రాసినది నేనే…రాయించినది..?
*****
“పలికెడిది భాగవతమట/ పలికించెడి వాడు రామ భద్రుండట.నే/ పలికిన భవ హరమగునట/ ” ఈ పద్యమును శ్రీమద్భాగవతం రచించిన పోతనామాత్యుడు చెప్పినట్లుగా నేను కూడా ” ఈ సాహిత్యంలో న్యాయాలు-సునంద భాష్యం” రాయడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.
సంస్కృత న్యాయాలకు తెలుగు వ్యాఖ్యానాలు రాస్తున్నప్పుడు నేనేనా వెయ్యికి పైగా న్యాయాలు ఒక్క రోజు కూడా ఆపకుండా నిరవధికంగా ఇలా రాయగలిగింది” అనేది తలచుకుంటే ఇప్పటికీ నాలో అంతులేని ఆశ్చర్యం.
“శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు” అన్న లోకోక్తి ని వందశాతం నమ్మిన దానిని.ఎందుకంటే నేను తరగతి గదిలో బోధన చేసే తెలుగు భాషోపాధ్యాయినిని. విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన న్యాయాలను కూలంకషంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని నిర్ణయించుకున్నాను.
ఒక్కో న్యాయము రావడం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు భగవద్గీత, రామాయణం, ఉత్తర రామాయణం, మహాభారతం,భాగవతం మొదలైన గ్రంథాలలో ఎక్కడ ఈ న్యాయము యొక్క ప్రస్తావన వచ్చింది? అనే కారణాలు, ఆయా సంఘటనలు, సన్నివేశాలతో పాటు ప్రముఖ పద్య కవులు వేమన, బద్దెన,మారన, కంచెర్ల గోపన్న, ధూర్జటి లాంటి వారు మొదలుకొని నేటి మేటి కవుల పద్యాలను కూడా సందర్భోచితంగా న్యాయాల్లోకి తీసుకొని వివరించడం జరిగింది.
ఈ సంస్కృత న్యాయాలన్నీ తెలుగు భాషలో ఉన్న జాతీయాలు, సామెతల రూపాలే” అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మన భాష యొక్క గొప్పతనాన్ని తెలిపేలా ఆనాటి మన పెద్దవాళ్ళు ఎలా అలవోకగా తమ మాటల్లో ఈ న్యాయాలను ఉపయోగించి నైతిక విలువలు నేర్పడానికి ప్రయత్నించారో చెప్పడమే కాకుండా మన భాష సంస్కృతీ సాంప్రదాయాలను విద్యార్థులకు వారసత్వంగా అందించాలనే తపన నాచేత ఇన్ని న్యాయాలను సవివరంగా రాసేలా చేసింది.
వాగ్దేవి,వీణావాణి కృపచేత నా ద్వారా పరిచయం కాబడిన న్యాయాలలో 116 తీసుకుని పుస్తకంగా ముద్రించి ఇచ్చిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భాషాభిమానులు, సహృదయులు శ్రీమాన్ వరప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మిగతా న్యాయాలను మీకు పరిచయం చేసే అవకాశం కలిపించిన తరుణి అంతర్జాల పత్రిక సంపాదకులు ప్రియ నేస్తం కొండపల్లి నిహారిణి గారికి వినమ్రంగా నమస్కరిస్తూ…
మీ
వురిమళ్ల ( భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం