నోరారా పాడుకుందాం…

2026 అక్టోబర్ తరుణి సంపాదకీయం

           ఆదిమానవుల నుండి ఆధునిక మానవుల వరకు తనలో అంతర్లీనంగా నిబిడీకృతమైన భావాలను పాట రూపంలో రాగాలు తీసిన చరిత్ర అందరికీ తెలుసు . పాట రచయిత తానే అయితే సరే.. తాను కాకున్నా ఈ గీతంలో ని అక్షరాక్షరం తానే అయ్యి,  పాటను రాగ భావ తాళయుక్తంగా పాడితే   శ్రవణానందంగా ఉంటుంది. అలాంటి పాట ఏంటో, ఈ పాటల విశేషాలేమిటో దృష్టి సారిస్తే…..

      ఇది పండుగల కాలం… సంబరాల కాలం. ప్రకృతి సంబంధం, మనుషుల సంబంధం. తెలంగాణ ఆత్మగౌరవానికి సాంస్కృతిక ఆరాధనకు పూల పండుగ గా “బతుకమ్మ” ను  ప్రత్యేకంగా చెప్పుకునే కాలం . భాద్రపద మాసం లో   శుద్ధ పాడ్యమి కి ముందు వచ్చే అమావాస్య నుండి అష్టమి వరకు తొమ్మిది రోజుల పూల పండుగ జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. శరత్ ఋతువు మొదలయ్యే సమయంలో వానా కాలం ముగిసి,  ప్రకృతి అంతా పచ్చదనంతో కళకళలాడే ఈ సమయంలో ఆడవాళ్ళంతా బతుకమ్మను పాటలతో కొలవడం ఇక్కడి సంస్కృతి .

       సాధారణంగా పూలతో దేవుళ్లకు పూజలు చేస్తే ఇక్కడ పూలనే దేవుడిగా భావించడం గమనిస్తాం. తంగేడు పువ్వు, గునుగు పువ్వు, బంతులు చేమంతులు, కట్ల పూలు, రుద్రాక్ష పూలు, సీత జడ పూలు, గుమ్మడి పూలు ఇలా అన్ని పూలూ దేవతా రూపం ఎత్తుతాయి. సిబ్బి పైన, తాంబాళం పైననో  వలయాకారంలో , గోపురం లా పూలను పేరుస్తారు. శక్తిని బట్టి ఎత్తుగా పేరుస్తూ తలకెత్తుకొని గుడి ముందో, చెరువు పక్కననో  బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో కొలిచే  పండుగ.  సద్దుల నాడు ముగిస్తుంది . ఈ బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్ర పండుగగా నిర్ణయించారు. ఉదయాన్నే పసుపు తో  గౌరమ్మకు పూజ చేసి సాయంత్రం పేర్చుకున్న బతుకమ్మల మధ్యన గౌరమ్మలను పెట్టి సద్దులు చేసుకునే ఆడవాళ్ళంతా చక్కగా తయారై,  చెరువుగట్టుకు వెళ్లి అందరూ ఒక్కచోట చేరి బతుకమ్మలు పెట్టి,  చుట్టూ తిరుగుతూ లయబద్దంగా చప్పట్లు కొడుతూ పాట పాడుతూ …ఆడుతూ పాడుతూ… అడుగులేస్తూ సాగే బతుకమ్మ పండుగ ఈనాటిది కాదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న పండుగ .

    బతుకమ్మ పండుగ అస్తిత్వానికి ప్రతీక! కొంత విషయాన్ని పునఃశ్చరణ చేసుకుందాం …

బతుకమ్మ ను ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలుస్తాం. గౌరమ్మను పార్వతీదేవికి చిహ్నంగా లక్ష్మీదేవికి చిహ్నంగా పాటను సరస్వతీదేవికి చిహ్నంగా కొలుస్తాం. పార్వతి ధైర్యానికి ప్రతీక పువ్వులు  సంపదకు ప్రతీక, అంటే లక్ష్మీదేవికి ప్రతీక. పాటలు దాగిన అక్షర జ్ఞానం సాహిత్య సంపద సరస్వతి దేవికి ప్రతీక. ఈ తాత్వికతను ఒడిసి పట్టుకున్న తెలంగాణ పల్లె ప్రజలు జానపద సాహిత్యంతో బతుకమ్మను బతుకు నిచ్చే అమ్మగా కొలుస్తారు.

 ఆ అమ్మవారి అండదండలు ఉన్నా, ఆ  బృహదేశ్వరి మాత అండదండలున్నా తెలంగాణ ఆడపడుచుల గుండెల్లో పాటగా కొలువైన మాట !  రాజేశ్వరి బృహదీశ్వరి మాతనే బతుకమ్మ అయ్యిందని గాథ ఉన్నది. వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతీదేవి నుంచి వేరుచేసి తంజావూరు

తీసుకువెళ్లిన ఆ కథను గుర్తు చేసుకుంటూ పాడే పాటలే బతుకమ్మ పాటలు అని ఒక కథనం ఉంది. దుర్గాదేవిని బతుకమ్మ కన్నా ముందు బొడ్డెమ్మగా చేసి పూజించే ఆనవాయితీ ఉంది. కన్నె పిల్లలు చేసే ఈ పండుగ  కూడా పాట తో పూజించే ఆచారమే …

“బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో

బిడ్డాలెందారే వలలో”  అని సంతానానికి ఉండే ప్రాముఖ్యతను గుర్తిస్తూ పాడే బొడ్డెమ్మ పండుగ

“తొమ్మిది రోజులు ఉయ్యాలో …

నమ్మిక తోడను ఉయ్యాలో” అంటూ పాటలు పాడి పూజలు చేసే ఆడపిల్లలు, ఆడవాళ్లు  జానపదుల ఆచారాన్ని అనాదిగా కొనసాగిస్తున్నారు. మట్టితో తయారు చేసే బొడ్డెమ్మ పండుగ, పూలతో తయారుచేసే బతుకమ్మ పండుగ ఇట్లా గాన గుచ్ఛంగా, సంగీత నాదం లా  ఒక గొప్ప సంస్కృతికి సాక్ష్యాలు గా నిలిచాయి.

   బతుకమ్మ తర్వాత వచ్చే దసరా పండుగ విశేషంగా జరుపుకునే పండుగ. ఆడబిడ్డల ను పుట్టింటికి ఆహ్వానించుకునే ఆచారం ఈ ప్రాంతంలో ఉన్నది. జీవితానికి అత్యంత విలువ ఇచ్చే పండుగగా బతుకు అమ్మ అంటూ మాతృత్వానికి

చిహ్నంగా సహజ సిద్ధమైన పూలతో కొలవడం పెద్ద బతుకమ్మ పండగ వరకు ఎంతో గొప్ప సంస్కృతిని నేర్పించే పండుగ ఇది. అయితే , ఈ పూలను పాటలతో కొలవడం ఈ పాటలకు అర్థవంతమైన చరిత్ర, కథ.. ఉండడం విశిష్టమైన విషయం . జానపద కథ ఉంది అలాగే పౌరాణిక కథ ఉంది. రెండు కథలలోను బతుకమ్మ అంటె బతుకును ఇచ్చే అమ్మగా వెలిసిన మూర్తి గా చెప్పే కథనే ఉంది.

     సాహిత్యం మనుషులకు జ్ఞానాన్ని, ఆనందాన్ని , విజ్ఞానాన్ని, మంచితనాన్ని నేర్పిస్తుంది . పాటలుగా, గేయాలుగా, పద్యాలుగా, వచన కవిత్వం  గా  ప్రజలను అలరించాయి.  కథలుగా, నవలలుగా, కల్పిత  సాహిత్యంగా వెలుగు చూస్తాయి.   కల్పనేతర సాహిత్యమైన జీవిత చరిత్రలు, ఆత్మకథలు , చరిత్ర వంటివిగా ప్రాముఖ్యతను సంతరించుకున్నవి ఎన్నో అంశాలు ఉన్నాయి. సంస్కృతికి ఆధారమైన సజీవ వారసత్వాన్ని తరతరాలకు అందించే అక్షర తేజస్సే సాహిత్యం. మనిషి వ్యక్తిత్వ వికాసానికి మూలం. మంచి దిశగా ఆలోచింపజేస్తూ నైతిక విలువలతో తీర్చిదిద్దడానికి, భాషా వికాసాన్ని కలగజేయడానికి సాహితీ సంపద చేసే మేలు ఎంతో గొప్పది. ఇవన్నీ బతుకమ్మ పండుగలో ఉన్నాయి.

పాట ఒక శక్తివంతమైన శబ్ద సాధనం. బతుకమ్మ పాటలు గొంతెత్తి పాడుతారు. పాడేప్పడు ఆటలాడుతారు. ఉయ్యాలలు వంగడం, కోలాటాలు వేయడము వంటి ఆటలూ ఉంటాయి. లయబద్దంగా కదులుతూ చప్పట్లు కొడితూ ఒంగుతూ లేస్తూ చేతులు చేతులు కలిపేస్తూ ,  కలవేస్తూ, అడుగుకు అడుగు అవుతూ బతుకమ్మ పాట ఆటకు పోటీ.. మాట కు పోటి, పాటకు ఆట పోటీ.

 గొప్ప స్వర జ్ఞానం లేని వాళ్ళకి కూడా ఈ బతుకమ్మ పాట లు వస్తాయి, గళమెత్తి పాడుతారు. ఎవ్వరి ముందు మాట్లాడడానికి  ఇష్టపడని ఆడవాళ్లు కూడా ఈ బతుకమ్మ పాట లు పాడుతారు. ఇది ఇక్కడ విశేషం. ఇందులోని రహ‌స్యం ఏంటో ఎవ్వరికీ తెలియదు. పాటతో ఆకాశానికి అభిముఖంగా ఎగిరే విహంగాలవుతారు ఆడవాళ్లు . నీటిలో ఈదే చేపపిల్ల ల్లా  పాట సంద్రాన్ని ఈదుతారు ఆడవాళ్లు. నేలమ్మ నవ్వుతూ ఆడమన్నంతసేపు నెమళ్ళవుతారు ఆడవాళ్లు.

ఏ ఆధిపత్యం ఏ అధికారం కట్టెయ్యలేదు ఈ బతుకమ్మ పాటలను.  బతుకమ్మ పాట పాడే బతుకమ్మ ఆట ఆడే పిల్లలను, జీవితబడి పిల్లలను. బతుకమ్మ స్త్రీల ను స్వేచ్ఛ గా పాడుకొమ్మంటుంది. బతుకమ్మ పాట స్త్రీలను స్వేచ్ఛగా ఆడుకోమంటుంది. అయితే కాలం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది ఈ పరీక్షల్లో నెగ్గాలంటే సమాజం ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి alert గా ఉండాలి.  Fashion world అనే ఈ ఆధునిక ప్రపంచం బతుకమ్మ పాటల సంపదను కుదేలు చేస్తున్నది.

  నోటి నిండా ఇష్టంగా పాడుకునే ఆడుకునే బతుకమ్మ పాటలోని పద సంపద వినపడకుండా  డి.జె . సౌండ్ అడ్డుకట్ట అవుతున్నది. ఒకళ్ళు చెబితే అందరూ తిరిగి చెప్పడం అనే ఒక గొప్ప కళ. ఈ చక్కని సామూహిక గానకళ అంతరించిపోతున్నది ఇప్పటికే చాలా నష్టం చేసింది. డిజె సౌండ్ ఇచ్చిన పాటలు కూడా బతుకమ్మ పాటలే!  ఒకప్పుడు నో రారా పాడుకున్న పాటలే ! కానీ,  ప్రస్తుతం  ఆడపిల్లలు ఈ పాటలను పాడలేకపోతున్నారు. మ్యూజిక్ లో ఆ సంగీత ఝరి హోరు లో ఓలలాడుతూ మైమరచిపోయి నృత్యాలు చేస్తున్నారు . యువతను పట్టడం ఈ కాలంలో సాధ్యమయ్యే పని కాదు !

   యువతకి ఈ పాటల లోని విశిష్టత అర్థం కావాలన్నా, తిరిగి పాడగలగాలన్న ఎంతో కొంత శ్రమ పడవలసిందే!  దీనికోసం ఒక ఉద్యమం చేయవలసిందే ! ఈ ఉద్యమం స్త్రీలు చేయాల్సిన ఉద్యమమే కాదు. సమస్త జనులు ఆలోచించి, పాట అనే గొప్ప సంపదను పోగొట్టుకోవద్దు అనే ఆలోచనతో ముందుకు సాగి ఉద్యమం చేయాలి.

ఇళ్లల్లో  ముత్తాతమ్మలు , తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు ,అమ్మలు ,మేనత్తలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు , అక్కయ్య లు అంతా అంతా మేల్కోవాలి ఈ అన్యాయాన్ని ఖండించాలి.

         తాతలు నాన్నలు, పెదనాన్నలు, చిన్నాన్న లు, మేనమామలు, అన్నలు అందరూ కూడా పాటను మరుగున పడిపోకుండా కాపాడాల్సిన ఈ యజ్ఞంలో పాల్గొనాలి. ఈ పాటలు కేవలం ఆడపిల్లల పాటలే కాదు!  సమస్త జీవులకు సంబంధించిన పాటలు!!  కాబట్టి అందరమూ పాల్గొని ఈ తరం అమ్మాయిలకు జ్ఞాన బోధన చేసి, ముందు తరాల వాళ్లకు ఈ మౌఖిక సాహిత్యం అందుబాటులోకి వచ్చేలా చేయాలి.  పుస్తకాలు వచ్చాయి సి.డీ.లు వచ్చాయి, సెల్ఫోన్లలో మోగుతున్నాయి ,యూట్యూబ్ లలో చెలరేగిపోతున్నాయి.. ఇంకేంటి ? అని అనుకోకండి! ఈ శబ్దాలలో నిక్షిప్తమైన ఈ బతుకమ్మ అద్భుత సాహిత్యం మన నోళ్ళల్లో ఆటలాడాలి. మన గుండెల్లో ఎలుగెత్తాలి !!

     అవి మన హృదయంలో నుంచి , మన నోటిలో నుండి రావాలి. అప్పుడే బతుకమ్మ పాటకు ఆటకు సార్థకత ఏర్పడుతుంది . బతుకమ్మ అంటే ఏదో సినిమాల్లో ఒక డాన్స్ చేసినట్టు సినిమాలోని ఒక పాట పాడినట్టు కాదు. ఇది జీవితాన్ని సమకాలీనతను అల్లుకొని  అక్షరమైన గీతాలు .

      పాట పాడితే ఏమొస్తుంది ? ఏమొస్తుందో చెప్పండి ! పాట పాడితే శ్రవణ శక్తి పెరుగుతుంది. ధారణ శక్తి పెరుగుతుంది . మౌఖికశక్తి పెరుగుతుంది. వీటితో మెదడు ఎప్పుడు చురుకుగా ఉంటుంది.

యోగా చెయ్యమని, ధ్యానం చేయమని, మెడిటేషన్ చేయమని వీటి ద్వారా మీ ఒత్తిళ్లు తగ్గిపోయి మీ మెదడు ప్రశాంతంగా చురుగ్గా ఉంటుందని ఇప్పుడు చెబుతున్నారే ….ఇవి అన్ని ఏవి అక్కర్లేకుండా బతుకమ్మ పాటలతోనే  ఆ కాలంలో వాళ్ళ మెదళ్ళు చురుకుగా ఉండేది .  ఈ పాటలలోని సాహిత్య సౌందర్యం, భాషా సౌందర్యం, భావ సౌందర్యం మెదడు కణాలు దెబ్బతినకుండా  చేస్తుంది. మెదడుకు రక్తప్రసరణ బాగా పెరిగి  జ్ఞాపకశక్తి పెంపొందేలా , మరింత బలోపేతం అయ్యేలా దోహదపడుతుంది . ఒకటి నేర్చుకుంటే మరొకటి నేర్చుకోవడం సులభం  అని చెప్పే సిద్ధాంతం పైన ఆలోచిస్తే కొత్త నైపుణ్యాలు భాషాప్రావీణ్యం అబ్బడం వంటివి ఎన్నో మెదడుకు వ్యాయామం లా  పనిచేస్తాయి ఈ బతుకమ్మ పాటలు .

            బతుకమ్మ పాట వలన మెదడుకు ఎలా వ్యాయామం జరిగి ప్రశాంతమైన నిద్ర కలుగుతుందో శారీరక వ్యాయామం కూడా బతుకమ్మ ఆట వలన కలుగుతుంది. ఒత్తిడి నివారించే సాధనమౌతుంది. ఉల్లాసంగా ఉంచే ఔషధమూ అవుతుంది.

 మతిమరుపు తొందరగా రాదు. బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది . ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఈ కొత్త కొత్త వ్యాయామాలన్నీ ఆనాటి ఆటపాటలలో ఉండేవి అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు .

బతుకమ్మ పాటలు పాడితే ఇన్ని ఉంటాయా!  అని ఆశ్చర్యపోకండి !! అవును ఇన్ని ఉన్నాయి !!!! ఈ

పాటలలోని భావాన్ని అర్థం చేసుకుంటారు ఈ పాటల్లోని పదాలను గుర్తు చేసుకుంటారు. మరి ఈ కాలం పిల్లలకు ఉన్న ఇన్నేసి ఒత్తిడిలను చూస్తే బ్రెయిన్ యాక్టివ్ గా లేదంటూ, ఆంగ్సైటి ఎక్కువైపోయిందని భయపడుతూ, విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నాము కాస్త రిలాక్స్ కావాలి అని అనుకుంటూ ఎన్నో మాటలు చెబుతున్నారు.  నేర్చుకునే తత్వం వల్ల ఇవన్నీ ఈ బాధలన్నీ కూడా పోతాయి.  స్వేచ్ఛగా ఇష్టంగా ఎలుగెత్తి పాటలు పాడితే Neuroplasticity improve అవుతుంది . బ్రెయిన్ చురుకుగా ఉంటుంది. నలుగురితో కలిసి ఆట ఆడుతూ బతుకమ్మ పాట పాడుతూ ఉంటే ఒంటరితనం తగ్గుతుంది నెగెటివిటీ అనేది దూరమవుతుంది . మానసిక విశ్రాంతి దొరుకుతుంది. బ్రెయిన్ హెల్త్ బాగుంటేనే కదా బాడీ హెల్త్ బాగుండేది. ఇవన్నీ ఇప్పుడు ఆధునిక వైద్యులు చెప్పిన విషయాలు కాదు ఆ రోజుల్లో ఇళ్లల్లో నేర్చుకుని ఆ నోట ఈ నోట విని పాడుకొని గుర్తు చేసుకుని మెదడు అనే పుస్తకంలో దాచుకొని పాడిన పాటలు ఇవన్నీ !!

ఖచ్చితత్వమూ  అలవాటవుతుంది . ఏ పిచ్చి విషయాల ప్రభావానికి  లోను కారు.

అందరూ కలిసి  అలా గొంతెత్తి రాగయుక్తంగా పాడడం వల్ల మెదడుకు సంతోషాన్ని ఇచ్చే ఎండార్పిన్స్ అనే హార్మోన్లు విడుదలై ,మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలసట కూడా మటుమాయమైపోతుంది. ఇది ఒక గొప్ప బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వంటిది . అంటే, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది . పాటను తప్పులు లేకుండా ,భావ దోషం లేకుండా చక్కగా పాడడం అనేది అలవాటయితే తెలివి పెరుగుతుంది. గట్టిగా పాడడం వలన శ్వాసక్రియ మెరుగవుతుంది .

పాటల వరస ఏది? ఏ వాక్యం తర్వాత ఏది వస్తుంది దేని తర్వాతే ఏది వస్తుందని గుర్తు చేసుకోవడం, పదాలను గుర్తుంచుకొని లయ బద్ధంగా పాడడం వలన ఏకాగ్రత పెరుగుతుంది . జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ముఖ్యంగా బతుకమ్మ పాటలు ప్రకృతిని,కుటుంబ వ్యవస్థను ఏకం చేసేటువంటివి జానపద సంపదగా మనకు అందినవి .  ఈ అందిన సాహిత్య సంపద తర్వాత తరాలకు అందించాలి . దానివల్ల సంస్కృతి కాపాడబడుతుంది. ప్రకృతినే గౌరమ్మగా అనుకొని పూజించే ఈ పండుగ అటు చెరువులను, ఇటు మైదానాలను పచ్చని వనాలను చేస్తుంది. ఈ సమస్త పండుగ వాతావరణం ప్రకృతికే కృతజ్ఞతగా ఉండడమే కాదు, సమ సమాజానికే కృతజ్ఞతగా ఉండేలా చేస్తుంది.

     బతుకమ్మ చరిత్ర తెలుసుకోవాలి బతుకమ్మ లోని నిర్దిష్టమైన పాటల సాహిత్యాన్ని Lyrics నూ సంపూర్ణంగా తెలుసుకోవాలి. అప్పుడే బతుకమ్మ పండుగ ప్రయోజనం నెరవేరుతుంది .

ఎన్ని రకాల పాటలు? ఎన్ని రకాల భావాలు? అవేంటో చూద్దామా….

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ..ఏమేమి కాయొప్పునే గౌరమ్మ… కట్లాయిపువ్వొప్పునే గౌరమ్మ… కట్లాయి కాయొప్పునే గౌరమ్మ …

కట్లయి పువ్వుల్ల ఆటచిలుకల్లారా ….

పాట చిలుకల్లారా…. కలికి చిలుకల్లారా…” అంటూ సాగే ఈ ఒక్క పాట చాలు ప్రకృతి ప్రణయమంతా లీనమై ఉంటాయి. ఇట్లా ప్రకృతితో ముడిపడిన బతుకమ్మ పాటల లో మైదానాలలో అడవులలో దొరికే రంగు రంగుల పూలు , పండ్లు ,చెట్లు అన్ని

అక్షర సంపదగా వచ్చిపోతుంటాయి . ఎండలు, వెన్నెలలు , వానలు , వంకలు వచ్చి పోతుంటాయి.ఇక,

“కలవారి కోడలు ఉయ్యాలో… కలికి మహాలక్ష్మీ ఉయ్యాలో…”  ఈ పాట వింటే అత్తగారింట్లో ఆడపిల్లల కష్టాలు అని చెప్పుదామా ? లేకుంటే ఆడపిల్లలకు పుట్టింటి పై ఉన్న మమకారానికి ఉదాహరణగా చెప్పుదామా?  కాదు! ఇలా చూసే కన్నా ముందు  క్షేమం గురించి చెబుతున్నాయేమో ఈ పాటలు కూడా అనిపిస్తాయి . ఎందుకంటే.,ఇప్పుడు ఎక్కడ చూడూ ఆడవాళ్లను అత్యాచారాలకు గురి చేస్తూ, ఒంటరిగా నడవలేని పరిస్థితులను తీసుకువచ్చిన ఈ అ’ సభ్య సమాజంలో ఉన్న కష్టాలను చూస్తున్నాం కదా ! ఇవి, ఈ దాష్టీకాలను ముందే ఊహించి ఉంటారేమో ఆనాటి జానపదులు!! ఇంట్లోంచి బయటికి వెళ్లేప్పుడు అందరికీ చెప్పి, అందరిని అడిగి పుట్టింటికి వెళ్ళమ్మా అని చెప్పడం, ఆ తర్వాత  ఆమె భర్త  తన భార్య ను క్షేమంగా తిరిగి మళ్ళీ మా దగ్గరికి రామ్మా అని చెప్పడం చూస్తాం. భద్రత అనేది  ముఖ్యమనే ఎవరో ఒక తోడుతోనే పంపించడం అనేది చూస్తాం.

“శ్రీ లక్ష్మీదేవివై చందమామ సృష్టి బ్రతుకమ్మ వై చందమామ … పుట్టినా రీతి జెప్పె చందమామ….” అనే పాటల వంటివి బతుకమ్మ చరిత్రకు సంబంధించిన పాటలు ఉంటాయి.

“రామ రామ ఉయ్యాలో… రామనందనలాల… ఉయ్యాలో ..” వంటి పౌరాణిక గాథలను తెలిపే పాటలు ఉంటాయి. ఇలా ఎన్ని పాటలు ? అమ్మాయిని అత్తవారింటికి పంపేప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతారు తల్లితండ్రులు . బతుకమ్మను సాగనంపే పాటలో మనమివి  చూడవచ్చు. హాస్యస్పోరకమైన పాటలు ,శృంగార భరితమైన పాటలు, తత్వాలను చెప్పే పాటలు ,మానవ తత్వాలను చెప్పే పాటలు, సామాజిక కుటుంబ సంబంధాల విషయాలపై పాటలు ఇట్లా ఎన్ని పాటలు?

“ఆకాశము నందూ  వలలో.. అల్లన మేఘములూ వలలో .. మేఘములా నడుమ వలలో … మేలైనా కాంతి వలలో… ” అనే పాటలోని లయబద్ధతను శ్రవణానందంగా ఉన్న రీతిని చూస్తాం. “పసుపుల పుట్టే గౌరమ్మా… పసుపుల పెరిగే గౌరమ్మా… పొన్నాగంటి పూలు… పోకల వంటి వనమూ ….వనమున చిలుకలు ఆడే గౌరీ వాడంతా మురిసే ….” Beautiful , melodious Rhythm నూ చూస్తాం. ఇటువంటి పాటలలో స్త్రీ హృదయ సౌందర్యాన్ని చూస్తాం ఈ బతుకమ్మ పాట ల్లో తెలుగు భాష వైశిష్ట్యాన్ని, సంగీత లయ ప్రధానమైనటువంటి భావ లయనూ చూస్తాం.

మరి ఇంకేం ? మరి ఇంకేం కావాలి ? ఇంత గొప్ప పద్ధతులు, విధానాలు ఈ బతుకమ్మ పాటల లో నిక్షిప్తమై ఉన్నాయి కదా! వీటిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం ? అతి పెద్దగా వినిపించే  లౌడ్ స్పీకర్ సౌండ్ లలో ఈ పాటలు మరుగున పడిపోవద్దు.  ఎన్ని కొత్త కొత్త పదాలనో తెలుసుకోవచ్చు. వాటి అర్థాలను కనుక్కొని అర్థాలు, పరమార్థాలూ తెలుసుకోవచ్చు,  Synonymous .. అంటే సమానార్ధక పదాలను తెలుసుకోవచ్చు తెలివిని పెంచుకోవచ్చు. భాషా జ్ఞానం పెరుగుతుంది. ఒక భాష వస్తే మిగతా భాషలూ సులభంగా వస్తాయి అనే జ్ఞానాన్ని అందిపుచ్చుకోండి.  అందుకే  బతుకమ్మ పాటలను వినండి, రాసుకోండి, నేర్చుకోండి , పాడండి!

  బతుకమ్మ పాటల లోని సౌందర్యాన్ని అనుభూతి చెందండి . డీజే చప్పుడులలో ఆటలాడుతూ బతుకమ్మను కొలిచినా గాని, ఆ ఆటలతో పాటు ఈ  పాటలనూ పాడండి. పాడుతూ ఆడండి! చమక్కున మెరిసే పదాల అర్థాలను తెలుసుకోండి . పాటను నోరార పాడండి …. బతుకమ్మ పాటలను నోరార పాడండి!! నోరారా పాడండి!!

____***___

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జంతర్ మంతర్ – కొత్త అక్షరాల పాఠశాల

“అమ్మా! నన్ను క్షమించవా!”