నేలతల్లి నవ్వింది -4

కలెక్టర్ అభిషేక్ ముందు తలవంచుకుని కూర్చున్నాడు ఫారెస్ట్ రేంజర్ కృష్ణారెడ్డి.

“దీనికి సమాధానం కావాలి కృష్ణారెడ్డి. గత ఆరు నెలలుగా అడవిలో జరుగుతున్న ఇల్లీగల్  లాగింగ్ మీ దృష్టికి రాలేదంటే నమ్మమంటారా? లేక అందులో మీకు భాగస్వామ్యం ఉందా? మీ మీద  డి.ఎఫ్.ఓ గారికి రిపోర్ట్ వెళ్ళింది. సస్పెన్షన్ లేదా జైలు శిక్షకు తయారుగా ఉండండి. ఇప్పటికైనా మీకు తెలిసిన నిజాలని బయట పెడితే శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. నాకు ఇప్పటికిప్పుడు సమాధానం కావాలి.” అంటూ కటువుగా అన్నాడు అభిషేక్.

“సారీ సర్! రియల్ ఎస్టేట్ భద్రాద్రి కన్ను లక్ష్మణగిరి వంద ఎకరాల తోటల మీద దానిని ఆనుకున్న అడవి మీద పడింది.అడవిలో కొంత భాగాన్ని ఆక్రమించుకొని ఆ తోటలతో కలిపి ప్లాట్లు చేయాలని దురాలోచనతో ముందస్తుగా అడవిలో చెట్లను నరకటం మొదలుపెట్టాడు.

హైదరాబాద్లో చదువుకుంటున్న నా ఇద్దరు కూతుళ్లు నా భార్య సెలవులకు నా దగ్గరికి వచ్చారు. నా ఒకకూతురు ఐ.ఏ.ఎస్ కి ఎప్పియర్ అవుతోంది. రెండవ కూతురుకి ఐ.పి.ఎస్ చేయాలని ఆశయం. నాకు వాళ్ళిద్దరూ కవల పిల్లలు. చిన్నది చాలా సహజంగా డేరింగ్ డెవిల్.దానికి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. అడవిలో సరదాగా తిరగటానికి వెళ్లినవాళ్లు ఎంతకీ రాకపోవడంతో, నా వర్కర్స్ ని పంపాను. అక్కడ నా కూతుర్లను బందీ చేసినట్లు వార్త వచ్చి హుటాహుటి బయలుదేరాను.

అక్కడ జరిగినది ఏమిటంటే నా కూతుర్లు ఇల్లీగల్ లాగింగ్ ఫొటోస్ తీశారు. అక్కడున్న  స్థావరాలు, వారు ఉపయోగించే మిషన్లు ఫోటోలు తీస్తుండగా పట్టుబడ్డారు. వారి దగ్గర నుండి మొబైల్స్ లాక్కుని వారిని కిడ్నాప్ చేశారు. వారిని వదిలి పెట్టాలంటే వారి కార్యకలాపాలకి ఎటువంటి ఆటంకము రాకుండా నేనే కాపలా కాయాలని షరతు పెట్టారు. వాళ్లు పరమ దుర్మార్గులు. చెంచుగూడెంలోని యువతులను చెఱపట్టి మానభంగాలు చేశారు.ఆ శవాలను ఆచూకీ లేకుండా లోయలో పడేసారు. కోయలు పోయిన వాళ్ళు ఏ కౄరజంతువు  బారిపడిందోనని  మౌనంగా ఉన్నారు.  మొన్న మొన్న జరిగిన యువతి హత్య పోలీసుల రికార్డులో చేరింది.తీగలాగితే డొంక లాగా అంతకు ముందు చనిపోయిన గిరిజన యువతులది హత్యే అని. వారిని ఏ కౄరజంతువు చంపలేదని నిర్ధారించారు. హంతకులకోసం వెతుకుతున్నారు. ఇది తెలిసిన నేను నా బిడ్డలకి అటువంటి గతి పట్టరాదని వారి షరతులకు గత్యంతరం లేక ఒప్పుకొని నా బిడ్డలను విడిపించుకున్నా. రిజైన్ చేసి వెళ్ళిపోదామనుకున్నా. ఆ విషయం తెలిసి మరల నన్ను బెదిరించారు. రిజైన్ చేస్తే అంతకంటే దారుణంగా నా బిడ్డల్ని చంపుతామని, వారి పని పూర్తి అయ్యేవరకు నేను అక్కడే ఉండి మద్దతు ఇవ్వాలని బెదిరించారు. అందువల్ల నా కూతుళ్ళ మీద ప్రేమతో చేతకాని వాడినై ఒక రకంగా స్వార్థంతో వారి కార్యకలాపాలకు అడ్డు వెళ్లలేదు.” అన్నాడు బాధాతప్త హృదయంతో.

“మరి మీరు మీ స్థానిక ఎమ్మెల్యేని కలిసి విన్నవించుకోలేదా!”   అన్నాడు కలక్టరు అభిషేక్.

అంత బాధలోనూ”హ్హ హ్హ హ్హ”  అంటూ పెద్ద పెట్టున నవ్వాడు కృష్ణారెడ్డి.

“లేదు. కలవలేదు. కలవదలుచుకోలేదు. ఎందుకంటే భద్రాద్రి , ఎమ్మెల్యే కిరణ్ గౌడ్ స్వయానా బావమరిది. ఆ అండ చూసుకొని భద్రాద్రి ఆగడాలు విచ్చలవిడి అవుతున్నాయి.” అన్నాడు కృష్ణారెడ్డి.

“సరే కృష్ణారెడ్డి! మీరు చెప్పినది నిజమే అయితే అక్కడి సమాచారం మాకు తెలుపుతూ వారి మీద కన్ను వేసి ఉంచండి. వారికి అనుమానం రాకుండా ఎప్పటిలా ప్రవర్తించండి.

“ఓ.కే. సర్!”. అంటూ కృష్ణారెడ్డి నిష్క్రమించాడు.

అభిషేక్ కృష్ణారెడ్డి మాట్లాడినదంతా ఎవిడెన్స్ గురించి రికార్డ్ చేసి పి.ఎ ఆదిత్యకి ఇచ్చాడు.

అభిషేక్ కి చాలా చికాకుగా ఉంది ఎటూ
పాలుపోలేదు. ఇంత చదువు చదివి, లా అండ్ ఆర్డర్ చేతిలో ఉండి, ఒక రాజకీయ నాయకుడిని, ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిని ప్రశ్నించే హక్కులేదు. వాడు ఖూనీ కోరైన వాడికి సలాం కొట్టాల్సిందే .

వెంటనే అభిషేక్ రవీంద్ర దగ్గరకు బయలుదేరాడు. రవీంద్ర గాయాలు చాలావరకు మానిపోయాయి. బుల్లెట్ దూసుకెళ్లిన గాయం తప్ప మనిషి ఫ్రెష్ గా యాక్టివ్ గా  ఉన్నాడు. అదే మాట అభిషేక్ రవీంద్రతో అన్నాడు.

“పొట్టకూడా పెరిగింది కదా అన్నయ్యా! అంటూ బృందవైపు చూసి నవ్వాడు. పొట్టదేముంది అదే కరిగిపోతుంది ఒక వారం తిండి లేకపోతే. ఎలాగూ నీకు అటువంటి పనితగిలింది.అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు అభిషేక్.

ప్రత్యక్షంగా కిరణ్ గౌడ్ అరాచకాలు తెలిసిన నేను కలెక్టర్ గా ఎటువంటి చర్య తీసుకోలేని పరిస్థితి. ‘నిర్దిష్టమైన సాక్ష్యం లేనిచో కలెక్టరు ఎమ్మెల్యేల జోలికి వెళ్లరాదన్న చట్టం ఉంది.’అన్నాడు అభిషేక్.

“ఇది పోలీసులు, ఎఫ్.ఆర్.వో లు ఎన్.జి.ఒ ల చేతిలోనే ఉంటుంది.” అంటూ నిస్పృహతో నిట్టూర్చాడు అభిషేక్.

“వాడి వేలుతోనే వాడి కన్ను పొడుచుకునేట్టు చేద్దాం. నువ్వు ఆందోళన చెందవద్దు అన్నయ్యా!”అన్నాడు రవీంద్ర.

“ఇంతకీ రామగిరి పొలాలు, మందులు ఫ్యాక్టరీ గొడవ ఎంతవరకు వచ్చింది? రైతులు పొలాలు ఇస్తామన్నారా?” అన్నాడు రవీంద్ర  కొంటెగా అభిషేక్ ని చూస్తూ.

“ఇది కూడా తమరి ఆధ్వర్యంలోనే పురుడు పోసుకోవాలి. కలెక్టర్ అని ఒక బ్యాడ్జ్ తప్ప అన్నిటికీ ఆంక్షలు. ఎల్లుండి సర్వేయర్ల తో రామగిరి పొలాల ఎస్టిమేషన్ కి వస్తున్నాం పదకొండు గంటలప్రాంతంలో. నీ సత్తా చూపు.” అంటూ అభిషేక్  రవీంద్రకు కన్నుగీటుతూ జీపు ఎక్కాడు.

రవీంద్ర అర్థవంతంగా నవ్వాడు.

“ఆచార్యా! నాకు చాలా పనులు ఉన్నాయి. సెలవు ఇప్పిస్తారా! మీ ఋణం తీర్చుకోలేను. నా ప్రాణాలు కాపాడారు.” అన్నాడు రవీంద్ర ముకుళిత హస్తాలతో.

“బాబు రవీంద్ర బుల్లెట్ తీసిన గాయం ఇంకా పచ్చిగా ఉంది. అక్కడ గాయం పూర్తిగా పూడుకోలేదు. ఒత్తిడి వస్తే మరల గాయం నుంచి రక్తం కారే అవకాశం ఉంది. జాగ్రత్త రోజు మొత్తం మీద వీలైనప్పుడు గాయాన్ని శుభ్రపరచుకొని ఈ లేపనాన్ని రాసుకో. వీలైనప్పుడు వచ్చి గాయానికి నా దగ్గర వైద్యం చేయించుకో. ఈ ఆయుర్వేద గుళికలు దగ్గర పెట్టుకో. రోజు పచ్చిపాలతో ఈ మాత్ర సేవించు. మేకపాలు కానీ ఆవు పాలు కానీ శ్రేష్టం.” అంటూ జాగ్రత్తలు చెప్పాడు మణికంఠ ఆచార్యులు.

                          ★★★

హుటాహుటి రవీంద్ర శివరామకృష్ణ గారి దగ్గరికి వెళ్లాడు. ఆరోజు శనివారం అవటంతో శివరామకృష్ణ మధ్యాహ్నం నుంచి తీరుబడిగా ఉన్నారు.

ఈసారి శివరామకృష్ణ, రవీంద్ర రామనాధాన్ని కలవటానికి పంచాయితీ ఆఫీసుకు వెళ్లి సీతారామయ్యకు, శేషయ్యకు కబురు పంపారు.
శేషయ్య కొంతమంది ముఖ్యులతో పంచాయితీ ఆఫీసుకు వచ్చాడు.

రవీంద్ర వారితో ఇలా అన్నాడు. “కలెక్టర్ గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారి విధులు వారు నిర్వర్తించక తప్పదు. సోమవారం కలక్టర్ సర్వేయర్స్ తో కలిసి రామగిరి పొలాలని అంచనా వేసి ఎంతవరకు నష్టపరిహారం ఇవవచ్చునో అంచనా వేసి పొలాలు కొనుగోలు చేయ కార్యక్రమం మొదలు పెట్టాలని వస్తున్నారు. మన పొలాలను అడవిని రక్షించుకోవలసిన బాధ్యత మనదేను. నేను నాకు తెలిసిన ఎన్.జి.ఒ లకు ఆహ్వానం పంపాను. అడవిని ఎలా రక్షించుకోవాలో నాకు వదిలేయండి. పొలాలు కాపాడుకోవలసిన బాధ్యత మీది. మీ రైతులది. ఉద్యమం చేస్తే కానీ ఇది హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్లదు. వార్తలలోకి ఎక్కదు. మీడియాలోకి ఎక్కితే కానీ దీని ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియదు. నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు న్యాయం మన ప్రక్క ఉన్నప్పటికీ ఆ ఒక్క పాలు శ్రమ మనం వేసే అడుగు మీద ఆధారపడి ఉంటుంది.” అన్నాడు ఉద్వేగంగా.

“శేషయ్యా! వీలైనంతమంది రైతులు గ్రామం పొలిమేరలో కలెక్టరు వాహనాలు వారి ఆఫీసర్లు గ్రామంలోకి రానీయకుండా రోడ్డుమీద బైఠాయించి అడ్డుకోండి.

“అడవులు మానవ మనుగడకు జీవనాధారం.”

“చెట్లు మన చుట్టూ మౌన నేస్తాలు.”

“పొలాలే మానవాళి కన్నతల్లి. ఆకలేస్తే అన్నం పెడుతుంది.”

“ప్రకృతి ప్రసాదించు వరమే కదా వృక్షం. జనజీవన సౌభాగ్యానికి తానే ఒక సాక్ష్యం.”  వంటి నినాదాలు వ్రాసుకుని రహదారిలో కూర్చొని ఆందోళన చేయండి. లాఠీ ఛార్జ్ జరగవచ్చు. అయినా చెక్కుచెదరవద్దు. నిగ్రహం వహించండి. మీ వైపు నుంచి హింసాత్మక చర్యలు వద్దు. ఇంతకంటే నేను ఎక్కువ సూచనలు ఇవ్వను. మీ ఆందోళన ప్రెస్ మీడియా కి తెలియాలి. ఇది గవర్నమెంట్ వారు చేస్తున్న దురాక్రమణ. మీ ఉద్యమం ఎంతో బలంగా ఉండాలి.అది మీ గుండె లోతుల్లోంచి రావాలి.నేను ఇక్కడ ఉండను. నా పనిమీద వెళ్తున్నాను. ఎప్పటికప్పుడు సమాచారం అందించండి.” అంటూ అక్కడ నుంచి బయలుదేరాడు రవీంద్ర.

‘ ఇప్పుడు తను అడవిని కొట్టేస్తే వచ్చే ఉపద్రవాలు అరికట్టాలి. ఈ కొండలు అడవులు గ్రామంలో వరద నీరు రాకుండా ఆపుతున్నాయి. ఆ సంగతి పై అధికారులకి తెలిపి అడవిని రక్షించాలి.’ అనుకున్నాడు రవీంద్ర.

                            ★★★

“భద్రాద్రి! కొన్నాళ్లు అడవిలో పని ఆపు. కలెక్టర్
ఎఫ్.ఆర్.ఓ ని కలిశాడు అన్నట్లు సమాచారం అందింది. అయినా నన్నేం సేయలేడు. గానీ నువ్వైతే జర జాగ్రత్తగ ఉండు.” అంటూ భద్రాద్రికి కిరణ్ గౌడ్ ఫోన్ చేశాడు.

ఎం.ఎల్.ఎ కిరణ్ గౌడ్ కి తెలియదు తమ ఫోను టాపింగ్ అయినది, భద్రాది తో మాట్లాడిన ప్రతి మాట పోలీసు రికార్డులో చేరుతోందని.

“ఊరికూరికే భయపడొద్దు బావ. ఏమి కాదు.
నెమ్మళంగుండు.” అంటూ కొట్టి పారేశాడు భద్రయ్య ఎమ్మెల్యే కిరణ్ గౌడ్ మాటల్ని.

పగలే ఒక ఇరవై మంది గుండాలతో చెంచు గూడానికి పోయి ,
“ఏ లం……. లు, ఏ ఏ లం……… కొడుకులు”  నా మీద కాంప్లైంట్ ఇచ్చింన్రు? అంటూ దొరికిన వాళ్ళని దొరికినట్లు తన మనుషుల చేత కొట్టించాడు.

“సప్పుడు సేయకుండా రేత్రిళ్లు మా పని మేం సేసుకుంటుంటే అడ్డం వస్తారా బా..లారా! సూడండి ఇయ్యాలసంది నుంచి పగలే సెట్లు నరుకుతాం. ఏ మొగోడు అడ్డొస్తాడో సూస్తాం!”  అంటూ అందరినీ బెదిరించి సరాసరి ఎఫ్.ఆర్.ఒ  కార్యాలయానికి వెళ్ళాడు.

“ఏంది సామీ! నీకు నీ బిడ్డలకి సంజాయించినా గందా!
మల్ల మల్లా తోకూపుకుంటూ కలెక్టర్ తో భేటీ అయిన వంటా! ఏంది ధైన్యం? నీ బిడ్డల గురించి నీకు బాద్యత లేదా గేం? నేనిప్పుడు పగలే అడవిలో సెట్లు నరుకుతా! అడ్డొచ్చిన వానిని అడ్డంగా నరుకుతా! అంటూ అడవిలోకి వెళ్ళాడు భద్రాద్రి.

                             ★★★

భద్రాద్రి నేర చరిత్ర మీద అప్పటికే సి.ఐ.డి ఎంక్వైరీ మొదలైంది ఎంక్వయిరీలో అడవిలో చెట్లు నరకటం, రైతుల మీద ఒత్తిడి, గిరిజన స్త్రీల మానభంగాలు, హత్యలు, చెంచుల మీద ఫైరింగ్. అందులో ఒక చెంచు మరణంతో సహా దృష్టిలోకి వచ్చినాయి.

పోలీసులు చెంచుగూడానికి వెళ్లి విషయాన్ని సేకరించి వారిచే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించారు. గాయపడిన వారిలో ఒక ఎన్జీవో ఉన్నారని తెలిసి రవీంద్ర వైద్యం కోసం మణికంఠ ఆచార్యుల వద్ద ఉన్నప్పుడు వివరాలు సేకరించారు.

తగిన సమయం గురించి ఎదురు చూస్తున్నారు. అడవిలో కాల్పులు జరిగినా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న ఎఫ్.ఆర్.ఒ   కృష్ణారెడ్డిని  ఎక్స్ప్లనేషన్ అడిగారు. ఎంక్వయిరీ ఆర్డర్లు వచ్చాయి. అటవీ పరివాహక ప్రాంతాన ఇల్లీగల్ లాగిన్ చేసే వారి గురించి ఆకస్మిక గాలింపు చేపట్టింది పోలీసు శాఖ. ఆ గాలింపులో ఎన్నో గుడారాలు అందులో చెట్లని నరకటానికి ఉపయోగించే పెద్ద పెద్ద రంపపు మిషన్లని స్వాధీనం చేసుకుంది. ఈ విషయం తెలిసిన భద్రాద్రి తన అనుచరులతో అడవిలో రహస్య స్థావరానికి బయలుదేరాడు. కానీ చెంచులు వాడిని తరిమి తరిమి అటకాయించి తీవ్రంగా గాయపరిచి పోలీసులకి అప్పగించారు.

ఈ వార్త తెలిసిన ఎమ్మెల్యే కిరణ్ గౌడ్ తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉన్నాడు. భార్య శ్రీలక్ష్మి తమ్ముని విడిపించమని పోర సాగింది.

“నీకు మగడు కావాలో! తమ్ముడు కావాలో! ఎంచుకో!గిప్పుడు గానీ నీ తమ్ముని బెయిల్  కని పోయినానా నేను కూడా పోలీసుల గండ్ల బడతా. ఆ కలెక్టర్ ను పటాయించినంత తేలిక కాదు నీ తమ్ముని యవ్వారం. కమిషనర్ దంకా పోయినాది. ఏదో నాలుగు చెట్లు నరుక్కుని రియల్ ఎస్టేట్ దంధా సేసుకుంటాడు అని గా తోటల రైతులని బెదిరించి కొనుకొనుగోలు చేద్దామనుకున్నా. గాని ఈడు గిరిజన ఆడోళ్ళ తావుకి పోయిండు, ఆరిని చంపిండు, కాల్పులు సేసి చెంచుల్ని సంపిండు, ఒక ఆఫీసర్ని మల్ల షూట్ చేసిండు, అది సాలదన్నట్లు మల్ల మల్ల బోయి చెంచుల్ని బెదిరించి, వారిని కొట్టి, ఎఫ్.ఆర్.ఒ కాడబోయి వార్నింగ్ ఇచ్చిండంట. నేను సెప్పినా జర కొన్ని దినాలు ఈ ధందా ఆపి సైలెంట్ గ ఉండమని. ఏమో తోపు లెక్కన ఉరికిండు. పోలీసులకు దొరకపోయిండు. నేనేమీ ఇందులో తలదూర్చ. నా ఎమ్.ఎల్.ఏ పదవికి ఎసరు వస్తది.” అంటూ వీరావేశంతో ఊగిపోయాడు కిరణ్ గౌడ్.

శ్రీలక్ష్మి కి భర్త మీద భద్రాద్రి మీద ఎనలేని కోపం వచ్చింది.

‘బెయిల్ అడిగి తనని కొండుబోవ బావ వస్తాడని ఆశతో ఎదురుచూసిన భద్రాద్రికి నిరాశే ఎదురైంది. శ్రీలక్ష్మి ద్వారా విషయం తెలిసింది. భద్రాద్రి రక్తం ఉడికిపోయింది బావ ఎమ్మెల్యే గవ్వాలని ఎంత గెంత పాటుపడ్డాడు. అడ్డొచ్చినోళ్ళని త్రొక్కులాటలో తొక్కేసి ఆపోజిషన్ పార్టీ వాళ్ళని మీటింగులు పెట్టుకొనీక అల్లర్లు సేసి ఆరిక్యాండిడేట్లని దొంగ దెబ్బలు తీసి బావకి ఓటేయమని  మందు పోసి, పైసలు పంచి, బావ మీద ఈగ ఆలనీయక గొడుగు పట్టిన నన్ను కాపాడటానికి రాడా? ప్లాట్లు చేసిన స్థలాల్లో తనకి వాటా ఇవ్వమని అడిగినట్లు మరిసినట్లు ఉండాడు. సెప్తా నా దగ్గర సాక్షీకాలు ఉండాయి. నా జైలుకు పోతే నేనొక్కడినే పోవా! నిన్ను కూడా తీసుకుపోతా!’ అంటూ పళ్ళు పటపట కొరికాడు భద్రాద్రి.

                              ★★★

ఆదివారం అంతా కూర్చుని విద్యార్థుల సహాయంతో  నినాదాల ముద్రితాపత్రాలని ఒక అట్టకు అతికించగా, ఇంకొందరు దానిని చిన్నచిన్న వెదురు కర్రలకు మేకులతో కొట్టి ‘ప్లక్కార్డ్స్’ తయారు చేశారు.

సోమవారం ఎనిమిది గంటలకల్లా రాజన్న నాగరాజు తూర్పు దిక్కు పొలాలున్న రైతులందరినీ పోగేశాడు. అలానే శేషయ్య పడమటి దిక్కు పొలాలు ఉన్న రైతులను, గిరిజనులైన గోండ్లు, చెంచు, కోయ, లంబాడా, కోలం, ఎరుకలు, సవరలు, తొట్టి, సుగాలి, బంజారా వంటి విభిన్న తెగల గిరిజన పెద్దలను పంచాయతీ ఆఫీసు ముందు సమావేశపరచారు.

శివరామకృష్ణ వారి ని ఉద్దేశించి, “ఈ దినము కలెక్టర్ గారు సర్వేయర్లతో ఈ భూమిని కొలిచి దానికి తగిన వెల నిర్ధారించటానికి వస్తున్నారు. మన భూమిని కాపాడటానికి ఏ పోలీసు మనకు సహాయం చేయటానికి ముందుకు రాడు. మన నేలతల్లిని మనమే కాపాడుకోవాలి. అడవి బిడ్డలు!  మన నేలతల్లిని మనమే కాపాడుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. నేలతల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కలెక్టర్ గారి బృందాన్ని మన గ్రామం పొలిమేరలకి రానివ్వకుండా అడ్డుకోవాలి.

‘మందుల ఫ్యాక్టరీ వద్దు. అడవులే హద్దు. పొలాలే ముద్దు’ అనే నినాదంతో వారిని తరిమికొట్టాలి. పోలీసు హింసకు పాల్పడితే ఓర్చుకోండి. గవర్నమెంట్ వారి ప్రతిపాదనను వెనుకకు తీసుకునే వరకు మన ఈ ఉద్యమం నిరాటంకంగా సాగుతూనే ఉంటుంది. మధ్యలో ఆపివేయకూడదు. దీనికి సమ్మతించని వాళ్ళు వెనుకకు మరలిపోవచ్చు.” అన్నాడు శివరామకృష్ణ.

బృంద, రాధ, కొంతమంది విద్యార్థుల సహాయంతో ముఖ్యులకు ఆ ‘ప్లక్కార్డ్’ పంపిణీ చేశారు. వచ్చిన వారిని జట్లుగా విడగొట్టి జట్టులోని ముఖ్యులకి ఆ
‘ప్లక్కార్డు’  ని పట్టుకోవాలని రాధ, బృంద సూచనలు ఇచ్చారు. వారిని గుంపుల వారి చేసి అందులో దృఢంగా ఉన్నవారికి ‘ ఫ్లక్కార్డ్’ ఇచ్చి ముందు వరుసలో నుంచో పెట్టారు.

                                       సశేషం

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పరస్పరం

రమక్కతో ముచ్చట్లు -40