హరి చందన-15

ధారావాహిక నవల

” పద…….సరే కానీ…. ఒక కండీషన్ “
“కండీషన్……ఏమిటి స్వామీ” అంది హాస్యంగా.
“ప్చ్.. నువ్వలా అంటే నేను రాను “.
” రాకపోతే… వెళ్ళండి…. ఇంక మనం కలిసేది ఇదే చివరిసారి”
“చందూ!చెప్పేదివినకుండా ఏమిటీ అలక…”
“చెప్పమనే కదా అడుగుతున్నాను… ఏమిటి మీ కండీషన్?
” అక్కడ పెళ్లి చూపులు అన్నట్లు మీ వాళ్ళు హడావిడి చేసేస్తారేమో మీ పేరెంట్స్…. జస్ట్ ఫ్రెండ్లీ గా కలవడానికి వస్తున్నా అంతే “.
“మీకా భయం అక్కరలేదు…నేను కూడా ఫ్రెండ్లీ గానే కలవడానికే రమ్మంటున్నా. మిమ్మల్ని చూడకుండా మా నాన్న ఎలా ఒప్పుకుంటారు? మీ పేరెంట్స్ అయినా నన్ను చూశాకే వాళ్ళ అంగీకారం చెప్పారుకదా”
“అవును. ” బుద్దిగా ఒప్పుకున్నాడు.
“గుడ్ బోయ్! పదండి”అంది నవ్వుతూ.
******************

రామ్ ప్రసాద్, సీతమ్మ హైదరాబాద్ వచ్చారు. ఆ విషయం తెలియగానే ఆడపిల్లల తల్లిదండ్రులుగా చందన తల్లిదండ్రులు, శైలజ తల్లిదండ్రులు వెళ్లి వారిని కలిసి మాట్లాడారు.
“మేమే ఈ శని,ఆదివారాలు ఆత్రేయపురం వద్దామనుకుంటున్నాం” అన్నాడు వాసుదేవరావు.
“సంబంధం కలుపుకోవాలనుకున్నాక ఎవరింటికి ఎవరు వస్తే ఏమిటి బావగారు. ఆ పంతాలు, పట్టుదలలు పెట్టుకుని పిల్లల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం ఉండదు… అందులో… అమ్మాయి చెప్పే ఉంటుంది. మా నాన్నగారు, అమ్మ పెద్దవాళ్ళు. వాళ్ళ కళ్ల ముందే వీళ్ళ పెళ్లిళ్లు జరిగిపోవాలని కోరుకుంటున్నారు.అందుకే మమ్మల్ని తొందరపెట్టి పంపించారు “
“అవును చెప్పారు, మా పిల్లల్ని ఎంతో అభిమానంగా, ప్రేమగా చూశారని చాలా సంబరంగా చెప్పారు “అంది కౌసల్య.
“అవునండీ…రెండురోజులు బాగా ఎంజాయ్ చేశామని చెప్పారు”అన్నాడు కుటుంబరావు.
రామ్ ప్రసాద్ చందన, శైలజలిద్దరినీ అందరి ఎదుటకి పిలిచి “చూడండమ్మ… అక్కడి పరిస్థితుల్ని, మనుషుల్ని చూశారు. చదువుకున్న పిల్లలు కనుక బాగానే అర్ధం చేసుకుని ఉంటారు.
ఇంటికి వచ్చాక మీ పేరెంట్స్ తో మాట్లాడి ఉంటారు.
మీరు పెళ్ళికి సుముఖంగానే ఉన్నారని పెద్దవాళ్ళు చెప్పారుగానీ. మరోసారి బాగా ఆలోచించుకుని చెప్పండి. ఆ ఉమ్మడికుటుంబంలో మీరు అడ్జస్ట్ అవగలమని మీరు… మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా? మీరు ఒకమాట చెప్పేస్తే మనం ముందుకి వెడదాం “చెప్పాడు రామ్ ప్రసాద్.
“మాతో మాట్లాడాకే నాన్న, పెదనాన్న మీకు కాల్ చేసి చెప్పారు అంకుల్ “అంది చందన.
“వాళ్ళు కాల్ చెయ్యడం సరేనమ్మా. నేను మీ ముఖతః వినాలనుకుంటున్నాను. నిశ్చయతాoబులాలుమార్చుకోవచ్చునా?
గతంలో కొన్ని సంఘటనలు మమ్మల్ని మోసం చేశాయి. అందుకే ఇలా రెట్టించి అడుగుతున్నా. ఏమీ అనుకోవద్దు “
ఇద్దరూ తమ అంగీకారం తెలియచేశారు.
అప్పటికప్పుడే నిశ్చయతాoబూలాలు మార్చేసుకున్నారు.
చందన, శైలజ ఇద్దరూ రామ్ ప్రసాద్, సీతమ్మల ఆశీర్వాదం,
తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు.
వీడియో కాల్ లో అంతా చూశారు వృద్ధులు.
“పిల్లల్లారా! తొందరగా వచ్చేయండి మా ఇంటికి ” అంది బామ్మ గారు నవ్వుతూ.
“అంతా మీ ఆశీర్వాదం బామ్మ గారు.
అసలు ఇప్పుడే పెళ్లి ఆలోచనే లేని నాకు.. అందులో.. ‘ఇంత ప్రేమగా ఉండే మీరు ఒకే ఇంటి కోడళ్ళు అవ్వాలని’ మీరు దీవించిన ఫలితమే ఒకే ఇంటీ కోడళ్ళు అవుతున్నాం….. మరో ఇల్లు అయినా మీ వారసులేగా అందరూ ” అంది శైలజ.
“నేను చెప్పాను కదే పిల్లా,మీ తాతయ్య గారు దీవిస్తే అదిజరిగిపోతుందని “మళ్ళీ వెన్నెల కురిసినట్లు చల్లని నవ్వు.
” నమస్కారం తాతయ్యగారూ, అమ్మమ్మగారూ! త్వరలో వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటాం “ఆన్లైన్ లోనే నమస్కరించారు. పెద్దలు నలుగురు.
రాజారావు, సుబ్బలక్ష్మి, సుందరం, అతని తల్లిదండ్రులు అందరూ వీడియోలోనే ఆ కార్యక్రమం అంతా చూశారు.
“మా అక్కా,బావగారు గారూ కూడా పెద్దవాళ్ళు.ప్రయాణాలు చెయ్యలేరు అందుకే వాళ్ళ తరఫున కూడా మేమే బాధ్యత వహించాం “చెప్పాడు రామ్ ప్రసాద్.
“మా హరి, జగదీష్ తో పాటు మా ఇంట్లో మా పిల్లాడిలాగే పెరిగాడు సుందరం కూడా.”చెప్పింది సీతమ్మ.
“ఇప్పుడు మా సుందరానికి నీ సెల్ నెంబర్ ఇవ్వవచ్చా?” అడిగాడు హరి నవ్వుతూ.
“ఊ “సిగ్గు పడుతూ తల ఊపింది శైలజ.
“పల్లెటూరులో పండుగ సరదాగా చూస్తామనివెళ్ళి పెళ్లి కుదుర్చుకుని వచ్చారు ఇంకా సిగ్గు ఎందుకు? “అంది రేవతి.
“వాళ్ళు కుదుర్చుకోలేదు లెండి మా అమ్మ నాన్న తో మాట్లాడాకే మా నిర్ణయం చెబుతాం అని పద్ధతిగానే మాట్లాడారు”.అంది సీతమ్మ.
“అవును పిన్నీ, నేనైనా, చందూ అయినా పొరపాటున కూడా మీ పెద్దరికానికి భంగం రానివ్వలేదు. అసలేప్పుడు అలా ఊహించుకోవద్దు మీరు. అది మీ పెంపకం గొప్పతనం ” చెప్పింది శైలజ
కౌసల్య నవ్వుతూ” ఇద్దరికీ ఒకరి పై ఒకరికి ఉన్న ఎఫెక్షన్ అలాంటిది.ఎదుటి వాళ్ళ మీద ఈగ వాళ్లనివ్వరు “అంది.
“చిన్నప్పటినుంచి స్వంత అక్కా చెల్లెళ్ళలాగే పెరిగారు మరి” అంది రేవతి.
“మీతో మాట్లాడి మీచేతే చెప్పించారు గానీ,తమంతట తాము స్వతంత్రించి పెళ్ళికి ఓకే చెప్పలేదు ఇద్దరూ కూడా. పెద్దవాళ్ళపై వారికి ఉన్న గౌరవం మాకు నచ్చింది “అంది సీతమ్మ.
“సారీ నాన్న.. హరి పరిచయం గురించి చెప్పానుగాని, తను ప్రపోజ్ చేసినట్టు మీకు చెప్పలేదు. శైలూ అక్కడ అడ్జస్ట్ అవగలనో లేదో చూద్దాం,అంటే వచ్చాక చెప్పవచ్చు అనుకున్నాను. అక్కడ వాళ్ళు కులాంతర వివాహానికి అంత తొందరగా ఒప్పుకుంటారని కూడా ఊహించలేదు.అందుకే వెళ్లే ముందు చెప్పలేదు ఐ యామ్ సారీ డాడీ ” తండ్రి చేతిని తన చేతుల్లోకి తీసుకుంది.
” ఇట్స్ ఒకే బేబీ.!… నీ గురించి నాకు తెలియదా? ” కూతురిని భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకి తీసుకుని, నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు వాసుదేవరావు.
” పెళ్లిళ్లు అక్కడ మా ఊరిలోనే జరుగుతాయి. పెద్ద వాళ్ళు అమ్మ, నాన్నగారిని ఇబ్బంది పెట్టలేము, వాతావరణం మారితే వారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు వాళ్ళ ఎదురుగా జరగాలని వాళ్ళ కోరిక. “
అందరు బయలుదేరుతుంటే శ్యామల ఇంటికి వెళ్ళడానికి చందనని ఆగమన్నారు.
“హరిగారికి బాగా పరిచయమే ఇంక నేనెందుకు అంకుల్?” అంది చందన.
“ఇంక ఆ ఆంటీ, అంకుల్ ఆపి,అత్తయ్య, మావయ్య అని పిలువమ్మా… ఆ పిలుపు వినలేక పోతున్నా “అంది, సీతమ్మ నవ్వుతూ.
“సరే అత్తయ్య “
రామ్ ప్రసాద్, సీతమ్మ, హరి, చందన జగదీశ్ ని తీసుకుని శ్యామల ఇంటికి బయలు దేరారు.

*****************
కాలింగ్ బెల్ చప్పుడు విని తలుపు తీసిన శ్యామల, ఎదురుగా నిలబడి ఉన్న చందనని,హరిని చూసి ” వెల్కమ్! “లోపలికి ఆహ్వానించి “కాబోయే దంపతులకు కంగ్రాట్స్ “చందనని హగ్ చేసుకుంది.
“థాంక్యూ!” ఆమెను విడిపించుకుని “ఉండు, అతిధుల్ని తీసుకొచ్చా ” బయటికి తొంగి చూస్తూ “లోపలికి రండి అత్తయ్యా ” పిలిచి వారు రాగానే, ” మా అత్తయ్య, మావయ్య గారు ” పరిచయం చేసింది.
శ్యామల వారికి మర్యాదగా నమస్కరించి “కూర్చోండి ” కుర్చీలు చూపించింది.
వారితో పాటు వచ్చిన జగదీశ్ ని చూడగానే, వాళ్ళు ఎందుకు వచ్చారో అర్ధమై, గుండె దడదడలాడింది.
తన తడబాటు వారికి తెలియకూడదని, లేచి లోపలకి వెళ్ళబోతుంటే “ఇప్పుడేమి వద్దు కూర్చో శ్యాము. ఆంటీ లేరా? అడిగింది.
“పక్కనే పార్క్ ఉంది,చిన్నూని ఆడించడానికి తీసికెళ్లారు.” లోపలికెళ్లి ఫ్రిడ్జ్ లోనుంచి వాటర్ బాటిల్, నాలుగు గ్లాసులు తెచ్చి వారి ముందున్న టీపాయ్ మీద పెట్టింది.
“మీ పేరెంట్స్ ఉండేది ఎక్కడ అమ్మాయ్ “అడిగాడు రామ్ ప్రసాద్.
“గుడివాడ… నాన్న నా చిన్నప్పుడే పోయారు. అమ్మ మొన్న కరోనా రోజుల్లో చనిపోయారు “
“మమ్మీ”! చిన్నూ పరుగెత్తుకుంటూ రావడంతో ఎదురెళ్ళి పట్టుకుంది. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ముఖం మీద పడుతున్న జుట్టుని పైకి తోసింది.
“చిన్నూ!” రమ్మని చేతులు చాపింది చందన.
తల్లిని హత్తుకుని మెడ ఒంపులో ముఖం దాచుకున్నాడు.
“చాక్లెట్ వద్దా?నేను తినేయ్యనా?” అడిగింది, బేగ్ లో నుంచి చాకోలెట్ తీసి,నోటి దగ్గర పెట్టుకుoది,తినబోతున్నట్లు.
పరుగెత్తుకొచ్చి చాక్లెట్ లాక్కుని పోబోతుంటే పట్టుకుని “దొంగ! “
పారిపోదామనుకున్నావా? “ఒళ్ళో కూర్చో బెట్టుకుంది.
చాక్లెట్ పై కాగితం చింపి ఇవ్వబోతుంటే,, “చిన్న ముక్క ఇవ్వు చందూ అసలే జలుబు,దగ్గుగా ఉంది “అంది.
“మీ అత్తగారి ఊరు…”?
“గోదావరి జిల్లాలో ఏదో ఊరు. కానీ, మావయ్య భిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీ లో పని చేశారు. కరోనా తో పోయారు అప్పటినుంచి నాదగ్గరే ఉంటున్నారు “
తయారమ్మ లోపలికి అడుగు పెడుతూనే అక్కడున్న వాళ్ళందరిని చూసి బొమ్మలా నిలబడిపోయింది.

( సశేషం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మనమూ మన వినాయక చవితి

కొత్త లోకాలు (కాలమ్-4)