ఒకానొకప్పుడు ఒక సభలో ఒక ప్రవచనకర్త ప్రవచనం చేస్తూ అంతః సౌందర్యం బాహ్య అనే విషయంపై ప్రవచనం చేస్తూ ఉంటాడట. ఆ సభలో ఆ ప్రవచనకర్త ఒక యువకుడిని లేపి ఇలా అడిగాడట. ఒక అందమైన అమ్మాయి లేదా యువతి నీ ముందు నుండి వెళుతూ ఉంటే నువ్వు ఎంత సేపు చూస్తావు ఆ అమ్మాయిని అని అడిగాడట. ఆ యువకుడు కనిపించినంత వరకు చూస్తాను అని జవాబు ఇచ్చాడట. ఎంతసేపు జ్ఞాపకం పెట్టుకుంటావు ఆ అమ్మాయిని అని అడిగినప్పుడు మహా అయితే ఒక పూట లేదా ఇంకొక దాని మీద మనసు మరలేవరకు అని జవాబు ఇచ్చాడట. అప్పుడు ఆ స్వామీజీ అదే నీకు ఒక మంచి పుస్తకాన్ని ఇచ్చి ఒక వ్యక్తి అడ్రస్ ఇచ్చి ఆ అడ్రస్ కి ఆ బుక్ ని చేర్చాలి అని చెప్పినప్పుడు నీవు ఆ బుక్ ని తీసుకెళ్లి ఆ వ్యక్తిని కలిసి నిన్ను నువ్వు పరిచయం చేసుకొని ఫలానా వారు పంపించారు అని చెప్పగానే ఆ వ్యక్తి నిన్ను సాదరంగా ఆహ్వానించి ,నీకు అతిధి మర్యాద చేసి, నీవు ఇచ్చిన పుస్తకాన్ని తీసుకొని నీకు కృతజ్ఞతలు తెలిపి ,నీవు బయటకు వెళ్లేటప్పుడు నీతో కూడా మాట్లాడుతూ వచ్చి కరచాలనం చేసి ,కారు వరకు నీతో పాటు నడిచి నిన్ను సాగనంపినారు అనుకోండి .అప్పుడు ఆ వ్యక్తిని ఎన్ని రోజులు గుర్తు పెట్టుకుంటావు అని అడిగారట. అప్పుడు ఆ యువకుడు అటువంటి వ్యక్తిని అతని చూపించిన ఆదరాభిమానాలను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. సందర్భం వచ్చిన ప్రతిసారి అతని గురించి మాట్లాడుతాను అని బదులిచ్చాడట .ఇప్పుడు చెప్పండి అసలైన అందం ఏది??? అందం అనేది రూపంలో కనిపించినంత మాత్రాన సరిపోదు. సద్గుణాలతో కూడిన వికలాంగుడైన చూడడానికి బాగా లేని వ్యక్తి అయినా సరే అతడి సద్గుణముల వలన అతని ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. ఎంతో తేజో మూర్తి లా కనిపిస్తాడు కదా!!! మరి అందం ఎందులో ఉందంటారు గుణం లోన???? రూపంలో నా??? మనసులో కల్మషం లేకుండా ప్రతి వారిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, ఆపదలో ఉన్న వారికి తనకు తోచిన సహాయం చేసే వ్యక్తికి, ఎదుటి వ్యక్తి కి మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం తెలిసిన వ్యక్తికి ఉన్న అందం బాహ్యంగా అందంగా కనిపించే వారి దగ్గర కనిపించదు. గుణములతో అందాన్ని సంతరించుకున్న వ్యక్తిని సద్గుణ సంపన్నుడు అంటారు. అతని గుణములే అతని ఐశ్వర్యం సంపద. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం 1000రెట్లు మిన్న. ఇది నా అభిప్రాయం కూడా.
సామాజిక మధ్యమంలో విన్న ఒక అంశాన్ని ఆవిష్కరించే ప్రయత్నం