బంగారు కలలు కనమని భవిష్యత్తుకి ఏం చెప్పగలం? సాధించిన విజయాలలో ఛేదించిన సత్యాలు ఎన్ని? రాకెట్లు కనుక్కున్నారు, చంద్రమండలం పైన దిగారు , సబ్మెరైన్స్ నడుపుతున్నారు, దేశ దేశాలు దాటుతున్నారు. నేల ఉన్నంతవరకు రహదారులు నిర్మిస్తూ రయ్ రయ్ మంటూ నాలుగు చక్రాల పై పరుగులెడుతున్నారు. ఇన్ని కనుక్కున్నా చాన్నాళ్ల వరకు ఆడవాళ్ల ఆరోగ్యానికి ముఖ్యమైన బహిష్టు విషయాన్ని, గర్భం విషయాన్నీ పట్టించుకోలేదీ ప్రపంచం. ఈ మాటలను చర్చించడానికి సిగ్గుపడినటువంటి సమాజం ఇది. సైన్స్ ను సెన్స్ ఫుల్ గా ఇన్వెంట్ చేసిన సైంటిస్టులు సైతం , ప్రతి నెలా అన్వాంటెడ్ విషయమైనా తప్పనిసరిగా భరించే స్త్రీ ల ఇబ్బంది ని ఎవరు గుర్తించలేదు. ఇంతగా ప్రజాస్వామ్యం అని మాట్లాడే దేశాలలో కూడా , తెలివైన వాళ్ళం అని గొప్పలు చెప్పుకునే దేశాలలో కూడా ఎలక్షన్స్ అనేవి ఆచరణలోకి వచ్చిన చాలా ఏళ్ల వరకు ఆడవాళ్లకు ఓటు హక్కును కల్పించలేదు . అటువంటిది స్త్రీ ల శారీరక ఇబ్బందిని కుటుంబ ఇబ్బందిగా ఎవరైనా ఆలోచించారా ? లేదు!
ఎన్నైనా చేయగలరు కానీ సహజ సిద్ధంగా గర్భం నుండి పిండం వచ్చే మహా కష్టానికి న్యాయం చేయలేకపోతున్నారు. రోబోట్స్ కనుక్కుంటారు, కృత్రిమ పిండాలను తయారు చేస్తారు, మనుషుల్ని పుట్టిస్తారు అనే మాయమాటలతో మనిషి తత్వాన్ని హననం చేస్తున్నారు. ప్రేమ ఆప్యాయత ఆనందము సంతోషము వంటి భావాలను కొనుక్కొచుకునే ఆటోమేటిక్ యంత్రాలను ఏమైనా కనుక్కుంటారేమో అని కూడా ఆశపడే జీవులు లేకపోలేదు ఈ భూమి మీద! ఎంత సాంకేతికత పెరుగుతుంటే ఎంత యాంత్రికత పెరుగుతుంటే అంతగా విలువలు హరించకపోతున్నాయి అన్న జ్ఞానం లేకనా? కాదు! అన్నీ తెలుసనే అహంభావం, పురుషాధిపత్యం అనేవి చికిత్స చేయలేని జబ్బులు అయికూర్చున్నాయి. లేకుంటే ఇదేంటి ఇంత అన్యాయమా? ఈ కాలంలో కూడా ఆడవాళ్లు తల్లి అవుతున్న నేపథ్యాన్ని పరిశీలిస్తే ఎన్నెన్నో కొత్త అంశాలు బయటపడుతున్నాయి.
గర్భం దాల్చిన తొలిదశ ఇబ్బందులు కొన్నైతే డెలివరీ అప్పుడు కొన్ని . ప్రెగ్నెన్సీ వచ్చిన మొదట్లో శారీరక శక్తి తగ్గుతుంది బలహీనతగా ఉంటుంది చేతకాదు. ఇన్ని బాధలను పడుతూ ఒక స్త్రీ మరొక శిశువుకు జన్మనిస్తుంది. ఆ శిశువు వాళ్ల కుటుంబ వారసత్వానికి చిరునామా అని తెలిసి కూడా స్త్రీల విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉండడం చాలా మంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. పోషక విలువలతో ఉండే మంచి ఆహారం ఆమెకు అందజేయాలని ఆలోచన ఉండదు ఎవరికీ నూ! అందరి కోసం వంట చేస్తూ అందులో తాను తినాలి. ఇది ఎక్కడి న్యాయం? తినబుద్ధి కాకుండా వున్నా కూడా కడుపులో ఉన్న పిండానికి ఆహారం అందించాలి కాబట్టి తప్పనిసరిగా తింటుంది ఆ స్త్రీ .ఆమెకి నచ్చిన వంటకం ఏంటో చేసి పెట్టాలి అనే స్పృహ ఇంట్లో ఎవరికి ఉండదు. చాలా సాధారణంగా భావిస్తారు. ఇది అసత్యం కాదు. మనం చాలా మందిని చూస్తుంటాం. కానీ నిజాన్ని ఒప్పుకోవడానికి ఎవరు ముందుకు రారు.
ఈ మధ్యకాలంలో యువతలో కొంత మార్పు వచ్చింది. కానీ ఇంకా రావాలి. అందరిలో కూడా రావాలి. దీన్ని ఒక ఉద్యమంగా చేస్తే కానీ సాధ్యమవుతుంది. ఎవరైనా మాట్లాడితే స్త్రీవాదులు విప్లవవాదులు అంటూ ఒక ముద్ర వేసేస్తున్నారు. స్త్రీవాదం అంటే ఏమిటి? స్త్రీకి కావలసిన హక్కులను గురించి మాట్లాడటం తప్పంటారా? హక్కుల విషయాన్నీ పక్కన పెడితే ఇటువంటి ముఖ్యమైన విషయంలో కూడా ఆమెకి ప్రేమను ఆప్యాయతను అందించకుండా ఉండడము న్యాయమంటారా? ఇదే కదా స్త్రీవాదులు అడుగుతున్నది! అమ్మో అని ఒక ముద్ర వేసినటువంటి తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. కవయిత్రులు రచయిత్రులు ఇవే కదా అడిగినవి? ఇంతకన్నా ఇంకా ఏమైనా ఎక్కువ అడిగారా? ప్రెగ్నెన్సీ డెలివరీ ఈ రెండు విషయాల్లో శ్రద్ధ వహించడం లేదని కవితాత్మకంగా రాశారు కాస్త ఘాటుగా రాశారు అంతే! అది కూడా కొందరే రాశారు . అయినా కూడా దాన్ని కూడా భరించలేని మనస్తత్వం ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఉన్నదంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకేమైనా ఉందా?
ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన శిశువు వృద్ధి అవుతుంది అనే కనీస జ్ఞానం లేకుండా ఉన్నారా? తెలిసినా కూడా అహంభావమనేది అడ్డువచ్చి విసుగును చిరాకును ప్రదర్శిస్తుంటారు.
ఇక్కడ ఇంకో వింత విషయం ఏంటంటే అత్తగారి తోటి కోడలి పాత్రల్లో ఉండేవాళ్లు కూడా ఆడవాళ్లు అయ్యుండి కూడా వాళ్లు కూడా వ్యంగ్యంగా ఏదో ఒక చురక వేస్తూ మాట్లాడుతుంటారు. మా కాలంలో అయితే నా అనో…నాకైతే ఇలా కాదు అనో… ఒక విసురు విసురుతూనే ఉంటారు.ఇది న్యాయమా? ప్రముఖ స్త్రీవాదులు అంటున్న మాట ఏంటంటే ఇట్లా స్త్రీలు కూడా స్త్రీ లనే అనే విధంగా ప్రోద్బలం చేసిన జాతి ఎవరయ్యా అంటే పురుష జాతి ఈ పురుషాధిక్యతనే నడిపిస్తున్నది అని ! ఇది తప్పు , అది తప్పు అని రుజువు చేయాల్సిన బాధ్యత ఈ పురుష జాతి మీద లేదా? ఎలా ప్రూఫ్ చేస్తారు ? ప్రూఫ్ చేయడానికి అనేక మార్గాల్లో ముఖ్యమైన విషయం ఇళ్లల్లో భార్యను,కోడలు కూతురును సమస్త స్త్రీ జాతిలో ఉన్న వాళ్లు ఎవరైతే గర్భం దాల్చిన స్త్రీ లు ఉంటారో వాళ్ళని గౌరవిస్తూ సదుపాయాలను అందిస్తే ఇదే పెద్ద రుజువు. ఎలా చూపించాలి అంటారా ! మీరు ప్రయత్నించండి అదే తెలిసిపోతుంది. ప్రపంచం గుడ్డిది కాదు ఎక్కడైనా చూడగలుగుతుంది, మనసుపెట్టి చూడగలుగుతుంది . ఇది ఎవరు మర్చిపోవద్దు.
ఈ అత్యాధునిక యుగంలో ఎక్కడో కాస్త సౌకర్యాలు ఎక్కువైన చోట అది అందుకునే పరిస్థితిలో ఉన్న కుటుంబాలలో స్త్రీలు మాత్రమే జాగ్రత్తగా ప్రెగ్నెన్సీ ని కాపాడుకుంటున్నారు డెలివరీ అవుతున్నారు. మారుమూల గ్రామాలలోని స్త్రీల ఇబ్బందులు పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. దగ్గర్లో హాస్పిటల్స్ ఉండవు వైద్య సౌకర్యాలు ఉండవు. చిన్న చిన్న కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ‘నీళ్లాట’ అనే ప్రక్రియ అంటే డెలివరీ లలో ఎన్నో మరణాలను చూపిస్తుంది. కొన్నిచోట్ల శిశువు మరణాలు కొన్నిచోట్ల మాతృ మరణాలు వెరసి కష్టాలన్నీ స్త్రీల వే. కుటుంబ పరంగా భర్తకు కష్టం ఉండదా? అంటే …ఉంటుంది! ఉండదని అనడం లేదు. అది కుటుంబాన్ని ప్రేమించేవాళ్ళకు ఓ మానసికవ్యధ. స్త్రీలకు అటు మానసికంగా వేద ఇటు శారీరక వ్యధ.
ఇన్ని చట్టాలు వచ్చినా న్యాయానికి మొత్తం చుట్టాలు కావు. గృహహింసలకు అంతులేదు. ఏ చిన్న కారణం వచ్చినా ఎద్దేవా చేయడం అవమానపరచడం. వీటిని భరించలేకనే అమ్మాయిలు ఎదురు తిరుగుతున్నారు. సామరస్యపూరిత సంసారం పచ్చనిచ్చి గుళ్ళతో పువ్వులతో కాయలతో వెల్లివిరిసే మహా వృక్షం. పక్షసంతతికి జంతుసంతతికి మనుషులకు సహాయాన్నిచ్చే వృక్షం ఎటువంటిదో సద్భావనలతో స్వచ్ఛంగా ఉండే కుటుంబం అంతటిది.
పిల్లల్ని కనడానికి ఈ కాలం యువత ఎందుకు సిద్ధంగా లేదు ? అనే ఈ ప్రశ్న లోనే కుటుంబ సభ్యులు సమాధానాన్ని వెతుక్కోవాలి.
పట్నాలలో మాత్రమే సౌకర్యాలు , అది కూడా ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళకు మాత్రమే సులభం గా ఉండే పరిస్థితులు ఇప్పుడు.
ప్రెగ్నెన్సీలో ఆరోగ్యంగా ఉన్న స్త్రీకి మానసికంగా కూడా ఆరోగ్యాన్ని కలిగి ఉండేలాగా చూడాల్సిన బాధ్యత మొత్తం కుటుంబ సభ్యులదే. తల్లి ఆరోగ్యకరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన శిశువులు జన్మిస్తారు.
Womb , pregnancy , delivery, baby అనేవి “LIFE ” ను నిర్మస్తాయి. ఒక్కో లైఫ్ ప్రపంచాన్ని నిర్మిస్తుంది. మరి… జీవితాలను నిర్మించే ఆడవాళ్లు ఎప్పుడు గౌరవింపబడతారు? ఆడవాళ్లు మోసే గర్భం ఎప్పుడు గౌరవింపబడుతుంది?
_____****_____