వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి

రాధికా సూరి

ఝాన్సీ లక్ష్మీబాయి నవంబర్ 19, 1828 న మహారాష్ట్రలోని కర్హాడీ బ్రాహ్మణ కుటుంబంలో వారణాసి యందు జన్మించారు .అసలు పేరు ‘మణికర్ణిక’ మాతాపితరులు మోరో పంత్ తాంబే, భాగీరథీబాయి. తండ్రిగారు రెండవ భాజీరావు పేష్వా దగ్గర సైన్యాధికారిగా పనిచేసేవారు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో మణికర్ణికను చాలా ముద్దుగా అపురూపంగా చూస్తూ ‘మను’ ‘ఛబిలీ’ అని పిలిచేవారు .ఛబిలీ అంటే అందమైన,చలాకీయైన అని అర్థం. సంతానం లేని పేష్వా గారు నానా సాహెబ్ అనే బాలుడిని దత్తత తీసుకున్నారు. నానాసాహెబ్ ఇంకా అతని సోదరుడు , రావు సాహెబ్ ఇరువురు మణికర్ణికను మనుబాయి అని పిలుస్తూ తమ సొంత చెల్లెలిగా ఆదరిస్తూ, ఆప్యాయంగా కలిసిమెలిసి పెరిగి అన్ని విద్యలు ఒకే దగ్గర నేర్చుకున్నారు. కత్తి సాము ,గుర్రపు స్వారీ ,తుపాకీ పేల్చడం. మనుబాయికి అత్యంత ప్రీతిపాత్రం.
13 ఏళ్ల వయసులో 1842లో ఝాన్సీ నగర రాజైన గంగాధరరావు నెవల్కర్ తో వివాహమైంది .అప్పటినుండి ఝాన్సీ రాజ్యానికి మహారాణి అయ్యారు. 1851లో వారికి ఒక కుమారుడు జన్మించిన నాలుగు నెలల్లోనే కన్నుమూశాడు. బిడ్డ మరణంతో మానసికంగా తేరుకోలేని గంగాధరరావు 1853లో అనారోగ్యం కారణంగా బంధువుల సలహాతో వాసుదేవనేవల్కర్ కుమారుడైన దామోదర్ రావును దత్తత తీసుకున్నారు .దత్తత తీసుకున్న కేవలం ఒక్క రోజు తర్వాత అంటే 1853 నవంబర్ 21న గంగాధరరావు మరణించారు.

వివాహానంతరం లక్ష్మీబాయిగా పేరు మార్చబడిన ఈమె తండ్రికి గల పేరు ప్రఖ్యాతులతో మిగిలిన యువతులకంటే ఎక్కువ స్వేచ్ఛ కలిగి ,యుద్ధవిద్యలయందు గల ప్రావీణ్యంతో స్నేహితురాళ్లతో కలిసి ఒక సైన్యాన్ని తయారు చేసుకుంది.
గంగాధరరావు మరణానంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావలసి ఉండగా ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్ హౌసీ నిరాకరించారు.
ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటన్ సామ్రాజ్యంలో విలీనం చేయాలని నిర్ణయించిన కారణంగా,’ రాబర్ట్ ఎల్లిస్ ‘అనే సమర్థుడైన బ్రిటిష్ న్యాయవాదితో న్యాయస్థానంలో దావా వేసినా ఫలితం లేకపోయింది. దాంతో రాణి పై కక్ష సాధింపుగా బ్రిటిష్ ప్రభుత్వం రాజాభరణాలను స్వాధీనం చేసుకొని, మార్చి 1854లో రాజుగారు ఋణపడి ఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే భరణం నుండి తీసుకున్నారు. ఆమెను ‘ఝాన్సీ’ వీడి వెళ్లాలని ఆదేశించినా కూడా నిరాకరించి వెళ్లే ప్రసక్తే లేదని నిక్కచ్చిగా తేల్చి చెప్పారు.
ఝాన్సీ రాజ్యాని ధారాదత్తం కానివ్వనని నిశ్చయంతో తన సైన్యాన్ని బలోపేతంగా మార్చే క్రమంలో స్వయంగా చక్కని మెరికల్లాంటి యుద్ధ వీరులను తయారు చేసుకుంది. గులాం గాస్ఖాన్, దోస్త్ ఖాన్ ,ఖుదా బక్ష్, లాలా భు భక్షి ,మోతిబాయి ఇంకా ఎందరో యువతులకు చక్కని శిక్షణనిచ్చి తన సైన్యంలో చేర్చుకుంటుండగా, మే 10 1857లో మీరట్ లో సిపాయిలు తిరుగుబాటు మొదలైంది. ఇది బ్రిటిష్ వారి పై మొదటి తిరుగుబాటు .భారతీయుల మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా పందులు, ఆవుల కొవ్వును యుద్ధ ఆయుధాలకు పూసి వాటిని వాడేలా హిందూ ముస్లింలను నిర్బంధించిన క్రమంలో తిరగబడ్డ జనం చేతిలో ఎంతోమంది బ్రిటిష్ వారు సైతం మరణించారు. ఉత్తర భారతదేశంలో మొదటి స్వాతంత్ర సంగ్రామం మొదలవగా, ఆంగ్లేయులు ఝాన్సీ నుండి దృష్టి మళ్లించిన కారణంగా ఝాన్సీ లక్ష్మీబాయికి ‘ ఝాన్సీ’ ని పాలించే అవకాశం ఏర్పడింది .అప్పుడే ఆమె తన శక్తి యుక్తులతో సమర్థవంతమైన సైన్యాన్ని ఏర్పరచుకుంటూనే రాజ్యాన్ని శాంతియుతంగా సురక్షితంగా ఉంచగలిగింది. బ్రిటిష్ వారు తిరిగి యుద్ధం ప్రకటించగా రెండు వారాలు పాటు సాగిన యుద్ధంలో మహిళా సైనికుల పాత్ర అత్యంత కీలకం. సైనికులకు కావలసిన ఆయుధాలు,’ఆహార పదార్థాలను అందిస్తూ, చురుకుగా పాల్గొన్నారు. నగర పరిరక్షణను లక్ష్మీబాయి స్వయంగా పర్యవేక్షించారు.
జనవరి 1858 న రాజ్యాన్ని బ్రిటిష్ వారు తిరిగి స్వాధీనం చేసుకున్న క్రమంలో ఆమె మగ వేషం ధరించి, తన దత్తపుత్రుని వీపుకి కట్టుకుని తాంత్యా తోపే అనే తిరుగుబాటు వీరున్ని కలిసి అన్ని బలగాలని ఒకటి చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించింది కానీ కపట నీతితో వారు కోటను ఆక్రమించుకున్నారు .జూన్ 17 , 1858 యుద్ధంలో మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయి నిలువెల్లా గాయాలతో రక్తసిక్తమై ఉండగా, ఆమెను ఒక ఆలయప్రాంగణానికి తరలించగా వారితో ,తన మరణానంతరం తన కుమారుని అత్యంత జాగ్రత్తగా, మంచి విలువలతో పెంచి పెద్ద చేయాలని, అలాగే తన మరణానంతరం తన దేహాన్ని బ్రిటన్ వారికి స్వాధీనం చేయొద్దని ,అధర్మపరుల చేతుల్లో తన పార్థివ దేహం పడరాదని కోరింది .భగవద్గీత శ్లోకాలు ఉచ్ఛరిస్తూ, కృష్ణ భగవానుని తలుస్తూ తనువు చాలించింది. అక్కడే ఆమె పార్తివదేహం అగ్నికి ఆహుతి చేయబడింది. పరిపూర్ణ స్త్రీగా ,ధీర వనితగా, ఆదర్శ పత్నిగా
పరమతసహనంకలిగి, దేశభక్తి కలిగి, భారతదేశ స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్న వారిలో ఈమెది ప్రముఖ స్థానం. ఆంగ్లేయులపై సిపాయిల తిరుగుబాటులో ముఖ్య భూమిక పోషించారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇంకా ముందు తరాల భారతీయులందరికీ ఒక స్ఫూర్తి ప్రదాతగా వీరు చరిత్ర పుటల్లో నిలిచిపోయారు .ఆమె మరణానంతరం బ్రిటిష్ జనరల్ రోస్ ఇలా ప్రస్తావించారు : విప్లవకారులందరిలో ఈమె అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పారని కీర్తించారు.
భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమేగాక 19 శతాబ్దపు అత్యంత ప్రభావశీలమైన మహిళగా ప్రఖ్యాతిగాంచారు.

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇంగ్లీష్ వింగ్లీష్

అవును….అక్కడే!!!