విత్తు

కవిత

వాన చుక్క పలకరించగానే,
ఉబ్బితబ్బిబ్బై,
ఆనందాన్ని అణుచుకోలేక,
అంకురంగా మారి
పుడమితల్లి గర్భం నుండి
సగర్వంగా లేచింది

వెచ్చని సూర్య కిరణం,
సుతి మెత్తని తుషారం,
చల్లని పవనం,
వెన్నుతట్టగా
మొక్కగా మారి
తల ఎత్తుకు నిలబడింది

ఈదురు గాలులకు తలవాల్చినా,
కుంభవృష్టికి తడిసి ముద్దైనా,
ఎండవేడికి అల్లాడిపోయినా,
లెక్క చేయక,
కూకటివేళ్ళతో పుడమినంటి పెట్టుకొని,
శాఖలను పెంచుకుంటూ చిఱువృక్షంగా మారింది

భూమాత కోత నరికడుతూ,
మానవాళికి ఊపిరియై,
పశుపక్ష్యాదులకు గూడు నీడై,
ప్రకృతికి పచ్చదనపు గొడుగై,
తన ఉనికిని సార్ధకం చేసుకుంటూ
మహావృక్షమై మహిలో నిలిచింది

కష్టనష్టాలకు ఓర్చుకుంటూ
మంచిక్షణాలను మనసున నింపుకుంటూ
నెమ్మది నెమ్మదిగా ఎదగాలనుకుంటేనే
మహిలో నీ మనుగడయని
మానవాళికి సందేశమిచ్చింది

Written by Dr. Majji Bharathi

ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరంలో ప్రొఫెసరుగా మరియు మైక్రోబయాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డా. మజ్జి భారతిగారు, మూడు కథా సంపుటాలు- 1. ఆలోచనా తరంగాలు (2022), 2. వేకువ (2024), 3. జీవన గానం (2025), 4. భారతీ! వందనము అనే పద్య సంకలనాన్ని వెలువరించి, నాల్గవ కథా సంపుటం "అనగనగా ఒక కథ" ప్రచురించబోతున్నారు. వందకు పైగా కథలు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ వ్యాసాలు, ట్రావెలాగ్స్, కవితలు వివిధ పత్రికలలో (ఈనాడు ఆదివారం అనుబంధం, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, మాతృక, భూమిక, పాలపిట్ట, ప్రసారిక, సాహితీ కిరణం మొదలైన పత్రికలలో, కథామంజరి, కౌముది, విహంగ, సారంగ, సంచిక, మాధురి, తరుణి, మయూఖ, రవళి, గో తెలుగు డాట్ కాం మొదలైన అంతర్జాల పత్రికలలో) ప్రచురింపబడ్డాయి. ఐదు కథలకు బహుమతులు, ప్రత్యేక బహుమతులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు -32

వారాలబ్బాయి