గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తూ… వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పొదుపు సంఘాలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. సెర్ప్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంఘాల ద్వారా ప్రతినెలా చిన్నమొత్తంలో పొదుపు చేసే అలవాటు చేసుకుంటూ.. సంఘంలో అప్పుగా తీసుకున్న డబ్బులతో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది మహిళలు తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వారిలో కొందరి గురించి మన తరుణి ద్వారా తెలుసుకుందాం….

ప్ర. ప్రేమ లత గారు నమస్కారం.మీ గురించి చెప్పండి
ప్రేమలత తరుణి పాఠకులకు సమస్కారం. నా పేరు ప్రేమలత. మా ఆయన పేరు సిహెచ్ అశోక్ రావు. కామారెడ్డి జిల్లా యాడవరం మా గ్రామం. రెండు ఎకరాల పొలం మా జీవనాధారం. పొలంపై వచ్చే ఆదాయానికి, కుటుంబ జీవనానికి మధ్య పెద్ద అగాథం. దాంతో నేను బీడీలు చుట్టడం నేర్చుకున్నాను. మా ఆయన, కొడుకు, కూతురుతో కలిసి ఒకవైపు పొలం పనులు చేసేవారు.
ప్రశ్న. మీరు సంఘంలో ఎప్పుడు చేరారు. చేరిన తర్వాత వచ్చిన మార్పు
ప్రేమలత.. ఒకవైపు పొలం పనులు, మరోవైపు బీడీలు చేస్తూ సంసారాన్ని లాగువస్తున్నాం. మాది చిన్న గ్రామం. ఇక్కడ వేరే ఉపాధి అవకాశాలు ఏమీ లేకపోవడంతో చాలీచాలనీ ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న క్రమంలో మహిళా సంఘం గురించి తెలిసింది. కూలీ చేస్తూ సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే నెలకు 30రూపాయలు కడుతూ గ్రూప్ లో చేరాను.
ప్రశ్న. సంఘం నుంచి మొదటి సారి తీసుకున్న అప్పుతో మీరు ఏం చేశారు. మీ కుటుంబ ఆదాయం ఎలా పెంచుకున్నారు?ప్రేమలత … గ్రూప్ నుంచి మొదటి సారి అప్పు తీసుకుని పిండివంటలు చేయడానికి అవసరమైన సామాగ్రి కొనుగోలు చేశాను. అనారోగ్యాన్ని ఇచ్చే బీడీల తయారీ నుంచి ఆరోగ్యాన్నిచ్చే పిండివంటల తయారీకి ఉపాధిని మార్చుకున్నాం. తెలంగాణ స్పెషల్ పిండివంటలైన సర్వపిండి, సకినాలు, అప్పలు, లడ్డు మొదలైనవి చేస్తూ నాతో పాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను.
ప్రశ్న.. గ్రామంలో మరి గిరాకీ ఎలా ఉంది.
ప్రేమలత…. మొదట్లో పెద్దగా గిరాకీ లేకపోయినా ఓపికగా అవకాశాల కోసం ఎదురుచూశాను. మేం తయారు చేసే పిండివంటలు రుచికరంగా ఉండటం, చెప్పిన సమయానికే అందించడంతో క్రమంగా మంచి డిమాండ్ వచ్చింది. పెండ్లిళ్ల సీజన్, పండుగల సీజన్ లో ఎక్కువగా ఆర్డర్స్ రావడంతో మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాను.
ప్రశ్న. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది.
ప్రేమలత. గతంలో చాలీచాలనీ ఆదాయం ఉండేది. పొలం పనులు లేదా బీడీలు చేసే పనులు మాత్రమే ఉండేవి. ఎంత కష్టపడినా వచ్చే కూలీ తిండి ఖర్చులకే సరిపోయేది. ఇప్పుడు ఆర్థిక సమస్యలను అధిగమించాను.
ప్రశ్న. మొదటిసారి అప్పు తీసుకుని తిండి వంటలు చేస్తున్నారు. మరోసారి లోన్ తీసుకుని ఏం చేశారు
ప్రేమలత…. రెండోసారి సంఘం నుంచి అప్పు తీసుకుని పిండిగిర్ని పెట్టాం. పిండివంటలకు కావల్సిన పిండి గిర్నీ పట్టించాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. కొన్నిసార్లు నాణ్యమైన పిండి వచ్చేది కాదు. అందుకే మేమే పిండి గిర్ని కొనుగోలు చేశాం. మేం తయారు చేసే పిండివంటలకు అవసరమైన పిండితో పాటు చుట్టుపక్కల వారికి పిండిగిర్ని అందుబాటులో తీసుకువచ్చాం.
ప్రశ్న ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది.
ప్రేమలత.. పొదుపు సంఘంలో చేరకముందు ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు పిల్లలకు మంచి చదువుతో పాటు సొంత ఇల్లు కట్టుకున్నాం. కొంత పొలం కొన్నాం. మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపడింది. మరికొందరికి ఉపాధి కల్పిస్తూ, అందరికీ ఆరోగ్యకమైన పిండివంటలు అందిస్తున్నాం.
రెండు లక్షల రూపాయలు సంఘం నుంచి తీసుకుని ప్రేమలత తన కుటుంబ ఆదాయాన్ని మరింత పెంచుకునేలా కిరాణం షాపు ప్రారంభించింది. ప్రతినెలా అప్పు చెల్లిస్తూ పిల్లలను బాగా చదివిస్తుంది ప్రేమలత. చిన్న పొదుపు ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది.
