మనమూ మన వినాయక చవితి

2026 సెప్టెంబర్  తరుణి పత్రిక సంపాదకీయం

మనం కాలంతో పాటు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా పండుగలు, జాతరలు, ఉత్సవాలను జరుపుకోవాలి . ఓ సరికొత్త దృక్పథం అవసరం. ప్రకృతి మనిషి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నది . జీవితం అనుభవాల మూట ఎట్లాగో, అట్లాగే అనుబంధాల మూట కూడా ! మాటలు ఎన్ని చెప్పినా మనసుకు నచ్చిన విధంగా చేయడం మనల్ని మనం మనంగా చూపించుకోవడం అనేది ఎంత ముఖ్యమో వినాయక చవితి పండుగ ఆధారంగా చూద్దాం… ఈ 2026లో సెప్టెంబర్ 14న వినాయక చవితి ఆధునిక కాలంలో వినాయక చవితిని జరుపుకునేప్పుడు ఎలాంటి చిన్న చిన్న కొత్త తరహా శైలిలో ఆచరించవచ్చు కొన్ని స్పృశించుకుందాం…. ఈమధ్య,  ఎకో ఫ్రెండ్లీ సెలబ్రేషన్స్ అని అంటున్నాము. అంటే పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితిని ఎలా జరుపుకుంటే బాగుంటుంది అని చర్చ వస్తున్న

సందర్భంలో… మట్టి వినాయకుల విగ్రహాల వాడకం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది.

     వినాయకులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పి.ఓ.పి. తో తయారు చేయడం, రసాయనాల రంగులతో చేసిన విగ్రహాల వల్ల జల కాలుష్యం పెరుగుతున్నది . అందుకొరకు సహజసిద్ధమైన మట్టి వినాయకులను అంటే క్లే ఐడల్స్ ప్రతిష్టించుకోవడము ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. వీటితోపాటు విగ్రహాలను విత్తనాలలో ఉంచి పండుగ తర్వాత ఆ ఇంట్లోనే కుండీలో అలాగే నిమజ్జనం చేసే సీడ్ గణేష్ మొక్కల పెంపకంతో చేసే, ట్రీ గణేష్ , మట్టి గణపతిని పూజించుకోవడం అవసరం. ఇది పర్యావరణ పరిరక్షణ అనే భావనను అలవర్చుకునేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ పండుగ చేసే ఉద్దేశ్యం లో  ఆడంబరాల కంటే కూడా సేవా భావం మిన్న అనేది తెలుసుకోవాలి. సామాజిక ఐక్యత సేవ అనేది ఒక మంచి  సందర్భంలో చేస్తే దానికి విశిష్టత వస్తుంది.

       ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి కాలనీవాసులను అడిగి నిధులను సేకరించి అవి  ” ఎకో వినాయకుని” దించడానికి ఉన్న వేదికను నిర్మించి మిగతా డబ్బులను మంచి కార్యక్రమానికి వినాయక చవితి

పేరున వినియోగిస్తే అంతకన్నా గొప్ప ఆధ్యాత్మిక భావన, అంతకన్నా గొప్ప సేవాభావము ఇంకొకటి ఉండదు. అనాధ  శరణాలయాలు ఉన్నాయి. వీటి నిర్వహకులకూ, అక్కడ చదువుకుంటున్న పిల్లలకి అవసరార్థం ఈ నిధులను వినియోగిస్తే వినాయకుడు నిజంగా సంతోషిస్తాడు.

    ఇకపోతే పెద్ద పెద్ద భారీ విగ్రహాలను తీసుకొచ్చి ఆ నవరాత్రి మంట పాలను నిర్మించి పెద్దపెద్ద డిజె సౌండ్ శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్నటువంటి ఈ విషయాన్ని కూడా ఒకసారి చర్చించుకోవాలి. ఇవే ముఖ్యమైన సామాజిక అంశాలు . మంటపాలలో విపరీతమైన లైట్స్ వెలుగులలో రకరకాల ఫ్లోరోసెంట్ రంగురంగుల లైట్స్ వెలుగులలో విద్యుత్ దీపాల సందళ్ళలో పెట్టవలసిన అవసరం లేదు. ఒక సభా మండపాన్ని నిర్మించి,  చిన్న మట్టి వినాయకుని పెట్టి ఆ కాలనీలో ఆ గృహ సముదాయాలు ఉన్న ఆ ప్రదేశంలో ఉన్న పిల్లలందరినీ పెద్దలను అందర్నీ విడతలవారీగా కూర్చోపెట్టి పూజలు నిర్వహించి సదస్సులను పెట్టితే మంచి ఫలితాలను తీసుకున్న వాళ్లు అవుతారు.  ప్రస్తుతం  ఉన్న సమస్యలపై దృష్టి పెట్టే విధంగా వాళ్లను ఆలోచింప చేయవచ్చు.

అయితే , స్పిరిచువల్ అండ్, మెంటల్ వెల్ బీయింగ్ అనేది ఎంతో అవసరం కాబట్టి, ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతత కోసం సభ మంటపానికి వచ్చిన పిల్లలను ఇటువంటి ఆలోచనలను కలుగజేయడానికి వినాయకుడి రూపాన్ని తీసుకొని నాయకత్వ లక్షణాలకు ఆపాదిస్తూ చెప్పడం చాలా మంచిది అవేంటో చూద్దాం. …

వినాయకుడికి పెద్దపెద్ద చెవులు ఉంటాయి కదా? అంటే అందరి మాటలను వినడానికి సూచనప్రాయంగా పెద్ద చెవులు – “వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక కని, కల్ల  నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలోసుమతి!”  అని ఎప్పుడో మనకి బద్దెన భూపాలుడు 13వ శతాబ్దంలోనే చెప్పాడు. ఇటువంటి ఈ పెద్ద చెవులు అనే విషయాన్ని పిల్లలకు ఇలా చెప్పాలి . ఇకపోతే, మరి వినాయకుడి నోరు ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది . చిన్న నోరు అనేది తక్కువ మాట్లాడడము అనే విషయానికి నిదర్శనం.  దీంట్లో ఏం కనిపిస్తోంది? తక్కువ మాట్లాడడం ఎక్కువ వినడము ఇవి జీవితంలో గొప్ప స్థానానికి వెళ్లడానికి మెట్ల వంటివి.

ఇక వినాయకుడికి పెద్ద పొట్ట ఉంటుంది. అంటే, ఎటువంటివి తిన్నా జీడినించుకోవడం అనేదాన్ని.. ఎటువంటివి విన్నా జీర్ణించుకోవడం అనేదానికి ఉదాహరణగా చెబుతూ మేనేజ్మెంట్ స్కిల్స్ కి అనుగుణంగా జీవిత నిర్వహణ నాయకత్వ లక్షణాలు పిల్లలకి నేర్పించాలి.

    ఇలా చేయడానికి ఎవరైతే వినాయకుల కొరకని ఈ ఉత్సవాన్ని జరపడానికని డబ్బులను సేకరిస్తారో ఆ గ్రూప్ లీడర్ నాయకుడు అతని కింద ఉన్న అనుచరులు సమిష్టి ప్రణాళికను వేసుకొని సమయమనంతో చేయాలి. మేం చెప్తే ఎవరు వింటారు ? ఇలాంటివి చేస్తే ఎవరు వస్తారు? పాటలు, డాన్సులు ఉంటే కదా అందర్నీ ఆకట్టుకోవచ్చు… అని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. ఏది కొత్తగా ఉంటే దాన్ని అనుకరిస్తారు. అని కొత్త కొత్త సినిమా పాటలను తెచ్చావనో,  అలా డాన్స్ ప్రోగ్రాం లో పెట్టడం వలననే గొప్ప వస్తుందని అనుకోవడం ఇది ఎంత వృధా ప్రయాస . వీటిపై ఉండే భ్రమలు పోగొట్టాలి.  అసలైన భక్తిని ఆత్మలో కలగ చేయడం అనేది ముఖ్య ఉద్దేశ్యం  కాబట్టి ఇటువంటి డిజిటల్ డిటెక్స్ వలన కాదు అనేది అలవర్చాలి.

    ఈ మార్పు వచ్చింది అనేది పిల్లలకి తెలియాలి, తెలిపాలి. ఈ బిజీ లైఫ్ లో సోషల్ మీడియాకు దూరంగా , కాసేపు కుటుంబ సభ్యులు అంతా కూర్చుని భగవంతుని విగ్రహానికి పూజ చేయడం అనేది ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ విషయాన్ని సభా వేదిక మంట పాల మీద చెప్పాలి.

    ఇకపోతే అసలు పండుగలు అనేవి మన సంప్రదాయానికి మనదైన విజ్ఞానానికి అంటే ట్రెడిషన్ అండ్ సైన్స్ ఈ రెండు ఉంటాయనేది వాళ్లకు నేర్పించాలి. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత ఉంది పండుగలో వాడే ప్రసాదాల విషయమైనా పూలు పండ్లు వంటి విషయాల్లో  అయినా ఎంతో విజ్ఞాన దాగి ఉంది అనేది ఈ తరం వాళ్లకు చెప్పాలి. అంటే వినాయక చవితిలో ప్రత్యేకంగా వినాయకుని పూజలో వాడే 21 రకాల ఆకులు ఏంటివి వాటి పేర్లు, దొరికిన వరకైనా …అన్నీ దొరకకున్నా ఎన్ని దొరికినవో అన్ని ఆకులను ఆ పత్రులను చూపిస్తూ వాటి విశిష్ట లక్షణాలను చెప్పాలి. ఇవి దేవుడికి ఎందుకు ఇష్టమైనవో దీన్ని బట్టి వాళ్ల కు అర్థమవుతుంది.

వర్షాకాలం కదా సెప్టెంబర్ నెల అంటే వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి రక్షించుకోవాలంటే గొప్ప ఔషధ గుణాలున్న ఈ ఆకులను పువ్వులను భగవంతుని విగ్రహం చుట్టుపడితే అక్కడ వచ్చే ఆ గాలి మనం పీల్చి మనం ఆరోగ్యంగా ఉంటాము . అందుకే ఈ ఆకులను ఈ పువ్వులను సమర్పిస్తున్నాము అని ఈనాటి తరం పిల్లలకి సైంటిఫిక్ రీసన్స్ తో చెప్పాలి. మామిడి ఆకు తోరణాలు కట్టడం వెనుక ఉన్న విశేషాన్ని చెప్పాలి  బిల్వపత్రం గరిక అంటే ధూర్వ  ఆకు , మాచి  పత్రి , తులసి,  జాజి పత్రి,  వావిలి, తెల్ల మద్ది,  ఉత్తరేణి , జిల్లేడు  వంటి ఇరవై ఒక్క రకాల ఆకులకు ఉన్న విశేష ప్రాధాన్యతను చెప్పాలి ఈ 11 రోజులు ప్రతిరోజు వేద శ్లోకాలు చదవడం ప్రార్థనలు చేయడము పూజలను నిర్వహించడం 11వ రోజున విగ్రహ నిమర్జనం కార్యక్రమానికి ముందు ఊరేగింపులు తీయడం ఇలా ప్రతి సంవత్సరం చేస్తుంటాం 1892 ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం హిందువుల సమావేశాలపై ఆంక్షలు విధించిన సందర్భంలో స్వాతంత్ర సమరయోధులు ప్రజల మద్దతుతో జాతీయ స్ఫూర్తిని రగిలించడానికి వినాయక చతుర్థి మహోత్సవాన్ని ప్రారంభించారు.

పూజా మందిరాలలో జరిగే ఈ పూజకు  సామూహికంగా నిర్వహిస్తే సామాజికపరమైన విషయంగా పర్యాలోకనంల్లోకి వచ్చి సార్వజనీనమైన ప్రాధాన్యత లభిస్తుంది అని ఆ రోజుల్లో ప్రారంభించిన ఉత్సవం ఇప్పటికీ నిర్వహించాల్సిన పరిస్థితులని గమనించాల్సి వస్తుంది .

    పర్యావరణహితంగా అలంకరించి, పచ్చని ఆకులు,  పూలు వాటి ప్రయోజనాలను చెప్పడానికి వినాయకుడి పండుగ అంత గొప్ప పండుగ మరొకటి లేదు. కదా ? చెబితే అన్నా తమ్ములైన  ఇద్దరు మధ్యన వచ్చిన పోటీ… అందులో గెలుపు , తల్లిదండ్రుల దీవెనలు అందుకోవడం   వంటివి కూడా చెప్పవచ్చు.

వినాయక చవితి ….అదేంటో చూద్దాం భాద్రపద మాసంలో శుక్లపక్షం నాడు చవితి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. ఎవరింట్లో వాళ్లు తొమ్మిది పది రోజులు పూజలను చేసి 11వ రోజున నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. వినాయకుడికి ఇష్టమైన మోదకాలు

కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహోర  వంటివి ఎట్లా చేస్తారు ఎందుకు చేస్తారు ఎంత సంఖ్యలో పెట్టాలి అనేవి కూడా పిల్లలకు నేర్పించాలి. ఎలక్కాయలు సీతాఫలాలు మొక్కజొన్నలు వంటి ప్రసాదాలు వినాయకుడికి ఇష్టం ఈ కాలంలో దొరికే పండ్లు కూరగాయలు సమర్పిస్తాం వినాయకుడిని ని జ్ఞానప్రదాతగా చెప్తారు. పురాణం కథ అనుసారం పార్వతి పరమేశ్వరుల కొడుకు వినాయకుడు. వినాయకుడి కథ అందరికీ తెలుసు గజాననుడిగా ఎలా పేరు తెచ్చుకున్నాడు ఇతని వాహనం ఏమిటి ఇతని తమ్ముడు ఎవరు అతని వాహనం ఏమిటి అందరికీ తెలుసు. గణాధిపతిగా ఎలా అయ్యాడో కథ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నీలా పని ఉందని ఎందుకు వస్తాయి శమంతమణి కథ ఎందుకు చదవాలి? అవన్నీ  అందరికీ తెలిసినవే.

   అయితే, వినాయక నవరాత్రుల తర్వాత చెరువులోనో, నదిలో గాని సముద్రంలో కానీ నిమజ్జనం చేసే విషయంలోనే కొంత పునరాలోచన అవసరం. పూజ చేసేప్పుడు  ఇంకా శ్రద్ధగా విశ్వాసం ముప్పతిప్పల్లేలా చేయాలి .

    కాలుష్యాన్ని ఎంత తగ్గించుకుంటే మన ప్రగతికి

అంత మంచిది . అసలే విపరీతమైన జబ్బులు ఏవేవో వస్తున్నాయి . వాటికి తోడు ఈ కాలుష్యాలతో కొత్త జబ్బులు వస్తే ఎవరు ఏం చేయలేరు. స్వయంకృతాపరాధమే అవుతుంది.  అట్లా కానివ్వ వద్దు.   ఆటంకాల నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

భక్తి  అవసరం.  మూఢ భక్తి వద్దు.  ఆధ్యాత్మిక భావనలు అవరసం.  అతి వద్దు.  తాత్విక చింతన ఉండాలి.  కానీ ఇవేవీ మితిమీరొద్దు . స్వచ్ఛమైన , శుభ్రమైన,  శుభకరమైన , ప్రియమైన చక్కని  వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలను మనం చేసుకుందాము.  అందరికీ పంచుదాము.

___***__

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమ్మక్కతో ముచ్చట్లు-39

హరి చందన-15