గంపెడు ఆశలు మూటన గట్టి
స్వేదంతో సేద్యం చేసిన
వరి , ప్రత్తి , పసుపు , మిరప, టమోటా
పంటేదైతేనేం …. ?
గిట్టుబాటు రాక
బతుకును బజారుకీడుస్తుంటే
రైతు ఆశలు అశ్రుధారలై
దుఃఖ సముద్రాలౌతున్నాయి !
కాయకష్టాన్నే నమ్ముకొని
మొలకెత్తిన రైతన్నను
ఒకవైపు
నకిలీ విత్తనాల ఘాతుకాలు
మరోవైపు
అతివృష్టి,అనావృష్టి శరాఘాతాలు
వెనుకవైపు నుంచి
బతుకుల్ని ఆర్పేస్తున్న దళారీలు
ముందువైపు నుంచి
మెతుకుల్ని లాగేస్తున్న వడ్డీవ్యాపారులు
నలుదిక్కులా నష్టాలు వెంటాడుతుంటే
లంగరు లేని నావలా రైతు బతుకు ఊగిసలాట
ఆక్రందనల గుండెల తడి ఆరిపోయి
అంపశయ్య మీద చతికిల పడ్డ
రైతు భీష్ముడు
ఘనీభవించిన శ్వాసతో
ఎదురుచూపులు !
శ్వాసను కరిగించి ఆదుకునేది
మానవత్వ వెచ్చదనమొక్కటే !
రైతన్నను ఆదుకుంటేనే
దేశ సౌభాగ్యం
రైతన్నను అక్కున చేర్చుకుంటేనే
అభివృద్ధి పథం !