అందరికీ శనార్థులు!
మంచిగున్నర.
వినాయక చవితి వచ్చిందంటే సాలు… గల్లీల ధూంధాం మొదలైతది. పోరగాల్ల నుంచి నాయకులు దాక… ప్రతి గల్లీల ప్రతి అపార్ట్మెంట్ల, గణపతి మీద భక్తి గంగ లెక్కనే పారు తుంటది. చిన్న పోరల నుంచి
గల్లీలల్ల చోటా బడా బాబులు సుత చందాల పుస్తకాలు పట్టుకోని తిరుగుతుంటరు.
ఇగ రికార్డులు పాటలు డీజేలు పెడ్తరు..సుట్టుపక్కల ఉండే ముసలోళ్ళకే కాదు, చిన్నోళ్లకు సుత బీపీ రేటు, గుండె కొట్టుకునే వేగం దండ కడియంలా పెరిగిపోతయి. ఒకప్పుడు “శుక్లాంబరధరం విష్ణుం” అని ప్రశాంతంగ, భక్తితోని మొదలయ్యే మన వినాయక ఉత్సవాలు… ఇప్పుడు ప్యూర్ సైకోసిస్కి, హద్దులు లేని కాన్సెప్ట్ రభసకి కేరాఫ్ అడ్రస్సు లెక్క మారిపోయినయి.
అసలు ఆ విగ్రహాల గెటప్పుల గురించైతే ఎంత చెప్పుకున్న తక్కువే! స్వామివారిని కొత్తగ సూపించనీకి మండపం కుర్రోలు పడే తాపత్రయం సూస్తుంటే పాపం ఆ లంబోదరుడు సుత “కైలాసంల నేను ఏమైన గ్యాంగ్‌స్టర్‌ని అనుకుంటున్నార్రా వారీ….?” అని తొండం పట్టుకోని మనాది అయితడో ఏమో….! ఒక మండపంలో వినాయకుడు గడ్డం రాసుకుంట “తగ్గేదేలే” అని పుష్పరాజ్ లుక్ల ఉంటడు. ఇంకో తావుల ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ లెక్క బైక్ మీద స్వారీ చేస్తుంటడు. ఇంగ కొందరైతే టైటానిక్ షిప్ మీద రోజ్-జ్యాక్ల జాగాల గణపతిని కూర్చోబెట్టేస్తరు! ఖర్మరా బాబూ… గిదంత.
భాద్రపద శుద్ధ చవితికి, థియేటర్ల రిలీజ్ అయ్యే మాస్ సినిమాలకి ఏమైన సంబంధం ఉందా అని అడిగితే…. “ఇది క్రేజ్ భయ్యా, సోషల్ మీడియాల రీల్స్ వైరల్ అవ్వుడు ముఖ్యం !” అని పుక్కడ్ సలహాలు ఇస్తరు.
ఇక ఆ మైక్ సెట్లు, డిజె పాటలు, పోరగాండ్ల రచ్చ సంగతికైతే ప్రత్యేకంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. తెల్లారగట్ల ఐదు గంటలకు పవిత్రమైన సుప్రభాతం రావలసిన చోట… “బుల్లెట్టు బండి”, “సారంగ దరియా” పాటలతో భక్తుల చెవులకు రంధ్రాలు చేస్తరు. పొద్దున్న పూజ సరిగ్గ అయితదో లేదో తెల్వది కానీ, రాత్రి మాత్రం భక్తి ‘తీన్మార్ డిజె సర్కస్’లెక్క రూపాంతరం చెందుతది. స్వామి వారి ముందర గుంజీలు తీసి నిష్ఠగా దండం పెట్టుకోవాల్సిన కుర్రోల్లు , పూనకం వచ్చినట్టు , “నాగినీ డాన్సులు” చూసి… పక్కనే ఉన్న కార్తికేయుడు “అన్నా! నీ వాహనం ఎలుక అనుకున్న గానీ, ఈ మండపం నిండ ఏంది ఇన్ని నాగుపాములు తిరుగుతున్నాయి?” అని లబోదిబోమంటూ కైలాసానికి పారిపోతడు.
అసలు చందా వసూళ్ళ ప్రక్రియ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గల్లీలల్ల ప్రతి ఇంటికి పోయి “అంకుల్ పక్క సందుల పదివేలు ఇచ్చింరు, మీరు ఇరవై వేలు ఇయ్యకపోతే మీ ఇంటి ముందు మైక్ సెట్ పెట్టి పాటలు వేస్తం” అని ప్రేమపూర్వకంగ బెదిరిస్తరు.
గణేశుని మండపాల అసలు ఉద్దేశం….లోక కళ్యాణం, పర్యావరణ పరిరక్షణ, గల్లీ లల్ల ప్రజలందరినీ ఒక దగ్గర కలిపి ఐక్యతను చాటడం.
ఇప్పుడు రియాలిటీ ఎట్లున్నది… చెవులు రంద్రాలు పడే టట్లు శబ్ద కాలుష్యం, ‘మా విగ్రహం ఎత్తు గొప్ప అంటే మాది గొప్ప’ అనే ఈగో కాంపిటీషన్.
పండుగ అంటే మన ఆధ్యాత్మికతను, ప్రకృతిని గౌరవించడం. నిమజ్జనం రోజున ఆ బొజ్జ గణపయ్యను నీటిలో కలిపే ముందు, మన బుర్రల్లో ఉన్న ఈ వికృత ఆలోచనలను, పిచ్చి ఫ్యాషన్ల హడావుడిని సుత నిమజ్జనం చేస్తే ఆ స్వామివారికి కాస్త ప్రశాంతంగ ఉంటది. లేదంటే వచ్చే ఏడాదికి ఆయన నిజంగానే లీవ్ పెట్టేసి కైలాసంల తలుపులేసుకుని కూర్చుంటడు జాగ్రత్త!
గణేశుని పూజ తప్పకుండ చేసుకోవాలి. స్వామి అవతారంలనే మస్తు రహస్యం దాగి ఉంది. పిల్లలకు చెప్పాల్సింది చానా ఉంది. ఇప్పుడు ఎన్నో లొల్లీలు, ఎన్నో గలీజ్ కతలు జరుగుతున్నయంటే… కారణము భక్తి లేకపోవుడు, ఆధ్యాత్మికత తగ్గిపోవుడు సుత ఒకటి! గణేష్ పండుగ ఎంత ముఖ్యమో.. స్వామివారి పూజా, ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తరు, ఆ స్వామివారికి పత్రి ఎందుకు ఇష్టమో, స్వామి వారిని నిమజ్జనం ఎందుకు చేస్తరు, ఇవన్నీ చెప్పాలి. ఎలుక ఎందుకు గణపతికి వాహనము.. అది ఎంత లొల్లి చేస్తది. అన్ని ఖరాబ్ చేస్తది ఎందుకంటే ఎలుక చంచలమైన మనసుకు ప్రతీక. దానిని కంట్రోల్ చేయాలి. అందుకే నిండైన గణపతి ఎలుకను అదుపుల పెడ్తడు. ఈ ముచ్చట మన పిల్లలకి ఎరుకైతే ఎంత మంచిగుంటది కదా!
పెద్ద చెవులతోని వినాలి, చిన్న కళ్ళతోని సూక్ష్మంగ పరీక్షించాలి, ఇట్ల చానా ఉంది గణేష్ ని రూపంల అర్థం- పరమార్థం. పెద్దోళ్ళు దీనిని ముందుగాల అర్థం చేసుకొని గణేషుని పూజలోని ఉన్నత తత్వంను పిల్లలకు తెలియజేయాలి. భజనలు చేయాలి. ఇప్పుడు జర నయం భజన్ జామింగ్ అని కుర్రకారు అందరు మొదలుపెట్టింరు. అట్ల మండపాలల్ల సుత భజనలు చేద్దాము. భక్తిని పెంచుదాం. ‘ఓం గం గణపతయే నమో నమః’ అని స్మరిద్దాం.దీనితోని ‘ఆరా’ సుత బాగుపడుతది. పిల్లల మనస్సు సుత నెమ్మదిస్తది. ఎంత గొప్పది తెలుసా… మన భారతీయ సంస్కృతి, మన ఆధ్యాత్మికత! దానిని తగ్గేదేలే గణపతిలు,జీన్స్ ప్యాంట్ గణపతిలు… తీన్మార్‌ల పూజల కిందికి చేస్తరా…?? ఇదేమన్న పద్దతినా చెప్పండి తమ్మీ జర! మంచిగ చేసుకుందాం పండుగ. గణపతి మన పిచ్చి కతలు సూశి వాళ్ళ అమ్మ నాయనలు పార్వతీ పరమేశ్వరుల దెగ్గరికి ఉర్కి పోవద్దు. మన ప్రశాంతత,పద్ధతితో జరిపే మన పూజలు సూశి మన దగ్గరికి వచ్చి వరాలు ఇయ్యాలి. పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం సుత మనకు దక్కాలి. అట్లా… ఉండాలి పూజ. దేవుడికే గుండె గుబేలు మనేటట్టు చెయ్యొద్దు. ఏమంటరు.?
మంచిది మరి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
ఉంట పైలెం మరీ!
ఇట్లు
మీ రమక్క