అనుభవ సుధాసారం

మనిషి మనసు మహార్ణవమంత లోతైనది. అందులోని ఆలోచనా పరిధి ఎల్లలు లేనిది. ఆ మనసు నుండి ఉబికివచ్చే భావజాలపు ప్రజ్ఞాపాటవాలు కొంతమందిలో మాత్రమే అసాధారణంగా విస్తృతమవుతాయి. అట్టి అరుదైన జ్ఞానంతో, సామాజిక సేవా దృక్పథంతో, మానవీయ విలువలతో జీవన సాఫల్యాన్ని చవి చూసిన ప్రజ్ఞాశాలి అమృతలత గారు. సకల సద్గుణ సంపన్నురాలైన సౌజన్యమూర్తి.
మనిషికి అనుభవాలు మనసును దృఢతరం చేస్తాయి. నడచుకోవాల్సిన మార్గాన్ని నిర్దేశించుకునేలా చేస్తాయి. గుణపాఠాలూ నేర్పిస్తాయి. కానీ వాటిని కేవలం తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం కోసం, స్వప్రయోజనాన్ని సాధించుకునే దిశగా అందరూ పయనిస్తారు. అమృతలత గారు మాత్రం ఆ అనుభవరాశిని పూర్తిగా పొదువుకొని చీకట్లను చీల్చుకుంటూ తాను ముందుకు నడుస్తూనే ఇతరులకు దారి చూపించారు. తన సౌఖ్యం కన్నా ఎదుటివారి ఆనందంలో సంతోషాన్ని వెతుక్కున్నారు.
కేవలం పదేళ్ళ వయస్సులో జరిగిన సంఘటన సమాజంలో సాటి మనుష్యుల పట్ల ఉండే నిర్లక్ష్యభావం, అనాదరణ, సంకుచిత మనస్తత్వం ఆమెకు ఎరుకపరచింది. అదే ఆమెకు మనుషుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగుల పట్ల ఎంతటి ఆదరణ కలిగి ఉండాలో తెలియజేసింది. అవయవలోపం ఉన్నవాళ్లను, అందంగా లేనివాళ్లను చుట్టూ ఉండే జనం మాటలతో ఎంతగా నిర్వీర్యం చేస్తారో ఆమె అవగతం చేసుకున్నారు.
బాల్యంలో అల్లరి చేష్టల వల్ల తనకు అనుకోకుండా కలిగిన ఎడమచేయి లోపానికి బాధపడుతున్న తరుణంలో, ఒక నాటకప్రదర్శనలో ఒక చేయిలేని పిల్ల బిచ్చగత్తె పాత్ర పోషించి మెప్పించడం ఆమెకు ఒక స్ఫూర్తిని కలిగించింది. అవయవలోపం శరీరానికే కానీ మనసుకు కాదని దృఢంగా నిర్ణయించుకున్నారు. అందరిలో అల్లరిపిల్లగా పేరు తెచ్చుకున్నా చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆమె చేష్టలను అల్లరిగా భావించడం కంటే సాహసోపేతమైన చర్యలుగా అభివర్ణించవచ్చు.
[9:53 PM, 6/5/2025] Niharini: ఆ కాలంలో వచ్చే ప్రజామత, కృష్ణాపత్రిక, జాగృతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక మొదలగు ఎన్నో పత్రికలు చదువుతుండేది. చందమామ, బాలమిత్ర పత్రికలలోని కథలు ఆమెలో చదువు పట్ల ఆసక్తిని, ఆలోచనా శక్తిని పెంపొందించాయి. “భట్టివిక్రమార్క కథలు”, “వేయిశిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి” వంటి పుస్తకాలు సాహిత్యం పట్ల మక్కువను పెంచాయి. ఈ విషయంలో ఆమె పెద్దన్నయ్య ప్రోత్సాహం ఎనలేనిది.
స్కూల్లో చదువుతున్న సమయంలోనే ఒక పాతకథను చదివి డైలాగులు, పాత్రలు మార్చి కొత్తగా కథ రాయడం చూసి వాళ్ళ మేనమామ బాగుందని మెచ్చుకొని “నువ్వే కొత్త కథలు రాయొచ్చు కదా” అన్న మాటలు ఆమెలోని సృజనాత్మకతను వెలికితీశాయి. అప్పటినుండీ ఆమెలో వికాసం పెల్లుబికింది. చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా పరిశీలించి విశ్లేషించుకోవడం మొదలుపెట్టారు. మనసు స్పందించిన ప్రతిసారి ఆమెలోని రచయిత్రి మేల్కొని కలం పట్టుకునేలా చేసింది. కేవలం పన్నెండేళ్ల వయస్సులో నవలా రచనకు పూనుకోవడం అంత సులభమైన విషయం కాదు.
“చిన్నారి పొన్నారి చిఱుత కూకటి నాడు / రచియించితి మరుత్తరాట్చరిత్ర” అన్న శ్రీనాథుని పలుకులు ఈ సందర్భంగా తలపుకు వస్తాయి.
తొమ్మిదవతరగతి చదువుతున్న రోజుల్లో స్నేహితురాలికి రాసిన ఒక ఉత్తరంలో “అమూల్యమైన ఓ సంవత్సరం ఎలాంటి విజయాలు లేకుండా వ్యర్థమైంది” అని రాశారు. అంత చిన్న వయస్సులో ఆమెకు ఉన్న అద్భుత భావనాశక్తికి, సమయాన్ని సద్వినియోగ పరచుకునే దృక్పథానికి ఇది నిదర్శనం. ఎప్పుడూ ఆమెలో ఒకే ఆలోచన ‘ఏదైనా చేయాలి’ అన్నది.
అదే తొమ్మిదవతరగతిలో ఆ సంవత్సరానికి సంబంధించిన సావనీర్ లో పృథ్వీరాజ్ చౌహాన్ కథను కథా వస్తువుగా చేసుకొని ఆమె నాటికగా రాయడం జరిగింది. హెడ్ మాస్టర్ దాన్ని ఆనాటి హైదరాబాద్ మేయర్ , రాజకీయవేత్త, ప్రముఖ రచయిత మాడపాటి హనుమంతరావు గారికి పంపించగా ఆయన చదివి “ఈ అమ్మాయి భవిష్యత్తులో గొప్ప రచయిత్రి అవుతుంది” అని మెచ్చుకున్నారు. ఆ మాటలు వమ్ముకాలేదు. అనంతరం ఆమె గొప్ప రచయిత్రిగా ఎదిగి అనేక రచనలను వెలువరించి పలువురి మన్ననలను అందుకున్నారు.
అమృతలత గారు తన జీవితంలో రెండు వివాహాల వైఫల్యానుభవాల ఘర్షణలోంచి రాటుదేలి జీవితం పట్ల ఒక కసిని ఏర్పరచుకున్నారు. దాన్ని సవాలుగా తీసుకొని తనను తాను మలచుకొని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఏ కష్టాన్నైనా నిబ్బరంగా ఓర్చుకోవడం ఆమెకు అలవాటు. దానికోసం ఎవరినీ నిందించడం కానీ భగవంతుని ప్రార్ధించడం కానీ ఆమెకు ఇష్టం ఉండదు. స్వయంకృషితో ఎదగాలంటారు.
ప్రభుత్వోపాధ్యాయినిగా సేవలందిస్తూ పాఠశాలల్లో ఉండే లోపాలను ఎదిరించలేక, ఎలాంటి లోపాలు లేనటువంటి పాఠశాలల స్థాపన చేయాలని సంకల్పించుకున్నారు. కొంత కాలం తర్వాత వాటి అభివృద్ధికొరకు తాను ఇంకా కృషి చేయాలన్న ఆలోచనతో ఉద్యోగానికి రాజీనామా చేయడం ఆమె త్యాగనిరతికి తార్కాణం. సమాజం పట్ల, భావితరాల పట్ల ఆమెకున్న బాధ్యాతాయుత భావనకు ఇది దర్పణం. విద్యాప్రమాణాలను పాటిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నతస్థానాన్ని పొందేలా తీర్చిదిద్దారు.
ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి తాను స్థాపించిన విద్యాసంస్థలను అభ్యుదయపథంలో, ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో ఆమె తన జీవితాన్ని మొత్తం వెచ్చించారు. ఈ విజయంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు, పొందిన చేదు అనుభవాలు అనూహ్యం. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. ప్రముఖుల ప్రశంసలకు పాత్రులయ్యారు. అంత ఎత్తులకు ఎదిగినా నిరాడంబరంగా ఉండడం, చిరునవ్వు చెరగనీయకుండడం ఆమెకు సుగుణాలు.
పత్రికలు ఆమె వ్యక్తిత్వాన్ని అంబరానికి చేరువ చేశాయి. ఎవరితో ఎలా నడుచుకోవాలో కథలు నేర్పించాయి. అందుకే ఆ రచయితలకు, రచయిత్రులకు ఋణపడి ఉంటానని చెప్పుకోవడం ఆమె వినయశీలతకు ప్రతీక. “గ్లాస్ రూమ్ లో కూర్చున్నట్టుగా మన నడత ఉంటే సమాజం కోటి కళ్ళతో చూసినా మనం భయపడనక్కరలేదు” అనే అమృతలతగారి మాటలు ఆమె స్వచ్ఛమైన వ్యక్తిత్వ విలువలకు అక్షర రూపాలు. పత్రికలు ఆమెకు ఆరోప్రాణం. ఆ మమకారంతో పత్రిక స్థాపించినప్పటికీ పత్రికా రంగంలో ఉన్న పోటీకి తట్టుకోలేక నిలిపి వేయాల్సిరావడం బాధాకరం. అయినా తమ ఆదర్శాల ఆచరణలో సమాజంలో విశిష్ఠస్థానాన్ని పొందారు.
అంతేకాదు కళలకు ఇచ్చినంత ఆదరణ నవల, కథ, కవిత, సాహిత్య విమర్శకు లేదనే ఒక అసంతృప్తి
ఆయారంగాల్లో ప్రతిభాశాలురను గుర్తించి, ప్రతీ సంవత్సరం వారి సేవలకు గాను అవార్డులు ఇచ్చే దిశగా పురికొల్పింది. “ఆనాటి కాలంలో కళాకారులను పోషించే మహారాజులు లేకపోతే ఆనాటి సాంస్కృతిక ప్రతీకలను మనం చూసి ఉండేవాళ్ళం కాదు. చరిత్రను నిక్షిప్తం చేసి భావితరాలకు అందించడానికి మానవ జీవన వికాసానికి కళలు చేసే విలువ వెల కట్టలేనివి” అంటారు అమృతలత గారు. పూవుకు తావి అలదాల్సిన అవసరం లేనట్లే కళాకారుల ప్రతిభ విరాజిల్లుతూనే ఉంటుంది. వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం మనదే.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి ఆమెకు వెన్నంటి ఉంటూ తనకు ఆలయం నిర్మించుమని కోరుకోవడం ఆమె పురా సుకృతం. ఆ వరాన్ని అందుకొని దేవాలయ నిర్మాణం గావించి ధన్యులైనారు అమృతలత గారు. మృత్యువు ముఖం వరకు వెళ్లినా ఆమెను ఇతరుల కొరకు నియోగించడం కోసం భగవంతుడు ఆమెకు పూర్ణాయువునిచ్చాడు.
బాధ, అవమానం సవాళ్ళను మాత్రం ఆమె ఒక్కరే భరించారు. ఆనందాన్ని మటుకు అందరికీ పంచిపెట్టారు. “నా చుట్టూ ఒక స్నేహబృందం ఎప్పుడూ ఉండాల్సిందే. కాకపోతే నేను అంతర్ముఖురాలిని, ముభావిని” అని చెప్పుకునే అమృతలత గారు ఎప్పుడూ సమూహంలో ఉంటూ అందరినీ అలరిస్తుంటారు.
పట్టుదల, ప్రజ్ఞ, ధైర్యం, కరుణ, స్నేహ శీలత, పరోపకారం, సమాజ శ్రేయస్సు కాంక్ష ఆమెకు స్వాభావిక లక్షణాలు. కాబట్టే అరుదైన మహిళగా, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని సామ్రాజ్ఞిగా భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న ధీయుతురాలు అమృతలత గారు. జీవన ప్రయాణంలో గతుకులను పూడ్చుకుంటూ ముందుకు సాగి ఉన్నతశిఖరాలను చేరుకున్న అరుదైన మహిళ ఆమె.
దర్శకుడు కె. విశ్వనాథ్ గారి నుండి “The best women achiever award” అందుకోవడం ఆమె ప్రతిభకు గీటురాయి. నిజంగానే ఆమె అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ “THE BEST WOMEN ACHIEVER”.

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని -69 వ భాగం

రక్తదానం