మౌనమే నీ భాష ఓ మూగ మనసా అన్నాడో సినీ కవి .మనకు అది ఒక్కోసారి నచ్చుతుంది .Silence is golden అన్నారు కదా . ఈ మాటలు చెప్పే మౌన సంకేతాలు ఏమిటో ఓ లుక్కేయండి మరి.
మీ ఆంతరంగిక విషయాలను ఇతరులతో పంచుకున్న ప్రతిసారి,మీకు తెలియకుండానే మీలో ఇన్నాళ్లు దాగిన అద్భుతమైన ప్రత్యేకమైన శక్తిని కొంత పోగొట్టుకుంటారు . పిచ్చాపాటి ల కాలక్షేపకబుర్లకు ఈ సూత్రం వర్తించదు .ఇది హాని కలిగించేది కాదని మీ కనిపించినా , దానికీ ఓవెల ఉంటుంది కదా! కారణం మీరు బయటపెట్టిన మరుక్షణం అది జాతీయం అవుతుంది .పరాయిది అవుతుంది .మీది కానిది అవుతుంది .తరువాత నాకు మాత్రమే చెం దిందని చెప్పుకోలేరు . మనం జరిగిన దాని గురించి ఎంత ఎక్కువగా వెల్లడి చేస్తే ,ఇతరులు అంత తక్కువగా అర్థం చేసుకుంటారు .
సాధారణంగా మనం పంచుకునేది మన కలలు లేదా ప్రణాళికలు లేదంటే ,బాధ కాకుంటే ,ఆవేదన . బయటపడిన మరుక్షణం అవి తీవ్రతను పోగొట్టుకుంటాయి . మీరెంత బలహీనంగా ఫీల్ అవుతే ,ముందుకెళ్లే అవకాశాలు అంత దూరం అయిపోతాయి లేదా అవే ప్రగతి నిరోధకాలుగా దారి మార్చుకుంటాయి .
ప్రఖ్యాత మనస్తత్వశాస్త్రజ్ఞుడు కార్ల జంగ్ అధ్యయనం ప్రకారం మనిషి అంతరాంతరాలలో తన ఉనికిని చాటుకోవాలన్న కోరిక బలంగా ఉంటుంది .అది కూడా ఇతరుల ద్వారా . అందరూ గుర్తింపును ,దగ్గరితనాన్ని లోలోపల కోరుకుంటారు చాలాసార్లు .
ఈ క్రమంలో అంతర్గత శక్తులు బలహీన పడతాయి . నిశ్శబ్దాన్నిబలహీనతగా భావించకండి .పెదవి దాటితే పృధివి దాటుతుందని మనవారు ఊరికే అనలేదు .బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లు సొంత వివరాలను ఎక్కువగా బయటపెట్టరు .వారి జీవిత పోరాటాలను , ఆశలను , ఆకాంక్షలను నిర్భయంగా మౌనంగా ఎదుర్కొంటారు .
ఎందుకంటే వాటిని తెలుసుకోవాలనుకునే ప్రేక్షకుల అవసరం వారికి లేదు. కావలసింది పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కోవడం మాత్రమే . అలా చేయాలంటే మనిషి అంతర్గత శక్తులను జాగృతం చేయాలి .మీరు తక్కువగా వెల్లడి చేసి ఎక్కువగా సాధించాలనుకుంటేనే ,ఈ వ్యాసం చదవండి . అప్పుడే ఇందులో ఇచ్చిన సూచనలు పనికొస్తాయి .చివరి వరకు చదవండి .ఆలోచించండి .ఓ నిశ్చయానికి రండి . ఆ నిశ్చ యాన్ని మీ జీవితంలో ఒక ముఖ్య భాగంగా మార్చుకోండి .
ఇందులో చర్చించే ప్రతి అంశము జీవితాన్ని మరో కోణంలో పరిచయం చేస్తుంది . మీ గమ్యానికి ఒక అర్థాన్నిస్తుంది.మనం మాట్లాడే మాటలు మనం అనుకోని దాన్ని బయటపెడతాయి చిత్రంగా .మీ కంఠస్వరం ,ఊ నిక ,ఎంచుకునే మాటలు ఇవన్నీ మీరేంటో చెప్పేస్తాయి .
మనసు విప్పిన ప్రతిసారి మీ ముద్రను వదులుతారు ఈ ప్రపంచానికి .నాణ్యానికి మరోవైపు
ఓ భావవేశాన్ని వెల్లడి చేయడం ద్వారా ,మీ అంతరంగపు కిటికీ కాస్త కాసేపు తెరుస్తున్నారన్నమాట . ఆ తీవ్రత బలపడవచ్చు లేదా బలహీన పడవచ్చు . ఇదంతా మీరు ఎవరికి ఎక్కడ ఏ సందర్భంలో బయటపెట్టారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా
మీకు మాత్రమే సొంతమైన విషయాలను ఇతరులతో వారెంత ముఖ్యులైనా సరే పంచుకున్నాక చెప్పి ,పొరపాటు చేశానా అని విచారించిన సందర్భాలు లేవా? గుర్తు తెచ్చుకోండి .ఇలా చెప్పుకోవడం అనేది యాదృచ్ఛికమే కాదు . మీ అంతరాత్మ ఈ క్షణం మీ సొంతం కానీ మరుక్షణం కాదు అని చెప్తూనే ఉంటుంది .మనమే గుండె బరువు తగ్గుతుందని , మనసు తేలిక పడుతుందని , పడాలని అనుకుంటాం .
మాటలకి ఓ విలువ , భారం ఉంటుంది .
అదే సమయంలో మౌనం మీకు రక్షణగా నిలబడుతుంది .ఆలోచించుకోవడానికి ,అవగాహన చేసుకోవడానికి ,క్రమబద్ధంగా బయట పెట్టవలసిన పరిమాణాన్ని నిర్ధారించుకోవడంలో సహాయపడుతుంది .
అయితే నేడు సామాజిక మాధ్యమాలు ప్రజాజీవనంలో బలమైన పాత్రను పోషిస్తున్నాయి .ఆ సుడిగాలిలో మనం కొట్టుకొని పోతున్నాం మ్ .ఎలాంటి క్రమాన్ని పాటించడం లేదు . విచక్షణకు స్థానమే లేదు .పబ్లిక్ లైఫ్ కు ప్రైవేట్ లైఫ్ కు మధ్య తేడాను నిర్లక్ష్యం చేస్తున్నాము .
తెలియడానికి ,పంచుకోవడానికి వ్యవధి లేనప్పుడు విచక్షణ గురించి మాట్లాడడం అరణ్యరోధనే .పరిశీలించడాన్ని అభ్యాసం చేయండి . అంతరాత్మ గోడు కాస్త వినండి .దాన్ని మాట్లాడనివ్వండి .మీకు తెలిసిన లేదా ఆలోచించిన ప్రతి విషయాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదేమో ! కొన్నింటిని మీరే అర్థం చేసుకోవాలి .అలా చేసుకోగలరు కూడా .
మీలో మీరు దాచిందే క్రమంగా మీ బలంగా మారుతుంది .నిశ్శబ్దంలో అద్భుతమైన శక్తి ఉంది .దీన్నే బ్రూడింగ్ ఆఫ్ ది సోల్ అంటారు .అన్నింటినీ పంచుకోవడం మానేస్తే ,మరింత మానసిక దృఢత్వం మీ సొంతం.
పరిష్కారాలు , సమాధానాలు బయట నుంచి వస్తాయని అనుకుంటున్నారు. కానీ, చాలాసార్లు లోపలే దొరుకుతాయి నిశ్శబ్దం మిమ్మల్ని మీరు తెలుసుకునేలా చేస్తుంది. ఆ తెలుసుకోవడంలో నిజమైన మార్పు మొదలవుతుంది . మీ మానసిక గాయాలను మాన్పుకోవడానికి, బయటి వారి సహాయ సహకారాలు చాలాసార్లు అవసరం లేదు .
మీరు మీ దారిలో నడవడం అలవాటు చేసుకుంటే ,మీ విషయాలన్నింటినీ పంచుకోవడం తగ్గిస్తే ,ఓ రకమైన శాంతిని పొందుతారు .బలమైన , స్వతంత్రమైన శాంతి అది .
ఈ విషయాలు మీ పరిచయస్తులలో ఎవరికైనా పనికొస్తాయి అనుకుంటే పంచుకోండి . మీ బాధలను పంచుకోవడం తగ్గించండి .మీ ఆత్మస్థైర్యాన్ని ,విషయ నిర్ణయ శక్తిని పెంచుకునే మార్గాలను పంచుకోండి .
గుర్తుంచుకోండి .గుర్తింపు పొందాలనే కోరిక మిమ్మల్ని మరింత బలహీనులను చేస్తుంది .ఎదుటివారి అప్రూవల్ పొందడానికై అన్నింటినీ పంచుకోవాలనే బలహీనత మీ వ్యక్తిగత ఎదుగుదలకు పెద్ద శత్రువు .
ఎందుకో చూద్దాం
మనిషి మనసు చాలా సార్లు అభద్రతకు గురవుతుంది .ఆ అభద్రత మాట్లాడనే కోరికకు దారితీస్తుంది .మిమ్మల్ని అంగీకరించాలని ,అర్థం చేసుకోవాలని లేదా మెచ్చుకోవాలని చెప్పుకుంటే ,అప్పుడు మీ గుర్తింపు ఇతరుల మీద ఆధారపడేలా చేస్తుంది
అయితే పొగడ్తలు ,గుర్తింపులు లేనప్పుడే అంతర్గత శక్తులు కేంద్రీకరింపబడతాయి .శక్తివంతం అవుతాయి .
గుర్తుంచుకోండి ప్రతి శబ్దానికి ఓ శక్తి ఉంటుంది .దాన్ని వాడినందుకు ఏదో రూపంలో మీరు ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది . కనిపించదు కానీ ,అనుభవానికి వస్తుంది .
మీ బాధలను ,వ్యాధులను ఆలోచన లేకుండా బయట పెడితే , అవి మరింత పెద్దగా రూపుదిద్దుకుంటాయి . దీని అర్థం మీ భావాలను అణిచి పెట్టమని కాదు .ఏ కారణం చేత ఎవరితో ,ఎప్పుడు పంచుకోవాలనే దానిపై ఓ నియంత్రణ అవసరం .
వివేకంతో మాట్లాడిన మాటలు గాయాన్ని మానుపుతాయి .అనాలోచిత ప్రసంగాలు అలసటకు గురిచేస్తాయి .ప్రతి గాయాన్ని బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు .కొన్నింటిని మౌనంగా స్వీకరించాలి . దాన్నుంచి బయటపడడానికి మీ ఫీలింగ్స్ ను గమనించడం ,పరిశీలించడం అలవాటు చేసుకోండి . వాటి పోకడలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి అవసరమనుకుంటే ఒక దగ్గర రాసి పెట్టుకోండి .ఆ రాయడం అనే అలవాటు మీలోని శక్తిని అంతర్గత బలంగా మారుస్తుంది .
మీ ఆంతరంగిక ప్రపంచంలోకి అందరికీ ప్రవేశం లేదని గుర్తుంచుకోండి . ఎవరితో మీ ఆలోచనలను పంచుకోవాలనుకుంటున్నారు వారిని జాగ్రత్తగా ఎంచుకోండి .విన్న వాళ్ళందరూ సహానుభూతిని కలిగి ఉంటారు అనుకోకండి కొందరికి ఇతరుల విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం. మరికొందరికి పైన సానుభూతి లోలోన బాగా అయిందని పైసాచికా ఆనందం . మరి కొందరు మీ నుంచి తెలిసిన విషయాలను మీపై ఎదురుదాడి చేయడానికి వాడుకుంటారు .
మీ అనుభవాలు ,అనుభూతులు ఇతరులకు ఆట వస్తువులుగా మీ మీద బురద చల్లడానికి ఆయుధాలుగా మారవచ్చు.
మీ అంతరంగ లోకానికి కొందరికే ప్రవేశం .అది కూడా ఎల్లప్పుడూ కాదు . కొన్ని సందర్భాలలోనే .
వచ్చే సంచికలో ఈ అంశంపై మరిన్ని విశేషాలను తెలుసుకుందాం అంతవరకు సెలవా మరి