క్షీరాబ్ధి ఏకాదశి తర్వాత వచ్చే రోజు క్షీరాబ్ది ద్వాదశి. దేవతలు క్షీరసాగర మధనం చేసిన రోజు ఇది. అందుకే దీనిని చిలుకు ద్వాదశి అంటారు. యోగులు మునులు తమ చతుర్మాస దీక్ష విరమించే చివరి రోజు. ఈ కారణంతో దీనిని యోగేశ్వర ద్వాదశి అని కూడా అంటారు. ఉత్తాన ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి లేచిన విష్ణువు ద్వాదశి రోజున క్షీర సాగరము నుండి పుట్టిన లక్ష్మిని దేవదానవుల సమక్షమున వరించారుట. ఇది కాక మరొక పురాణ గాధ కలదు. ఇది తులసీదాత్రి వివాహం.

ఈ తులసి ఆవిర్భావ కథ పౌరాణికం.కాలనేమి అనే రాక్షసుని కుమార్తె బృంద. విష్ణు భక్తురాలు, తపస్విని. పరమేశ్వరుని మూడువ కన్ను నుంచి ఉద్భవించిన వాడు జలంధరుడు అనే రాక్షసుడు. ఇతడు అపార శక్తివంతుడు. కానీ విధివసం వల్ల బృందా జలంధరుడు పెళ్ళాడుతారు. రాక్షస స్వభావంతో జలంధరుడు తన జన్మకు కారకుడైన పరమేశ్వరుని ఓడించి విశ్వానికి అధిపతి కావాలని అనుకుంటాడు. శివుని మీదికి దండెత్తాడు. ఈ విషయం దేవతలకు తెలిసి శ్రీ మహావిష్ణువు సహాయం కోరుతారు. కానీ జలంధరుని భార్య తన పరమ భక్తురాలు మరియు మహా ప్రతివ్రత అనితెలుసు హరికి. అసలే విష్ణువు మాయా స్వరూపుడు. జలంధర పరమశివులు యుద్ధంలో ఉండగా మాయా జలంధర రూపంలో విష్ణు బృంద దగ్గరికి వెళ్తాడు. బృందా అతనిని గుర్తుపట్టలేక భర్తని భావిస్తుంది. విష్ణువుని తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది.

విష్ణువుని పోల్చుకుంటుంది. ఆమె ప్రతివత నిష్ట భంగం కాబడి జలంధరుడు బలహీనపడి శివుని చేతిలో హతమవుతాడు. తాను భక్తితో పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలిసి బాధపడి విష్ణువుని శిల కమ్మని శపిస్తుంది. అదే సాలిగ్రామ శిల . బృంద ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది. విష్ణువు తాను చేసిన పనికి ఎంతో మదనపడి బృందను వృక్షంగా మారమని, దానికి తులసి అని నామధేయం చేసి, తనకు ఎంతో ప్రీతికరమైనది అవుతుందని వరం ఇస్తాడు. అందుకే విష్ణు పూజలో తులసి అగ్ర భాగం పొందింది. తులాభారంలో కూడా శ్రీకృష్ణుడు ఒక్క తులసి దళంతో సరితూగాడు.
ఈ చిలుకు ద్వాదశి నాడు తులసి పూజ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఔషధ రూపంలో కూడా మానవులకు ఎనలేని సేవ చేస్తోంది. మన ముంగిళ్ళలో తులసి లేని ఇల్లు ఉండదు. విష్ణు కార్తీక మాసంలో ఉసిరి( ధాత్రి ) చెట్టులో కొలువై ఉంటాడట. అందుకే ఈ ద్వాదశి రోజున తులసి ధాత్రి వివాహం కూడా జరిపిస్తారు. సాయంత్రం మహిళలు కూడా తులసి కోటలో దాత్రి ( ఉసిరి కొమ్మ )నుంచి పూజ చేస్తారు. ఏది ఏమైనా ఒక మెండైన జీవితం పొందిన మహాసాద్వి.
దేవకార్య నిమిత్తం అని చెప్పనా తులసి, అహల్య ద్రౌపది లాంటి అనేక తరిణీమణులను వేలెత్తి చూపించవలసి వచ్చింది. ఆనాటి నుండి నేటి వరకు యుగాలు మారిన మహిళా వివక్షత కనిపిస్తూనే ఉంది. పునర్ సృష్టికి స్త్రీ మూలమైన కూడా చివరికి కళంకాలు, అపనిందలు మోయవలసి వస్తోంది. ఇది తప్పో, ఒప్పో కూడా నిర్ణయించలేని అయోమయకాలం.