సాంస్కృతిక కళలు – పరిణామం, సమాజం

1- 3- 2025 తరుణి పత్రిక సంపాదకీయం

సర్వకాల సర్వావస్థలలో సరైన కృషి చేసే మనుషులు చావు పుట్టుకల మధ్య self injury awareness తెచ్చుకుంటారు. ఎందుకంటే పని విలువ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక నిబద్ధతతో ఉంటారు. మామూలుగా ఇలాంటి వాళ్ళు కళాత్మక హృదయులై ఉంటారు కాబట్టి ధైర్య సాహసాలతో విజయాలు సాధిస్తారు.  సమాజాన్ని నిర్మించేవాళ్ళే మనుషులు .

కష్టాన్ని సుఖాన్ని అనుభవ పరంపరగా నడిచి వచ్చే ఈ బ్రతుకు పయనంలో ఎవరైనా సరే ధర్మంతో బ్రతకాలి. ఓటమిని చవిచూసినా, గెలుపును అందుకున్నా ఈర్ష్యా ద్వేషాలు దరిచేరకుండా ఉండాలి.  మా ఇల్లు మా ఇల్లు అనే మాట పూర్వం మాట్లాడే వాళ్ళు కాదు, మన ఇల్లు అనే ఎక్కువ శాతం ప్రజలు అనే వాళ్ళు. ప్రస్తుత కాలంలో నాది నేను తప్ప వేరేది లేకుండా ఉంటున్నారు. ఎప్పుడైనా “పాసంగం” సరిగా ఉండాలి అంటారు. అంటే తూకంలో వచ్చే తేడా. తక్కెట్లోని రెండు పళ్ళాలు అటూ ఇటూ ఊగుతూ ఉండకుండా చూడడం. జీవితంలో కూడా ఈ పాసంగం ఉండాలి. అందుకే జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంస్కృతి గురించి ఒక అవలోకన చేసుకోవాలి.

మన జానపద కళాకారుల వల్ల బ్రతికిన సంస్కృతి సంప్రదాయాలు ఇప్పటికీ ఈ నాగరిక ప్రపంచం అనుసరిస్తున్నది. జీవించడమే కళ. సరియైన పద్ధతిలో జీవించే మనుషులంతా కళాకారులే. “రామాయణం” ఇంకా ఎందుకు బ్రతికున్నది? రామాయణంలో కథ ఉన్నది, జీవితం ఉన్నది అవి మనదాకా చేర్చింది ఆది మానవ సమాజమే. సంప్రదాయ జానపద కళల వల్లనే.

శివరాత్రి జాగరణ చేస్తారు. దీని వల్ల ముక్తి భక్తి ప్రవహిస్తాయి.ఇవి ఆరోగ్య హేతువులు. ఈ జాగరణలో అంతరార్థం గ్రహించాలి. భక్తి వల్ల భయం వస్తుందా భయంతో భక్తి పెరుగుతుందా అనే వితండవాదన పక్కన పెట్టి భయభక్తులతో కూడిన శివనామ స్మరణ అవసరం అనే జ్ఞానం కలిగితే….చేస్తున్న పూజలకు ఒక పరమార్థం ఉంటుంది.

భారతీయ పురాతన వైద్యులు ఏర్పరిచిన ఆయుర్వేద శాస్త్రంలో “లంఖణాలు” చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నవి. ఇప్పుడు వస్తున్న ఆరోగ్య సూత్రాలను చూస్తే దీనికి మూలం ఎక్కడిది అనే ప్రశ్న తప్పకుండా ఉద్భవించాలి organic food తినాలని, fresh vegetables fresh fruits ఒంటికి మంచివని, ఫుడ్ సైకిల్ సిస్టం తో బ్లడ్ ప్యూరిఫై అవుతుందని ఇలాంటివి ఎన్నో ఎన్నో చెప్తున్న ఈ క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే మన పూర్వీకులు చెప్పిన ఈ పండుగలు ఈ ఉపవాసాలు వీటి వెనక ఉన్న ఆంతర్యం బోధపడుతుంది.

భోజనం చేసేటప్పుడు క్రింద కూర్చొని భుజించాలి అనే నియమం ఉంటుండేది. ఇది ఎందుకు పాటించి ఉంటారు? ఆ రోజుల్లో ధనికులైన పేదవాళ్ళైనా అలవర్చుకున్నటువంటి పద్ధతులవి. ఒకప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు ఏది తింటే అది మనము తినాలని ఏది కట్టుకుంటే అవి మనము కట్టాలని వాళ్ళని అనుకరించే సాధారణ ప్రజానీకం బాగా కనిపించేది. ఇప్పుడు ప్రపంచమే అరచేతిలోకి వచ్చాక, ఏదో విధంగా డబ్బు అనేది చేతిలో ఆడుతున్నప్పటినుంచి….అనుకరణ మరీ సులువు అయిపోయింది. అనుకరణలు మంచి వైతే నష్టమేం లేదు. మంచివి కాకుంటేనే కష్టం, నష్టం. కానీ సహజత్వాన్ని కోల్పోయి ఆర్టిఫిషియల్ మెంటాలిటీస్ ఎక్కువైపోయి ఓ విచిత్రమైన పరిస్థితిలో ఊగిసలాడుతున్నది దేశం.

అలవాట్లు పద్ధతులే కదా ఆచారాలు.వాకిట్లో ఆవుపెండ తో చాన్పు చల్లి ముగ్గు పిండితో ముగ్గు అందంగా అలంకరించడం అనే శాస్త్రీయతను ఆచారం గా మలుచుకున్న వాళ్ళం. ఇవి ఇప్పటికీ పల్లెటూర్లలో పాటిస్తున్నారే కానీ పట్టణాలలో పాటించరు. సరే పేడ ఆవుదైతేనేమి గేదెదైతేనేమి పేడ పట్టణాలలో దొరకడమే కష్టం కాబట్టి రంగు నీళ్లను పేడ లాగా చల్లుతున్న రోజులను మనం చూస్తున్నాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి, స్వేచ్ఛ అందిన  తర్వాత ఆధునికత పెచ్చు మీరిన ఈ కాలంలో మనవైన పద్ధతులు సంస్కృతులను భూస్థాపితం చేసేస్తున్నాం.

ఆచారాలు వ్యవహారాలు మానవ సంబంధాలు,పరిపాలనా పద్ధతులు వంటివి సంస్కృతిలో వచ్చే విషయాలు. వీటిలో లలిత కళలు భౌతిక రూప ప్రాధాన్యత కలిగిన సంస్కృతులు. మానసిక సంస్కృతులు కూడా ఉంటాయి. పెద్దవాళ్ళను  పిలిచే వరుసలు, చిన్న వాళ్ళని పిలిచే వరుసలు వంటి వావివర్సల విషయాలు, బంధాలు బాధ్యతలు ఇందులోకి వస్తాయి. సహనమూ, సామూహికత ,ఆధ్యాత్మికత వంటి విలువలను నేర్పించే మతం కూడా మనసుకు సంబంధించిన సాంస్కృతిక రూపమే.  కుటుంబ విలువలను కాపాడుకోవడం, వారసత్వ విశేషాలు, ఆహారపు అలవాట్లు కుటుంబ సమ్మేళనాల విలువలు వంటివన్నీ ఈకోవకే చెందుతాయి. వీటిలో ప్రముఖమైనవి వాగ్గేయకారులు ,కళాకారులు మనకందించిన సాహిత్య సంపద లోని తత్వాలు, గేయాలు, పాటలు, కీర్తనలు very rich culture తో ఉన్నవి. పూజా విధానాలు పాటించే ఆలయాలు వంటివి, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేవి, పురాణేతిహాసాల నీతి కథలు వంటివి మన సొంతం. పరమత సహనం మన దేశ ఔనత్యానికి చిహ్నం.ఇవన్నీ ఏ గాలి వాటానికో, ఏ తూర్పు తుఫానులకో లొంగిపోకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిదీ. సమాజం అంటే మనమే. మనంతట మనం సెల్ఫ్ ఇంజురీస్ కి గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది.

_____****____

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కనిపించని జాడలు

పాఠకుల స్పందన