మా పాఠశాల
గురువులు పాలించే రాజ్యమైతే
అందులో మా తరగతి గది ఓ చిన్న గ్రామం
అందులో మా సంతోషం మాకే
మా ఆనందం మాకే
కొన్ని తరగతి గదులు తోటలోని మొగ్గలైతే
మా తరగతి గది మాత్రం
వికసించిన కుసుమంలా
విజ్ఞాన పరిమళం నిండిపోయిన పూల తోట
విశ్వంలో ఉన్న చీకటిని
సూర్యుడి వెలుతురు తరిమేసినట్టు
మా బ్రతుకులోని చీకటిని
జ్ఞానమనే దీపంతో తరుముతుంది
మా తరగతి గదిలో కన్నీటికి తావులేదు
ఎప్పుడూ నవ్వుల వర్షం కురుస్తూనే ఉంటుంది
మా ముందున్న జీవితంలోని కష్టాలకి
ఫుల్ స్టాప్ పెడుతుంది
మా తరగతి గది
పేదరికపు సంద్రాన్ని దాటించే
పుస్తకాల పడవలను పరిచయం చేస్తుంది
సమాజం కుల మతాల భేదాలను చూపినా
ఏ భేదభావం లేకుండా అందర్నీ సమానంగా చూసే
ఓ అమ్మలాంటిది మా తరగతి గది