మావయ్య బంగారం! -3

పండగ సంబరాలు-3

జరిగిన కథ:  పెద్దమనిషయింది కళ  పదకొండేళ్లకే. సరదాగా సాగిపోతున్న కళ జీవితం లో తుఫాను రేగింది.  తోమ్మి దేళ్ళ వయసులో గుచ్చుకున్న ముల్లు , గణాచారి తతంగం ముగిసిపోయిందనుకొన్న తరుణంలో కళకి   ఫిట్స్  రావడం  మొదలయ్యాయి. కానీ ఇవేమి పట్టని సురేష్ బాబు మాత్రం హాయిగా తన చదువు కొనసాగిస్తున్నాడు.)

దసరా పండగలు మొదలయ్యాయి.  శివాలయంలో అమ్మోరికి, గుడ్లేరు వడ్డున ఉన్న పోలేరమ్మకి  నిత్య పూజలు మొదలయ్యాయి.  గుడ్లేరులో పండగ సందడి మొదలైంది.

ఆరోజు పగటివేషగాళ్లు వచ్చారు. కరణం గారి ఇంటి ముందు ప్రధమంగా వారి ప్రదర్శన జరుగుతుంది. ఆ తరువాత పెద్ద  రెడ్డి , కోమటి వెంకటేశు గార్ల ఇళ్ళకి వెళ్తారు. ఆ  తర్వాతే ఎవరి ఇంటికైనా. చాకలి రంగడు, మంగలి మహేష్ రామలక్ష్మణుల వేషంలో వచ్చారా రోజు. వాళ్ళ పక్కనే చాకలి రత్తి కూతురు మంగి   సీత వేషంలో చూడముచ్చటగా ఉన్నది. సీతారామ లక్ష్మణులను స్తుతిస్తూ కోతిలాగ కుప్పిగంతులు వేస్తున్న చినరాజుని  చూస్తున్న  కళకి నవ్వా గడం లేదు. సినిమా పాటలు పాడుతూ పక్కనే హార్మోనియం పట్టుకున్న సుబ్బయ్య, మద్దెలతో బసవడు.  మొదటి రోజు  పగటి వేషగాళ్ళు  రామ వనవాస ఘట్టాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సుభద్రమ్మ  మానేడు బియ్యం తెచ్చి వాళ్ళ జోలిలో పోసింది. రెండో రోజు కూడా రామలక్ష్మణుల వనవాస ఘట్టమే ప్రదర్శించారు. “ఏరా సుబ్బయ్య రోజు ఇదే ఘట్టమా? మార్చే దేవన్న ఉందా?” అంటూ దుర్గయ్య గారు నవ్వాడు. “చిత్తం దొర! మాకు ఎర్ర  రంగు దొరకలేదు, రేపు మారుస్తాం దొర.”  అన్నాడు వంగివంగి  దండం పెడుతూ.

అది విన్న సురేష్ వాళ్ళని చూస్తూ,”ఒరే  సుబ్బయ్య,  రంగులు తెచ్చి పెడతా, సాయంత్రానికల్లా వచ్చి  పట్టుకుపోండి,” అంటూ ,”నాన్న, నేను  పట్నం వెళుతున్న, కొంచెం పని ఉంది,”  అంటూ వెళ్ళిపోయాడు.

సాయంత్రానికల్లా  సురేష్ పట్టణం నుండి తిరిగి వస్తూ చాలా రంగు బిళ్ళలు తీసుకొచ్చాడు.  సుబ్బడు అప్పటికే వాళ్ళ వాకిట్లో కూర్చుని ఉన్నాడు.  వాడికి ఆ రంగులు ఎలా నీళ్లలో కలపాలో చెప్పి పంపించాడు సురేష్ బాబు.

*********************************

మరునాటికి  పగటి వేషగాళ్ల  బృందం మళ్ళీ వచ్చింది.   ఆ రోజు వాళ్ళు తాటకి సంహారం ఘ ట్టం వేశారు.  తాటకిని మామయ్య ఇచ్చిన రంగులతో భయంకరంగా తయారు చేశారు. పెద్ద వెదురు బుట్టను  నడుము దాకా లాగి కట్టి, దానిమీద నల్లటి చీరను కట్టి, జుట్టు వదిలేసి నల్లగా ముద్దగా కాటుక దిద్దిన   కళ్ళను ఇంకా పెద్దగా చేసి చూస్తూ,  ఎర్రగా నాలుకను పదేపదే ఆడిస్తూ,  బుగ్గలు, పెదవులు మధ్యన గీసిన కోరలతో మంగి ఆ రోజంతా చాలా హంగామా చేసింది.  చిన్నపిల్లలు భయపడుతున్నారని  సుభద్రమ్మ  తాటకి సంహారం ఘట్టాన్ని “ఊరి మధ్యన  మండపం  దగ్గర ఆడండి రా ! అక్కడికి వెళ్ళండి” అని పంపించింది. అలా రోజుకు ఒక వేషం వేసుకుంటూ ఏడు రోజులు పగటి వేషగాళ్ళు బాగా సందడి చేశారు. ఎనిమిదో రోజున బసవడు తానే స్వయంగా అర్ధనారీశ్వరుడి వేషం వేసుకొని వచ్చాడు. వాడి నడుముకి మావయ్య ఒక రబ్బరు బంతి నీళ్లతో  నింపి,  దాని లోకి ఒక సన్నటి రబ్బర్ గొట్టం దూర్చి, అలా నీటి తో నింపిన బంతిని నడుముకి కట్టి,  ఆ గొట్టం ఒక చివర  అర్ధనారీశ్వరుడు సిగలోకి ఏర్పాటు చేశాడు. డప్పు చప్పుడికి ఆడుతున్న బసవడు శివుడి రూపం చూపిస్తూ రెండోవైపుకి  తల మీదుగా కప్పుకున్న పరదాని కదుపుతూ ఆ రబ్బర్ బంతిని  నొక్కినప్పుడల్లా గంగాజలం వచ్చినట్లు వాడి తలలో నుండి నీళ్లు బయటికి వస్తున్నాయి. అలా అర్ధనారీశ్వరుడు వేషం గుడ్లేరులోని జనంలో భక్తిని నింపేసింది.

చివరి రోజున రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయుడు వేషాలతో పాటు భద్రకాళి వేషంలో మంగి గుడ్లేరు జనాన్ని బాగా ఆకర్షించింది, ఆరోజు దసరా జాతర పోలేరమ్మ గుడి దగ్గర బాగా జరుగుతుంది, చిన్న తిరణాలల్లే ఉంటుంది, చుట్టుపక్కల గ్రామస్తులందరూ పోలేరమ్మ దేవతకు  పసుపు నీళ్ళు తెచ్చి అమ్మవారి గుడి ముందు వారు  పోస్తారు. అలాగే గుడ్లేరు వాగు  వెంబడి గుడికి దగ్గరగా పొయ్యిలు పెట్టి పొంగళ్ళు వండుతారు. అలా వండిన పొంగళ్లను ఎవరికివారు  అమ్మవారికి సమర్పిస్తారు.  అలా దసరా వేడుకలు చాలా ఘనంగా జరిపిస్తారు కరణం గారు.  ఆ తొమ్మిది రోజులు వచ్చే పోయే చుట్టాలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.  ఆ హడావుడిలో సుభద్రమ్మ కు గాని,  దుర్గయ్య గారికి  కానీ గుర్తు రాలేదు కళకు వచ్చిన ఫిట్స్. పండగ అయినాక బసవడు, సుబ్బడు వచ్చారు. తాతయ్య ఒక కట్ట ధాన్యం 50 రూపాయలు వాళ్లకి ఇచ్చాడు. అలాగే రెడ్డి గారు కూడా ధాన్యం కట్ట, 50 రూపాయలు వారి చేతికిచ్చి పంపించారు. కోమటి వెంకటేశు కిలో బియ్యం, కిలో బెల్లం,25 రూపాయల   డబ్బులతో సరిపెట్టేసాడు. అలా మిగిలిన మూడు బజార్లలో ఉన్న కుటుంబాలు వారి శక్తి కొద్దీ వాళ్ళకి బియ్యం, పప్పులు, కూరలు ఇచ్చారు.  అవన్నీ ఆ గూడెంలో  అందరూ సమంగా పంచుకుంటారు. వేషం వేసిన వాళ్ళకి డబ్బులిస్తారు. ప్రతి ఏడాది దీన్ని చుట్టానికి  గుడ్లేరు  లోని ప్రతి కుటుంబము ఆ తొమ్మిది రోజులు చుట్టాలతో కిట కిట లాడుతూ ఉంటుంది.

కోమటి వెంకటేశు మిఠాయి కి చాలా గిరాకీ ఆ పండగ రోజుల్లోనే. విజయ దశమి నాటికి కళ వాళ్ళ అమ్మ సత్యవతి కూడా వచ్చింది. “ఏమే సత్యవతి ఎలా ఉన్నావు? నీకు కూతురు ఉంది అన్న ధ్యాసం ఉందా? ఎప్పుడో ఏడాదికో మాటు  వస్తావు,” అంటూ చనువుగా రెడ్డి గారి భార్య పోలమ్మ, నాగలి నాగమ్మ  కళ వాళ్ళ అమ్మని  పలకరించారు.

“ఏం సుభద్రమ్మ! నా క్కాసిని కాఫీ నీళ్లు  పోయి, పంటిమీదేసుకుంటా,” అని నాగలి నాగమ్మ అడిగింది.

“ఇప్పుడేం కాఫీ,” అంది విసుగ్గా సుభద్రమ్మ.

“నాకు తెలుసులే! సత్యవతి వస్తే, నీ  పెద్ద మనవడు కూడా వస్తాడు.  వాడి కోసం కాఫీ పెడుతూనే ఉంటావు.  నాకో గ్లాస్ పోస్తే నీ సోమ్మేమి   పోయేను,” వెటకారంగా అంది.  “ దీని మొహం మండ! దీని కళ్ళు నేను కప్పలేను.  ఎప్పుడూ నా మనవడి మీదనే,”  అనుకొంటు,  ఒక పెద్ద గ్లాస్ నిండా కాఫీ కలిపి తెచ్చి నాగమ్మ ముందు పెట్టింది.  కాఫీ గ్లాసుని   ఆత్రంగా అందుకొని ఆబగా చప్పరిస్తూ,

“మడిసట్ల కసురుకుంటుంది కానీ, మనసు వెన్న.  చూడు ఎంత కాఫీ పోసిందో,” అనుకుంటూ ఆనందపడిపోయింది నాగలి నాగమ్మ .

కాస్త సందడి తగ్గిన తర్వాత అమ్మ అడిగింది. “అమ్మ కళని నాతో తీసుకెళ్తాను. ఒంగోలులో బడిలో చేరుస్తాను. పెద్ద పిల్ల అయింది కదా! నీకెందుకు ఇబ్బంది ప్రతినెలా,” అంది.

 

అంతే  సుభద్రమ్మ  కస్సుమంది. “నాకేం కష్టమని, నీకు ఇంటి నిండా పిల్లలు ఉన్నారు. నువ్వు వెళ్లిపోయాక  నాకెవ్వరు దిక్కు.  ఆ నలుసుని చూసుకుంటూ నేను మీ నాన్న  కాలక్షేపం చేస్తున్నాం. పెద్దాడు రానే రాడు. చిన్నోడు ఆ పట్నం పట్టుకుని వెళ్లాడు తుంటాడు. మాకు దాహం వేస్తే  మంచినీళ్లు అందించే దిక్కు కూడా లేదు. అయినా అది నీ బిడ్డ! అడిగి చూడు దాన్ని. ఏమంటుందో? అయినా మా కోసమని మీ బిడ్డని ఇంకేన్నాళ్ల దూరం చేస్తాము.  అది వస్తానంటే తీసుకెళ్ళు. నాకేం అభ్యంతరం లేదు, ” అంటూ కళ్ళు వత్తుకుంది సుభద్రమ్మ.

“ఒంగోలు గుడ్లేరుకి ఎంత దూరం అమ్మ చెప్పు.  చిన్నోడు కూడా అక్కడే చదువుకుంటున్నాడు కదా.  అందుకని తీసుకెళ్దాం అనుకున్నాను,” అంది  అనునయిస్తూ సత్యవతి.

“నీ కూతుర్ని అడుగు, మీ అయ్యని అడుగు. వాళ్ళకి ఇష్టమైతే తీసుకెళ్ళు. నేనెవరిని అడ్డుపడటానికి,” అంటూ  నిష్టూరంగా మాట్లాడింది.

సత్యవతి కళ వంక చూసింది.  కళ కు ఏం చెప్పాలో అర్థం కాలేదు. సుభద్రమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకోవడం మాత్రం అర్థమైంది. అందుకని అమ్మమ్మ వెనకాలే వెళ్లి “అమ్మమ్మ, నేను అమ్మ తోటి వెళ్ళను. నీతోటే ఉంటా. నువ్వు అలా కళ్ళు నీళ్లు పెట్టుకోవద్దు,” అన్నది వెనకనుంచి ఆమె కాళ్ళని చుట్టేస్తూ.

సత్యవతి ఏమీ మాట్లాడలేకపోయింది. కళ తన దగ్గరికి ఇక రాదని అనిపించింది ఆమెకి. చాలా బాధేసింది. సుభద్రమ్మ కూడా ఏం చెప్పలేదు  కళకి ఒంట్లో బాగాలేదని. నాగమ్మ  చెప్పింది రహస్యంగా సత్యవతి  చెవిలో.  అప్పుడు  సత్యవతి కళ ని బాగా జాగ్రత్తగా గమనించింది. మొహం పీక్కుపోయింది . ఎండలకి, గాలికి తిరిగి తిరిగి నల్లబడ్డట్టుగా కనిపించింది. ఏదో నలతగా ఉన్నట్టు కనిపించింది.

“అమ్మ కళ కేమైనా సుస్తీ చేసిందా ఈ మధ్యన,” అడిగింది.

సుభద్రమ్మకి గొంతులో వెలక్కాయ  పడ్డట్టయింది. తను చెప్పనేలేదు దానికి ఫిట్స్ వచ్చాయని.  ఇప్పుడిక చెప్పక తప్పదు,”అవునే! ఒక వారం క్రితం దానికి నిద్రలో   సుస్తి చేసింది. కాళ్లు చేతులు కొట్టుకుంది. నాకు మీ నాయనకు భయమేసింది. ఆచారి  గారిని పిలిపించాము. ఆయన అంత భయపడాల్సిందేమీ లేదు అని అన్నాడు,” అంటూ కళకు వచ్చిన ఫిట్స్ గురించి చాలా తేలిక విషయంలాగా మాట్లాడింది. “అది బాగానే ఉంది. నువ్వేమి కంగారు పడకు. పుట్టినప్పటి నుండి దాన్ని నేను  పెంచాను.  నువ్వు కాదు కదా! మిమ్మల్ని అందరిని కూడా నేనే కదా పెంచి పెద్ద చేసింది.  ఇది నీ బిడ్డ అయినా నా ఇంటి పిల్ల.  నువ్వు దిగులు పడమాకు సత్యవతి,” అంటూ  సుభద్రమ్మ సత్య వతి తల నిమిరింది.

ఆ మరునాడు ఉదయమే సత్యవతి ఒంగోలు బస్సుకి వెళ్ళిపోయింది.  కళకి ఏడుపొచ్చింది. “అమ్మ మళ్ళీ ఏడాది దాక రాదు. తను అమ్మమ్మ దగ్గరే ఉండాలి. అమ్మ కూడా ఇక్కడే ఉంటే ఎంత బాగుండు,” అన్న చిన్న ఆశ కళ మనసులో మెదులుతూ ఉంటుంది.

******************************************

అలా నెల రోజులు గడిచాయి మళ్ళీ ఒక రోజు తెల్లవారుజామున కళకి ఫీట్స్ వచ్చాయి. అలా నాలుగు ఐదు నెలల  నుండి వరుసగా ఫైట్స్ వస్తూనే ఉన్నాయి. ఆ విషయం గుడ్లేరులో పొక్కిపోయింది.

పెద్దరెడ్డి గారి భార్య  పోలమ్మ వచ్చి  “సుభద్రమ్మగారు మీరు ఒకసారి  సోదెమ్మని పిలిపించి అడగొచ్చు కదా!మన  కళకి ఏమైందో చెబుతుంది కదా!” అంటూ సలహా ఇచ్చింది.

సుభద్రమ్మ ఈరిగాడిని పిలిచి,”ఒరేయ్  ఈరిగా! ఈ చుట్టుపక్కల ఎక్కడైనా  సోదెమ్మ కనిపిస్తే నేను రమ్మన్నానని చెప్పి పిలుచుకురా,” అని చెప్పింది. ఆదివారం  నాడు దుర్గయ్య గారు, సురేష్ బాబు కలిసి  పెద్ద కొడుకు  రాజశేఖర్ ని కలవడానికి చెన్న పట్నం వెళ్లారు . ఆరోజే అనుకోకుండా ఈరిగాడు సోదమ్మని  పట్టుకొచ్చాడు కరణం గారింటికి.

ఇదే సరైన సమయం సోది చెప్పించడానికి అనుకుంటూ, “ఒసేయ్ కళ ఒకసారి ఇట్లా రా!”  పెద్ద కేక వేసి పిలిచింది.  కళ  పరుగున లోపలి నుండి వచ్చింది.  ఎర్రటి జరి అంచు పరికిణి తెల్లటి ఓణి       వేసుకొని కాస్త బక్కగా ఉన్న ముచ్చటగా కనిపించింది కళ సోదెమ్మ కళ్ళకి. తేరిపార చూసింది, కానీ కళ మొహం లో ఏదో  కళ తప్పినట్టుగా అయితే గుర్తించింది.

కళ భయం భయంగా సోదిమ్మనే  చూట్టం  మొదలు పెట్టింది. ఆకుపచ్చ రంగు ముతక నేత చీర, ఎర్ర జాకెట్టు, చేతినిండా ఎరుపు పచ్చ రంగు మట్టి గాజులు, మెడ నిండుగా నల్లపూసల గొలుసు, మొహమంతా పసుపు రాసుకొని, నుదుటిన సూర్యుడు లాంటి ఎర్రటి కుంకుమ బొట్టు,కళ్ళకి నిండుగా మెత్తిన కాటుకతోటి చూడ్డానికి కాస్త భయం గొలుపుతూ ఉంది సోదిమ్మ.

పొగాకు తమలపాకులు సున్నం కలిపి నమిలిన నాలుక ఎర్రగా పండి గారపడిన పళ్ళు, మాట్లాడుతుంటే తమల పాకురసం   తుప్పర్లు నోట్లోంచి పడుతున్నాయి. చేతిలో కర్రను  ఊపుతూ సోదమ్మ  కళను  దగ్గరగా వచ్చి కూర్చోమని చెప్పింది. భయం గానే కళ అమ్మమ్మ పక్కకు వచ్చి సోదిమ్మకు కాస్త దూరంగా కూర్చున్నది.

“అమ్మగారు చాట నిండా బియ్యం తెప్పించు.  ఐదు రూపాయల కాసులు పెట్టించు.  నాకు సిరా రవికా ఇప్పించు,” అంటూ చెప్పింది.

“నీ సీర, రవిక మాటకేమి గాని, ముందు నా బిడ్డకు సోది చెప్పు,”అంటూ చాట నిండా  బియ్యం ఐదు రూపాయలు బిళ్ళలు తీసుకొచ్చి సోదమ్మ ముందు ఉంచి  కూర్చుంది.  కళ భయంగా అమ్మమ్మని అతుక్కుని కూర్చున్నది.

“నీ కుడి చేయి సాచు బిడ్డ,” అంటూ చేయి పట్టుకు లాగింది. కళ ఇంకా దూరంగా జరిగిపోయింది భయంతో.  సుభద్రమ్మ కళను లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కుడి చేయి లాగి అరచేతిని  తెరిచి పట్టుకుంది.  సోదమ్మ తన కర్రను కళ తల  కానించి తన బుట్టలోని అమ్మవారి పటం ముందుకు జరిపి కళ్ళు మూసుకుంది.  కొన్ని క్షణాల్లో నే ఆమె తమకంతో మాట్లాడటం మొదలు పెట్టింది.

అది మాటలా లేదు పాటలాగా చెప్తున్నది,”సింహాద్రి అప్పన్న పలుకు, కనకదుర్గమ్మ పలుకు, తిరుమల వెంకన్న పలుకు, మన ఊరి పోలేరమ్మ పలుకు, పలుకు తల్లే పలుకు!” అంటూ “ఉన్నది ఉన్నట్టు చెప్పు,” అంటూ మళ్ళీ కళ్ళు మూతలు పడగ  ఊగిపోతూ కనిపించింది. మరి కొన్ని క్షణాల తర్వాత ఆమె ఎవరో పూనీనట్లు బొంగురు గొంతుకతో మాట్లాడటం మొదలు పెట్టింది.

“ఏమి సుభద్రమ్మ! నన్ను మర్చిపోయినావా! నేను నీ ఆడబిడ్డ సుబ్బమ్మను. నాకు పసుపు కుంకుమ లిచ్చుకో. అప్పుడే నీ మనవరాలిని వదిలి పోతా. లేదంటే లేదు. నీ బొట్టుకు చెప్పు, నీ కడుపున పుట్టిన వాడికి చెప్పు, ఊరి కాడ  పొలేరమ్మకు చెప్పు, నేను ఎవ్వరికీ నక్క. నాకు నువ్వు అన్యాయం చేసినావు. నన్ను మర్చిపోయినావు. నాకు పసుపు కుంకుమలు ఇచ్చుకో!  నీ బిడ్డను వదులుతా,” అంటూ ఊగిపో సాగింది సోదెమ్మ.

సుభద్రమ్మకు  కలవరం తో కూడిన భయం కలిగింది. “ఈ సుబ్బమ్మ పోయి కూడా

శాన్నళ్లు అయింది. ఇప్పుడు  ఇలా  పట్టిందేమిటి.  ఈ విషయం ఏంటో  ఇంటాయన్ని   అడగాలి,” అని నిర్ణయించుకుంది.

సోదెమ్మ ఊగి ఊగి కొద్దిసేపటికి శాంత పడిపోయింది.ఒక పెద్ద గ్లాసు  మజ్జిగ  తాగింది. సుభద్రమ్మ ఇచ్చిన పాత  జరీ చీర,  రవిక  తీసుకొని ఐదు రూపాయలు కొంగులో ముడి వేసుకొని బియ్యం బుట్టలో పోసుకొని, ఏదైనా పచ్చడి ఉంటే పెట్టమ్మా అని అడిగింది.  రాచిప్పలో ఉన్న చింతకాయ పచ్చడి ముద్దని ఇస్తరాకుల చుట్టూ దానికి ఇచ్చింది.  అది దండాలు  పెడుతూ వెళ్ళిపోయింది.

“ఏ పాపం తెలియని ఈ పిచ్చి పిల్లని వేధిస్తున్నది,” సుభద్రమ్మ కు మనసంతా వికలామైపోయింది.

(ముందేం జరుగుతుంది?)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘మళ్ళీ కూయవే గువ్వా!’ 3వ భాగం