జరిగిన కథ:
పాణిగ్రహణం చేసుకున్న విదర్భ రాకుమారి, మనసులో తాము లేమని తెలిశాక, ఆమె కోరిక మేరకు, మారువేషంలో వినయవర్మగా రాకుమారికి శిక్షణనిస్తూ, ఆమె మనసులో ఉన్నది అనంతుడా అన్న అనుమానం పొడసూపినా తర్వాత కాదని తెలుసుకుని, ప్రమీలాదేవంటే తనకిష్టమెలా ఏర్పడిందోనని జ్ఞాపకాలలోకి జారుకున్నాడు విక్రమసింహ. మారువేషంలో రాకుమారిని చూసి, అంగీకారాన్ని తెలిపాక, తల్లిగారు, విదర్భ రాకుమారిని తమ దేశ పట్టమహిషిగా చేసుకోవడానికి కబురు పెట్టడం, వారు కాదనడం, ఆ బాధతో తన తల్లిగారు మరణించడం గుర్తుకొచ్చి నిట్టూర్చాడు విక్రమసింహ. జైత్రయాత్ర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న వేళలో, గురువుగారు వచ్చారన్న వార్త తెలియగానే, శిరస్త్రాణము తీసి వెళ్తున్న వినయవర్మను చూసి మూర్చపోయింది రాకుమారి. తర్వాతేమి జరిగిందో చూద్దాం రండి…
“అదేమిటమ్మా అలా అంటారు? మీరు ప్రేమించినది వినయవర్మ గారినని తెలిస్తే మహారాజుల వారు దానినే రకంగా తీసుకుంటారు? వినయవర్మ గారిని ఏమి చేస్తారోనని భయమేస్తుందమ్మా” ఏమైతే అది అయిందని తన మనసులో నలుగుతున్న ఆలోచనను చెప్పేసింది ప్రియంవద.
అంత దుఃఖంలో కూడా తనన్న మాటలకు ఫక్కున నవ్విన రాకుమారిని చూసి, తనన్న మాటలో అంత హాస్యాస్పద మేమున్నదో అర్థం కాక తెల్లబోయింది ప్రియంవద. “పిచ్చిదానా! వారిరువురూ ఒకరే. వారే మహారాజులు”
“వారిరువురూ ఒకరేనా! మీకెప్పుడు తెలిసింది? నాకెందుకు చెప్పలేదు?” ఆశ్చర్యపోతూ, ప్రశ్నల వర్షం కురిపించింది ప్రియంవద.
“నాకూ ఇప్పుడే తెలిసింది” సాలోచనగా అని, తనకా అనుమానం ఎప్పటి నుండి ఉందో, ఇప్పుడెలా తెలిసిందో గుర్తు తెచ్చుకోసాగింది రాకుమారి.
“నాకీ అనుమానం ఎప్పటినుండో వుంది. ఎందుకంటే మహారాజులకు సన్నిహితులు, అనంతుల వారొక్కరే. వారిరువురికీ విద్య గరిపినవారు, రాజగురువులే. అందుకని ఈ వినయవర్మ అనేవారు వేరే లేరని నాకప్పటినుండి అనుమానమే. నాకు విద్య నేర్పించమని నేను అభ్యర్థించిన వెంటనే, నాకు గురువుగా నియమించింది అనంతుల వారినే. వారిరువురూ అత్యంత సన్నిహితులైతే తప్ప, ఒక రాకుమారికి విద్య నేర్పడానికి ఒక యువకుడిని నియమించరు. మగధరాజ్యంలో, యుద్ధవిద్యా విశారధులు ఇద్దరే. ఒకరు మహారాజులు, ఇంకొకరు అనంతులవారే. వేరెవరూ లేరు. ఇంతవరకూ మహారాజులు, వినయవర్మ ఒకరేనన్నది అనుమానం మాత్రమే. ఈరోజే అది నిర్ధారణ అయింది. ఎలా అంటే, మహారాజు చెవులకున్న కుండలాలు… అవి మా తండ్రిగారు ఇచ్చినవి. ఈరోజు వారు శిరస్త్రాణం తీసినప్పుడు, నేను గుర్తించాను” అని చెప్పి ఆగింది.
“ఇంతటి శుభవార్త యింత నెమ్మదిగా చెప్తారేమమ్మా! ఇన్నాళ్లకు దేవుడు కరుణించాడు. మీరు ప్రేమించిన వారే, మిమ్ము వివాహం చేసుకున్న వారవడం, ఎంత అదృష్టమో? లేవండమ్మా! మిమ్మల్ని నా చేతులతో నేనే స్వయంగా అలంకరించి, మహారాజుల వారికి మిమ్మల్ని అప్పచెప్తాను. లేవండంటూ” తొందర పెట్టింది ప్రియంవద.
“కాని, వారికి నా మనసు అన్యాక్రాంతమని చెప్పాను. ఇప్పుడు అది మీరేనంటే నమ్ముతారంటావా?” బేలగా అడిగింది రాకుమారి.
“మీరేమీ బాధపడకండమ్మా! వారు విశాల హృదయులు. మీ మనసును అర్థం చేసుకుంటారు. మీ మనసులో వారు లేరని చెప్పాక కూడా, మారువేషంలో వచ్చి మీకు శిక్షణ ఇస్తున్నారంటేనే, అర్థమవుతుంది. ఇప్పటికీ వారు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారని. మీలాగే వారు కూడా మిమ్మల్నే, వారి మనసులో నిలుపుకొని ఉన్నారని. ఇంకేమీ సందేహాలు పెట్టుకోకుండా, వెళ్లి వారిని మన్నించమని అడగండి” ప్రోత్సహించింది ప్రియంవద.
“ఇప్పుడే వెళ్లి వారి పాదాలమీద పడి నన్ను మన్నించమని వేడుకుంటాను. నా పాపానికి ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమంటాను. మహారాజులవారి మందిరానికి మేము వస్తున్నామని కబురు పెట్టు” కన్నీళ్లు తుడుచుకుని లేచింది ప్రమీలాదేవి.
*
“మహారాజుల వారు అంతరంగ సమాలోచన మందిరంలో ఉన్నారు. ఎవరికి ప్రవేశం లేదని” వీరిరువురినీ అడ్డుకుంది, మహారాజుల మందిరంలో అంతర్గత వ్యవహారాలు చూస్తున్న దేవసేన.
“మహారాణి వారు వచ్చారని విన్నవించండి” ప్రియంవద అభ్యర్థిస్తూ అంది.
“క్షమించాలి. లోపలికి ఎవరికీ ప్రవేశం లేదు. యుద్ధ సమాలోచనలు జరుగుతున్నాయి” నిక్కచ్చిగా చెప్పింది దేవసేన.
వివాహం జరిగాక ఒక్కసారి కూడా మహారాజ మందిరంలోనికి రాని ప్రమీలాదేవి అంటే, దేవసేనకు ఎప్పటినుండో కోపంగా ఉంది. దానికి తోడు రాజమాత మరణానికి కారణం కూడా ప్రమీలాదేవేనని ఆమె దృఢనిశ్చయం. చిన్నప్పటినుండి మహారాజును ఆమె చేతుల మీదే పెంచింది. ఆ చనువుతో ఆమె మహారాజు మనసును అంచనా వేయగలదు. అందుకనే ఎవరూ చెప్పకుండానే, మహారాజుకు ప్రమీలాదేవితో ఏ రకమైన సాన్నిహిత్యం లేదని అంచనా వేయగలిగింది. అందుకే ఆమెకు ప్రమీలాదేవి అంటే అంత కోపం.
దిగులుగా చూసింది ప్రమీలాదేవి.
“మీరేమీ దిగులు పడకండమ్మా! రేపు వద్దాం రండి” అని ప్రమీలాదేవిని, అంతఃపురానికి తోడ్కొని పోయింది ప్రియంవద. మరుసటి రోజు కూడా వీరికి మహారాజ మందిరం లోనికి ప్రవేశం దొరకలేదు.
మరింత దిగులు పడిపోయింది ప్రమీలాదేవి. ఇంకో రెండు రోజులలో విదర్భదేశ ప్రయాణం.
ఇటుచూస్తే జైత్రయాత్రకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మహారాజుకు క్షణం తీరిక దొరకడం లేదు. అందుకనే శిక్షణా తరగతులను కూడా రద్దు చేశారు. అనంతులవారి కలుసుకుందామనుకుంటే, వారు కూడా యుద్ధ ఏర్పాట్లలో మునిగిపోయి ఉన్నారు. మహారాజును కలుసుకోవడానికి ప్రమీలాదేవికి, దేవసేన అనుమతినివ్వడం లేదు. మహారాణి, మహారాజు మందిరాలకు వచ్చిందన్న విషయం విక్రమసింహకు తెలుసో లేదో కూడా, ప్రమీలాదేవికి తెలియడం లేదు.

విచారంగా మరలా అంతఃపురానికి చేరుకుంది ప్రమీలాదేవి. రాకుమారి, మహారాజును కలుసుకునేందుకు దేవసేన అవకాశం ఇవ్వదని, ప్రియంవదకు అర్థమయింది. అంతేకాదు, మహారాజులను చిన్నప్పటినుండి పెంచిన కారణంగా, దేవసేనను మహారాజులు విశ్వసిస్తారని, ఆమె అనుమతి లేకుండా మహారాజ మందిరంలోకి ఎవరికీ ప్రవేశం లేదనే విషయం కూడా అర్థమైంది. ఏ రకంగా ఈ సమస్యను పరిష్కరించాలా అని ఆలోచిస్తూనే ఉంది ప్రియంవద.
*
వివాహమయ్యాక ఒక్కసారి కూడా మహారాజు మందిరానికి రాని మహారాణి, మహారాజుల వారు సరిగ్గా యుద్ధానికి వెళ్లే ముందు రావడంలో ఆంతర్యమేమిటి? చిన్నప్పటినుండి రాజమందిరాలలోనే మెలిగినందున, ఈ విషయాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదనే విషయం బాగా తెలుసు దేవసేనకు. అయినా వచ్చినామె మహారాణి. అందుకని, ప్రమీలాదేవికి మందిర ప్రవేశానికి అనుమతినివ్వలేదని మహారాజుకు ఎక్కడ తెలుస్తుందోనని, ఒక ప్రక్క భయంగానే ఉంది. ఇంకొక ప్రక్క క్షణం కూడా తీరిక లేకుండా మహారాజులు ఉండడం వలన, ఈ విషయం వారి వరకు వెళ్లదనే విశ్వాసం.
మహారాజులకు సన్నిహితులైన అనంతుల వారికి విన్నవించుకుందామంటే మహారాణి, మహారాజుల మధ్య ఉన్న అంతరం, వారికి తెలుసో! లేదో! తెలియకపోతే ఇప్పుడు తాను వారికి చెప్పినట్లు అవుతుంది. అది సమంజసం కాదు. పోనీ, మహారాజుల దృష్టిలోనే ఈ విషయం పెడదామనుకుంటే, యుద్ధానికి ముందు ఈ విషయం వారి దృష్టికి తేవడం సమంజసమా కాదా అన్న విషయం తేల్చుకోలేక పోతుంది. అందుకని ఏమి చెయ్యాలో పాలు పోవడం లేదు దేవసేనకు.
*
ఇంకొక ప్రక్క మహారాణి విదర్భ దేశ ప్రయాణానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అనంతుడు ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. ప్రయాణంలో రాకుమారికి అలసట తెలియకుండా, మార్గమధ్యంలో విడిది చేసేలా ఏర్పాటు చేస్తూ, అక్కడ కావలసిన రక్షణ ఏర్పాట్లను చేస్తూ, తనకు అత్యంత నమ్మకస్తుడూ, వీరుడూ అయిన విజయుని కొంతమంది సైన్యంతో పంపిస్తున్నాడు.
ఇవన్నీ ఇలా ఉంటే, మహారాజును కలుసుకోకుండానే ప్రయాణమవ్వాలేమోనని, ప్రమీలాదేవి బెంగటిల్లి పోతుంది. ఒకవేళ కలిసినా…. ఇంతకాలం నా మనసులో ఉన్నది మీరేనని ఏవిధంగా చెప్పాలో అర్థంగాక తల్లడిల్లిపోతుంది.
ప్రయాణంలోగా మహారాజును కలుసుకునే అవకాశం దొరకకపోతే, ఏమి చెయ్యాలన్న విషయం మీద, అవకాశాల కోసం అన్వేషిస్తూ ఉంది ప్రియంవద.
ప్రయాణం రోజు రానే వచ్చింది. మహారాజును కలుసుకోవటం జరగలేదు. మహారాజ మందిరం దగ్గరకు వచ్చిన ప్రమీలాదేవిని యధావిధిగా, “మహారాజు సమాలోచనలలో ఉన్నారని, ఎవరికీ ప్రవేశం లేదని,” అడ్డగించింది దేవసేన.
ప్రతి రోజులాగ ఈరోజూ ఊరుకుని వెనుకకు తిరిగి పోలేదు ప్రమీలాదేవి. “ఈ దేశ మహారాణిని ఆజ్ఞాపిస్తున్నాను. అడ్డు తొలుగు” హూంకరించింది. ఆమె స్వరంలోని తీవ్రతకు ఒక అడుగు వెనక్కు వేసింది దేవసేన. అదే అదనుగా ముందు ప్రియంవద దారి తీస్తే, మిగిలిన చెలికత్తెలతో మందిరంలోకి మొదటిసారిగా ప్రవేశించింది ప్రమీలాదేవి.
సేవకులు తెచ్చిన, తెరలతో కప్పి ఉంచిన, చిత్రపటాన్ని శయన మందిరంలో శయ్య ప్రక్కన జాగ్రత్తగా అమర్చింది. “మహారాజుగారు వచ్చిన తక్షణం, ఈ చిత్రపటాన్ని మేము వారికి బహుకరించామని చెప్పవలసినదని” దేవసేనకు చెప్పి చెలికత్తెలతో అంతఃపురానికి, అక్కడ నుండి విదర్భ రాజ్యానికి ప్రయాణమయింది ప్రమీలాదేవి.
*
ఇంతకాలము లేనిది, ఇప్పుడీ యుద్ధ సమయంలో, అడ్డు చెప్తున్నా, ప్రమీలాదేవి మహారాజు మందిరాలకు రావాలనుకోవడం, బలవంతంగా చిత్రపటాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడం… దేవసేన మనసు కీడుని శంకించింది.
ప్రమీలాదేవి మందిరం దాటిన వెంటనే, అనంతునికి వార్త పంపించింది. హుటాహుటిన మందిరానికి వచ్చాడు అనంతుడు. అతనిలో కూడా అనేక సందేహాలు.
తెరలతో కప్పి ఉంచిన ఆ నిలువెత్తు చిత్రపటాన్ని చూసి, అనంతునికి ప్రమీలాదేవి రాక వెనక, ఈ చిత్రపటం బహుకరణ వెనక, ఏదైనా కుట్ర దాగుందా? అనే కోణంలోనే ఆలోచించసాగాడు.
వివాహమైన ఇన్ని నెలలుగా ఏరోజూ మహారాజమందిరం లోనికి రాని ప్రమీలాదేవి, సరిగ్గా జైత్రయాత్ర ముందు రావటం, నిలువెత్తు చిత్రపటాన్ని బహూకరించడం, అదీ… శయన మందిరంలో, మహారాజు శయ్య ప్రక్కనే అమర్చడం… సందేహించాల్సిన విషయంగా తోచింది. దానికి తోడు ఆమె యుద్ధవిద్యలలో శిక్షణ తీసుకోవాలనుకోవడం, చిత్రంగా దానికి తామే ముందుండి నేర్పించడం …. అనుమానించదగ్గ విషయంగా తోచింది.
ప్రత్యర్ధులను ఓడించాలంటే ముందు నమ్మకంగా మెలగడం, ఆపై వెన్నుపోటు పొడవడం… అధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎప్పుడూ చేసేదిదే. వినయ విధేయతలు కలిగిన శిష్యురాలిగా ముందు నమ్మకాన్ని చూరగొని, సరిగ్గా జైత్రయాత్ర సమయంలోనే వారి రాజ్యంలో అమ్మవారి ఉత్సవాలంటూ, ఈ రాజ్యాన్ని విడిచి వెళ్లాలనుకోవడం సామాన్య విషయంగా తోచలేదు. ఆమె ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందేమోనన్న కోణంలోనే సాగాయి అనంతుని ఆలోచనలు.
దానికి తోడు, ఆమె తండ్రిగారు యుద్ధంలో ఓడిపోవడం, ఆమెకు ఇష్టంలేని పెండ్లి చేసుకుని ఇక్కడికి రావడం, మహారాజును దూరం పెట్టడం… ఇవన్నీ అనంతుని సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పుడీ విషయం మహారాజు ముందు పెట్టాలా! వద్దా! అన్న మీమాంసలో పడిపోయాడు. మహారాజుకు ఆమెంటే ఇప్పటికీ ఇష్టమని, ఆమె కోసం ఏమి చెయ్యడానికైనా సిద్ధపడతాడని అర్థమవుతూనే ఉంది. ఆమెకు వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోరని తెలుస్తూనే ఉంది. జైత్రయాత్రకు వెళ్లే ముందు మహారాజుల మనసును డోలాయమానంలో పెట్టడం ఎందుకని, విషయం మహారాజుకు చెప్పకూడదనే నిర్ణయించుకున్నాడు.
ముందు చిత్రపటంలో ఏముందో పరిశీలించాలి. ఒకవేళ ఏమైనా మందుగుండు సామాను పెట్టి… తెరలు విప్పగానే అది పేలుతుందా? లేకుంటే ఏదైనా విష పదార్థాలను లేపనం చేసి తెరలు తొలగించగానే, ఆ విషవాయువులతో ఏదైనా ప్రమాదం జరుగుతుందా? ఈ మందిరంలో ఆ చిత్రపటం ఎవరికైనా సంకేతమా? ఏ రకంగా మహారాజు మీద, కుట్ర జరుగబోతుంది? ఇందులో శత్రుదేశ రాజుల హస్తమేమైనా ఉందా? ఈ విధంగా సాగుతున్నాయి అనంతుని ఆలోచనలు. చిత్రపటం మహారాజుకు మహారాణి బహుకరించిందన్న విషయాన్ని పక్కన పెట్టి, సేవకులను పిలిపించి, “తెరలు తొలగించండి” ఆజ్ఞాపించాడు.
అతని ఆజ్ఞమేరకు జాగ్రత్తగా తెరలు తొలగించారు సేవకులు. అదొక అందమైన చిత్రపటం. అద్భుతంగా చిత్రీకరించారు. అందులోని మనుషులు సజీవంగా ప్రాణాలతో మన ముందు నిల్చున్నట్టు… ఆ చిత్రపటంలో ఒక యువకుని చేతులలో వాలిపోతున్న యువతి, ఆమె ముగ్ధ మోహన రూపం, ఎవరినైనా సమ్మోహన పరుస్తుందంటే అతిశయోక్తి కాదు. కాని, అందులో ఆమె ధరించిన శిరస్త్రాణం, ఆమె శిరస్సు నుండి జారిపడుతుంది. యువతీ యువకులిద్దరూ ఈ లోకాన్నే మర్చిపోయి, ఒకరి చూపుల్లో ఇంకొకరు తాదాత్యం చెందుతున్నారు. చుట్టూ దట్టంగా చెట్లు… చూస్తుంటే అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించినట్టుగా ఉంది. ఇందులో ఏదైనా సందేశముందా?
ఇంకొక సమయంలో అయితే ఆ చిత్రపటాన్ని చూసి, అది చిత్రించిన వారి కౌశలానికి జోహార్లు అర్పించేవాడే! కాని, ఇప్పుడు పరిస్థితి అది కాదు. మామూలు చిత్రపటంలా కనిపిస్తూ, ఎన్ని రహస్యాలు దాచుకుందో తనలో! ఆ రహస్యాలను ఛేదించకపోతే అనుకోని ముప్పు వాటిల్లవచ్చు. అందుకని ఏ రకమైన అలక్ష్యాన్ని ప్రదర్శించకుండా, అడుగడుగునా జాగ్రత్త పడాలి. ఇలా అనుకుంటూ అనుమానంతో దగ్గరగా వెళ్ళి తరచి పరిశీలించాడు? సందేహాన్ని రేకెత్తించే జాడలేమైనా కనిపిస్తాయేమోనని. అవేవీ కనిపించలేదు.
చిత్రపటాన్ని యధాతధంగా ఉంచి, దేవసేనకు కనుసైగ చేసాడు, మహారాజుకు ఎంత అవసరమో అంతే చెప్పమని. ఏమి చెయ్యాలో గ్రహించుకుంది దేవసేన.
*
మహారాజు మందిరంలోకి వేంచేయగానే, “ఈ చిత్రపటాన్ని మహారాణిగారు మీకు బహూకరించారు” అని మాత్రమే చెప్పింది దేవసేన. ఇంకే విషయమూ చెప్పలేదు.
దానికే విక్రమసింహ “ఏమిటీ! మహారాణివారు మా మందిరంలోకి వేంచేశారా? ఎప్పుడు? మాకు వెంటనే తెలియజేయ లేదెందుకు? మేము లేనందుకు వారెంత మనస్తాపం చెందారో?” ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ చిత్రపటానికున్న తెరలు జాగ్రత్తగా తొలగించాడు.
ఆ చిత్రపటాన్ని చూసి మ్రాన్పడిపోయాడు. “అయ్యో!” అన్న మాట అతని నోటి నుండి వచ్చింది. రెండు చేతులతో శిరసును పట్టుకొని శయ్యపై కూలిపోయాడు. అతని దిగ్భ్రాంతిని చూసి, తామూహించినదే నిజమైందని దేవసేన తలచి, ఇప్పుడు తన తక్షణ కర్తవ్యమేమిటని ఆలోచనలో పడింది.
తర్వాత భాగం వచ్చే సంచికలో…