సూర్యోదయం, సూర్యాస్తమం, పున్నమి వెన్నెల, వసంత ఋతు శోభ ఇవన్నీ ఎంతో అందంగా ఉంటాయి.ఎంతటి బాధాతప్త హృదయాలకైనా కొంతైనా సాంత్వనను ఇస్తాయి. చల్లని పిల్లవాయువులు, ఓ చక్కని దృశ్యం, ఓ మంచి మాట ఇవి కూడా….
వివాహ బంధం బాగున్నప్పుడు… కుటుంబాలు మమకారాలకు నెలవులైనప్పుడు జీవన రస రేఖలు ఉదయిస్తాయి. ఒక్కరు సంపాదిస్తే కూర్చుని అందరూ తినడం, ఒక్కరు పని చేస్తే కూర్చొని అందరూ తినడం, బ్రతుకులు గడిపేయడం అనేవి ఎప్పుడూ ఆరోగ్యకరమైనవి కావు. దీనికోసం ఏకత్వ భావన, ప్రేమ ఆప్యాయతలు ఉండగానే సరిపోవు నలుగురు నాలుగు చేతులు వేస్తే కుటుంబ సౌధం చక్కగా నిలుస్తుంది. అందరూ ఉద్యోగాలు చేస్తూనో, వ్యాపారాలు చేస్తూనో సంపాదించిన నాలుగు రాళ్లలో అన్నీ ఒక్క దగ్గర కలివిడిగా పెట్టుకొని కలివిడిగా ఉపయోగిస్తూ ఉన్నప్పుడు సమానత్వ భావన ఏర్పడుతుంది. సంపాదించలేని వాళ్ళు కుటుంబానికి తగిన ఇంటి పనులలో సహాయపడాలి… అప్పుడే శ్రమైక జీవన సౌందర్యానికి మీ ఇల్లు ఒక చిరునామా అవుతుంది. గోడ కున్న గడియారం సమయాన్ని సూచించినట్టే నిత్యజీవితంలో ప్రతి ఘడియ, ప్రతి సంఘటన, ప్రతి సన్నివేశం హృదయ లయలను స్పృశిస్తూ ఉంటాయి. ఈ స్పందనలలోనండే జీవన పరిమళాల వ్యాపిస్తాయి. విశ్వసానికి పునాదులు వేస్తాయి.
చీటికిమాటికి విసుక్కోవడం, ఒకరితో ఒకరు ముభావంగా ఉండడం, భావాలను స్పష్టంగా చెప్పకపోవడం, కష్టాలని ఇతర కుటుంబ సభ్యులతో పంచుకోకపోవడం వంటివే మనుషుల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. జాగ్రత్తగా కుటుంబ శకటాన్ని నడపాలి .
Sharing is Caring ! అంటాం!! వీటన్నిటికీ మూలాధారం శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం . మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైన ఇంధనమే శారీరక ఆరోగ్యం. యాంత్రిక జీవనానికి అలవాటు పడిన ఈ నూతన తరం , పెద్దవాళ్ల నుండి ఏం నేర్చుకుంటున్నాము అని ఎవరికో
వాళ్ళు ఒక పరీక్ష పెట్టుకోవాలి. మట్టి కుండ ను ఎక్కువ ఉష్ణోగ్రతలో కాల్చినప్పుడే అది గట్టిపడుతుంది, నీటికి నిలువ అవుతుంది. కష్టాలు రానిది ఎవరికి ? వస్తాయి… వాటిని అధిగమించాలి. ఎలా? ఈ ప్రశ్న చాలా కఠినమైనది చాలా సులభమైనది ఈ రెండు వైవిధ్యమైన భావాలతో ఈ రెండక్షరాల ప్రశ్న మన ముందు నిలుస్తుంది.
ఒంటరిగా చేయలేని కొన్ని పనులు ఒంటరిగా ఎదుర్కోలేని కొన్ని సమస్యలు ఇంటి వాళ్ళు తీర్చగలరు.కాకుంటే ఎప్పుడూ వాళ్ళపై అనుమానం, తక్కువ చూపు, అయిష్టత వంటి వాటితో ఆ మనసులోని బాధను పంచుకోరు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్యన అన్నా చెల్లెల మధ్యన అక్క తమ్ముళ్ల మధ్యన ఉండాల్సిన బంధం బీటలు వారకుండా ఉండాలంటే కష్టసుఖాలను పంచుకోవాలి. వీటన్నింటికీ ఆర్థిక స్వేచ్ఛ కూడా ముఖ్యమైనదే. ఆర్థికంగా నిలదొక్కుకోలేని వాళ్ళు ఎవరి అవస్థలనూ అణు మాత్రం తీర్చలేరు కానీ సరైన సలహా ఇవ్వడం వాళ్ళకి సమయానికి ఆకలి తీర్చే భోజనాన్ని పెట్టడం నీకు నేనున్నాను అంటూ చెప్పే ధైర్యం ఇవి చెయ్యగలరు. ఇవే వెలకట్టలేనివి.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించినప్పుడు కూడా ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అన్యోన్యత లోపానికి కారణం ఏంటి అని లోక చూపుతో… లో చూపుతో చెల్లిస్తే ఎవరి కళ్ళ ముందున్న ఎవరి గుండె ముందున్న బాధనైనా ఇట్టే తొలగిపోతుంది. పిడికిలి ఎత్తి చెప్పడానికి ఇవేవీ ఉద్యమాలు కావు. ఈ పిడికిలి అన్యోన్యతకు సూచకాలు. కుటుంబం అంటేనే ఒకే ఇంట్లో నివసించే కొంతమంది మనుషుల సమూహం. జంతువులలోనే కుటుంబాలు ఉన్నాయి అంటే ఇక మనుషుల్లో మనకు ఉండవా? జంతువులు కూడా వాటి పిల్లల రక్షణ కొరకు, వాటి ఆహార సేకరణ కొరకు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకొనే మౌలిక అంశం మనకు కనిపిస్తుంది. అటువంటిది మానవులం మనకేంటి? మనం ఎందుకు చేయలేం? మానవ సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా నిలవడానికి మూలాధారంగా ఓ నాలుగు సూత్రాలను నిర్మించుకోవాలి…
-
విశ్వాసం 2. అనుబంధం 3. ధైర్యం 4. స్థితిస్థాపకత అనేవి ముఖ్యమైన సూత్రాలుగా తీసుకున్నప్పుడు సరళమైన ఆలోచన విధానం తో స్నేహమయమైన ప్రేమమయమైన కుటుంబాలు పెనవేసుకునేలా రోజులు వస్తాయి. భార్య భర్త పిల్లలు అనేది ఒక చిన్న కుటుంబం ఇటువంటి రెండు మూడు కుటుంబాలు కలిసి ఉండే వాటిని ఉమ్మడి కుటుంబం అంటాం. ఒకవేళ సోదర సోదరీమణులు కలిసి ఉన్న కుటుంబాలు కానప్పుడు తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు వంటి వాళ్ళతోను ఉమ్మడి కుటుంబం ఏర్పడుతుంది. కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా వరుసలు ప్రధాన పాత్ర వహిస్తాయి అమ్మ నాయనా అన్న వదిన అత్త మామ తమ్ముడు మరదలు చిన్నమ్మ చిన్న అన్న పిన్ని బాబాయ్ అన్నయ్య అక్కయ్య తమ్ముడు వంటి బంధాలపేర్లు స్థిరపడిపోయి ఉన్నాయి. ఇవి ప్రేమ వారధులు. ఉమ్మడి కుటుంబంలో లాభాలు నష్టాలు రెండు ఉంటాయి. లాభాలు గుణానికి సంబంధించినవి నష్టాలు మనసుకు సంబంధించినవి. మనసును అధీనంలో ఉంచుకున్న వాళ్ళకి నష్టాలు తెలిమబ్బుల లా తేలిపోతాయి. బాధలలో ఉన్నప్పుడు ఓదార్పు దొరుకుతుంది. పెద్ద వాళ్ళ సలహాలు దొరుకుతాయి సుఖ సంతోషాలను కూడా కష్టాలు పంచుకున్నట్టే పంచుకోగలము భోజన భజనాది ఖర్చులలో కొంత భాగం తగ్గుతుంది ముఖ్యంగా ఆడవాళ్లకు గౌరవ మర్యాదలు ఎక్కువగా దొరుకుతాయి. విడాకులు, ఆత్మహత్యలు వంటివి రాకుండా ఉంటాయి. ఆర్థిక మద్దతుతో కుటుంబ సభ్యులు సమిష్టిగా ఉండగలుగుతారు. సరే ఇక నష్టాలేంటివి కూడా చూద్దాం ! వ్యక్తిగత స్వేచ్ఛ కాస్త తగ్గుతుందని చెప్పొచ్చు.. అలాగే ఆర్థిక స్వేచ్ఛ కూడా ఉండదు! లెక్కలు,లాభాలు, నష్టాలు అనేవి ముందుకు వచ్చి పడతాయి ఇకపోతే కష్టం విలువ కూడా తెలియకపోవచ్చు. కానీ ఇవన్నీ తేలికగా overcome చేయవచ్చు. ఇవి సమిష్టి కుటుంబ విలువలు.
ఇది వ్యష్టి కుటుంబం లో ఉంటుందో చూద్దామా? భార్యాభర్త పిల్లలు మాత్రమే ఉండే చిన్న కుటుంబం వ్యష్టి కుటుంబం అంటాం. పైన చెప్పుకున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉంటాయి. కానీ , భద్రత కొరవడుతుంది. ఈ కుటుంబాలపై బయట కుటుంబాల చూపు బాగా ఉంటుంది. సమాజంలో దుర్మార్గులు చాలా తొందరగా ఈ Single కుటుంబాల పట్ల ఆకర్షితులవుతారు. దీనితో ఎటువంటి లాభాపేక్షను ఈ కుటుంబాల నుంచి తీసుకువచ్చా అని వాళ్ళు పన్నాగాలు పన్నుతారు. బలయ్యేది పిల్లలు తల్లిదండ్రులు వేరువేరుగా..! ఇవి ఈ కనిష్ట కుటుంబాల వాళ్ళ ఏర్పడే సామాజిక విలువలు. ఎందుకంటే ఈ కుటుంబాల పైన ఎవరి దృష్టి ఉండదు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్లే ఎదగాలి.. ఎవరికి వాళ్లే ఎదురీదాలి! దీన్నే అవకాశవాదులు ఉపయోగించుకుంటారు.
Composite family లో ఉన్నప్పుడు ఇతర కుటుంబ సభ్యుల దృష్టి కూడా పడుతుంది కాబట్టి కాపాడుకుంటారు. దీనివల్ల కుటుంబం అనే ప్రాథమిక గుణాన్ని కోల్పోకుండా సమీక్షంగా కొనసాగుతుంది వ్యవస్థ. ఇవి సమిష్టి బాధ్యత గా ఉంటుంది.
కాలాన్ని బట్టి మార్పులు వస్తూ ఉంటాయి.. వివాహ చట్టాలు మతపరమైన వ్యవస్థలు సమాజంలో ప్రభావితం చూపిస్తాయి కాబట్టి, కుటుంబ వ్యవస్థ లో కూడా ఇటువంటి మార్పులు వచ్చాయి. ప్రేమ వివాహాలు, కులాంతర మతాంతర, దేశాంతర ఖండాంతర వివాహాలు జరుగుతున్న ఈ సందర్భంలో ఎవరిపై ఎవరికీ హక్కులు లేకుండా అయ్యాయి. దీనివల్ల కేంద్ర కుటుంబం విస్తృత కుటుంబం అనే మాటలు మరుగున పడిపోయాయి. సమిష్టి కుటుంబాలలోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి . తల్లిదండ్రులు పిల్లలు ఎవరికి వాళ్లే అందరూ ఉన్నా ఒంటరి వాళ్ళవుతున్నారు కాబట్టి పెద్ద కుటుంబాల అవసరం ఎంతైనా ఉంది.సంప్రదాయ బద్దంగా నిర్మితమైన కుటుంబాల లో అత్యంత సాధారణమైన విషయం safety first! అయితే పితృస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత… మాతృస్వామ్య వ్యవస్థ మరుగున పడిన తర్వాత… సమతావాద సిద్ధాంతం అనేది అడుగంటిన తర్వాత…. మిశ్రమ సమ్మేళనాల సంఘాలు వెలసిన తర్వాత ఇప్పుడు కుటుంబం విలువలను గురించి ఏం మాట్లాడతాం? రక్త సంబంధాల ప్రాధాన్యత తగ్గి వైవాహిక సంబంధాల విలువలు పోయి వ్యక్తుల సమూహాలే తయారయ్యాయి గాని హృదయ సమూహాల మాటే వీగిపోయింది. వివాహేతర సంబంధాలంటే ఆసక్తి పెరిగి , రేపటి గురించిన నిరాసక్తత మనుషుల మధ్య నిర్లక్ష్య భావాన్ని తీసుకొచ్చి పెట్టింది ప్రతి ఒక్కళ్ళు అధికారాన్ని కోరుకోవడం నియమాలను అతిక్రమించడం వంటి శైలులు సహజత్వాన్ని పోగొట్టాయి. కుటుంబ అవసరాలలో రాజీకి తావులేని , భద్రతకు ప్రాధాన్యత తగ్గినప్పుడు కుటుంబ దృఢత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు కుటుంబ సభ్యులు తెలివిగా ఆలోచించాలి. వీటికి కొన్ని
మౌలిక సిద్ధాంతాలు ఉన్నాయి..
-
పిల్లలు ఎలా ఉన్నారు:- అవివాహిత సంతానం ఉన్నప్పుడు విరుద్ధ లింగాలకు చెందిన వాళ్లతో ఎలా మెలుగుతున్నారు గమనించాలి తాత్కాలిక ప్రయోజనాలే తప్ప శాశ్వత ప్రయోజనాలు లేని ఈ సంబంధాన్ని ఆదిలోనే గ్రహించి అడ్డుకోవాలి.
-
ఆర్థిక అవసరాలు:- భావోద్వేగాలకు మద్దతు ఇస్తున్నట్టు ఇచ్చేలా చూడాలని చేసే ప్రయత్నాలలో ఆర్థిక వ్యవస్థ ముందుకు వచ్చి పడుతుంది కుటుంబాలలో సురక్షితం అంటే కేవలం డబ్బుకు సంబంధించిందే కాదు అనే జ్ఞానం ఉండాలి పిల్లలలో చిన్నప్పటి నుంచే ఈ ధ్యాసను కలగజేయాలి.
-
ఆసక్తులు, అవసరాలు:- శక్తికి మించిన ఖర్చులను చేసేప్పుడు నిజం ఏమిటి పిల్లలకు తెలియాలి. డాంబికాలకు పోయి భేషజాలకు పోయి నిజాలు దాస్తే ఏ లాభం ఉండదు. ఇది వ్యక్తుల సంపూర్ణ అభివృద్ధికి ఏమాత్రం సాయపడదు. ముందు నుండే మనం ఎంత కష్టపడి ఈ స్థితికి వచ్చాము అనేది పిల్లలకి చెప్పాలి మనకన్నా తక్కువ స్థాయి ఉన్నవాడని చూసి ఇదిగో ఇది నేర్చుకోవాలి అని అలవర్చాలి.
-
పనుల భాగస్వామ్యం:- సురక్షితమైన కుటుంబానికి సమిష్టి కృషి తత్వం ఎంతో ముఖ్యం. ఇల్లు శుభ్రం చేయడం అనే అంశం వస్తే బట్టలు ఉతకడం మడత పెట్టడం, ఇల్లు ఊడవడం, పుస్తకాల గూళ్ళు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం. వంటిల్లు సంబంధించిన పరిశుభ్రతను నేర్పడం. కూరగాయలు తరిగి పెట్టేప్పుడు పిల్లలకు పనులు చెప్పడం వంటివి.
-
బరువు, పరువు ల బాధ్యత:- న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది ఎక్కువైనా ఈనాటి సామాజిక అవసరాలను దృష్ట్యా… ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి రాగలిగాము అనేది ఎప్పుడూ చెబుతూ ఉంటే ఇంటి పరువును పోనివ్వరు ఇంటి బరువును మోస్తారు. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు మనం చెప్పడం జాగ్రత్తగా ఉంటే తప్ప ఆచరించరు. ఈ సత్యాన్ని గుర్తెరిగి ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి నేర్పిస్తూ ఉండాలి. అతి గారాబం ప్రమాదకరం.