సామెతల ఊట- సునందమ్మ నోట

సామెత -6
అతి వినయం -ధూర్త లక్షణం
****
“అవ్వా! అవ్వా! “అతి వినయం -ధూర్త లక్షణం అంటేంది చెప్పవా?..

కత చెప్పమని నాల్దినాల సంధి ఒకటే నస బెడుతువున్నవ్ గద. చెప్త పా ” అనంగనే నా దోస్తులను దీసుకొత్త పెయ్య దుడ్డోలే గంతులేస్కుంట బోయింది.చటుక్కున పది మందిని ఎంటేసుకొచ్చిన భూలచ్మిని,పిలగాండ్లను అబ్బురంగ జూసుకుంట “కతలంటే ఎంత ఆపాచ్ఛనో” అనుకుంది.

అనగనగా ఓ సాములోరు. అట్టాంటి ఇట్టాంటి సాములోరు గాదు. ముఖానికి బూడిద పూతలు.మెళ్ళో పూసల దండలు.మన జెండా పైరంగు తెల్సుగా కాషాయం గుడ్డతో కుట్టించుకున్న లంబా చౌడా బట్టలు.” వింటున్న భూలచ్మి కిసుక్కున నవ్వింది.” గట్ల నవ్వితే కళ్ళు బోతయ్.వింటున్న ఓ పిలగాడు.అంతిన్నంక సూద్దాం. వినుండ్రి” బుద్ధిగ సద్దుకుని చెవులు రిక్కించారు.

ఆ సాములోరు ఊళ్ళో గుళ్ళో తిష్ట ఏశాడు. జనాలంత పడీ పడీ మొక్కుడు.చెయ్యి చూపించుకునుడు.పదో పరకో ఆయన తెచ్చుకున్న సంచీలో ఏసుడు. సాములోరి పండగ పండింది.భక్తుల పసాదాలతో పొట్ట నిండుతోంది.పైసలకు పైసలు.పైంగ గౌరవం. అద్దమ రాతిరి పైసలు లెక్కేసుకుని ఉబ్బి తబ్బిబ్బయ్యిండు. పెద్ద గుడ్డ సంచికి లోపల పైకి కనబడకుండా కానాలు కానాలు కుట్టిండు. ఒక్కో కానాలో నగా నట్రా,పదులు, నాణాలు భద్రంగా దాచి పెట్టడం మొదలు పెట్టిండు.

గిదంతా భక్తుడి పేరుతో వచ్చిన ఓ దొంగ కనిపెట్టిండు.సాములోరికి వద్దన్నా సేవలు జేయడం మొదలు పెట్టిండు. పాదాలొత్తడం దగ్గర్నుంచి. ఇతర భక్తులు ఏమిచ్చినా జాగర్త చేసి అతి వినయంగా సాములోరికి ఇవ్వడం.

గదంతా జూస్తున్న సాములోరికి ఆ భక్తుడిపై మస్తు గురి కుదిరింది. ఆ వూరి నుంచి మరో చోటికి వెళ్తున్న సాములోరిని యిడిచి ఉండలేనని,వస్తనని వేడుకుండు. సాములోరు సరే అన్నడు.
ఓ రోజు ఇద్దరు పక్కూరికి వెళ్ళి వచ్చిండ్రు. తన బట్టలకు అంటుకున్న గడ్డిపోస చూసి అయ్యో! అయ్యో! ఎంత ఘోరం జరిగిపోయింది. ఊళ్ళో కెళ్ళినప్పుడు మనం గూసున్న ఇంటోళ్ళ గడ్డిపోస బట్టకంటుకుంది.ఎంటనే ఇచ్చి రావాలి.”పరుల సొమ్ము పామసుమంటింది” సామీ! ఇచ్చొస్తా అని ఉరికి ఉరికి పోయి వచ్చిండు.

సాములోరికి మరింత గురి కుదిరింది. తన సొమ్మున్న సంచి ఇసుమంటి వాడికిస్తే యాడికి బోదు “ఎంత వినయం, ఎంత విధేయత” అనుకున్నడు.

ఓ రోజు ఊళ్ళోకి ఎళుతూ సంచిని ఆ భక్తుడికి పట్టుకొమ్మని ఇచ్చిండు. ఎంతో వినయంగా దాన్ని పట్టుకొని సాములోరు జనంలో ఉండంగ పరారై పోయిండు. ఎంత ఎతికినా దొరకలేదు. ఆ సంచి విషయం చెబితే ఊరోళ్ళు తంతరని లోలోపల ఏడుస్తూ అక్కడ్నుంచి ఎళ్ళిపోయిండా సాములోరు.

“గదిరా కత! అనంగనే “దొంగ సాములోరికి- దొంగ భక్తుడు” బాగయ్యిందని సంకలు కొడుతూ.. “అతి వినయం ధూర్త లక్షణం” అంటే అర్థమయ్యిందవ్వా! అన్నరు.

అదండీ సంగతి “అతి వినయం-ధూర్త లక్షణం” అంటే ఇదే.అతి అంటే ఎక్కువ. వినయం అంటే విధేయత, నడవడిక.ధూర్త అనగా దుష్టుల.లక్షణం అనగా గుణం, స్వభావం.అతి వినయం చూపేవారిని ఓ కంట జాగర్తగా కనిపెట్టాలి.
****
సామెత -7
అందని ద్రాక్ష పుల్లన
*****
లచ్చక్కా! లచ్చక్కా!ఇంకో సున్నుండ తినాల్నుంది.నువ్వోటి నేనోటి తిందామా? తనబ్బి పైకి చూస్కుంట అంటున్న తమ్ముడిని చూసి”
“ఒరేయ్ !అవ్వేం జెప్పిందో గప్పుడే మరిసినవా? దినాం ఒక్కటి కంటే ఎక్కువ తింటే పొట్ట నొస్తదన్లే?

“నీయవ్వ! అవ్వ గట్లనే అంటది గని. అవ్వొచ్చేది కనిపెట్టు. నేను స్టూలు పీట ఎక్కి తీస్త.” అనుకుంట డబ్బా అందుకోబోయి స్టూలు బెనికిసలాడి దబ్బుమని కింద పడ్డడు.

ఏందిరా సప్పుడు? గబ్బగబ్బ ఏమైందోనని ఉరుకొచ్చి అంటున్న అవ్వ మాటలకు “ఏం లేదవ్వా! అని భూలచ్మి,బుష్కోటు లాగు దులుపుకుని లేచి నిలబడ్డ బుడ్డోడేమో.”నువ్వు జేసిన సున్నుండలేం బాలేవు అవ్వా! అంటుంటే నవ్వొచ్చింది అవ్వకు.

అవున్రా “అందని ద్రాక్ష పుల్లనేగా” అంది.

భూలచ్మి, బుడ్డోడు ఏమర్థం కాక తెల్లమొహాలేసి సూస్తుంటే.. గదేందో నే జెప్తా రాండి మంచంకాడికి తీస్కపోయి చెరో పక్కన కూసబెట్టుకుని చెప్పింది.

అడవిలో మీలాగనే రెండు నక్క పిల్లలు ఆడుకుంట ఆడుకుంట ఓ ద్రాక్ష తోటకెళ్ళినయ్. అక్కడే చానా సేపు ఆడుకున్నయి. తోటలో పందిరి కింద కొన్ని ద్రాక్ష కాయలు రాలి పడుంటే వాటిని చెరోటి నోట్లో వేసుకుని భలే! భలే! తీయంగున్నవి అనుకుంట దొరికినవన్నీ ఏరుకొని తిన్నవి. వాటికి ఇంకా తినాలనిపిచ్చింది. పందిరి పైన గుత్తులు గుత్తులుగా ఏలాడుతున్న వాటిని ఎగిరెగిరి అందుకో బోయినయ్. ఎంత ఎగిరినా అందలేదు. అప్పుడా నక్క పిల్లలు “అవి పుల్లంగున్నయ్. అందుకే మనకు అందలేదు.పోదాం పా అనుకుంట అక్కడ నుంచి ఎళ్ళిపోయినయ్.” అందని ద్రాక్ష పుల్లన” కత బాగుందా అనంగనే ఇద్దరూ సిగ్గు పడుకుంట అవ్వ కొంగులో మొఖం దాసుకున్నరు. “ఇంగ పటండ్రా! మీ కోసమే నా పైసల కీసలో పొట్లం గట్టి దాసిన.పటుండ్రి! చెరోటి ఇచ్చింది.

అదండీ! సంగతి. “అందని ద్రాక్ష పుల్లన” అంటే. కావాలనుకున్నయి దొరకనప్పుడు, మనకు ప్రాప్తం లేదు అనుకోవడం కంటే అవి బాగా లేవు కాబట్టే మనకు దొరక లేదు అని సర్దుకు పోవడాన్ని ఈ సామెతతో పోలుస్తారు.

కీస – సంచి. బుష్కోటు- షర్ట్.
***
సామెత -8
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు
****
అవ్వా! ఏం జేత్తున్నవ్? పెయ్యి బాగుందా? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే నవ్వుతూ..

ఏందిరా తమ్మీ! వకీలు సాబోలే ఒకటే అడుగుతుండవ్! అంతా బాగేగని నువ్వేంది గట్లున్నవ్! తడ్సిన కోడిపిల్లొతికే. ఇంతకి నీ ఒంట్లో ఎట్టుంది? బల్లెపీట మీద కూసోబెట్టి ఎదురు ప్రశ్నలు ఏసింది.

నీగ్గాకపోతే ఇంకెవలికి చెప్పుకుంట. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుద్ది. పొల్లకు లగ్గం జేసినన్న సంబురం లేదు. అల్లుడోళ్ళు దాన్ని సిత్ర యింసల బెడుతున్నరు. అంగరంగ వైభోగంగ లగ్గం జేసిన.ఆళ్ళు అడక్కుండనే ఎక్కడ లోటు రావొద్దని ఎక్కువే బెట్టిన.గింత జేస్తే.తేపతేపకు పొల్లతో అది గావాలె ఇది గావాలె అని ఫోన్ జేపిచ్చుడు. గిప్పుడు పండక్కి వచ్చిండు.ఆళ్ళను జూత్తుంటేనే కాల్జేతులు ఆడట్లే.మస్తు గుబులైతాంది. గందుకే నీతానకొచ్చిన.”

గదేదో నే జూస్కుంట. అంతా సక్కబడుద్ది.ఈ అవ్వ రమ్మందని తోల్కొనిరా! అని పంపింది.

కొత్త జంట సూడ ముచ్చటగున్నరు. పోరడికేం పొయ్యే కాలమొచ్చింది. సక్కంగ కాపురం జేయకుండా!సక్కదనాల పొల్లను యిబ్బంది పెడుతుండు ” అనుకుంటూ “రారా మనవడా! ఒసే మనవరాలా ఎంత పెద్దిరికం ఒచ్చిందేమే! సీరకట్టులో సూడ ముచ్చటగున్నవు. ముంతలో మజ్జిగుంది గని బాగా సిల్కి అందులో లేత కల్యమాకు,గింత ఉప్పేసి మూడు గలాసుల నిండా పట్రా ‌.భూలచ్మిని అడిగితే యాడున్నయో చెప్తది. లోనికి పంపింది.

“మనవడా! నువ్వు శానా మంచోడివని మా వాడ కట్టంత చెప్పుకో బట్టిండ్రు. కాణీ కట్నం తీస్కోలేదంటగా.ఉబ్బితబ్బిబ్బైనట్టుగా కాలరెగరేయడం జూసి.. “కీలెరిగి వాత బెట్టాలె” అనుకుంట.
“ఎన్ని బెట్టినా గందుకేనా సిన్న సిన్న కోరికలు కోరుతున్నవ్.గదేమన్న బావుందా? మంచిపేరు మట్లె గలవట్లే.,

“ఆ మాటలకు ఉడుక్కుంటూ ఎవురు జెప్పిండ్రు. నా పరువు తీస్తున్నరు. వీళ్ళ యవ్వారం పెళ్ళయిన కానించి సూస్తున్న. నన్ను బద్నాం చేస్తుండ్రు.”

“ఆళ్ళ సంగతి నేజెప్తా తీ.నీతాన ఏదైనా తేడా ఐతే..దొండాకు పసరు గక్కిస్తా‌. నీతో పాటు నీ అమ్మ అయ్య సంగతేందో తేలుస్తా!

గా మాటలకు గజ్జున వణుకుతూ అవ్వా! గిదంతా మా అమ్మ నాయిన వల్ల జరిగింది.ఇంగెప్పుడూ అట్ల జరగదు.పువ్వుల్ల బెట్టి సూసుకుంట.ముఖానికి బట్టిన చెమటల్ని దస్తు రుమాలుతో తుడుసుకుంటూ అంటుండంగనే భూలచ్మి,ఆ వెనకాల కొత్త పెళ్ళి కూతురు మూడు గలాసుల నిండా మజ్జిగ పట్కొచ్చిండ్రు.

గటా గటా తాగి అవ్వ కాళ్ళకు దండం పెడుతుంటే సిత్రంగా అనిపించింది.ఆ ముగ్గురికి.

“భూలచ్మికి ఏదో అర్థమైనట్టు అవ్వా! “అందితే జుట్టు అందకపోతే కాళ్ళు “అంటే గిదేనా” అంది. కొత్త పెళ్ళి కొడుకు ఒక్క సారిగా ఉలికులికి పడటం జూసి అవ్వ లోలోపల నవ్వుకుంటూ అర్థమై కానట్టు “తల నిలుగ్గా అడ్డంగా ఊపింది.”

గదండీ సంగతి”అందితే జుట్టు అందకపోతే కాళ్ళు” అంటే…
***
సామెత -9
అన్నీ ఉన్న ఆకు (ఇస్తరాకు)అణిగిమణిగి ఉంటుంది – ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
****
“అవ్వా! అవ్వా! గియ్యాల మా బళ్ళో పెద్ద లొల్లయింది.నాకైతే మస్తు బయ్యమయ్యింది. పెద్ద పెద్ద గుతుపకట్టెలు పట్టుకోని రౌడీల్లెక్క కొంతమందిరి వొచ్చిండ్రు. గియ్యాల మా సార్లు మస్తు పరేషాన్ అయ్యిండ్రవ్వా! మా సార్లు ఎంతొద్దన్నా కిటికీల్లోంచి సినిమా లెక్క జూసినం.మా పెద్ద సారు అందర్నీ సముదాయించి లొల్లి ఆపుజేయించిండు.లేకుంటెనా ఎవ్వలివో ఒకలివి తలకాయలు పగిలేయి”.

బడినుంచి వచ్చిందో లేదో భూలచ్మి “వసదాగిన పిట్టొతికె” అవ్వెంట దిరుక్కుంట ఒకటే జెప్పుడు.

గట్లెట్ల అయ్యింది.ఊళ్ళో కొట్లాటలు బల్లె దాకెట్ల బోయినయ్.గిసుమంటి యిషయాలు పొల్లగాండ్లను అస్సలు గుచ్చి గుచ్చి అడగొద్దు.కూపీ తీయొద్దు. ఎట్లబ్బా! అని రంధి జేస్తూ ఏం మాట్లాడక బొయ్యేతల్కి అవ్వ గూడ పరేషాన్ అయితుందట్టుంది అనుకుంటా దోస్తుల్తో ఆటకు బొయ్యింది.

ఇంతట్లనే అవ్వో అవ్వా! ఏడున్నవే!పంచె ఎగదోసుకుంట, కండువా సవరిచ్చుకుంట ఆదరా బాదరా వస్తున్న మల్లేశాన్ని జూసి “ఏందిరా? ఏమైంది? ఏం తక్లీబయ్యింది? నిమ్మలపడు.ముందుగాల గీ కుర్సీల కూసో!ఇగ జెప్పు” అంది.

“ఏం జెప్పనవ్వా! గవేవో పోరగాండ్లను తిట్టొద్దు, బెత్తంతో కొట్టొద్దని సర్కారోళ్ళేవో సట్టం బెట్టిండంట గంద.అగ్గో గప్పట్నుంచే పొలగాండ్లు అదుపాజ్జల లేకుండ బొయ్యిండ్రు”.

అసలు యిషయం గీ పిట్ట కతేంద్రా తమ్మీ!
అగ్గో ఆడికే వత్తన్న. పొల్లగాండ్లకు సదువెట్టాగైనా వొచ్చేలా జెయ్యాలని మన బల్లో ఓ సారు గా ఏడోతరగతి పొల్లగాండ్లకు ఓ రూల్ బెట్టిండంట. పాఠాలు సదుకొని రమ్మని అందులో విషయాలను అడుగుడు.చెప్పనోళ్ళను చెప్పినోళ్ళతో సెంపదెబ్బ ఏయించుడు.గప్పన్నించి కొంచెం బాగుపడుతన్నరకుంటే నిన్న మన పెంటిగాడి కొడుకు ఈరేశం గాని కొడుకుతో మూన్నాలుగు తేపలు సెంపదెబ్బలు తిన్నడంట.ఇంగేముంది పెంటిగాడి కొడుకు సారు కావాలనే శెంపదెబ్బలు ఏయించిండు. సారు సంగతి ,గా ఈరేశం కొడుకు సంగతి తేలుత్తానని పక్కన దోస్తుగాళ్ళతో చెబుతుంటే విని సార్ గట్టిగా కలాస్ పీకి ” ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటే గిదే.రోషముంటే సదువులో సూపెట్టాలె” అండంట. ఇంకేముంది బడొదిలే దాక పామొతికె బుసకొడుతూ ఎల్లిండంట. ఏం జెప్పిండో ఏమో పోరడు.అయ్య నలుగురి నేసుకుని గుతపకట్టెల్తో వొచ్చి ఒకటే ఈరంగం ఏసిండు.

పాఠం ఇంటున్న ఈరేశం కొడుకును బరబరా బయటికీడ్చి” మా పొల్లగాడ్ని కొట్టడానికి ఎంత ధైర్నం రా అని నాలుగు పీకిండట. సారడ్డం బోతే మా పొల్లగాడ్ని ఏదో తిట్టినవంట గదని ఆయన మీద ఎగబడ్డడంట.యిషయం దెల్సి మేమంతా ఉరికురికి బోయినం. ఎదవ నాయాల బాగా పీకల్దాక పట్టించి వొచ్చిండు. ఏం మాట్లాడుతుండో ఆడికే తెల్వట్లే. పాపం ఈరేశానికి సర్థి జెప్పితే బాగనే ఇనుకున్నడు.ఆడు కొంచెం సదుకున్న పోరడు గాబట్టి సరిపోయింది.మర్లబడితే ఏమన్నుందా? శాల్తీలు లేశేయి.”

అందుకేరా తమ్మీ! మన పెద్దోళ్ళు ఊకెనే అన్లే” అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది- ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని”. ఈరేశం గాడికి ఇజ్జత,ఇవేకం ఉండబట్టి సరిపోయింది. గీ తాగుడా! గా అజ్ఞానమా! ఏది తమ్మీ! గిసుంటివి జరగడానికి కారణం. వాపోతున్న అవ్వని జూసి రెండూ అవ్వా! సదువుంటే మంచి చెడూ తెలుత్తయి.తాగితే ఒళ్ళు సోవి ఏడుంటది.నువ్వన్నట్లు .ఇయ్యే ఈటన్నటికి మూలం ” అనుకుంట ఎట్టాగైతేంది పేపర్ల కెక్కకుండ,బడి అందరి నోళ్ళల్ల బడకుండా యిశయాన్ని కమ్మినం” అన్నడు మల్లేశం.

గదండీ! “అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది – ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది”అంటే..
చదువు సంస్కారం ఉన్న వ్యక్తులు ఏ విషయానికి తొందర పడరు.అన్ని వైపులా ఆలోచిస్తరు. పెంటయ్య కొడుకు స్థానంలో వీరేశం కొడుకుంటే ఇంత జరిగేది కాదు. అవి లేక పోవడాన్ని ఏమీ లేని ఆకుతో పోల్చారు ఇక్కడ.
****”
సామెత -10
అచ్చోసిన ఆబోతు/ ఆంబోతు
*****
అవ్వా! అవ్వా! గిదిన్నవా? నాంచారమ్మత్త బిడ్డ నవ్య,కోటమ్మొదిన శెల్లె కోమలి, రంగమ్మ నాయనమ్మ మనువరాలు రమణి…గీళ్ళు ముగ్గురు బడికెళ్ళమని మొండికేత్తున్నరంట.ఎందుకంటే మూగిమొద్దుల్లా ఉలుకూపలుకు లేకుండా తలకాయలు వాల్చేత్తుండ్రంట.ఆ మూడిండ్లోళ్ళు పొల్లగాండ్లకు గాలేమన్న సోకిందేమో అనుకుంటుండ్రు. దినాం ముగ్గురు నడ్సుకుంట పక్కూళ్ళో పది సదివేందుకు ఎళ్ళేటోళ్ళు. నయాన బయాన ఎట్లడిగినా తలకాయలు అడ్డంగా నిలుగ్గా ఊపుడే తప్ప నోరిప్పడం లేదంట.” సంగతంతా ఎళ్ళగక్కి అవ్వేం జెపుతదోనని నోటొంక సూడబట్టింది చంద్రమ్మ .

ఎందుకనో మరి కూసింత కూపీ లాగక పోయినవ్ చంద్రా !సక్కగ సదూకునే బిడ్డలు.ఎవ్వల జోలికి పోయేటోళ్ళు గాదు. ఆణిముత్తాలని ఊళ్ళే అందరూ అనుకునే గాళ్ళు ఎందుకట్ల చేత్తుండ్రో నీకు తెలియదా! అనంగనే “అమ్మో! అందరు”ఆవులిత్తె పేగులు లెక్కబెట్టోళ్ళయితే” గీ అవ్వ ఆవులించకుండనే పేగులు లెక్క బెడ్తది.”

తడబడుకుంట ఆఁ ఆఁ తెలుసవ్వా! గుసగుసగా గొంతు తగ్గించి గా పెద్దిరెడ్డి కొడుకు లేడు గాడు గాని తొట్టి గాంగ్ పోరలే ఏదో బెదిరిచ్చి ఉంటరని, ఎవలికి వాళ్ళే సాటుమాటుగ సెవులు కొరుక్కుంటుండ్రు. అయ్య వో పెద్ద రౌడీ,కొడుకో సిన్న రౌడి. గాళ్ళంటే ఊళ్ళె చానామందికి చచ్చేంత బయ్యం.”అచ్చోసిన ఆంబోతుల్లా” తిరిగే గా పులుల నోట్లో తలకాయ దూర్సడం ఎందుకని ఆ పొల్లల ఇంటోళ్ళు సదువు మానిపిచ్చుదాం అనుకుంటుండ్రంట”.అసలు సంగతి జెప్పి కడుపుబ్బరం తగ్గించుకుంది.

” కాదే చంద్రా! “అతి రహస్సం శెవుల పోటని” అందరికీ యిషయం తెలుసు గంద.ఇంగ బయ్యమెందుకు? … ఏమో అవ్వా! గోడలకు చెవులుంటయ్! ఆళ్ళ జోలి తేవొద్దని,పోవద్దని మా ఆయన ముందరి కాళ్ళకు బంధమేసిండు.గందుకే గిట్ల.

సరెగని గా ముగ్గురిని మూడో కంటికి తెల్వకుండ నా తానకు దీస్కరా! మిగతాది నేజూస్కుంట. నచ్చజెప్పి పంపింది.

గంతే మూడోరోజు నుంచి ముసిముసిగా నవ్వుకుంట ముగ్గురు దోస్తురాళ్ళు బడికి పోతుంటే ఊళ్ళె అందరూ ముక్కున వేలేసుకుని అబ్బుర పడ్డరు. గప్పుడు గూడా గింత మార్పెట్లొచ్చిందని అడిగితే ఒక్కటే కుతికతో “ఏమో మాకేం దెల్సు. ధైర్నం వొచ్చింది ఎళ్తున్నం గంతే” అన్నరంట. “ఆర్నీ పొల్లలకు గింత దైర్నం ఎట్లొచ్చిందబ్బా! అనుకుంట ..గీ ముచ్చట దీసుకొచ్చి అవ్వకు సంబురంగా జెప్పి ,ఆవలిత్తే అవ్వ పేగులు లెక్క బెడదాం అనుకున్న చంద్రమ్మకు “అవునా! చంద్రా! అని సప్పుడుజేకుండ ఉండే తల్కి ఇంగేం మాట్లాడాల్నో తెల్వక ఎల్లిపోయింది.

పెదవి దాటితే పృథివి దాటుతుందని అవ్వకు మాబాగా దెల్సు.గందుకే చంద్రమ్మ ముందు బయట బడలె.తన సుట్టపోళ్ళ పిల్ల షీటీంల పనిజేస్తుందని గామెతోనే ముగ్గురికి ఏం జేయాలో ధైర్నం జెప్పించిందనీ, గాళ్ళను చిడాయించిన గా పెద్ది రెడ్డి కొడుకు గ్యాంగును టేషనుకు తీస్కబోయి మక్కెలిరగ్గొట్టి పంపిందనీ, గా పెద్ది “చెప్పుకుంటే పరువు బాయె చెప్పకుంటే మానం బాయె” అన్నట్టు నోరు మూసుకుని ఉండన్న సంగతి” మూడో కంటికి తెల్వకుండ కత నడిపించింది అవ్వ.

గదండీ సంగతి. “అచ్చోసిన ఆబోతు/ ఆంబోతు అంటే పల్లెల్లో కొందరు రైతులు, పెద్దలు కలిసి ఓ కోడె దూడను దేవుని పేరు మీద వదులుతారు. దానిని సాక్షాత్తు దైవం లెక్క జూస్తరు. అచ్చు అంటే అది దేవుని కోడె అని తెల్వడానికి ఒంటి మీద రెండు ముద్దెర్లు/ శంఖు చక్రాల అచ్చులు వేస్తారు. దానిని ఎవరూ ఏమీ అనరు కాబట్టి ఊరే కాదు,పంట పొలాల్లో కూడా ఎదేచ్ఛగ తిరుగుతుంది.అది పశువు గాబట్టి చెల్లుతుంది.మడిసి గట్ల జేస్తే ఏమన్న బాగుంటదా?అందుకే మరి ఏ హద్దూ పద్దూ లేకుండా అవారాగా తిరిగేటోడిని గిట్ల “అచ్చోసిన ఆబోతు” అంటారు.

Written by Urimalla Sunanda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“కనిపించని గమ్యాన్ని – పదార్థ విజ్ఞానంతో ‘దృశ్యమానం ‘చేసిన ప్రతిభాశాలి.”

కొత్త లోకాలు-6 (కాలమ్)