కడుపు నిండిన వాడికి
ఆకలి బాధ తెలియదు
యుద్ధం మొదలు పెట్టిన వాడికి
శాంతికి అర్థం తెలియదు
గుప్పెట్లో ప్రాణాలు
అంటే తెలియదు
నెత్తి మీద ఎప్పుడు
ఏ బాంబు పడుతుందో
ఎప్పుడు ఎవరికి మూడుతుందో
…ఏవీ తెలియవు
చోద్యం చూసే వాళ్లకూ
తెలియదు
సెల్ ఫోనుల్లో
రీల్స్ చూసుకుంటూ
కడుపు చల్ల కదలకుండా
బతికే వాళ్లకు
యుద్ధమంటే ఏవిటో
తెలియదు
యుద్ధమంటే
అమానుషత్వం
యుద్ధమంటే
అణచివేత
యుద్ధమంటే
ఊచకోత
యుద్ధమంటేనే
సర్వ నాశనం కావడం
యుద్ధమంటేనే
సర్వం కోల్పోవడం
పాపం అప్పటి వరకూ
బడి ఒడిలో
అమాయకంగా
పరుగులెడుతున్న
పసివాళ్ళకి
తెలియదు
గూగుల్ తమ లొకేషన్
యుద్ధ స్థావరంగా చూపిస్తుందని
తల్లి ఒడిలో ప్రశాంతంగా
నిద్రించే పసికూనకి తెలియదు
తాము కాలూనుకున్న
భూమి కింది
పొరల్లోని నూనె నిల్వలే
తమని పొట్టనబెట్టుకుంటాయని
అప్పటివరకూ
తమదనుకున్నదేదీ
తమది కాదని
సామాన్య జనానికీ
తెలియదు
యుద్ధతంత్రాలు
రాసే వాడికి తప్ప
ఎవరికీ ఏ నష్టం
కలుగుతుందో
ఎవరికీ తెలియదు
ఎవరికీ
అర్థం కాదు
యుద్ధమంటే ఏవిటో
అనుక్షణం
భయం భయంగా
గుండె దడగా
బతకడమంటే
ఏవిటో –
పోయిన వారి
ఆనవాళ్ల కోసం
బతికున్న వారి
జానెడు పొట్ట కోసం
దీనాతిదీనంగా
వెర్రిచూపులు
చూడడమంటే
ఏవిటో
యుద్ధం మొదలు పెట్టిన వాడికీ
యుద్ధం అవసరం అయిన వాడికీ
యుద్ధం వినోదం అయిన వాడికీ
తెలియదు
యుద్ధానికి ఎదురు నిలబడేవాడికి
మాత్రమే తెలుసు
ఆయుధపు మొన గుండెల్లో గుచ్చుకున్నవాడికి
శకలాలుగా చీలిపడ్డ మొండాల్ని
భుజాన మోసే వాడికి మాత్రమే తెలుసు
యుద్ధానికి ఎదురు నిలబడేవాడికి
మాత్రమే తెలుసు
శాంతి విలువ