పసిమిరంగుతో, భారీ తలకట్టుతో, తీరైన కనుముక్కు తీరుతో, మృదువైననవ్వుతో, కోమలమైనమేను కలిగిన మాధవిని చూసినవాళ్ళు, ‘ఈ అమ్మాయి కుందనపుబొమ్మలా ఉంది’అనేవారు. మాధవి తండ్రి భారతసైన్యంలో పనిచేసే నిజాయితీపరుడు. క్రమశిక్షణ, దేశభక్తి ఆయనకు ప్రాణాలు. ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగినా, తన పిల్లలకు మంచి విలువలు నేర్పడంలో మాత్రం ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. తల్లి ప్రేమమూర్తి. కూతురిని ఎంతో గారాబంగా పెంచింది. బాల్యమంతా తన స్నేహితురాలు జాహ్నవితోనే గడిపింది మాధవి. వారింటి పిల్లలాగే పెరిగిన రోజులు మరువరానివి.
జాహ్నవి కుటుంబం అమెరికా వెళ్ళిపోయాక, ఒంటరిపక్షిలా విలవిలలాడింది, మాధవి. జాహ్నవి మీద బెంగతో, తరచు వచ్చే జ్వరం వలన, స్కూలుకి సరిగ్గా వెళ్ళక, చదువులో వెనకబడింది. అందమైన పిల్ల కావటాన, బైటకు వెడితే కాలనీలో జులాయి కుర్రాళ్ళ ఆగడాలు ఎక్కువయ్యాయి.
బంధువుల ద్వారా ఈ సంబంధం రావడంతో, అన్నివిధాలా బాగుందని మాధవి తండ్రి జగన్నాథం సంతోషించాడు. కాదనడానికి కారణం కనిపించలేదు. మాధవికూడా పెళ్ళి కొడుకు గోపాల్ని చూసాక అభ్యంతరపెట్టలేదు. ఒకరికి ఒకరు నచ్చారు కాబట్టి, పెళ్ళి ఏర్పాట్లు మొదలుపెట్టాడు జగన్నాధం. మాధవి తల్లి రాజ్యలక్ష్మికి మాత్రం కూతురిని కనీసం డిగ్రీ అయినా చదివించాలని ఉన్నా అందరూ, ఒప్పుకున్నాక కాదనడం దేనికి అనుకుని మిన్నకుంది.
మాధవికి పదిహేనేళ్ళు కూడా నిండకముందే, పెళ్ళి ముహూర్తం నిర్ణయించారు. పెళ్ళి విజయవాడలో ఇరువర్గాల బంధువులతో, అంగరంగ వైభవంగా జరిగింది.
పెళ్ళికి వచ్చినవారందరూ, అందంగా, ఈడూజోడుగా ఉన్న వధూవరులని చూసి ముచ్చటపడ్డారు.
మాధవి కాపురానికి వెళ్ళింది. మాధవి అత్తవారిల్లు కృష్ణాజిల్లాలో ఒక కుగ్రామం. ఇద్దరు ఆడపడుచులు, ముగ్గురు అన్నదమ్ములలో గోపాల్ అందరికన్నా చిన్నవాడు కావటాన బాగానే చదువుకున్నాడు. అగ్రికల్చర్ బియ్యెస్సీ కావటాన, అన్నదమ్ములతో కలిసి, వ్యవసాయం, బియ్యం మిల్లు, ఎరువుల షాపు, విత్తనాల షాపులకిసంబంధించిన పనులలో బిజీగా ఉండేవాడు.
అత్తగారికి, కోడళ్ళు అగ్గగ్గలాడుతూ ఉండేవారు. వారిని చూసి, మాధవికి కూడా ప్రభావతిని చూస్తే భయంగా ఉండేది. ఆడపడుచులు వస్తూ, వెడుతూఉండేవారు. నోములు, పండుగలకుఅన్నీ పద్ధతిగా జరగవలసిందే! ఇంట్లో మగవాళ్ళు, పెద్దవాళ్ళు, తింటేగాని కోడళ్ళు, పిల్లలు తినకూడదు. అన్నీ ఠంచనుగా, టైములవారీగా జరగాలి.
ఒకసారిగోపాల్, మాధవి అడిగిందని, ఇంటికి వచ్చేప్పుడు మల్లెపూలు కొని తెచ్చాడని, మర్నాడు మాధవికి వార్నింగ్ ఇచ్చింది ప్రభావతి.
“నీకేది కావాలన్నా, నన్నో, అక్కయ్యలనో, అడుగు! నా కొడుకు పూలు పట్టుకొచ్చి ఇస్తే కాని సంసారం చేయవా! మగవాళ్ళు చేసే పనులు కావు అవి! ఇది మీ హైదరాబాద్ కాదు, నీది విడికాపురమూ కాదు. పూలవాడు, గాజులవాడు ఎవరైనా ఇంటికే వస్తారు. నీకేది కావాలంటే అది కొనుక్కో! వాడికి నువ్వు పనులు చేయాలి కానీ, వాడు నీకు చేయడు! అది మనింట్లో లేదు.”
దెబ్బకి ఠారెత్తిపోయింది మాధవి.
గోపాల్‌తో అంటే, “అదంతే. మా అమ్మ మంచిదే! కానీ, ఆవిడ ఏదైనా ఒకసారి వద్దు అంటే వద్దు అంతే! నువ్వు కూడా అలా అలవాటు చేసుకో!” అన్నాడు. మొదటిసారిగా మాధవికి తన భర్తని చూసి ఆశ్చర్యం కలిగింది. కించిత్ ఆగ్రహం కూడా వచ్చింది.
భార్యకు భర్త ఏమైనా కొనితెస్తే, అందులో నామర్దా ఏమిటి? తల్లిపట్ల ఎంత గౌరవం ఉన్నా, భార్యపట్ల బాధ్యత, ప్రేమ ఉండాలి కదా! భార్య ఇష్టాలు తీర్చడానికి కూడా స్వాతంత్ర్యంలేదా! రేపెప్పుడైనా, ‘నీ భార్యను వదిలేయి’అంటే తనని వదిలేస్తాడా? ఇలా అనుకోగానే, అపశకునంగా మాధవి కుడికన్ను అదిరింది. వెంటనే భయంగా ‘దేముడా! మా కాపురం మంచిగా ఉండేలా చూడు. అని ప్రార్థించింది. కానీ, ఆమె భయం నిజమౌతుందని ఆక్షణంలో ఆమె ఊహకందలేదు.
పెళ్ళయిన ఆరునెలలకే నెలతప్పింది మాధవి. ఇంటిల్లిపాదీ అపురూపంగా చూసుకున్నారు. పురుటికి పుట్టింటికి పంపించమని, జగన్నాథం, రాజ్యలక్ష్మి అడిగితే, “మీ ఇద్దరూ సరిగ్గా ఇళ్ళల్లో ఉండరు. ఇక్కడ మేమంతా ఉంటాము. సూడిదలు అన్నీ ఇక్కడే పురమాయిస్తాను, శ్రీమంతం కూడా ఇక్కడే ఘనంగా చేద్దాము. పురుడొచ్చాక మీరే ఒక పదిహేను రోజులు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు వదినా! ఏమీ ఇబ్బంది పడొద్దు.” అని మెత్తగానే చెప్తూ, గట్టిగా చెప్పింది. ప్రభావతి దర్పం, దర్జా చూస్తున్నారు కాబట్టి, జగన్నాథం, రాజ్యలక్ష్మి ఏమీ అనలేకపోయారు. ప్రభావతి భర్త రామనాథం మాత్రం,“మనపిల్లే కదా! ఎక్కడున్నా బాగానే ఉంటుంది కదా బావగారూ! మీరేమీ భయపడకండి!” అని ఛలోక్తిగా అంటే, అందరూ వంతపాడారు.
మొత్తానికి తొమ్మిదోనెల నిండకుండానే, చక్కని పాప పుట్టింది. మాధవిలాగానే మంచిరంగు, నల్లనిజుట్టుతో, మెరిసిపోతున్న కూతురిని చూసి, గోపాల్ సంబరపడ్డాడు. అంతకుముందు అన్నలందరికీ అందరూ మగపిల్లలే. ఇప్పుడు ఆడపిల్ల మహాలక్ష్మి పుట్టిందనిఆనందంతో ప్రభావతి, అన్నీ ఘనంగా చేసింది.
రాజ్యలక్ష్మి సెలవు పెట్టుకుని వచ్చింది. పాపను తొట్టిలో వేయడం, చెవులు కుట్టించడం, బారసాల అయ్యాక, వెళ్ళింది. జగన్నాథం మధ్యమధ్యలో వచ్చి వెళ్ళేవాడు. కోడలికి బాలింత పత్యం బాగా చేయించింది ప్రభావతి. పాప బోర్లాపడితే బొబ్బట్లు, పాకితే పరమాన్నాలు, నవ్వితే నువ్వుండలు, గడపదాటితే గారెలు…. ఇలా ఏవో వేడుకలు, ముద్దుముచ్చటలు జరుపుతూ ఉండేది,
అత్తగారు, తోడికోడళ్ళు, ఆడపడుచులు తనను అంత బాగా చూసుకుంటుంటే, మాధవి పొంగిపోయేది. ఇంకా గోపాల్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తనంత అదృష్టవంతురాలు లేదనుకునేది, తల్లికి రాసే ఉత్తరాలు అన్నింటిలో అన్ని విశేషాలూ రాసేది.
రాజ్యలక్ష్మి,జగన్నాథం ఇద్దరూ ఎంతో సంతోషించేవారు. కూతురు యామినికి ఏడాది దాటకుండానే, మాధవి మళ్ళీ నెలతప్పింది. ఈసారి మాత్రం మగపిల్లాడినే కనాలని అందరూ అంటుంటే, మాధవికి అదోలా అనిపించేది. గోపాల్‌తో అంది, “ఇదేమిటి? అది నా చేతిలో ఏముంది?ఎవరైతే ఏముందిలే! అనుకోవాలి కానీ.”అని.
“వాళ్ళేదో అంటారులే, అవన్నీ పట్టించుకోకు!” అని గోపాల్ నచ్చజెప్పేవాడు. అయినా మాధవికి భయంగా అనిపించేది. మొదటిసారంత గ్రాండ్‌గా కాకున్నా రెండోసారి కూడా శ్రీమంతం చేసారు.
‘వాళ్ళమ్మలాగే ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి పుడతారేమో!’ అని ప్రభావతి అనుకోవటం విని మాధవి కూడా ‘అలా పుడితే బాగుణ్ణు!’అనుకునేది. ‘ఆల్రెడీ ఇంట్లో నల్గురు మనవలున్నారు. ఒక మనవరాలే కదా. అయినా ఇంత మగపిల్లల పిచ్చేమిటో! ఆడపిల్లయితే మనిషి కాదా!’అనిపించేది ఆమెకి.
నెలలునిండి, నొప్పులు మొదలయ్యాయి.
హాస్పిటల్‌కి వెడ్తున్నప్పుడు తల్లికి కబురు చేయమని మాధవి గోపాల్‌కి చెప్తుంటే, “ఏకంగా మనవడు పుట్టాక వస్తారులే! ఇప్పుడే వచ్చి ఏంచేస్తారు?”అన్న అత్తగారి మాటలకు మౌనంగా ఉండిపోయింది మాధవి. ‘అత్తయ్యకి తెలీదా,కాన్పుసమయంలో ఎందరున్నా తల్లి పక్కనే ఉండాలనిపిస్తుందని’దిగులుమొహం పెట్టిన మాధవిని చూసి గోపాల్ ఓదార్చాడు. “మధూ! టెన్షన్ పడకు. నేను ఆల్రెడీ కబురు చేసాను. మామయ్య, అత్తయ్య బయల్దేరారులే!” అని బుజ్జగించాడు.
మొత్తానికి రాత్రంతా ప్రసవవేదన పడ్డాక, తెల్లవారుఝామున పండంటి ఆడపిల్ల పుట్టింది. పెద్దదానిలాగే మంచిరంగు, నల్లనిజుట్టుతో ముద్దుగా ఉంది.
పురుడు రాగానే,‘ఆడపిల్ల’అని, ఒకసారి వచ్చి చూసి, ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయిన అత్తగారిని చూసి, మనసు చివుక్కుమంది మాధవికి. పాపను చూసి, తోడికోడళ్ళు, తల్లి, తండ్రి, తమ్ముడు రాజా, భర్త గోపాల్ మామగారు రామనాథం సందడిగా మాట్లాడుతుంటే యామిని వచ్చీరాని మాటలతో “చెల్లిచెల్లి” అని గంతులు వేసింది.
హాస్పిటల్‌నుండి డిశ్చార్జయి వచ్చాక, అత్తగారు నార్మల్‌గానే ఉంది. పెద్దదానికి చేసినట్లే చెవులు కుట్టించడం, బారసాల చేసి, ‘రాగిణి’అని పేరుపెట్టారు.
అటు యామిని వాళ్ళ బామ్మ దగ్గర చేరువైంది.
మొదటిసారి చేసినంతగా బాలింత పత్యం, పసిపిల్ల సంరక్షణ గురించి, ప్రభావతి పట్టించుకోలేదు. తోడికోడళ్ళు పద్మ, కమల మాత్రం మాధవిని, రాగిణిని, జాగ్రత్తగా చూసుకునేవారు. గోపాల్ దగ్గర , “రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టిందని, అత్తయ్యగారికి కోపం వచ్చినట్లుంది. అసలు చిన్నదాన్ని ఎత్తుకోవటంలేదు, పసిదాని మీద కూడా కోపమా?”అంటున్న మాధవిని విసుక్కున్నాడు గోపాల్.
“అలా ఎందుకనుకుంటావు? మా అమ్మ అలా అని చెప్పిందా? నీకు నువ్వే అన్నీ ఊహించుకుని మెదడు పాడుచేసుకుంటావు.” అన్నాడు.
మాధవి మరిక మాట్లాడలేదు.
ఆడో మగో ఇద్దరున్నారు కదా, ఆపరేషన్ చేయించేసుకోమని మాధవి తల్లి రాజ్యలక్ష్మి చెప్పింది. మాధవికి కూడా నిజమే కదా అనిపించింది.
ఆ విషయం గోపాల్‌కి చెప్తే, అతని ద్వారా విషయం తెలిసి, అగ్గిమీద గుగ్గిలంలా మండిపడింది ప్రభావతి.
“మీ అమ్మకి షోకులెక్కువ. జాబ్ చేస్తోందని, మీ ఇద్దరితో ఆపింది. మీనాన్న ఆవిడ మాటలకి ‘తందానా’అంటాడు. ఇక్కడ మా ఇంట్లో ఆడాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళరు. మొగుడిని, పిల్లలని సరిగ్గా చూసుకుంటే చాలు! నా కొడుకుకి మగసంతు లేకుండా చేద్దామని అనుకుంటే కుదరదు. దేముడిచ్చిన పిల్లలని వరంలాగ అనుకోవాలి. వెంటనే కాకపోతే, ఒక రెండేళ్ళ తర్వాతైనా కనాల్సిందే! పోనీ, రెండోసారైనా మగపిల్లాడు పుట్టి ఉంటే బాగుండేది. మూడవసారి టెన్షన్ ఉండేది కాదు.” అన్న అత్తగారి మాటలు అప్పుడు అర్థం కాలేదు మాధవికి.
ఏమందామన్నా అమ్మను, నాన్నను కూడా అంటోంది. అలాంటప్పుడు ఆవిడని ఎవరూ ఏమీ అనరు. గోపాల్ కూడా “సరేలే అమ్మా’అని తల్లినే అనునయించాఢు.
పిల్లల ఆటపాటలు, సందళ్ళతో, ఏడాదిన్నర అయిందో లేదో, మళ్ళీ నెలతప్పింది మాధవి. అందరికీ ఆనందమే కానీ, ఆమెకి భయంభయంగా ఏదో తప్పు చేసినదానిలా అనిపించింది. ‘ఈసారి కూడా ఆడపిల్లే పుడితే మళ్ళీ కంటూ ఉండాలా?’అని దిగులు పొడసూపింది.
ఆమె ఎలా భయపడిందో, అలాగే అయిదోనెలలో భర్తతో కలిసి డాక్టర్ దగ్గరకు వెడుతున్నప్పుడు ప్రభావతి గోపాల్ తో, “డాక్టర్ని నేనడిగిన విషయం అడుగు మర్చిపోకు!” అని చెప్తుంటే అత్తగారి మాటలకు ఏదో సందేహం కల్గింది మాధవికి.
భర్తను దారిలో అడిగింది. ‘అత్తయ్య డాక్టర్ గారిని ఏమడగమంది?”అని.
దానికి ఒక నిముషం మౌనంగా ఉండిపోయి, “అదే… ఆడపిల్లా, మగపిల్లాడా తెలుసుకోమని.” అని అంటున్న గోపాల్ మాటలకి షాక్ అయింది మాధవి.
‘ఏమిటీ ఘోరం! ప్రాణాలకి ఎదురొడ్డి పిల్లలని కనే తల్లికి ఎవరైనా ఒకటే! తల్లికి లేని ఈ భేదభావం ఎవరికైనా ఎందుకుండాలి? తన భర్తకి కూడా అత్తగారి ఆలోచనలు ఒంటపట్టాయా? ఆడపిల్లలు పిల్లలు కారా? ఒకవేళ తనకి, మళ్ళీ ఆడపిల్లే పుడితే, అత్తగారు ఏంచేస్తుంది? తనేంచేయాలి?’
(సశేషం)