ఓ ప్రేమ కథ ( మోహన రాగం) -రెండవ భాగం

ధారావాహికం

రాగ మాల కాలేజీలో జాయిన్ అవుతుంది.ఆమె కజిన్ సూర్య ద్వారా మోహన్ పరిచయం అవుతాడు. దక్షిణ మూర్తి కి రాగమాల చదివే ఊరికి ట్రాన్ఫర్ కావడం రాగ మాలకు సంతోషంగా ఉంది..

ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేస్తూ మోహన్ కనిపించాడు.

” ఇదేంటి? ఇంటికి వస్తున్నాడు.నాన్న ఏమనుకుంటారో ఏమో”అని కంగారు పడింది.

అతను లోపలికి రావడము దక్షిణామూర్తి గారు ఆఫీసుకు వెళ్లడానికి బయటకు వెళ్లడం ఒకటే సారి జరిగాయి.

మోహన్ను చూసిన దక్షిణామూర్తి గారు..

“ఏంటి బాబు ఇలా వచ్చావు”? అని అడిగారు .

“ఇతను నాన్నకు ముందే తెలుసా?”అనుకుంది రాగమాల.

“నాన్నగారు లీవ్ లెటర్ ఇచ్చారు ఆఫీసులో ఇమ్మన్నారు”అని ఒక కాగితం దక్షిణామూర్తికి ఇచ్చాడు మోహన్.

ఆ ఉత్తరం తీసుకున్న దక్షిణామూర్తి గారు రాగమాల వైపు తిరిగి..

“ఇతను మా ఆఫీస్ మేనేజర్ గారి అబ్బాయి. పేరు మోహన్. మీ కాలేజ్ లోనే చదువుతున్నాడు”అని చెప్పాడు.

తలా రెండు మూడు రకాలుగా ఊపింది రాగమాల. మోహన్ మాత్రం ఎప్పటిలాగే ఎవరో తెలియనట్లుగా ముఖం పెట్టాడు.

రాగమానికి చాలా కోపం వచ్చింది.

“తెలుసు నాన్న! సూర్య అన్నయ్య తో పాటు ఎన్నోసార్లు వచ్చాడు. బుక్స్ కూడా తీసుకెళ్లాడు నా దగ్గర”అని మొహం వైపు కోపంగా చూసి చెప్పింది.

“అవునా! సంతోషం నాకు ఆఫీస్ కు లేటవుతుంది. నేను బయలుదేరుతాను”అంటూ దక్షిణామూర్తి గారు వెళ్లిపోయారు.

మోహన్ కూడా వెళ్తూ వెళ్తూ ఒకసారి రాగమాల ముఖంలోకి చూశాడు.

చిన్నగా చిరునవ్వు నవ్వాడు.

“అబ్బో ఇతనికి నవ్వడం కూడా వచ్చా? ఓన్లీ డౌట్స్ అనుకున్నానే”అని నవ్వుకుంది రాగమాల.

అలా రోజులు గడుస్తున్నాయి . ఇంటర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు.

అప్పుడప్పుడు మోహన్ వచ్చి బుక్స్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు కూడా!

పుస్తకం అవసరం లేకున్నా అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తుండేవాడు. ఇంట్లో తండ్రి కూడా ఏమనే వాడు కాదు. ఎందుకంటే మోహన్ తండ్రికి, దక్షిణామూర్తి గారికి ఉన్న పరిచయం ఎప్పటిదో! అందుకని చక్కగా పలకరిస్తూ ఉండేవాడు.

కొన్ని విషయాలలో మోహన్ అంటే చిరాకు వచ్చేది రాగమాలకి. అతను చాలా కష్టపడి చదువుతాడు కానీ ఏమీ చదవలేదు అని చెప్తాడు. ఒక్కొక్కసారి తను చదువుకోవాలన్నప్పుడు ఆ బుక్స్ మోహన్ దగ్గరే ఉంటాయి. చదవడం అయిపోయిన తర్వాత ఎప్పుడూ తెచ్చి ఇవ్వడు.

వేసవికాలం అవడం వల్ల ఇంట్లో వేడిగా ఉందని మేడ పైన చదువుకునేది రాగమాల. అప్పుడప్పుడు చల్లగాలి కోసం అలా తిరుగుతున్నప్పుడు ఇంటి ముందు నుండి మోహన్ వెళ్లడం చూసేది. మగ పిల్లల బ్యాచ్ అంతా ఆ టౌన్ లో ఉన్న ఒక మంచి హోటల్ కి టీ కోసం వెళ్లేవారు. అదే చెప్పాడు మోహన్
రాగమాల అనుకుంది..

“ఈ అబ్బాయిలు ఎంత చదువుతారో తెలియదు గాని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్ కి వెళ్లి టీ తాగి అక్కడ ఒక గంట సేపు బాతాఖానీ వేసి ఇంటికి వస్తారు”

అలా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి.
ఎగ్జామ్స్ అయిన తెల్లవారి మోహన్, రాగమాల దగ్గరికి వచ్చాడు. అప్పటికి ఇంకా దక్షిణామూర్తి గారు ఆఫీస్ నుండి ఇంటికి రాలేదు.

“ఎగ్జామ్స్ బాగా రాశావా రాగ మాలా?”అని అడిగా డు మోహన్.

” బాగా రాశాను అనే అనుకుంటున్నాను.నా మీద నాకే నమ్మకం లేదు. రిజల్ట్స్ వస్తే కానీ తెలియదు”అన్నది రాగమాల.

“బాగానే రాసి ఉంటావులే! ఇంతకీ నువ్వు కోచింగ్ కి వెళ్తున్నావా? ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ కోసం?”అన్నా డు మోహన్.

“కోచింగా? నేనేం వెళ్ళను. ఎంట్రెన్స్ రాసినా నాకు సీట్ రాదు. నువ్వు వెళుతున్నావా?” అన్నది రాగమాల.

“అవును. రేపటి నుండి క్లాసులు మొదలవుతాయి. అందుకే నీతో మాట్లాడి వెళదామని వచ్చాను. మళ్లీ నెల వరకు నిన్ను కలవడం కుదరదు”అన్నాడు మోహన్.

“అవునా! నాతో మాట్లాడి పోదామని వచ్చావా? ఎందుకు?”అన్నది రాగమాల ఆశ్చర్యంగా.

“ఏమో తెలియదు. క్లాసులు మొదలవక ముందే నీతో మాట్లాడి వెళ్ళాలి అనిపించింది”
అన్నాడు మోహన్.

కాసేపయ్యాక అతను వెళ్ళిపోయాడు. క్లాస్ లో కొంతమంది కోచింగ్ కొరకు క్లాసుల్లో జాయిన్ అయితే రాగమాల మాత్రం ఊరికి వెళ్ళిపోయింది.

ఊరికి వెళ్ళిన తర్వాత సెలవులు సంతోషంగా గడిచిపోయాయి.
రోజు నాయనమ్మ తో చిలిపి గొడవలు, అన్నా, అక్కతో కబుర్లు.ఆ ఊళ్ళో ఉన్న డొక్కు థియేటర్ లో సినిమాలు చూడటం వీటితో సెలవులు తొందరగా గడిచి పోయాయి.

అందులో తుత్తురు చెట్టు కింద రాళ్ళ పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టీ నాయనమ్మ చేసే ఉప్పుడు పిండి అంటే రాగమాలకు చాలా ఇష్టం.

ఆరు బయటపడకలు, కొబ్బరి చెట్టు ఆకులు గాలికి కదులుతుంటే ఆ సవ్వడి ఎంతో బాగుండేది. ఆకాశంలో నక్షత్రాలను లెక్కిస్తూ ఉండటము. అరుంధతి చుక్క కోసం వెతకడం ఇవన్నీ ఒక అనుభూతిని మిగిలించాయి.

మరో వారంలో కాలేజ్ తెలుస్తారు అనగా, రాగమాల తల్లి దగ్గరకు వెళ్లి,

“అమ్మా! నాకు వోణి లు కొనివ్వు. మా క్లాసులో అందరూ వేసుకుంటున్నారు. నువ్వేమో నాకు ఇంకా కొనివ్వలేదు”అన్నది చిరాగ్గా.

“ఏంటో బిడ్డా! నువ్వు చిన్న పిల్లవే అనుకున్నా. సరే తెచ్చుకో. మనం ఎప్పుడు కొనే షాపులో ఉంటాయి. ఎవరినైనా తీసుకుని వెళ్ళు” అంటూ డబ్బులు ఇచ్చింది తల్లి.

తన స్నేహితురాలిని తీసుకుని వెళ్ళింది రాగమాల. నాలుగు వోణిలను కొనుక్కుంది. మ్యాచింగ్ జాకెట్ ముక్కలను తీసుకొని కుట్టించుకుంది.

సెలవులు పూర్తి కా గానే బట్టలు,పుస్తకాలు సర్దుకుని టౌన్ కి వెళ్ళింది.

తెల్లవారి కాలేజీకి వెళ్లాలంటే భయమేసింది. “మొదటిసారి వోణి వేసుకుని వెళ్తే ,మగ పిల్లలు ఎలా ఏడిపిస్తారో? ఏమో?” అని భయపడింది.

మెరూన్ వోణి వేసుకుంది.తనకు తానే కొత్తగా కనిపించింది. ఒంటరిగా కాలేజీకి వెళ్లలేక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది.

రాగమాలను చూడగానే

“వావ్! ఎంత బాగున్నావ్! చాలా సన్నగా కనపడుతున్నావు వోణిలో, రియల్లీ బ్యూటిఫుల్”అన్నది సుధ.

“నిజంగా నాకు బాగుందా”?”అంది సిగ్గుగా నవ్వుతూ రాగ మాల.

“అవును, చాలా బాగుంది. పద, కాలేజీకి వెళ్దాం. మొదటి రోజు అంతలా క్లాసులు ఏం జరగవు.సరదాగా మాట్లాడుకుందాం”అన్నది సుధ.

ఇద్దరు కలిసి కాలేజ్ కి వెళ్లారు. మోహన్ కనిపించాడు.
ఆశ్చర్యంగా రాగమాల వంక చూసి నవ్వి వెళ్లిపోయాడు.

మోహన్ కుటుంబం చాలా పెద్దది. ఒక అక్క,ముగ్గురు తమ్ముళ్ళు ఇంకా ఇంట్లో చాలా మంది ఉండే వాళ్లు.

ఒకసారి ఒక అబ్బాయి సైకిల్ మీద వెళుతున్నాడు..కొంచెం మోహన్ పోలికలు ఉన్నాయి. షర్ట్ మాత్రం అతను వేసుకున్న లాంటిదే వేసుకున్నాడు.మరొక రోజు మరో అబ్బాయి కనిపించాడు.అతను కూడా అదే షర్ట్, అతనికి కూడా పోలికలు ఉన్నాయి.

మోహన్ ఇంటికి వచ్చినప్పుడు..

” ఇద్దరు అబ్బాయిలను చూసాను. నీ పోలికలు ఉన్నాయి.షర్ట్స్ మాత్రం నీలాంటివే” అని చెప్పింది రాగమాల.

మోహన్ నవ్వేసి..

” వాళ్లిద్దరూ నా తమ్ముళ్ళు.మన కాలేజ్ లోనే చదువుతున్నారు.షర్ట్ మాత్రం ఒకటే.ఒక్కొక్క రోజు ఒకరం వేసుకుంటాము”అని నవ్వుతూ చెప్పాడు.

“అవునా” అని నవ్వింది రాగమాల.

“అవును, మరో తమ్ముడు స్కూల్ లో చదువుతున్నాడు. అక్క కూడా మన కాలేజ్ ” అని చెప్పాడు మోహన్.

ఆ సంవత్సరం లో మోహన్ అక్క కూడా పరిచయం అయ్యింది.అది కూడా సూర్య నే వాళ్ళింటికి తీసుకుని వెళ్ళాడు.

వాళ్ళింటికి వెళితే మాత్రం మోహన్ రాగ మాల ఎవరో అన్నట్లుగా చూసే వాడు.ఇంట్లో వాళ్ళ ముందు తాను తెలియనట్లు ప్రవర్తించేవాడు.

ఒకసారి మహా శివరాత్రి వచ్చింది. మోహన్ వచ్చి మా ఇంటికి వస్తావా? మా అక్క ఒక్కతే ఉంది ” అన్నాడు.

రాగమాలకి వెళ్ళాలని పించలేదు. వేరే ఫ్రెండ్ ఇంటికి జాగరణ కోసం వెళ్ళింది.

అక్కడికి వెళ్ళాకా ఇబ్బంది గా అనిపించింది.

సశేషం

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సాహిత్యమే నా ఊరట – మైథిలీ అబ్బరాజు

అయితే మీరే.. (భుజాలు తడుముకుంటున్నారుగా!) – 6వ భాగం