిగా గుర్తుకొచ్చాయి. నేల పై వాడిపోయిన పువ్వులు, ఖాళీ చేయబడిన సారాకుండలు, పండుగ మంటల బూడిదలను చూశాడు. రుచికరమైన మద్యం వాసనను భారంగా గాలి మోసుకొస్తోంది. ఆ వాసనను పీలుస్తూ రాత్రి జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. కలో నిజమో తెలియని గందరగోళంలో ఉన్నాడు అతడు.
పాచిపట్టి ఎండిపోయిన కాలువ దారిలో కమిలీతో కలిసి నడుస్తూ అతను అడుగుతున్నాడు.
“నువ్వు ఎవరి దానివి కమిలీ? నువ్వు చెప్పు ఎవరి దానివి?” అంటూ అడుగుతున్నాడు.
ఒక చేయి అతని నడుము చుట్టూ వేసి ఆమె పెదవులతో అతని చెవులను నొక్కుతూ “నేను నీ దానిని” అంటూ గుసగుసలాడింది.
వారి ప్రశ్నోత్తరాల ప్రయాణం అంతు లేకుండా సాగింది. అయినప్పటికీ వారు చెప్పదలుచుకున్నది, పూర్తిగా ఒకరికొకరు చెప్పుకోలేకపోయారు. ఒక లోతైన లోయలో చుట్టూ ఎత్తయిన కొండలతో, చిక్కటి అడవికి ఒకవైపు తడి ఇసుకలో జింకల గిట్టల గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ వారు ఒక బండపై కూర్చుని ఉన్నారు. కమిలీ అతని ఒడిలో కూర్చుని ఉండగా భూక్యా తన చేతిని చాపి, ఒక అడవి పూలగుత్తిని తెంపి , ఆమె కొప్పులో ఉంచాడు. అంతలో ఒక్కసారిగా ఒక జింకల గుంపు వారి ముందు నిలబడింది. ఒక పెద్ద మగజింక తన తలను పైకెత్తి వారి వైపే చూస్తూ ఉన్నది. పొడవైన చెట్ల కొమ్మల వంటి కొమ్ములు కలిగిన ఆ జింక ముక్కులను ఉబ్బిస్తూ శ్వాసను గట్టీగా బయటికి వదులుతూ ఆడ జింకలను కుమ్ముతోంది. అంతలోనే మరో తీరం వరకు భయంకరంగా ఒక గరుడ పక్షి లాగా అది ఎగిరిపోయింది. దాని వెంట మిగిలిన గుంపంతా చెట్లలోకి నడిచాయి. ఇంకా కమిలీ భూక్యా అక్కడే కూర్చుని ఉన్నారు.
కానీ ఇదంతా కలలోనే నిజం కాదు.
ఇంకా వాయిద్యాల మోతలు కొనసాగుతూనే ఉన్నాయి. గొప్ప వేట ప్రారంభం కాబోతున్నది. పురుషులందరూ అడవిలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. వట్టి చేతులతో వస్తే వారంతా స్త్రీల తట్లను నిందలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. స్త్రీలందరూ తమ భర్తల మెడ చుట్టూ వస్త్రాలను కట్టి చివరన తాళ్ళను కట్టారు. ఒకవేళ ఎవరైనా ఏ జంతువునైనా వేటాడడంలో విఫలమై, ఖాళీ చేతులతో వస్తే, ఆ పురుషుణ్ణి పేడ ముద్దలతో మట్టి ముద్దలతో కొడతారు. వారిపై వారి భార్యలు అరుస్తారు “చూడండి ఈ శక్తివంతమైన వేటగాడిని, సిగ్గులేకుండా ఒట్టి చేతులతో ఇల్లు చేరాడు” అంటూ “వెంటనే తిరిగి అడవికి వెళ్ళు” అని అరుస్తారు. ఇదంతా వారి సంప్రదాయంలో భాగం. కానీ విజయవంతంగా వేటతో వచ్చిన వారిని పూల దండలతో సన్మానిస్తూ డాన్సులు వేస్తూ వేడుకగా ఎదుర్కొంటారు.
భూక్యా లేచి తన ఇంటివైపు నడిచాడు అతని అందమైన కలలను వదిలి, అసంతృప్తితో మిగిలాడు. అవును కమిలీ అతన్ని ప్రేమిస్తోంది. కానీ ఆమె తనకు ఏమిచ్చింది? దుఃఖంతో కూడిన నిరాశ మాత్రమే ఇచ్చింది. అతడు మళ్ళీ గందరగోళంలో మునిగిపోయాడు. ఏది నిజమో ఏది కలో గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. కానీ వెంటనే అతను కోరుకున్నట్టు కమిలీ అతని సొంతమవుతుందని నమ్మకం కలిగించుకున్నాడు.
నవ్వుకుంటూ ఆనందంగా వేటకు సిద్ధపడ్డాడు. అతడు జింకను కలలో చూసాడు. అది ఎక్కడ కనపడుతుందో అతనికి తెలుసు. వేటాడటానికి మరికొందరు వేటగాళ్లతో అడవిలోకి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. కమిలీ అక్కడ అతనిని కలవచ్చని అతని ఆశ. జింకను వేటాడాలనే కోరిక అతనిలో పెరిగింది.
గిరిజన పురుషులందరూ వీలైనంత తొందరగా ఉదయం పూట ఆహారాన్ని తీసుకొని అడవి వైపు బయలుదేరారు. ప్రతి ఒక్కరి చేతిలో తుపాకులు, ధనస్సులు, బాణాలు, గొడ్డళ్ళు, కత్తులు, కర్రలు ఏదో ఒక ఆయుధాన్ని వారి భుజాలపై పట్టుకొని ఉన్నారు. వారితో పాటు స్త్రీలు గ్రామం నుండి చాలా దూరం వరకు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వారిని అనుసరించారు. ఊరిలోని కుక్కలు వారితో పాటు అడవికి బయలు దేరాయి. వాయిద్యాలు మోగుతున్నాయి బాకాలు ఊదుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉద్రేకంతో ఉన్నారు.
వారంతా కొండపైన చదును ప్రాంతానికి చేరగానే, ఆక్కడ చర్చలు మొదలు పెట్టారు. జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరూ తమ తమ ప్రత్యేక బాధ్యతలను పంచుకున్నారు. చాలాసేపు సంభాషణల తర్వాత, వేటగాళ్ళందరూ మూడు భాగాలుగా విడిపోయి, వారి వారి మార్గాలలో అడవిలోకి మూడు దిక్కులకు వెళ్లారు. స్త్రీలు వారిని అనుసరించారు.
భూక్యా కూడా తనకు నిర్ణయించిన దిక్కుకు నడిచాడు. అతడు సెలయేటి వైపు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. అతనితోపాటు ఇంకా ఐదుగురు పురుషులు ఉన్నారు. అక్కడ అడవి దట్టంగా ఉన్నది . చెట్ల ఆకులన్నీ రాలిపోయి, ఎండిపోయిన కొమ్మలు ఒకదానికి ఒకటి అల్లుకుపోయి ఉన్నాయి. అవి ఒకదానికొకటి అడ్డుగా చొరబడడానికి వీలుకాకుండా తడక అల్లినట్లు ఉన్నాయి. అక్కడి నుండి ఎత్తయిన ఏటవాలు ప్రాంతం నుంచి అనేక గ్రామాలు సుదూరంలో కనిపిస్తున్నాయి. లెక్కలేనన్ని సెలయేళ్ళు లోయల్లోకి ప్రవహిస్తున్నాయి. అదంతా దట్టమైన అడవితో చుట్టబడి ఉన్నాయి. ఒక తీరంలో వారు నడుస్తున్నారు. దట్టమైన చెట్లు, పెద్ద పెద్ద అనేక రకాల వృక్షాలు తీగలు వ్యాపించి ఉన్నాయి. కనీసం పేర్లు కూడా తెలియని చెట్లు, తీగలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్దపులి తీగ
ఒకటి చెట్టుకు పాకి, పూలతో నిండి ఉంది. ఆ చెట్టు పూలవాసన పెద్దపులి వద్ద వచ్చే వాసనను పోలి ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు. మరో తీగకు చిన్న ఎర్రటి పువ్వులు చిరు మంటలాగా వాడిగా కనిపిస్తూ ఉన్నాయి.
ఆదివాసీల అధికార సంపదను ఎవరు చెరపలేరు. ఆకులు, పూలు, పండ్లు వారి సంపద. అడవంతా వారి రాజ్యమే. కొద్దిసేపటి క్రితమే అక్కడ ఒక నెమలిని పెద్దపులి చంపి లోయలోకి గుంజుకు పోయింది. నెమలి పిట్ట తోకకున్న పొడవైన ఈకలు చెట్ల నడుమ రాలిపడిఉన్నాయి. నెమలి మెడవద్ద ఉండే ప్రకాశవంతమైన ఈకలు, సగం ఎండిన పొదల కొమ్మలపై తాళ్ళకు కట్టిన బానర్ల వలె వేలాడుతూ ఉన్నాయి. పరజజాతి యువకులు పొడవైన నెమలి ఈకలను ఏరుకొని తమ తలవెంట్రుకలలో దోపుకున్నారు. పులి యొక్క కాలి ముద్రలు ఇంకా కనిపిస్తున్నాయి. ఎండిన పులి విసర్జక గుళికలు బురద సుద్దతో కలిసిన రంగులో ఉన్నాయి. నేలమీద
ఇరుకైన దారిలో అవి పడి ఉన్నాయి. ఆ పెంటికలు ఎండి పగిలిన తర్వాత దానిలోని ఎముకలు వెంట్రుకల శకలాలు కనిపిస్తాయి.
దారిలో జోడి చెట్టు కింద ఒక చిన్న రాళ్ల కుప్ప ఉన్నది. ఆ రాళ్ల కుప్ప మీద రెండు కర్ర దుంగలు మూడు అడుగుల ఎత్తువి నిలువుగా పాతి ఉన్నాయి. వాటికి కట్టిన మామిడాకుల తోరణాలు సగం ఎండి కనిపిస్తున్నాయి. ఒకవైపు తాటాకుల గొడుగు ఏర్పాటు చేసి ఉన్నది. అక్కడ ఒక మనిషిని పులి చంపి తిన్నట్లు అది ఒక గుర్తు అన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక పశువుల కాపరిని పులి చంపింది. దానికి జ్ఞాపకంగా అక్కడ అది ఏర్పాటు చేశారు.
వేటగాళ్లు తమ మార్గాలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. గుట్టలు బండరాళ్ళు ఉన్న ఆ లోయ ప్రాంతంలో దట్టమైన అడవి ఉన్నది. లోయ ప్రాంతంలో వేటగాళ్ళు పాకుతూన్న మార్గంలో అడవి అరటి తీగలు, మిగిలిన అడవి పళ్ళ తీగలు కనిపించాయి. కొన్ని పళ్ళ చెట్లు రెండు నిలువుల ఎత్తుతో పెరిగాయి. ఆ చెట్ల బోదెలు ఏనుగు తొండాల వలె కనిపిస్తున్నాయి. కొండలు కొన్ని ఆకస్మికంగా లోతైన లోయలుగా మారి నదీ ప్రవాహాల వైపు చేరుతున్నాయి. కొన్ని కొండచరియలు పదునైన కత్తుల వలె కనిపిస్తున్నాయి. సెలయేళ్లు కొన్ని దాదాపు పూర్తిగా ఎండిపోయాయి అక్కడి ఇసుక తిన్నెలపై ప్రకాశవంతమైన రంగురంగుల గులకరాళ్ళు మెరుస్తున్నాయి. వేటగాళ్ళు ప్రయాణిస్తూ కొండ శిఖరాలపైనుండి అరుపులను, కొందరు చెట్లను నరుకుతున్న శబ్దాన్ని ఆలకించారు. వారున్న లోయల నుండి తల పైకెత్తి చూసినప్పుడు ఆకాశమంతా ఇరుకైన సన్నని పీలిక వలె కనిపించింది. నిటారుగా ఉన్న కొండ శిఖరాలు చుట్టుకున్న ఒక పెద్ద పాము బలహీనంగా చుట్టుకున్నట్టు , ఎత్తయిన గట్ల మీద ఆ లోతైన అడవి మార్గంలో కొండ శిఖరాలు విస్తారంగా వ్యాపించి, పెద్ద పెద్ద రాళ్లతో ఏర్పడిన లోయలు కనిపిస్తున్నాయి. చుక్కలు పెట్టినట్టుగా కొండలపై పెరిగిన చెట్లు, రకరకాల కోణాల్లో అలరిస్తున్నాయి. కొండచరియలలో కొన్ని రాళ్ళ మధ్యన ముళ్ళతో ఉన్న అరటి చెట్లు ఉన్నాయి. వాటిని చుట్టుకొని కొండచిలువలు ఉన్నాయి. వేటగాళ్ళు చేసే డప్పుల శబ్దానికి అవి ఉలిక్కిపడి చెట్ల తొర్రలలోకి, రాళ్ల చరియల్లోకి పారిపోతున్నాయి. మొదట కొద్ది సేపటి వరకు పొడవైన వాటి తోకలు రాళ్ల చివరన వేలాడుతూ ఉండి , ఆ తర్వాత కొద్దికొద్దిగా అవి కనిపించకుండా పోతున్నాయి. గుంపుల కొద్ది కోతులు చెట్ల కొమ్మలపై వేలాడుతూ పళ్ళు ఇకిలిస్తూ తమ కోపాన్ని వ్యక్త పరుస్తున్నాయి. జింకల గుంపు తొక్కిన ఇసుక తిన్నెలు కనిపించాయి. నడుము లోతు నీళ్లలో నీరు తాగి, స్నానం చేసి, ఉల్లాసంగా అటు ఇటు తిరిగినట్లు లెక్కలేనన్ని జింకల గిట్టల గుర్తులు వేటగాళ్ళకు కనిపించాయి. అవి వారికి ఆనందాన్ని కలిగించాయి. కాలువ ఒడ్డున నడుస్తూ మరొక సరస్సుకు చేరారు. అక్కడి నుండి వారి దారి కొండలవైపు మళ్ళింది. అక్కడ పైనుండి నీరు పడుతున్న శబ్దం, కొండల్లో ప్రతిధ్వనిస్తుంది. అది జడివాన శబ్దాన్ని పోలి ఉంది.
వేటగాళ్లు వేటకు సరి అయిన మాటును లోయలో ఎంపిక చేసుకున్నారు. భూక్యా దూరంగా ఒక చోట మాటును ఎంచుకొని, పాతకాలం నాటి తన తుపాకీని మందుతో నింపి సిద్దంగా కూర్చున్నాడు. ఒక చిన్న సెలయేరు ప్రధానమైన కాలువతో కలిసి పెద్ద సరస్సుగా ఏర్పడింది. పైనుండి పడే నీళ్ల వలన మెరుగు పెట్టిన రాళ్లపై చిన్న చిన్న గుంటలు పడ్డాయి. నీటి ప్రవాహం వాటి మీదుగా ప్రవహించినప్పుడు సుడిగుండాలు ఏర్పడి నీటిలో కనిపిస్తున్నాయి. నాచు మొక్కలు అడవి మొక్కలు విలాసవంతంగా అక్కడ పెరిగాయి. మరికొన్ని చిన్న చిన్న పసుపు రంగు పూలమొక్కలు తడి నేలలో పైకి పాకి, చూడడానికి అది ఒక ప్రత్యేకమైన చిట్టడవిలా ఉన్నది. భూక్యా మొక్కలతో తీగలతో ఒక పరదా వంటి మరుగును తయారు చేసుకొని జాగ్రత్తగా చూస్తున్నాడు.
వేటగాళ్ళ శబ్దాలు వినబడటం మందగించాయి. అడివంతా నిశ్శబ్దంగా భయాన్ని గొలుపుతూ క్రూరంగా ఉన్నది. ప్రతిసారి కొమ్మలు కదిలిన శబ్దం వచ్చినప్పుడల్లా భూక్యా ఉలిక్కి పడుతున్నాడు. కానీ ఏమీ కనిపించడం లేదు. చాలాసేపటి వరకు కేవలం సెలయేటిలో అలల బుడగల శబ్దం, ముళ్ళవెదురు చెట్లతోపుల నుండి గాలి చేసే ఈలల గోల, తేనెటీగల ఝంకారం వినపడుతూ ఉన్నది. అక్కడి దృశ్యమంతా ప్రశాంతంగా ఎంతో అందంగా ఉన్నది. ఏ పొద నుండైనా ఒక పులి రావొచ్చని భూక్యా ఆశించాడు. నిటారుగా నిలబడిన కొండ పక్క నుండి ఒక దున్నపోతును నోట కరుచుకొని ఉల్లాసంగా పారిపోతున్న పులిని చూసాడతడు. ఇంకా ఎలుగ్గొడ్లు(ఎలుగుబంట్లు) కూడా ఆడవిలో ఉన్నాయి. అవి చెదపురుగులను మాత్రమే తింటాయి. అక్కడ అతను అనేక చీమలపుట్టలను చూశాడు. వాటిమీద ఎలుగుబంట్ల పంజాలతో గీకిన గుర్తులు కూడా గమనించాడు. కానీ ఎలుగుబంట్లను చంపడం నిషిద్ధం. పులి సంగతి వేరే. అది తన తల్లిని చంపేసింది. అటువంటి పులిమీద పగ తీర్చుకోవడం చాలా ఇష్టమైన పని. కానీ ఒకవేళ ఆ పులి తనను చంపితే అన్న ఆలోచన కలిగిందతనికి. అతని శవ యాత్ర పసుపు పచ్చని పువ్వులతో అలంకరించబడి కనబడింది కళ్ళ ముందు. కమిలీ పక్కనే ఏడుస్తూ నడుస్తోంది. చనిపోయిన అతని శరీరాన్ని ఒక చేతిని షావుకారు, ఒక చేతిని కమిలీ పట్టుకుని గుంజుతున్నారు. అట్లా ఆలోచిస్తూ అతను నవ్వుకున్నాడు. అతనికి అప్పుడు నిరాశతో కూడిన షావుకారు ముఖం కంటి ముందు కనిపించింది. లావైన పెదవులను పంటితో వెనకకు గుంజుతూ , పెదవుల చివర సొల్లు కార్చుకుంటూ, పెద్ద పెద్ద కనుగుడ్లను తిప్పుతూ, ఎంతో డబ్బు నష్టపోయానని షావుకారు చింతించడం అతనికి నవ్వు తెప్పించింది. కానీ భూక్యా ఆలోచనలలో నిజంగా తనదైన సొంత జీవితం ఎంత అని ప్రశ్నించుకున్నాడు. ఎంత జీవితం అతనికి మిగిలింది అనుకున్నాడు. కమిలీ, షావుకారు తమ వాటాలను పంచుకోగా, తనకు మిగిలేదెంత? అనుకున్నాడు.
ఇంతలోనే చెట్లలో ఏదో శబ్దం వచ్చినట్టు అనిపించింది. వెంటనే అతను పైకి చూశాడు. అతనికి కొన్ని గజాల దూరంలో ఒక గుంట నక్క నిలబడి ఉన్నది. ఒక్కసారి దాని చూపులో అతని చూపులు కలుసుకున్నాయి. వెంటనే అది పారిపోయింది. కానీ అది ఎందుకు వచ్చింది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది తన చుట్టూ అనుకున్నాడు. కనుచూపుమేర ఒక కుందేలు కూడా కనపడలేదు. అది మంచి సూచనే, కానీ గుంటనక్క ఎక్కడి నుండి వచ్చింది? దాని చూపు ఎంతో పరిచయం ఉన్నట్టు కనపడింది. అది చూసిన తీరు ప్రత్యేకంగా అనిపించింది. తనకు ఏదో చెప్పాలని ప్రయత్నించినట్టు అనిపించింది. ఇంతకుముందు దాన్ని ఎక్కడ చూశాడు. గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. చాలా రోజుల క్రితం షావుకారు తోటలో మొక్కజొన్న కంకులు దొంగిలించిన సమయంలో కొన్ని శబ్దాలు వినిపించాయి. మాటలు లేకుండా వాచ్మెన్ వస్తున్నట్టు తనకు ఎవరో హెచ్చరించినట్లు అనిపించింది. అప్పుడు ఆ హెచ్చరిక చేసింది తన తల్లి సాంబారి కావచ్చు.
భూక్యా వణికిపోయాడు ఎటువైపు పారి పోయిందో ఆ నక్క అదృశ్యమైపోయింది. ఆ సమయంలో పెద్ద మగజింక చెట్ల గుంపుల నుండి నిటారుగా ఎగురుతూ వచ్చి నీటి ప్రవాహం పక్కన బల్లపరుపు బండపై స్థిరంగా నిలబడి గంభీరంగా చుట్టూ చూస్తూ ఉన్నది. భూక్యా వెంటనే తన తుపాకీ అందుకని చేతినిండా గడ్డిపోచలను తీసుకొని నిప్పంటించి తుపాకీ మందుగుండు అంటించే దూదిని వెలిగించాడు. ఆ తర్వాత ఒకవైపు గురిపెట్టి వేచి చూస్తున్నాడు.
కానీ పాత తుపాకీ పేలడం ఆలస్యమైంది. తుపాకీ మందు చురచురమంటూ శబ్దం చేస్తూ ఉండగా అటు ఇటు జరుపుతూ గురిచూసి పేల్చాడు. చివరకు దేవుడి దయవల్ల కొండ ప్రాంతమంతా గర్జిస్తూ తుపాకీ పేలింది. కానీ పెద్ద పెద్ద కొమ్ములున్న ఆ మగ జింక తప్పించుకొని పారిపోయింది.
మళ్ళీ తన తుపాకీ మందుతో నింపి మళ్లీ పేల్చాడు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. అతడు తన స్నేహితులతో కలిసి ఆ కొండ లోయలో మరో వైపు వెళ్లారు. సెలయేటి పక్కన మరొకచోట మాటు వేసి ఉన్నారు. జింకల గిట్టలు ప్రతి చోటా కనిపిస్తున్నాయి. కానీ భూక్యా ఒక్కసారి గురి తప్పాడు. మగ జింక కనిపించడం మంచి సూచనే. చాలాసేపు అక్కడ ఒక్క కుందేలు కూడా కనిపించలేదు అది కూడా మంచిదే.
గంటలు గడిచిపోయాయి కొండలమీద నీడలు లోయల్లోకి పూర్తిగా కలిసిపోయాయి. నిశ్శబ్దం పెరిగిపోయింది అదే నిశ్శబ్దం చాలా సేపటి కొనసాగింది. వేలకొద్ది చురుకైన కళ్ళు సూది మొనల్లా చూస్తూనే ఉన్నాయి. వేటగాళ్లంతా తమ చెవులు రిక్కించి ప్రతి శబ్దాన్ని వింటున్నారు. చాలా సేపటి తర్వాత ఒక పెద్ద రాబందు ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూ కనపడింది. పులి చంపిన వేట కోసం అది వెతుకుతోంది. సూర్యుడు అస్తమించాడు వేటగాళ్లు అందరూ ఎండలో అలిసిపోయారు. వారికి వారు విఫలమైనట్లు ఓడిపోయినట్టు భావించి నీరసంగా ఉన్నారు. నిశ్శబ్దంగా అడవి నుండి తిరుగు ముఖం పట్టేందుకు ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. ఈరోజు మనకు అదృష్టం లేదు వేట అనుకున్నారు. లోయల్లో చీకటి నిండుకుంటుంది. వారి భుజాలపై తుపాకులు భారమవుతున్నాయి. తలలు వంచుకొని నడవడం మొదలుపెట్టారు. వారి చేతిలోని కొమ్ములతో మిగిలిన వారికి హెచ్చరికలు చేశారు.
“ఇంటికి తిరిగి పోదాం రండి అన్నలారా మేము వెళ్ళిపోతున్నాం” అనే సూచనలు ఇచ్చారు. ఆ సూచన చాలా విచారకరంగా ఉంది. వేట కోసం విడివిడిగా విడిపోయిన వారందరూ కలిసి ఇళ్ళకు తిరుగుముఖం పట్టారు.
ఊరి బయటకు చేరుకోగానే వేటగాళ్లు అసంతృప్తితో వారి అపజయానికి కారణాలను చర్చిస్తున్నారు. తుపాకులు పేల్చే వారిదే తప్పని వారిని నిందించారు. తుపాకుల పట్టిన వాళ్ళు సరైన సమయం కోసం వేచి ఉన్నామని సమాధానం చెబుతున్నారు. ఒకరినొకరు నిందించుకుంటూ కనీసం ఒక్క జంతువు కూడా వేటాడలేక పోయినందుకు తిట్టుకున్నారు. తుపాకి పేల్చడానికి ఆలస్యమైందని ఒకరు, ఒక్క జంతువు కూడా పసిగట్టలేకపోయామని, ఒకరినొకరు చేతకాని వారని తిట్టుకున్నారు. చివరికి అందరూ కలిసి తమ దురదృష్టాన్ని నిందించుకున్నారు.
“నేను ఒక జింకను తుపాకీతో కాల్చాను, కానీ అది తప్పించుకుందని” ఒకరు చెప్పారు.
” నాకు రెండు జింకలు కనిపించాయి, తుపాకీతో కాల్చే సమయంలో ఎవరో అడ్డు వచ్చారు. అందుకని వాటిని కాల్చలేకపోయాను” అన్నాడు ఒకడు.
మొత్తానికి అంతం లేకుండా వేడెక్కింది వారి చర్చ. ఒకరినొకరు నిందించుకుని చివరికి అందరూ చీకటైన తర్వాత నిశ్శబ్దంగా గ్రామంలోకి వచ్చారు. అయినా కానీ అక్కడ స్త్రీలంతా సిద్ధంగా ఉన్నారు. నిందించడానికి అవమానించడానికి ఉన్నారు.
కమిలీ, మాలీ ఇద్దరూ భూక్యా కోసం ఎదురుచూస్తున్నారు ధూషించడానికి. అతను భుజాలు ఎగరేస్తూ ఆనందించాడు వారి దూషణలను. కమిలీ ఇంకా ఎవరిని తన మనిషిగా పరిగణించలేదు. కనుక ఆమె ఎందుకు బాధపడుతుంది. అతడిని ఎవ్వరు తిట్టినా ఆమె పట్టించుకోదు.
*** *** *** *** ***