లోకాభిరామాయణం. 5

పుణ్యం –పురుషార్ధం

ముందుగా అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మరో ముచ్చటతో మీ ముందుకు వస్తున్నాను.
మొన్న ముక్కోటి ఏకాదశి నాడు మా అక్కయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే, మాటల సందర్భంలో ఉపవాసం ఉన్నాను అని చెప్పింది.
“అసలే ఆరోగ్యం బాగా ఉండటంలేదు ఇంకా ఈ వయసులో ఉపవాసాలేమిటే “అన్నాను.
“పుణ్యం పురుషార్ధం కలిసి వస్తుంది కదా అని ఉన్నాను” అంది.
“పుణ్యం సరే, పురుషార్ధం ఏమిటీ?” అన్నాను.
“డాక్టర్ ఈ మధ్య డైటింగ్ చేయమని చెప్పాడు. విడిగా ఎలాగూ నావల్ల కాదు, కాబట్టి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉంటే పుణ్యానికి పుణ్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం ” అంది.
“ఇదేదో బాగుందే, నేను కూడా ఉంటాను అయితే” అన్నా.
“సరిపోయారు ఇద్దరికిద్దరూ” అన్నారు అంతావింటున్న మావారు.

మనం చాలా సందర్భాల్లో పుణ్యం – పురుషార్ధం అనే మాట వాడుతూ ఉంటాము.
పుణ్యం అంటే‌ మంచిపనుల‌ వల్ల కలిగే సుకృతం. పురుషార్ధం అంటే మనిషి సాధించవలసిన లక్ష్యం. అయితే భక్తితో భగవంతుని ఆరాధించినందవల్ల కూడా పుణ్యం వస్తుంది అనేది మనందరి నమ్మకం. క్రమంగా, సత్కర్మల మాట పక్కనపెట్టి, పుణ్యం సంపాదించటానికి భక్తి ప్రధానం అని, అనేకానేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తే అపార పుణ్యం కలుగుతుందని గట్టి నమ్మకం ఈమధ్య కాలంలో బాగా పెరిగిపోయింది.
ఒకప్పుడు పుణ్యక్షేత్రాల దర్శనం అంటే నడివయసు నుంచి మొదలుపెట్టే వాళ్ళు. బాధ్యతలు తీరిన తర్వాత యాత్రలు చేయటం అనేది అప్పట్లో ఉండేది. కొన్ని పుణ్యక్షేత్రాల్లో మొక్కలు ఉంటాయి. ఉదా: తిరుపతి, శ్రీశైలం..వగైరాలు. పిల్లలు పుడితే వస్తాము అని భక్తితమొక్కుకుంటారు.అలాంటి వాళ్ళు చంటిపిల్లల్ని కూడా తీసుకొని ఆ పుణ్యక్షేత్రాలు దర్శించటం సహజం.
యువతీయువకులు ఆలయానికి, పుణ్యక్షేత్రాలకి రావటం చాలా అరుదుగా ఉండేది.
కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెద్ద వారే కాకుండా , యువతీయువకులు కూడా పుణ్యక్షేత్రాలు వెళ్ళటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది అభినందించదగినదే.
ఏ క్షేత్రం చూసినా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. పర్వదినాలు అనే కాదు విడి రోజుల్లో కూడా కోలాహలంగా ఉంటున్నాయి. ఇక డిసెంబర్ నెల, వేసవి సెలవుల్లో చెప్పేపనే లేదు.
ఈమధ్య అరుణాచలం వెళ్ళాను. అక్కడ గిరి ప్రదక్షిణ అనేది పరమపవిత్రమైన పరిక్రమణ. చిన్నా,పెద్దా అందరూ పగలూ,రాత్రి భేదం లేకుండా తిరుగుతూనే ఉన్నారు.
అరవై సంవత్సరాలు పై పడిన జంటలు మనసు మొత్తం ఈశ్వరునిపై లగ్నం చేసి గిరి ప్రదక్షిణ చేయటం చూస్తూఉంటే , వారి మీద అపారమైన భక్తి కలిగింది.
అదే సమయంలో యువతీ యువకులు కూడా గిరి ప్రదక్షిణ చేయటం కనపడ్డది. ఒకరి భుజం మీద మరొకరు చేయివేసి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతున్నారు.
మనసుని భగవంతునిపై లగ్నం చేసి భగవదారాధన చేస్తే పుణ్యం వస్తుంది. ఇక్కడ అసలు భక్తి భావనే లేదు.
పూర్వకాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవాళ్ళు. వీటిని పాదయాత్రలు అంటారు. తర్వాత కాలంలో రైలు, బస్సు వచ్చినా చాలా తక్కువ ఉంటుండేవి. కారు, ఫ్లైట్ కేవలం ఆర్ధికంగా ఉన్నత స్థానంలో ఉండే వారికే అందుబాటులో ఉండేవి. కాబట్టి చాలా వరకూ నిశ్చలమైన భక్తి , భగవంతునిపై అచంచల విశ్వాసం కలిగిన వాళ్ళు అన్ని కష్టనష్టాలకి ఓర్చి భగవద్దర్శనానికి వెళ్ళేవాళ్ళు.
కానీ నేడు ఆర్ధిక స్థితి గతులు మెరుగుగా ఉండటం, అన్నిరకాల రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావటంతో యాత్రలు చేయటం తేలిక అయిపోయింది. హోటల్స్, రెస్టారెంట్లు, ఏసీ ఎకామడేషన్స్ వీటన్నింటి మూలంగా నేడు పుణ్యక్షేత్రాలు ఒకరకంగా విహార యాత్రా స్థలాలుగా మారిపోయాయి.
మంచి కాటేజెస్ బుక్ చేసుకుని, నచ్చిన ఫుడ్ తింటూ, జాలీగా గడపగలిగే వెసులుబాటు ఉండటంతో యాత్రాస్థలాలు జనంతో కిటకిటలాడుతున్నాయి.
రెండు రోజుల సెలవులు రాగానే ఏదో ఒక ‘ట్రిప్’.అదివిహారస్థలమే కానక్కరలేదు, యాత్రాస్థలి అయినా ఓకే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హాయిగా వెళ్ళివస్తున్నారు. దీనివల్ల పుణ్యం, ఒక కొత్త ప్రదేశంలో ఎంజాయ్ చేయటం అనే పురుషార్ధం కూడా నెరవేరుతుంది కదా!

ఇదీ ఈ నాటి లోకాభిరామాయణం. వచ్చే నెల మరొక ముచ్చటతో మీ ముందుకు వస్తాను.

Written by PVS Krishnakumari

పేరు. : పీ. ( వల్లూరు) వి. యస్. కృష్ణ కుమారి
భర్త : పోతరాజు వేణుగోపాల కృష్ణ మూర్తి ( రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ హై కోర్టు)
పుట్టిన తేది. ఆగష్టు, 14
తండ్రి. : వల్లూరు కోటేశ్వరరావు
తల్లి : వల్లూరు రాజ్యలక్ష్మి
పిల్లలు : నీలా సుందరి ( కూతురు )
రవిశంకర్ ( అల్లుడు)
శ్రీవాత్సవ ( కుమారుడు)
‌. మృణాళిని ( కోడలు)

జన్మస్థలం : వల్లూరు , గుంటూరు జిల్లా
విద్యాభ్యాసం. : పొన్నూరు, విజయవాడ ,
క్వాలిఫికేషన్ : బి.ఏ. బీఈడీ
వృత్తి. : ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ శ్రీవాణి మోడల్ స్కూల్ ( సొంత స్కూల్)
ప్రవృత్తులు. : సంగీతం, సాహిత్యం
సాహితీ ప్రయాణం. : 2010 లో మొదటిసారిగా కవితలతో మొదలైంది. వార్త, మన తెలంగాణా, సత్యం ఆన్లైన్ మ్యాగజైన్ లలో వందకి పైగా కవితలు
2015 లో మొదటి కథ ' ఓ సీత కథ' నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత నవ్య, పాలపిట్ట, నమస్తే తెలంగాణా, జాగృతి, ఉషోదయ వెలుగు, వార్త ఆదివారం అనుబంధం, ఉషా మ్యాగజైన్ లలొ దాదాపు ఇరవై ఐదు కథలు, బహుమతులు , సాధారణ ప్రచురణకు ప్రచురితమైనాయి.
కథా మంజరి, కథా వేదిక, తరుణి ఇంకా అనేక ఫేస్ బుక్ గ్రూప్ లలో యాభైకి పైగా కథలు రాగా, ఇరవై కథలకి బహుమతులు వచ్చాయి.
నవలలు : జీవన విపంచి
వేద సుధామయం.
నేల నుండి నింగికి ( అముద్రితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తులసితీర్ధం

అంపశయ్య మీద రైతు భీష్ముడు