తుర్లపాటి శ్రీదేవి…భర్తకు అండదండ…ఓజర్నలిస్ట్ భార్యగా ఆమె అనుభవాలు
“ఓ జర్నలిస్ట్ కి అమ్మాయిని ఇస్తామంటే నేనొప్పుకోను’
అని అమ్మ అంటున్న మాటలు, `అది కాదే, జర్నలిస్ట్ కి సామాజిక బాధ్యత ఉంటుంది. చూస్తుండూ, ఇతగాడు రేపో మాపో పెద్ద రచయిత అవుతాడు’ అన్న నాన్న వాదన ప్రక్క గదిలో నుంచి వినబడుతూనే ఉంది. ఏ బ్యాంకీ ఉద్యోగినో, ఏ సర్కారీ నౌకరీకో ఇచ్చి చేస్తే జీవితం సాఫీగా సాగిపోతుందన్నది అమ్మ లాజిక్. కానీ నాన్న మ్యాజిక్ గెలిచింది. “ఆంధ్రప్రభ” లో పనిచేస్తున్న సబ్ ఎడిటర్ (తుర్లపాటి నాగభూషణ రావు)తో 1985 లో నా పెళ్లయింది. ఎందుకో తెలియదు గానీ నాన్న మాటలు చిన్నప్పటి నుంచి బోలెడు నచ్చేవి. సమాజానికి పనికొచ్చే పనులే చేస్తుండాలని నాన్న తరచూ ఇంటికి వచ్చిన వారితో చెబుతుండే వారు. నాన్న (మన్నవ గిరిధర రావు)గారు ఒక ప్రక్కన గుంటూరు హిందూకాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూనే అంతకంటే ఎక్కువగా `భారతీయ మార్గం’ మాస పత్రికకు ఎడిటర్ గానూ, “హిందూధర్మ వైభవం”, “కాంతి రేఖలు”, “పనికొచ్చే కథలు”, “ఎమ్మెల్యే ఆత్మకథ” వంటి పుస్తకాలకు రచయితగా పేరుగడించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి పూర్వ సభ్యునిగా సేవలందించారు. నాన్న నాకిచ్చిన స్ఫూర్తితోనే శ్రీవారిని నేను రచనా రంగంలోనూ వివిధ సామాజిక సేవా రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నాను. “

మీ అమ్మ గారి గురించి?
అమ్మ దీవెన :
“నాన్నగారి మాటలు ఒక వైపున నాలో స్ఫూర్తిని నింపుతుంటే మరో వైపు అమ్మ ప్రేమ, దీవెన గృహిణిగా రాణించడానికి దోహదపడింది. జర్నలిస్ట్ ని అల్లుడిగా అంగీకరించనంటూ భీష్మించుకున్న అమ్మ చివరకు అల్లుడిలోని మంచితనం చూసి ఎంతో ఆనందించింది. ఎప్పుడు ఇంటికి వచ్చినా మాకంటే ఆయనకే పెద్దపీట వేసేది. అమ్మ (లక్ష్మీ రాజ్యం) , బామ్మ (సామ్రాజ్యం) చిన్నతనంలో చెప్పిన జీవిత పాఠాలను నేను ఎప్పటికి మరువలేను” అని శ్రీదేవి చెప్పారు.
మీ పుట్టింటి విశేషాలు చెప్పండని అడిగితే..
ఇల్లే స్వర్గసీమ :
“చిన్నతనంలో ఇల్లు అంటే స్వర్గసీమలా అనిపించేది. ఆత్మీయతలకు, అనుబంధాలకు ప్రతీకగా ఉండేది మా ఇల్లు. కొంచెం పెద్దయ్యాక గుంటూరులోని కృష్ణనగర్ లో విశాలమైన ఆవరణలో మాకో ఇల్లుండేది. ముందువైపున మామిడి చెట్లు, కొబ్బరి చెట్లూ, వాటి మధ్యన పూల మొక్కలు..ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం. మొక్కలకు పాదులు తీయడం, వాటికి నీళ్లు పోయడం, అవి ఎదుగుతుంటే ఇంట్లో చంటి పాప ఎదుగుతున్నట్లు ఆనందపడిపోవడం ..ఇవి తీపి గుర్తులు. “
మరి ఇంట్లో పని పాట? అనడిగితే…
పని నేర్పిన పాఠం :
“ఇంట్లో ఆడపిల్ల ఎదుగుతున్నకొద్ది పని కూడా పెంచేవారు. అటు నాన్నగారు అమ్మ, బామ్మ, మరో వైపున అన్నయ్య (మారుతీ ప్రసాద్) ఇంకా వచ్చి పోయే పెద్దలు – అందరికీ నేను తలలో నాలుక. `శ్రీదేవి.. ఈ పని చేయి, శ్రీదేవి..ఆ పని చేయి’ అంటూ ఆర్డరీలు వేస్తుంటే చేసుకుంటూ పోతుండేదాన్ని. పనిలో ఆనందం అనుభవించడం అప్పుడే అలవాటైంది. ఇప్పటి పిల్లలను చూస్తుంటే మేము ఇందుకు భిన్నంగా ఉన్నామనే అనిపిస్తుంటుంది. ఆ రోజుల్లో ఇంటి పని అంతా చక్కబెట్టాము కనుకనే పెళ్లయిన తర్వాత ఒంటరిగానే పనులు సమర్థవంతంగా చేయగలుగుతున్నామేమో”.
మీ నాన్న గారు పబ్లిక్ ఫిగర్ కదా, మరి పెద్దలెవరైనా మీ ఇంటికి వస్తుండేవారా?
ఎందరో మహానుభావులు: 
“నాన్నగారు అధ్యాపకులు, ఎడిటర్, ఎమ్మెల్సీగా కూడా ఉండటంతో మా ఇంటికి ఎంతో మంది పెద్దలు తరచూ వచ్చిపోతుండే వారు. నాకు గుర్తున్నంత వరకు అలా వచ్చిన వారిలో శ్రీయుతులు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, విశ్వయోగి విశ్వంజి గారు, ప్రసాదరాయ కులపతి (ప్రస్తుత కుర్తాళం పీఠాధిపతి పూర్వ నామం), మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ వంటి వారిని దగ్గరగా చూడటం, వారి మాటలు వినడం, వారి ఆశీర్వచనం తీసుకోవడం నేను చేసుకున్న అదృష్టం. అంతే కాదు, చిత్తూరి నాగయ్య (సినీ నటులు) గారు ఇంటికి వస్తే వారు నా చిట్టి చేతుల్లోని పుస్తకం అందుకుని ఆటోగ్రాఫ్ ఇవ్వడం తలుచుకుంటే ఇప్పటికీ ఆనందంగానే ఉంటుంది. అలాగే పుచ్చా పూర్ణానందం (హాస్య రచయిత, సినీ నటులు) గారు మా కుటుంబంతో సన్నిహితంగా ఉండే వారు. మా పెళ్ళి కి విచ్చేసి ఆశీర్వదించారు.
ఆ నాటి రాజకీయ నాయకుల్లో జూపూడి యజ్ఞనారాయణ గారు, పిడతల రంగారెడ్డి గారు, మండలి వేంకట కృష్ణారావు గారు, భాట్టం శ్రీరాంమూర్తి గారు, విద్యాసాగర్ గారు, రోశయ్య గారు మాట్లాడిన తీరు, వారులోని రాజకీయ చైతన్యం నన్ను ఆకర్షించాయి. బహూశా అందుకేనేమో ఇప్పటికీ రాజకీయాలు, వార్తలు – విశ్లేషణలు పట్ల ఆసక్తి మెండుగా ఉంది. శ్రీవారు జర్నలిస్ట్ కావడంతో వారు వ్రాసే వ్యాసాల విషయంలో సలహాలు, సూచనలు ఇస్తుండటం ఓ అలవాటైంది.”
బాగుందండి, మరి పండుగలు ఎలా జరుపుకునే వారు?
పండుగలు – ఆనందం:
“ఏ పండుగ వచ్చినా ఇంట్లో ఆనందం రెట్టింపు అయ్యేది. బామ్మ మరీను. `పిల్లలూ ఇలా రండర్రా, చేతులు చాపండి, గోరింటాకు పెడతాను’ అంటూ నన్నూ నా చెల్లెలు (శార్వాణి)ను పిలిచేది. మేము వెంటనే వెళ్ళకపోతే వెంటబడేది. ఇక అమ్మకి వంట మీద ఆసక్తి ఎక్కువ. పండగ వచ్చిందంటే చాలు రకరకాల పిండి వంటలు చేసేది. ఎప్పుడూ వచ్చేపోయే ఇల్లాయే, చేసిన పిండి వంటలు ఒకటి రెండు రోజుల్లో ఖర్చయ్యేవి. అమ్మ చేసిన పచ్చళ్లు ముఖ్యంగా నిలవ పచ్చళ్లు బాగున్నాయంటూ కొంత మంది సీసాల్లోకి ఎక్కించుకుని మరీ తీసుకువెళ్ళే వారు. అమ్మ నుంచి నాకు కూడా వంటలు చేయడం, రకరకాల పచ్చళ్లు పెట్టడం అలవాటైంది. అమ్మకు మల్లేనే నేనూ పేరు గడించాను. అందుకే శ్రీవారు రిటైర్ అయ్యాక యుట్యూబ్ లో “ఛానెల్ 5ఏఎం” ఏర్పాటు చేయించి, అందులో “శ్రీదేవి వంటిల్లు” శీర్షికన వారం వారం వివిధ వంటలు ఏలా చేయాలో చూపించేదాన్ని. ఇదంతా పదేళ్ల క్రిందటి ముచ్చట. ఆ రోజుల్లో (2014- 26) నా వీడియోలు చూసి దేశ విదేశాల్లోని వీక్షకులు ఫోన్లు చేసి మరీ స్పందనలు తెలియజేసేవారు.
సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంటి ముంగిట పెద్దపెద్ద ముగ్గులు వేయాల్సిందే. అలా వేయకపోతే బామ్మ ఊరుకునేది కాదు. “నడుం వంచితేనే అమ్మాయిలకు ఆరోగ్యం “ అంటూ క్లాస్ లు పీకేది. ఈ కాలం ఆడపిల్లల్లో చాలా మంది ఇటువంటి పనులకు దూరం కావడం వల్లనేనేమో చిన్నతనంలోనే అనారోగ్యం, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఇప్పుడనిపిస్తున్నది”
సరే, ఎలాంటి ఆటలు అప్పట్లో ఆడుకునే వారు?
ఆట పాటలు :
“ఇందాక చెప్పినట్లు చిన్నతనంలో ఆడుకున్న ప్రతి ఆట వెనుక ఆరోగ్య సూత్రాలు దాగుండేవి. తాడాట, తొక్కుడు బిళ్ల, దాగుడు మూతలు, నాలుగుస్తంభాలాట వంటివి మంచి వ్యాయామం గా ఉండేవి. స్కూల్ లో పెద్ద గ్రౌండ్ ఉండటంతోనూ, ఇల్లు కూడా విశాలంగా ఉండటంతో ఇంటా బయటా హుషారుగా ఆడుకునేవాళ్లం. “ఎదిగే వయసులో ఇవన్నీ ముఖ్యమేరా “ అని బామ్మ అంటుండేది.
ఆనాటి నా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో షుమారు 15 మంది ఇప్పటికీ అంటే 50 ఏళ్ళు గడిచినప్పటికీ అడపాదడపా కలుసుకుంటూనే ఉన్నాము.. అలాంటప్పుడు నూతనోత్సాహం వెల్లివిరుస్తుంటుంది.
పిల్లలు పుట్టాక ఇక వారితోనే లోకమైంది. నాగార్జునా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ పట్టా అందుకుని ఉద్యోగం కొన్నాళ్లు చేసినప్పటికీ పిల్లల సంరక్షణకే పెద్ద పీట వేసి గృహిణిగా స్థిర పడ్డాను. పిల్లలకు అమ్మే కదా తొలి గురువు. మా అబ్బాయి రాజేష్ కు, అమ్మాయి దివ్యశ్రావణికి నేనే చదువులో మెళుకువల చెప్పేదాన్ని. ఇద్దరు పిల్లలు చదువుల్లో రాణించి ఇప్పుడు యు.కెలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. మాకు ముగ్గురు మనవళ్లు. వారిని చూడటానికి ఇప్పటికే ఐదు సార్లు శ్రీవారితో కలిసి యు.కె వెళ్ళాను. “
యు.కె లో కల్చర్ నచ్చేదా? లేదంటే…?
నా పద్దతి నాదే:
“ఐదు సార్లు యు.కె వెళ్ళినా మన కట్టు బొట్టుని విడనాడలేదు. ఓ సారి చీరలో బయటకు వెళ్ళి ఓ షాపింగ్ మాల్ లో అరుగుమీద కూర్చొంటే అటుగా వచ్చిన ఇంగ్లీష్ పిల్లలు నన్ను ఆశ్చర్యంగా చూశారు. ఈ కట్టు బొట్టు వారికి కొత్తగా అనిపించి ఉండవచ్చు. కానీ నా పద్దతి నాదే. ఎవరో ఏదో అనుకుంటారని నా అలవాట్లు మానుకోను. మన సంస్కృతి, సాంప్రదాయలను విడిచి దూరం జరగను. అందుకే “తుర్లపాటి సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం” అనే వేదికను ఏర్పాటు చేసి దానికి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాను”
మరి ఈ వేదిక తరఫున ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, మీ సంకల్పం ఏమిటి?
సాంస్కృతిక వికాసమే మా సంకల్పం
“తుర్లపాటి సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం“ (టిసికెసి) కార్యదర్శి గా ఉంటూ విశిష్ట కార్యక్రమాలకు రూపకల్పన శ్రీవారితో కలిసి చేస్తున్నాము.
ఈ వేదిక తరఫున 2026 జనవరి 26న హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గానసభ లోని మెయిన్ హాల్ లో పురస్కారాల మహోత్సవాన్ని నిర్వహించి పదిహేను మంది ప్రతిభా మూర్తులకు పురస్కారాలు అందజేశాము. పల్లెల్లోని విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ, ఎంపిక చేసిన పాఠశాలలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వాలనుకుంటున్నాము. “చిన్నారుల ప్రతిభకు పట్టాభిషేకం” కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తున్నాము. ఔత్సాహిక గాయనీ గాయకులను వివిధ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్నాము. కార్యక్రమాలకు సపోర్ట్ గా నిలవాలనుకునే వారు 9642721615 (వాట్సప్) కి కాల్ చేయవచ్చు”
బాగుందండి, మరి నేటి తరం వారికి మీరిచ్చే సందేశం…?