మారుతూనే వుంటారు
మనుషులు ఎప్పటికప్పుడు
మారే కాలమే విస్తుపోయేలా
నమ్మకానికే రోత పుట్టేలా
ప్రపంచానికి గీసిన
సరిహద్దులు దాటి
ఆశలతో ఒంటిరెక్క ప్రయాణం
సాధించిన దానికంటే
కోల్పోయిన బరువు ఎక్కువ
ఓ మనిషీ!!!
మారాలిక నువ్వే
పరుగులెత్తడం మాని,
కనుమరుగైన గతంలో
కాలమిచ్చిన గాయాలతో
ఓర్పును నేర్పుగా
పల్లవించే ఆశయాలకై
పదును తేలాలి
రాసుకోవాలి నీ రాతని నువ్వే
అంతరంగాన్ని రాపిడితో
అలంకరించాలి
ఊపిరి పోయాలి మనిషితనానికి,
భావాల అమ్ముల పొదిలో
మానవతల జెండాలు పాతాలి
నలుదిక్కులా మిగిలిపోవాలి
నీకు నీవైన చరితలా !!