వినాయక చవితి – సామాజిక పండుగ

వినాయక చవితి సందర్భంగా

భాద్రపదం వచ్చిందంటే అన్ని పర్వాలకు ఆదిపర్వం వినాయక చవితి వచ్చేస్తోంది అన్నమాట. మన పండుగలు అన్ని ఇక వరుసగా ఒకదాని వెంట ఒకటి వచ్చేందుకు సిద్ధమవుతాయి. దానికి నాందిగా ఈ వినాయక చవితి…!!

ఒకానొకప్పుడు ఇళ్లల్లో భాద్ర పద శుద్ధ చవితి నాడు కేవలం ఇళ్లల్లో మాత్రమే చేసుకునే ఈ వినాయక చవితి బాలగంగాధరతిలక్ పుణ్యమా అని ఒక సామాజిక పండుగగా మారింది. ఆరోజు ఆయన ఆలోచించి ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలమైన కారణమే ఉంది. సమాజంలో హిందువుల ఐకమత్యం ఆనాటికే అవసరం పడింది .కనుక ఎవరి మటుకు వారు ఇళ్లల్లో చేసుకోవడం ఒకటే కాకుండా అందరూ కలిసి సామూహికంగా ఒకచోట చేరి భక్తి భావంతో వినాయకుడిని పూజించి అందరూ కలిసి ఒక మంచి సమయాన్ని గడపాలని ఉద్దేశంతో తద్వారా మనుషుల మధ్య స్నేహ సంబంధాలు పటిష్టమవుతాయనే ఉద్దేశంతో ఈ ఆరు బయట వినాయక చవితి పూజల పద్ధతి ప్రారంభం అయింది .

విశేషంగా నాటి నుంచి నేటి వరకు ఇది కొనసాగుతూనే ఉంది .అది సంతోషించాల్సిన విషయమే అయినా నేడు ఈ పూజా కార్యక్రమం జరుగుతున్న తీరు చూస్తే మాత్రం కొంచెం నిరాశ అసహనం రెండు కలుగుతాయి. పూజ మండపాల్లో భక్తి కీర్తనలు భక్తి పాటలు అనేవి లేకుండా అసభ్యకరమైన సినిమా పాటలతో పోరెత్తించే ట్రెండ్ ప్రారంభమైంది.
ఇలాంటివే కాకుండా పిల్లలకు వ్యాసరచన పోటీ, క్విజ్ పోటీ, వక్తృత్వపోటీలు పెడితే పిల్లల తెలివి పెరుగుతుంది. ఉత్సావంతంగా పాల్గొంటారు. వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దినవారమవుతాము. నిర్వాహకులు ఇటువంటివి ఆలోచించాలి.

అసలు వినాయకుడి ప్రాధాన్యత ఈ పూజ తాలూకా ప్రాముఖ్యత ముందు చేసే వాళ్ళకి అర్థం కావాలి. మనం జీవితంలో ఏ పని చేసిన అది నిర్భిఘ్నంగా పూర్తి కావాలని అన్నివేళలా కోరుకుంటాము .అలా దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించగలిగే శక్తి ఉన్న దైవం ఈ వినాయకుడు .అందుకని ఏ పెద్ద కార్యక్రమం చేసిన ఏ పెద్ద పూజ చేసిన ఏ యజ్ఞం చేసినా ఏ హోమం చేసినా ముందుగా ఇతడిని పూజిస్తాం. ఆ ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అప్పుడు సరి అయిన పద్దతి లో చేస్తాం.

అన్నిటికన్నా ముఖ్యంగా నిమజ్జనం రోజు స్వామిని తీసుకు వెళుతూ డీజే తో పెట్టే పాటలు వింటూ ఉంటే దీన్ని భక్తి అంటారా అసభ్యత అంటారా అర్థం కాదు. ఇప్పటికైనా ఈ రకమైన అర్ధహీనమైన అలవాట్లకు స్వస్తి చెప్పి పూజ మండపాలని ఒక పవిత్రమైన ప్రదేశాలుగా తిరిగి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు అన్నదానము, సాయంత్రం పూట కనీసం ఒక అరగంట ఎవరైనా పెద్దవారితో ఒక సత్సంగము ,అలాగే చిన్న పిల్లలతో చిన్న చిన్న ఏకపాత్రాభినయాలు వంటివి ఏర్పాటు చేస్తే చేసిన పని సార్ధకం అవుతుంది.

ఈ గణపతి నవరాత్రుల కార్యక్రమాన్ని స్వచ్ఛంగా పవిత్రంగా జరుపుకునేలా మార్గదర్శనం చేయాలి. చివరికి మనం సంవత్సరం అంతా చేసే పనులలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడమని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నాము .ఆ పని మనం భక్తితో చేయాలి

Written by Shivala Padma

శివల పద్మ
జన్మస్థలం ....విజయనగరం.
విద్య.. MA తెలుగు
MA ఫిలాసఫీ
...జర్నలిజం
. వనవాసీ పత్రిక వనవాణికి సంపాదక బాధ్యత.

రచనలు - 1.చదువుకున్న మనసు,
2.కధా సంపుటాలు రెండు.
3.ఆశానికేతన్
4.సప్తపది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ముద్దుఫళని

మీతో కొన్ని క్షణాలు..