సాహిత్యమే నా ఊరట – మైథిలీ అబ్బరాజు

ముఖాముఖి

కవయిత్రి, రచయిత్రి, డాక్టర్ శ్రీమతి మైథిలీ అబ్బరాజు గారితో ‘తరుణి’ ముఖాముఖి

*కాంతా- కరవాలం*  అని ఒక సామెత ఉన్నది! కానీ ఆ సామెతను తిరుగరాస్తూ కాంత కరవాలంతో పాటు కలము, దానితో పాటు ఆలా, మరోచేత,గరిటనూ పట్టి మూడింటినీ దిగ్విజయంగా నడిపిస్తూ…

ఎందుకంటే వారి నివాసం *కుందమాల* అంటే *కుబేరుని నిధి* లా సాహిత్య సంపదను మూట కట్టి రచయిత్రి గానూ… ఇంటిని చక్క దిద్దుతూ  గృహిణిగానూ…

తమ పసందైన రచనలతో పాఠకులను ఉర్రూత లూగిస్తూ…రచయిత్రి గానూ… అటు ఆర్తులకు- రోగులకు సేవలు చేస్తూ…. వైద్యురాలిగానూ… ముప్పేటలుగా జీవితాన్ని ముచ్చటగా మలుచుకున్న మైథిలి అబ్బరాజు గారు రేపటి తరానికి వైద్యురాలి గానే కాకుండా ఈ అన్ని రంగాలలోనూ ప్రేరణ మూర్తులే!

     అందరికీ కాల మొక్క తీరుగానే కొలమానం ఉంటుంది! కానీ కాలాన్ని గుప్పిట పట్టుకునే వారు కొందరే! ఆ కొందరిలో కుందమాల నివాసి మన డాక్టర్ మైధిలి అబ్బరాజు గారు ఒకరు.

కలాన్ని- గళాన్ని- గరిటనూ, చేయి తిప్పకుండానే తిరగవేస్తున్నారు…మరి దాని వెనుక  ఆ కథ ఏమిటో? ఆ కమామిషు ఏమిటో? తెలుసుకొనండి.

ఆమె పనిలోని నైపుణ్యాలకు పులకించండి !!! వారి అడుగు వెనుక అడుగు వేసి నడవండి!!! ఇంకా దేనికి ఆలస్యం రండి వారిని కలుద్దాం!  వారెవరో కాదు బెంగుళూరు వాస్తవ్యులైన డాక్టర్ మైధిలి అబ్బరాజు గారు.

     డాక్టర్ మైధిలి అబ్బరాజు

1ప్ర :— .  మీ నేపథ్యం వివరించండి!

జ:–    మా నాన్నగారు డా. అబ్బరాజు శ్రీమన్నారాయణ మూర్తి గారు ప్రభుత్వ వైద్యులు.‌ అమ్మ శ్రీమతి రాధ గృహిణే కానీ బిఏ వరకూ చదువుకున్నారు. పుస్తకాలు  బాగా చదివేవారు. నేను వారికి  ఏకైక సంతానం. పితామహులు అబ్బరాజు సూర్యనారాయణ గారు ఉభయభాషా ప్రవీణ మాత్రమే కాక గొప్ప పండితులు, కవి. ఆంధ్రమహాభారత నిఘంటు కర్త.  అమ్మ వైపు ముత్తాత , పూండ్ల రామకృష్ణయ్య గారు నెల్లూరు లో *అముద్రిత గ్రంథ చింతామణి *  పత్రిక నడిపారు. వేదం వేంకటరాయశాస్త్రి గారికి సన్నిహితులు.

2ప్ర:— మీ విద్య- ఉద్యోగ విశేషాలు చెప్పండి!

జ:— నాన్నగారి బదిలీల వల్ల నా బడిచదువు అంతా ప్రకాశం, గుంటూరు జిల్లా పల్లెటూళ్ళలో సాగింది. శ్రీశైలం కొండ దిగువన పెద్ద దోర్నాల , ఆ ఊళ్ళలో ఒకటి. నా అదృష్ట వశాన- అక్కడ, ముత్తారెడ్డి వెంగళ రెడ్డి గారు కొత్తగా ఉత్తీర్ణులై తెలుగు ఉపాధ్యాయులుగా వచ్చారు. నా నేర్చిన తెలుగు ఏదైనా ఉందంటే అది వారి చలువే. వినుకొండ , నిర్మలా బాలికా పాఠశాలలో పదోతరగతి చదివాను. అక్కడ, సిస్టర్ సెలీన్ గారి వల్ల కొంచెం ఇంగ్లీష్ వచ్చింది. ఏడు, పది తరగతుల పరీక్షలు  రెండిటిలోనూ ఆయా జిల్లాల లో ప్రథమురాలిగా వచ్చాను. ఇంటర్మీడియెట్ , నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలలో. ఎంబీబీఎస్, డీజీవో రెండూ గుంటూరు వైద్యకళాశాలలో చదివాను.   పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో రెండు దశాబ్దాల కు పైగా స్వంత నర్సింగ్ హోమ్ నడిపాను. వైద్య పరీక్షకు గానీ శస్త్ర చికిత్స కు గానీ నా రుసుమును బాగా తక్కువగా ఉంచాను. ఏడాదికి వారం రోజులు తప్ప సెలవు తీసుకోలేదు. తీరికలేకుండా పని చేశాను. ఆ తర్వాత అలసట అనిపించి విరమించాను. అప్పుడు బెంగళూరుకు మారాము. నిర్ణీత కాలం మాత్రమే చేయగల ఉద్యోగాన్ని ఎంచుకొని, ‘స్పర్శ్’ హాస్పిటల్ లో పదేళ్ళు చేశాను. రెండు నెలల నాడు దాన్నీ చాలించటమైంది.  అరవైయవ ఏట ప్రవేశించాను, ఇక పూర్తిగా విరామ జీవితాన్నే గడపాలని కోరిక.

3ప్ర:—  వైద్యం లో ప్రత్యేక మైన అనుభవాలేమైనా ఉన్నాయా?

జ: — చాలా నే ఉన్నాయండీ. అప్పటికప్పుడు చేయవలసినది చేసి – ప్రాణాపాయం నుంచి రక్షించగలిగినవి ఉన్నాయి. గర్భిణులలో రక్తపుపోటు విషమించి వచ్చే గుర్రపు వాతం కేసులను  నూటికి నూరుశాతం నయం చేయగలిగాను.  పల్లెలలో , నొప్పులు ఎక్కువ అయేందుకు ఇంజక్షన్ లు  మోతాదు మించి ఇవ్వటం వలన గర్భకోశం చిట్లి , నాడి అందని దశ లో వచ్చిన స్త్రీ కి శస్త్రచికిత్స చేసి బ్రతికించ గలిగాను. గర్భాశయం పక్కన ఫాలోపియన్ ట్యూబ్ లో గర్భం వచ్చి పగిలే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లకు శస్త్రచికిత్స చేశాను. గర్భాశయం లోనూ, చుట్టుపక్కలా వచ్చే ట్యూమర్ లను – పెద్ద పరిమాణంలో ఉన్నవాటిని తీసివేయగలిగాను. అప్పటి లో ఆ ఊరిలో రక్తనిధి లేదు. చాలా సార్లు మా హాస్పిటల్ సిబ్బందే రక్తదానం చేసేవారం. నేనే ఆపరేషన్ చేసి ముగించి నేనే రక్తదానం చేసిన ఉదంతాలు ఉన్నాయి. గర్భిణులలో వచ్చే వాంతులు ఒక్కొక్క సారి చాలా తీవ్రమై గర్భం తొలగించవలసిన పరిస్థితి , అప్పట్లో సంభవించేది. అందుకోసమే ఒక అమ్మాయిని నా దగ్గరకు తీసుకు వచ్చారు. తొలగించననీ అవసరం లేదనీ నచ్చజెప్పి, దాదాపు ప్రతిరోజూ వాళ్ళతో  ఒకటిరెండు సార్లు పోట్లాడి ఆమెకు వైద్యం చేశాను. నెల కు పైగా హాస్పిటల్ లో ఉంది. పూర్తిగా తగ్గిపోయి,నెలలు నిండాకనే ఆరోగ్య వంతమైన బిడ్డను కన్నది. ఇట్లా రెండవసారి కూడా జరిగింది. సీరియస్ అని తీసుకువచ్చిన ఎవరినీ తిప్పి పంపినది లేదు. అదొక యుద్ధం. బెంగళూరు స్పర్శ్ హాస్పిటల్ లో , కోవిడ్ కాలమంతా సెలవు తీసుకోకుండా పనిచేశాను. డాక్టర్ ని అని, ఫేస్బుక్ లో తరచుగా చెప్పుకోను. రచయిత్రి  గానో సాహిత్యాభిమానిగానో మాత్రమే గుర్తించబడాలని అనుకుంటాను. డాక్టర్ ని అని ప్రకటించుకుంటూ ఉండటం ఒక రిజర్వేషన్ ని, ప్రివిలేజ్ ని తీసుకోవటమేనని నా భావన. కానీ కోవిడ్ రోజులలో మాత్రం , హాస్పిటల్ లో నాచుట్టూ ఎప్పటికప్పుడు మారే పరిస్థితిని చెబుతూ వచ్చాను. దైనందిన గణాంకాలలో- ఆశను వెతికి నాకు ధైర్యం చెప్పుకుని మిత్రులకు చెప్పే ప్రయత్నం చేశాను. అంతే, మళ్ళీ ఆ ఊసు ఎత్తుకోలేదు..

4ప్ర:— మీ కుటుంబ సభ్యుల గురించి చెప్తారా?

జ :–  మావారు డా. చీమలమర్రి శ్రీనివాస్, శల్యవైద్యులు.ఇద్దరం కలిసి వైద్యశాల నిర్వహించాము. ఆయన కూడా ఇప్పుడు పనిచేయటం లేదు. ఇద్దరు పిల్లలు. సాంత్వన, కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్ చేసింది. అల్లుడు , కొంపెల్ల ఆదిత్య  కూడా అంతే. వాళ్ళకొక పాప, కైరవీ నారాయణి. ఐదేళ్ళు నిండాయి.  మా అబ్బాయి స్వాప్నిక్, రెండు ఎమ్.ఎస్. లు చేశాడు. కోడలు శ్రావణి బి.టెక్ తర్వాత ఎం.బి.ఏ చేసింది. వాళ్ళ పాప పాటలీ నారాయణి. రెండేళ్ళది.  పిల్లలు అందరూ బెంగళూరు లో నే పనిచేస్తున్నారు. విదేశంలో స్థిరపడటం నాకు ఇష్టం లేనందున, ఆ మాటను పాటిస్తున్నారు.

5ప్ర:— మీరు వైద్య వృత్తిలో బిజీగా ఉంటూ కూడా సాహిత్యంలో ఇంత పట్టు ఎలా సాధించారు?

జ:—  చిన్నప్పటి నుంచీ బాగా చదివే అలవాటు ఉండటం వలన. అందుబాటులో ఉన్న తెలుగు వచనమంతా ,  దాదాపుగా  చదివి ఉంటాను. ఆంగ్లంలో చదవటం కొంత ఆలస్యంగా మొదలైంది. కష్టపడి, క్లాసిక్ లు అని చెప్పేవన్నీ ఇంచుమించుగా చదివాను. ఇప్పుడు రెండు భాషల లోనూ ఒకే వేగంతో చదవగలను. ఇదంతా నాకు చాలా అవసరమైంది. వైద్య విద్య, వైద్య వృత్తి -రెండూ నాకు చాలా ఒత్తిడి కలిగించేవి. సాహిత్యమే నా ఊరట, విడుదల.

6ప్ర :– మీరు చేసిన రచనలు వివరించండి!

జ:–చాలా కాలం పాటు, చదవటమే లోకం గా ఉండేది. 2001 లో నా మొదటి కథ *నియతి*, వార్త లో ప్రచురితమైంది . అది, ఆ ఏటి తెలుగుకథ (తెలుగు విశ్వవిద్యాలయం వారి వార్షిక సంపుటి) లో కూడా వచ్చింది. ఆ కథ కు ప్రశంసలు వచ్చినా, 2003 వరకూ తిరిగి వ్రాయలేదు. అప్పటి రెండవ కథ *పత్రహరితం * ఆ తర్వాత, 2012-13 వరకూ మళ్ళీ ఏమీలేదు. అంతర్జాల సాహిత్య సమూహాలలో ప్రవేశించాకనే,  క్రమం తప్పకుండా వ్రాయటం మొదలైంది.  వాకిలి పత్రికలో ‘కడిమిచెట్టు ‘ శీర్షిక కింద , పెద్ద వ్యాసాలు వ్రాశాను. వాటిలో, అభిజ్ఞాన శాకుంతలం గురించి వ్రాసినది చాలా మంది కి చేరింది. కుందమాల నాటకం గురించి, జేన్ ఆస్టిన్ గురించి, జాన్ కీట్స్ గురించి వ్రాసినవి నాకు ఇష్టమైనవి. సమాంతరంగా , ముఖపుస్తకం లో టపాలుగా చిన్న వ్యాసాలు వచ్చేవి. గాజుకెరటాల వెన్నెల శీర్షిక తో పాశ్చాత్య జానపద కథలను పిల్లల కోసం తిరిగి చెప్పాను. రైడర్ హగార్డ్ నవల ‘ షీ ‘ ని – రాజ్ఞి పేరుతో అనువదించాను. ఎల్.ఎమ్.మాంట్ గోమరీ నవల ‘ ఆన్ ఆఫ్ గ్రీన్ గేబుల్స్ ‘ నూ పూర్తిగా తెలుగు చేశాను.  వ్యాసాల సంపుటి ‘నిమగ్న ‘ పేరుతో 2016 లో వచ్చింది. పందొమ్మిది కథలు. ‘వేయిపడగలు’ లో అరుంధతి ని,  వెనకకు కాలప్రయాణం చేసి బ్రతికించిన ‘సంజీవరాయడు ‘, ముత్తు స్వామి దీక్షితుల వారు అమృత వర్షిణి రాగం పాడి వర్షం కురిపించిన గాథ ‘సుధావృష్టి ‘ ,పోతనామాత్యుల తండ్రి కాలపు ఊహాగానం ‘మోహరాత్రి ‘ – ఎక్కువ మంది కి నచ్చినవి. కథా సంపుటి ‘తన్మాత్ర ‘ 2023 లో ప్రచురించాను.    అచ్చు లోకి రాని రచన  ఇంకా చాలా నే ఉంందని చెప్పాలి. ఇ బుక్ లుగా తీసుకురావాలని ఉంది. ఇప్పుడు కొంత తీరికైంది కనుక, చూడాలి.

          

7ప్ర :– రవీంద్రుని సాహిత్యం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది?

జ :—  12,13 ఏళ్ళ వయసు నుంచీ  రవీంద్రులను  తెలుగు లో చదువుకున్నాను. మా అమ్మమ్మ, శ్రీమతి పూండ్ల రాజ్యలక్ష్మి గారు ఆ పుస్తకాలను  నాకు కొనిపెడుతుండే వారు. కొన్ని పద్యాలనూ ఖండికలనూ ఆంగ్లంలో చదివాను. గోరా నవల బాగా ఇష్టం. ఆ తర్వాత నౌగాభంగం, చిత్ర.  ఒక రచయితను మొత్తం గా లోపలికి తీసుకున్నాక ఆ  ప్రభావాన్ని విడిగా గుర్తించలేమేమో. కానీ,  ఆ కవిత్వం ! నా జీవితకాలపు సౌందర్యానికి తెరచిపెట్టిన  మంత్ర గవాక్షం అది.

8ప్ర :— అలాగే మన పూర్వ వాఙ్మయం ఈ నాటికి ఎలా వర్తిస్తుంది? దాని ఆవశ్యకత రేపటి తరానికి తెలుపగలరా?

జ:—  పూర్వవాఙ్మయం – ఏదైతే మనకు ఇప్పుడు లభ్యమవుతూ ఉందో అదంతా శిరోధార్యమే. జీవనశైలి మారి ఉండవచ్చు, విలువలు మారవు. వాటిని పాటిస్తే వచ్చే నిలకడ ఎప్పుడైనా ఎవరికైనా అవసరమే. సాపేక్షమే కానీయండి – తప్పూ ఒప్పూ అన్నవి ఉన్నాయి. భాష యొక్క వైలక్షణ్యం, లావణ్యం, అలంకారం మరింకెక్కడా తెలిసిరావు. తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు, ఆ నేర్చిన తెలివి ఆయా సందర్భాలకు అనువుగా వర్తిస్తుంది.

9ప్ర:— క్రాంతి ద్రష్టలుగా మీకనిపించిన మీ అభిమాన రచయిత ఎవరు? వారిలో మీకు నచ్చిన అంశమేమిటి?

జ: —  విశ్వనాథ సత్యనారాయణ గారు.  మూడుకాలాల లోనూ ఆయన దర్శించనిది లేదు. మన కోసం తాను ఆలోచించి నిగ్గుతేల్చి నిర్ధారించనిది లేదు. ఆధునిక ఆంధ్ర ప్రపంచానికి  పట్టిన సౌభాగ్యం , ఆయన రచన.

10ప్ర : — మీకు ఇష్టమైన ఇతర రచయితలు ఎవరు? ఎటువంటి పుస్తకాలు చదువుతారు ?

జ: —- తెలుగులో కృష్ణ శాస్త్రి గారు చాలా ఇష్టం. ఆయన వచనం కూడా రమ్యమైనది. చలం గారు నన్ను చాలా మలచారు. మెచ్చుకోవటం, విలువకట్టటం మొదట అక్కడే నేర్చుకున్నాను. కొడవటిగంటి కుటుంబరావు గారు ఇష్టం. ఆయనదైన విస్తృతి,  సూక్ష్మ పరిశీలన గొప్పవి.  జలంధర గారి ప్రభావం, పన్నెండు పదమూడేళ్ళ నుంచీ నా పైన ఎక్కువ. సమకాలీనులు కనుక ఆవిడ పరిచయాన్ని కూడా సంపాదించుకోగలిగాను. నాకు మాతృస్థానీయురాలు. ఆంగ్లంలో జార్జ్ ఇలియట్ చాలా ఇష్టం. జేన్ ఆస్టిన్, డికెన్స్, విల్కీ కాలిన్స్. బాల సాహిత్యం గా భావించబడే  రచనలు చేసిన ఎఫ్.ఎచ్.బర్నెట్, ఎల్.ఎమ్.మాంట్ గోమరీ – ఆ ఇద్దరు రచయిత్రులూ ఎంతో చెప్పారు . ఆ తర్వాత అగాథా క్రిస్టీ బాగా ఇష్టం. తర్వాత వారిలో ఇవా ఐబొట్ సన్, పాట్రీషియా మెకిలిప్. ఇష్టమని అంటే వారి రచనలు మొత్తం చదివానని అర్థం. ఇంకా ఉంటే బాగుండుననిపిస్తుంది. ఫాంటసీ, మిస్టరీ నవలలు నా తేలికచదువు. ఉల్లాసం కోసం. చీకట్లో కి లాక్కుపోవాలనుకునే సాహిత్య కారులకు చాలా దూరంగా ఉంటాను. థెరపి ఇవ్వటమే , కావలసినది.

11ప్ర :–వైద్య రంగం ఇంత అధునాతనంగా అభివృద్ది చెందినా ఇంకా రోగుల సంఖ్య పెరగడానికి కారణమేమంటారు?

జ:– వాతావరణ కాలుష్యం, అస్తవ్యస్తమైన జీవన విధానం – కారణాలు. అధవా, ఆధునిక వైద్యం చాలా సాధించింది.ప్రసూతి చికిత్స, క్షయ వ్యాధి చికిత్స  వంటివి అద్భుతంగా మెరుగుపడినాయి. గుండె, మెదడు కు చెందిన వ్యాధులకూ గొప్ప వైద్యం ఉంది. రోగుల సంఖ్య పెరగటానికి, రోగనిదానం ఎక్కువ అవటం కూడా కారణమే.

12ప్ర: —- మహిళల కోసం ఒక మహిళ నిర్వహిస్తున్న ఈ పత్రికలోని మహిళలకు వైద్యురాలిగా  మీరిచ్చే సలహా ఏమిటి?

జ:–రోజూ ఇరవై నిమిషాల పాటు నడవండి.  బరువును అదుపులో ఉంచుకోండి. ఏడాదికి ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోండి.  వీలైనంతగా ఆర్గానిక్ ఆహారం తీసుకోండి.  మరొకరితో ఎప్పుడూ పోల్చుకోకండి. కాసేపైనా ధ్యానం చేయండి.

13ప్ర:– పూర్వం కన్నా ఆర్ధికంగా బలంగా తయారైన ఈ సమాజం ఇలా నైతిక విలువలు, కుటుంబ విలువలు కోల్పోతున్న వైనం ఆందోళన కలిగిస్తున్నది. దీనికి ఏదైనా చికిత్స ఉందా? అది ఎలా ఉండాలంటారు?

జ:– ముందుగా, పెద్ద వాళ్ళు మారాలి. అత్యాశ, పోటీ తత్వం – ఈ రెంటినీ తగ్గించుకుంటే పిల్లలకి చెప్పుకోవచ్చు.  తాము, తమ తోబుట్టువులతోనూ తల్లిదండ్రుల తోనూ స్నేహితులతోనూ ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఆ ధోరణే సంతానానికి వస్తుంది.  ఆర్థికమైన ఎదుగుదల అవసరం, మరొక మాట లేదు . కానీ దాని కోసం ఏమేమి వదులుకుంటామో ఆ స్పృహ ఉండాలి. ఏది ముఖ్యం, ఏది ఆ తర్వాత, ఏది వద్దు – ఇట్లా ప్రాథమ్యాలను నిర్ధారించుకోగలిగితే సగం పని పూర్తయినట్లే.

14ప్ర:– యువత చదువు *కొంటున్నారు* కానీ విజ్ఞానవంతులు కావడంలేదనే ఒక వాదన ఉంది. మీరేమంటారు? దానికి ఏదైనా పరిష్కారముందా? చిన్నప్పటి నుంచీ, మంచి పుస్తకాలను ఎంచి చదివించాలి. ?

జ:–మనిషి కి ఉండేది ఒకే జీవితం – వేయి జీవితాల తీరుతెన్నులు తెలిసేది పుస్తకాలలోనే. అంతర్జాలం, విద్యుచ్ఛక్తి వంటిది. వెలిగించుకోవచ్చు, కాల్చుకోనూ వచ్చు. మున్నెన్నడూ లేనంత విస్తృతంగా సమాచారం అందుబాటులో ఉంది. దాన్ని జ్ఞానం గా మార్చుకోవటమే, తరువాయి. సామాజిక మాధ్యమాల ను విచక్షణ తో ఉపయోగించుకుంటే, అక్కడా ఎంతో నేర్వవచ్చు.  ఎన్నో పాడ్ కాస్ట్ లు, ఎందరివో ఉత్తమ ప్రవచనాలు.

15ప్ర:– బెంగాలీ సాహిత్యానికి- తెలుగు సాహిత్యానికి సామ్యమేమిటంటారు? ఈ నాటి సాహిత్యంలో మనం మార్చుకునే అంశాలు ఏమిటంటారు? అంటే ఎలా ఉంటే లాభిస్తుంది?

జ:– బెంగాలీ సాహిత్యం అంటే టాగూర్, శరత్ తప్ప ఎవరూ పెద్దగా తెలియరు. బిభూతిభూషణ్, ఆశాపూర్ణాదేవిలను కొంత చదివాను.  బెంగాలీ  ప్రభావం, ముఖ్యంగా శరత్ బాబు ది – 70 ల వరకూ తెలుగు మీద బాగా ఉండేది కదా. ఒక్క మాట నిజం – వారి రచయిత లను బెంగాలీ వారు గొప్పగా స్మరించుకుంటారు. ఈ మంచి విషయం, మలయాళం లోనూ కన్నడం లోనూ కూడా కనబడుతుంది. ఆయా రచయితలు  సంప్రదాయ వాదులా, ఆధునిక యోధులా అని తరచకుండా, ప్రతిభ ను మాత్రం గుర్తించుకొని గౌరవించుకోగలరు. మనకు అది లేదు.  దాని కి ఒక ముఖ్య మైన కారణం, నేను అనుకునేది ఏమిటంటే – తక్షణ ప్రయోజనం సాధించనిది సాహిత్యం కాదని, తెలుగు లో కొందరు తీర్మానించటం.ఇది,1960 లలో మొదలైంది. ఉదాహరణకు , అత్యంత ప్రభావశీలి అయిన శ్రీశ్రీ గారు చెప్పినది వేదంగా సాగింది. ఆయన చదవద్దు అన్నవాటిని పక్కనపెట్టేశారు. తర్వాత, కథ విషయంలో కాళీపట్నం రామారావు గారు. ఈ చట్రాలలో ఇమిడి వ్రాస్తే గాని మెప్పు లేదు. ఆ పరిధి లోనే మంచి సాహిత్యం రాలేదా అంటే కొంత వచ్చింది. ఆ కొంతా చాలదు కదా ? ఈ రోజు కీ ఆ శృంఖలాలు – సమకాలీన మైన తెలుగుసాహిత్యాన్ని వదలలేదు. వదలవేమో కూడా.

16ప్ర:–  మహిళ వంటింటికి తలుపు వేసి తాళం వేస్తున్నది. ఈ చర్యకు ఫలితం ఎలా ఉంటుందో?  ఎలా  ఉండాలో మీ అభిప్రాయం చెబుతారా?

జ:–  ఆ మాట పూర్తిగా నిజం కాదనుకుంటాను. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయవలసి వచ్చేటప్పుడు , ఇంటి పనులలో పురుషుల సహకారం ఆవశ్యకం కదా. అట్లా ఇద్దరూ కలిసి పని చేసుకునేవారు చాలా మంది ఉన్నారు, ఈ తరం లో. బయటి నుంచి ఆహారం తెప్పించుకోగల సదుపాయాలు ఎక్కువ అయినా, వాటి ని ప్రతిరోజూ వాడుకోవటం సరికాదు. ముఖ్యంగా, ఎదిగే పిల్లలకు అది మంచిది కాదు.

17ప్ర:– మహిళా పత్రిక  సమాజ హితవు కోసం- మహిళల కోసం ఇంకా ఏంచేయాలంటారు?

జ:–తమస్సు లోంచి జ్యోతిస్సు వైపుకు మరలటమన్నది,  ఎల్లప్పుడూ నిర్వాహకుల హృదయాలలో పనిచేస్తుంటే చాలు.

18ప్ర:–బాల బాలికలకు అవసరమయ్యేలా పత్రిక మీ దృష్టిలో ఇంకా ఎలా ఉండాలంటారు? దీనిలో రచయిత్రుల బాధ్యత ఎలా ఉంటే బాగుంటుంది?

జ:– మనకు బాల సాహిత్యం చాలా తక్కువ. మా చిన్నప్పుడు కొంత నయం. చందమామ, బొమ్మరిల్లు పత్రికలే కాకుండా ప్రత్యేకంగా పిల్లలకోసం కథల పుస్తకాలు, నవలలు కూడా వచ్చేవి. రష్యన్ అనువాద సాహిత్యం సరేసరి. పాతవి తవ్వి తెచ్చుకోవటం మంచిపని.  నూతన సృజన కు ఆ స్థాయి ఉండాలి. లేదంటే అనువదించుకోవచ్చు, మన దేశకాలాలకు అనుసరించుకోనూ వచ్చు. బాలసాహిత్యం లో 7-12 వయసు  ఒక విభాగమైతే 12-16 మరొకటి. ఎక్కడైనా పిల్లలకోసం వ్రాయటమంటే అంత క్రిందిస్థాయిలో ఉండవలసిన పనిలేదు. హింస తక్కువ గానూ అశ్లీలం లేకుండానూ ఉంటే చాలు. కాస్త పై స్థాయిలోని రచనలే వాళ్ళను పెంచగలుగుతాయి. చందమామ లో కథలున్నాయి చూడండి – అవి బోధించే స్వరంతో ఉండవు. వాటిలో పిల్లలే పాత్రలు కారు కూడా. మన అమరావతి కథలు 12-16 విభాగం లో గర్వంగా నిలబడతాయి.

19ప్ర:– మీకు రచన కాకుండా ఇతర అభిరుచులలోప్రవేశముందా? దానికి సమయం ఎలా కేటాయిస్తున్నారు? అభిరుచి మన మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

జ:–కొన్ని సంవత్సరాలు గాత్రసంగీతం చెప్పుకున్నాను. ఇప్పటికీ బాగానే పాడగలను. సినిమాలు బాగా చూసేదాన్ని.  ఎన్. టి.రామారావు గారి శతజయంతి ఉత్సవాలలో, తెనాలి వెళ్ళి మాట్లాడాను. చక్కని స్పందన వచ్చింది. ఇప్పుడూ కొన్ని సినిమాలు , సీరీస్ లు చూస్తాను . నచ్చిన వాటి గురించి వ్రాస్తుంటాను. అంతర్జాలంలో వర్ణ చిత్రాలను చూసి  ప్రశంసించటం మా అమ్మాయి నేర్పింది. తను మంచి చిత్రకారిణి.

సమయమా, అన్నిటికీ సరిపోతుందండీ.

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీజతగానేనుండాలి

ఓ ప్రేమ కథ ( మోహన రాగం) -రెండవ భాగం