పుస్తకం నీకో నమస్కారం

కవిత

(హైదరాబాద్ లో పుస్తకాల పండగ ముగియడం బాధగా ఉంది. వెళ్ళాలి, అందరిని కలవాలి అనే తాపత్రయంతో ఈ పది రోజులు ఉత్సాహంతో గడిచింది. అందుకే పుస్తకం ఏమనుకుంటుందో అనే భావనతో ఈ పంక్తులు కవితగా- విజయా రంగనాథమ్)
……..

ఉత్తుంగ తరంగాల జన జలధిని చూసి మురిసింది పుస్తకం
గుమ్మంలోనే రారమ్మని చేతులు చాచి పిలిచింది
తన అభిమానుల్ని కనులారా చూసి తృప్తి గా ఆనంద పడింది
తన సృష్టి కర్తలను చూసి ముచ్చటపడి నవ్వింది
అంతటా ఆనంద కోలాహలాల మధ్య
కావలసిన పుస్తకాల వెతుకులాట ను చూసి తల్లిలా నవ్వింది
పిల్లల పుస్తకాలు, ప్రేమ కథలు, నవలలు, కవితలు,
మత ప్రచారాల గ్రంథాలు, వ్యాసాలు… అబ్బో ఎన్నెన్నో…
తనను సృష్టించిన విజ్ఞాన ఘనులు కవులను రచయితలను
తనివితీరా చూస్తూ అభిమానం కురిపించింది
పుస్తకం చేసిన చుట్టాల పరిచయాలను,కరచాలనాలను,
ఆలింగనాలను చూసి సంతోషంతో తబ్బిబ్బయింది
పరిచయస్థుల వెతుకులాటల ప్రజల కన్నులను చూసి చలించింది
ఉపన్యాసాల సవ్వడి చిరు మువ్వల ధ్వనులుగా పులకించింది!
పది రోజుల పండుగను తనివితీరా ఆస్వాదించి పాఠకాభిమానుల ఇళ్ళకు చిరునవ్వులతో తరలింది!
పండుగ ముగిసిందని ..
తడి కన్నులతో మళ్ళీ వచ్చే ఏడు కలుస్తానంటూ వెళ్ళింది.
పుస్తకం నీకో నమస్కారం!

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇలాగన్నమాట!

“ఎంతదూరం”