ఆమె శ్వాస – భరత నాట్యం ; ఆమె ధ్యాస – భరతనాట్యం! ఈమె మరెవరో కాదు ! ఒద్దిరాజు విజయ్ కుమార్- రాధల ముద్దు బిడ్డ ఒద్దిరాజు సారణి!
అమెరికాలో ( U S A) పుట్టి అక్కడే పెరిగిన సారణి తన దేశ సంస్కృతి సంప్రదాయాలను
తు- చ తప్పకుండా పాటించి, ఆ పరంపరను కొనసాగించాలని ,ఎన్నో విద్యాసంబంధిత కోర్సులు అంటే ఇంజనీరింగ్, ఎంబిబిఎస్, ఐఐటి లాంటి కోర్స్ లున్నా అవి కాదనుకొని, శ్రద్దగా భరతనాట్యమే నేర్చుకుంటానని పట్టు పట్టిన చిరంజీవి ఒద్దిరాజు సారణి 4 సంవత్సరాల వయసులో మొదట న్యూజెర్సీలోనే శ్రీమతి జయశ్రీ కొత్తపల్లి గారి దగ్గర భరతనాట్యం ప్రారంభించింది.
ఆ తర్వాత పద్మా సుబ్రహ్మణ్యం గారి శిష్యురాలైన బాలాదేవి చంద్రశేఖర్ గారి దగ్గర చేరి శిక్షణ పొందింది.
ఆ తరువాత 2009 నుండి T బాలసరస్వతి – వజువూరి B . రామయ్య పిళ్ళై గారి శిష్యురాలైన శ్రీమతి ఆర్ని హేమమాలిని గారి దగ్గర శిక్షణ పొందిన తరువాత 2020 లో కళాక్షేత్ర లో (4 ) నాలుగు సంవత్సరాల డిప్లమా కోర్స్ లో చేరారు.
30 మంది నాట్య విద్యార్థుల లో 2 సంవత్సరాల డిప్లమా కోర్స్ లో రెండవ కళాకారిణిగా ఎన్నిక అయ్యారు.
ప్రస్తుతం మద్రాస్ యూనివర్సిటీలో డాన్స్ తో ఎం ఏ(M A) చేస్తున్నది. మొదటి సంవత్సరం పూర్తి చేసింది.
హైదరాబాదు రవీంద్ర భారతి లో 16-7- 2016 న నాట్యంలో ఆరంగేట్రం చేసారు.
శిల్పారామంలో భారతీయ కళాసంస్కృతి వడ్డేపల్లి ప్రవీణ్ గారి అధ్వర్యంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.
20-5-2017 రోజున కాలిఫోర్నియా(U S A) లోని మిల్పిటాస్ నగరంలోని సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మరొక ప్రదర్శన చేసారు.
అలాగే అక్కడే ఇండియానాలోని మేరియన్ హానివెల్ సెంటర్ లో 11-6-2017 నాట్య ప్రదర్శన చేసారు.
1-07-2018 రోజున ఖమ్మం దగ్గర కూసుమంచి గ్రామంలోని రామాలయంలో మరో ప్రదర్శన జరిగింది.
10-01-2020 నుండి 19-01-2020 వరకు బెంగుళూరులో ఇందిరా కాదంబి గారి అధ్వర్యంలో నడిచిన కార్యశాల ( work shop) కార్యక్రమంలో పాల్గొన్నది.

వజువూర్ బాణీలో ( Vachuvoor style) నాట్యం అభ్యాసంచేసిన సారణి భరతనాట్యమే కాకుండా కొరియోగ్రఫీ( choreography stage performance, Dance instruction History of Dance, Theory of Dance Tala aspects ల లోనూ సారణి ప్రవీణురాలు.
అంతే కాదు ఇతర నాట్యాల పట్ల కూడా మక్కువే! సారణికి భరతనాట్య శాస్త్రం గురించి పరిశోధన చేయాలని ఉందని తన ఆసక్తిని వెలిబుచ్చింది.
అసలైతే ఈ భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రం రచించిన భరతముని పేరుతో పేరు పొందింది.
పూర్వకాలంలో దేవాలయాలలో అంగ-రంగ- వైభవం భగవంతునికి శోడషోపచార పూజలలో అర్ఘ్య-పాద్యాలతో పాటు నృత్యం దర్శయామి! గీతం ఆలాపయామి! అనే ఉపచారంలో భాగంగా రంగమంటపం పైన ఈ నృత్యం ప్రదర్శన చేసేవారు.
ఈ భరతనాట్యంలోని భంగిమలు ప్రాచీన దేవాలయాలలోని శిల్పాల భంగిమ ఆధారంగా నాట్యాన్ని సమకూర్చారు. భరతనాట్యంలో ముఖ్యమైనవి భావం- రాగం -తాళం. వీటిని నృత్యంశాలతో జోడిస్తూ నృత్య కళాకారులు చక్కని హావ -భావ ప్రదర్శన చేస్తారు!
అలా అద్భుతమైన ప్రదర్శన ఇటీవల హైదరాబాదు లోని సారస్వత పరిషత్తు దేవులపల్లి రామానుజ రావు గారి హాల్లో చిరంజీవి సారణి తన అద్భుతమైన నాట్య కౌశలంతో ప్రదర్శన చేయాలని సంకల్పించి, ఈమె కళాక్షేత్ర నాట్య విద్యార్థిని కనుక పూర్వక పుష్ప అనే శీర్షికన భరతనాట్యం ప్రదర్శన ఇచ్చింది.
భరతనాట్యం అన్ని రకాల నాట్యాలలో మంచి ప్రాధాన్యత ఉన్న నాట్యం! ఎందుకంటే ఎక్కువగా దేవతా స్తుతులే ఉంటాయి, కాబట్టి ప్రేక్షకులందరిని అలరిస్తాయి.
ఈ శాస్త్రం రాసింది భరతమునే అయినా తంజావూరు వాస్తవ్యులు 18వ శతాబ్ద కాలం వారైన చిన్నయ్య, పొన్నయ్య, శివానందం, వడివేలు అనే అన్నదమ్ములు నట్టువన్నులు.
ఈ భరతనాట్యం దేవాలయాల ప్రదర్శన నుండి బయట ప్రదర్శనలు చేస్తూ ఒక శాస్త్ర మర్యాదను పాటిస్తున్నారు.
ప్రదర్శన ప్రారంభంలో అలరిపు మిశ్ర తాళంతో పాదముకుంద కీర్తన తో సాగిన నృత్యం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
వర్ణం తర్వాత కానకడికుడు (పాపనాశనం శివం) కీర్తన, తర్వాత గీత గోవిందంలోని అష్టపది నృత్యం, తర్వాత మైసూర్ వాసుదేవా చార్య జావళి నృత్యం ఓ ప్రాణనాథ! నే పిలిచితే రావేమి రా తరువాత తిల్లాన చివరగా భరతశాస్త్రాన్నికాపాడ మని, కళాక్షేత్రను కాపాడమని వేడుకున్న మంగళకర నృత్యం ఎంతో బాగుంది.
ముఖ్యంగా తిల్లాన నృత్యంలో భంగిమలు స్థిరంగా ప్రదర్శించడం జరుగుతుంది. శరీరం సగభాగం నుంచి వంచి అందంగా అభినయ ప్రదర్శన చేస్తారు. ఒద్దిరాజు సారణి అభినయం సర్వాంగాల్లోనూ ముఖ్యంగా కళ్ళల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. మొదలు పెట్టినప్పుడు ఎంత ఉత్సాహంతో మొదలుపెట్టిందో చివరి తిల్లానా వరకు అదే ఉత్సాహంతో అభినయం చక్కగా కొనసాగించింది.
సారస్వత పరిషత్తు దేవులపల్లి రామానుజ రావు హాల్ దాదాపు ప్రేక్షకులతో నిండి పోయింది.
ప్రదర్శన జరిగినంత సేపు మంత్రముగ్ధుల వలె కూర్చొని చూసి ఆనందించారు. ఎందుకంటే సారణి వేదిక మీదకు వచ్చేటప్పుడు ఒక గ్రేస్ తో కనపడి అవాక్కైయ్యేలా చేసింది.
అన్ని అంశాలను మధ్య విరామం లేకుండా నాట్యం చేసినా ,అలసట ముఖం మీద కనిపించనీయలేదు! భావాలు సున్నితంగా ఉన్నాయంటే ఆమె గురువుగారి శిక్షణ తెలుస్తుంది.
భరత నాట్య కళాకారిణికి ఆహార్యం ఎంతో ముఖ్యం. సారణి అందమైన రూపం, దానికి తగిన ఆహార్యం, సాధారణ ఆభరణాల అలంకరణ ఆమెకు ఒక హుందాతనాన్ని ఇచ్చింది.
ఒక్కొక్కసారి ఇతరుల నాట్యం చూసినప్పుడు ఇన్ని ఆభరణాలు అవసరమా? అన్న ప్రశ్న అనుకోకుండా నాకు వచ్చేది. దాని సమాధానం సారణి అలంకరణలో దొరికింది సమాధానం. అన్నన్ని కంఠాభరణాలు కానీ, హస్తాభరణాలు కానీ అక్కరలేదని, సహజ సౌందర్యమే చాలని తెలిపింది సారణి అలంకరణ !
తన కంటి కదలికలు ఎంతో బాగున్నాయి. అవి శిక్షణ లో రాలేదని, ఆమె సహజంగానే అలా కదిలించగలదని ఎక్కడా కృత్రిమత్వం లేదనిపించింది.
ముఖ్యంగా తిల్లానా నృత్యం చేస్తున్నప్పుడు ఆమె కదలికల నుండి నేను చూపు మరల్చుకోలేకపోయాను!
మద్రాస్ కళాక్షేత్రంలో సారణి నాట్య విద్య కొనసాగింది. ఆ సంస్థను రుక్మిణి అరుండేల్ స్థాపించి అందులో శాస్త్రీయ నృత్యం- సంగీతం మొదలైన భారతీయ కళలను నేర్పిస్తున్నారు. ఇందులో చాలా ప్రదర్శనలు జరుగుతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన కార్యక్రమాలు ఉంటాయి .అందుకే అంతర్జాతీయంగా ఎంతో పేరు ఉన్న సంస్థ కళాక్షేత్ర!
అందులో సారణి శిక్షణ పొందడం ఆమె అదృష్టమనే చెప్పాలి! ఈ నాట్యం మొత్తం కళాక్షేత్ర స్టైల్లోనే జరిగింది.
ఈ భరతనాట్యం అంటే అభిరుచి ఉన్నా చాలా మంది నేర్చుకోవడానికి ప్రయత్నించరు. ఎందుకంటే ఎంతో కాలానికి కానీ తమకు గుర్తింపు రాదనుకుంటారు.కానీ శ్రద్ధతో సారణి వలె నేర్చుకుంటే దానంతటదే వస్తుందని నిరూపించింది. పాశ్చాత్యదేశంలో పుట్టి పెరిగిన సారణి ఈ భరతనాట్యం అభిరుచిగా కాక ప్రధాన విద్యగా ఎన్నుకోవడం అభినందించదగిన విషయం!
తన పేరు సారణి అంటేనే షడ్జస్వరాలను పలికే తంత్రి వలె పేరుకు తగినట్టుగా ప్రేక్షకులకు, నట్టు వాంగ కళాకారులకు, వాయిద్య కళాకారులకు, సభకు పరిచయంచేసి స్వాగతం చెప్పిన వారికి
తన కృతజ్ఞతలు స్వయంగా చెప్పుకోవడంలో ఆమె వినయం తెలుస్తున్నది.
చిరంజీవి సారణి నృత్యం సభలోని వారందరినీ ఆకర్షించిందంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు !అంత మంచి శిక్షణే కాకుండా, స్వతహాగా మంచి క్రమశిక్షణ ఉన్న సారణి సుందరమైన రూపం లోనూ, ఆమె నాట్యం లోనూ ఉజ్వల భవిష్యత్తు కనపడుతున్నది.
ఆమె మరెన్నో నాట్య ప్రదర్శనా కార్యక్రమాలు నిర్వహించాలని, ఈనాట్య శాస్త్రం పై పరిశోధనా గ్రంథం రచించాలని, అందుకోసం ఆ నటరాజు ఆశీస్సులు సదా సారణికి లభించాలని శుభకామనలు కోరుతూ..
మనఃపూర్వకమైన ఆశీః
రంగరాజుపద్మజ