అభినవ రాముడు

సెలవలైనాక స్వాతి ఇంజనీరింగ్‌ కాలేజీ తెరిచారు. సీనియర్లంతా జూనియర్లని పరిచయం చేసుకుందామన్న ఉత్సాహంలో హుషారుగా ఉన్నారు. ర్యాగింగ్‌ బ్యాన్‌ చేసినప్పటి నుంచీ సీనియర్‌ విద్యార్థులకు కొంత నిరుత్సాహంగా ఉన్నా చేసేది లేక సర్దుకుపోతున్నారు. కానీ సెకండ్‌ మెకానికల్‌ చదువుతున్న సురేష్‌, రఘు లాంటి వాళ్లకి మాత్రం ఇదెంతో బోర్‌ గా ఉంది. కొత్తగా చేరిన జూనియర్స్‌ ని ఆటపట్టించడం ముఖ్యంగా ఆడపిల్లలని ఏడిపించడం లాంటి మజా లేకపోతే కాలేజీ లైఫ్‌ లో థ్రిల్లేముందీ అంటారు వాళ్లు!

కానీ వాళ్ల హాస్టల్‌ రూంమేట్‌ అయిన రోహిత్‌ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ”మీ ఆలోచనలు తప్పు, ఎదుటివారిని మానసికంగా హింసించే ఈ శాడిస్టిక్‌ మెంటాలిటీని మానుకుంటే లైఫ్‌ లో బాగుపడతారు” అంటూ అవకాశం దొరికినప్పుడల్లా క్లాస్‌ పీకుతుంటాడు వాళ్లకి.

ఆ రోజు కాలేజీ తెరిచి రెండవరోజు, ఇద్దరమ్మాయిలు కాలేజీ క్యాంపస్‌ లో అడుగుపెట్టి తమ క్లాసురూం వైపు వెళ్తుంటే సురేష్‌, రఘులు వాళ్లని అడ్డుకున్నారు. అయినా అది గమనించినట్లే ఆ అమ్మాయిలు వాళ్లని దాటుకుని వెళ్లడానికి ప్రయత్నించగా సురేష్‌ ఆ అమ్మాయిలను సంబోధిస్తూ అన్నాడు. ”చూడండి మిస్‌ మీరు ఈ కాలేజీలో క్రొత్తగా చేరినట్లున్నారు. అందుకే మీకు ఇక్కడి పద్ధతులు తెలిసినట్లు లేదు. ముందుగా మీరు సీనియర్లను గౌరవించటం నేర్చుకోవాలి. అప్పుడే వృద్ధిలోకి వస్తారు. ఏంటి అర్థమయిందా? మరి ఇందాకట్నించీ చూస్తున్నాము. ఇంత సేపయింది మేము ఎదురుపడి. ఇంకా మమ్మల్ని విష్‌ కూడా చేయలేదు అంటే మీ ఉద్దేశ్యం? సారీ చెప్పండి” అన్నాడు దబాయింపుగా.

అప్పుడా అమ్మాయిలు ఏమాత్రం తొణకకుండా ”సారీ చెప్పేంత తప్పుపని మేమేం చేయలేదు. మేము సారీ చెప్పం… సీ మిస్టర్‌, రెస్పెక్ట్‌ కెనాట్‌ బి డిమాండెడ్‌. బట్‌ ఇట్‌ షుడ్‌ బి కమాండెడ్‌! మా దోవ నుంచి తప్పుకోండి!” అన్నారు ముక్త కంఠంతో.

”ఏంటే ఊరుకొన్న కొద్దీ మరీ రెచ్చిపోతున్నారు… మాకు సారీ చెప్పి విష్‌ చేయకుండా ఇక్కడి నుంచి ఎలా వెళతారో మేమూ చూస్తాము” అంట వారి దారికి అడ్డంగా నిలుచున్నారు.

”ఏయ్‌ మిస్టర్‌ రెచ్చిపోతున్నది మీరా మేమా? ఎక్కువ మాట్లాడారంటే ఇప్పుడే వెళ్లి ప్రిన్సిపల్‌ కి రిపోర్ట్‌ చేసామంటే వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో కటకటాలు లెక్కపెడుతూ కూర్చోవలసిందే ! ఆడ పిల్లలంటే అంత అలుసుగా ఉందా?” అన్నది ఆ ఇద్దరిలో ఓ అమ్మాయి కోపంతో ముక్కుపుటాలు అదురుతుండగా.

ఇంతలో అటుగా వెళ్తున్న రోహిత్‌ ఇక్కడేదో గొడవ జరుగుతున్నట్లు అనిపించడంతో వీళ్లకేసి వచ్చి ”ఏంట్రా సంగతి?” అన్నాడు. అందుకు సురేష్‌ ”చూడరా వీళ్లు మనకి జూనియర్స్‌ కదా సీనియర్స్‌ని విష్‌ చేయడం మీ డ్యూటీ అని చెప్తున్నాము. అయినా విష్‌ చేయలేదు. అందులో సారీ చెప్పమంటే చెప్పడం లేదు. పైగా ప్రిన్సిపల్‌ కి కంప్లెయింట్‌ చేస్తామని బెదిరిస్తున్నారు” అన్నాడు ఫిర్యాదుగా!

”చూడండి మిస్టర్‌ వీళ్ళు మీ ఫ్రెండ్సో కాదో మాకు తెలీదు కానీ ఇందాకట్నించీ చాలా మ్యానర్‌ లెస్‌గా బిహేవ్‌ చేస్తున్నారు. మర్యాదగా అడగవలసిన పద్ధతిలో అడిగితే మేము విష్‌ చేసే వాళ్ళమే కానీ అలా దౌర్జన్యంగా అడిగితే మాకు తిక్కరేగింది. పైగా ఇతను మమ్మల్ని ఉద్దేశించి వాడిన పదజాలం వింటే ఎవరికైనా ఒళ్లు మండక మానదు” అన్నది అందులో తెల్లగా, నాజూగ్గా, అందంగా ఉన్న అమ్మాయి.

అప్పుడు రోహిత్‌ ”సారీ మిస్‌ ఇంత మ్యానర్‌ లెస్‌ గా మీతో బిహేవ్‌ చేసినందుకు వీళ్ల తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. సో ఈ రోజు జరిగింది మరిచిపొంది. లెటజ్‌ బి ఫ్రెండ్స్‌  ఫ్రమ్‌ నౌ ఆన్‌ వర్డ్స్‌. బై ద వే ఐయామ్‌ రోహిత్‌ మెకానికల్‌, మీట్‌ మై రూంమేట్స్‌ సురేష్‌ అండ్‌ రఘు. మీ పేర్లు కూడ మేము తెలుసుకోవచ్చా అఫ్‌ కోర్స్‌ ఇఫ్‌ యు డోంట్‌ మైండ్‌!” అన్నాడు.

అప్పుడు వారితో తెల్లగా అందంగా ఉన్నమ్మాయి ”ఐ యామ్‌ మధురిమ. ఫస్ట్‌ ఇయర్‌ ఎలక్ట్రానిక్స్‌. దిసీజ్‌ మై ఫ్రెండ్‌ సుష్మిత ఆల్సో మై క్లాస్‌ మేట్‌” అన్నది.

అప్పుడు రోహిత్‌ తన రూం మేట్స్‌ వైపు తిరిగి, ”ఒరేయి అంత అన్‌ కల్చర్డ్‌ గా బిహేవ్‌ చేసినందుకు మీరే వాళ్లకి సారి చెప్పాలి అదే న్యాయం” అన్నాడు. ఇక చేసేది లేక వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిలకు సారీ చెప్పారు.

”ఓకే మిస్‌ మధురిమ అండ్‌ సుష్మిత ఇక నుంచీ మీకేమయినా హెల్ప్‌ కావాలంటే మమ్మల్ని నిస్సంకోచంగా అడగండి. మాకు చేతనయిన సహాయం తప్పక చేస్తాము” అని పదండిరా క్లాస్‌ కి లేట్‌ అవుతోంది అంటూ సురేష్‌ రఘులతో కలిసి వెళ్లిపోయాడు రోహిత్‌.

తమ క్లాసుకెళ్ళాక వాళ్ళిద్దరూ రోహిత్‌ తో అన్నారు. ”ఒరేయ్‌ పెద్ద హీరోలా వచ్చి ఆ అమ్మాయిల ముందు మా పరువు తీసావు కదరా… అసలు నిన్నెవరు రమ్మన్నారు రా మా మధ్యలోకి”

”నోర్ముయ్యండిరా.. మీరు చేసింది బాగుందా? పరిచయం చేసుకోవాలంటే అదేనా పద్ధతి? మనమంతా ఒకే కాలేజీలో చదువుతున్న వాళ్లం, అంతా కలిసి ఓ ఫ్యామిలీలా ఉండాలి. ఇకనుంచీ ఆ అమ్మాయిలతోనే కాదు ఇంకెవరితో అలా బిహేవ్‌ చేసినా నేనూరుకోను తెలిసిందా జాగ్రత్త !” అని వాళ్లిద్దరికీ వార్నింగ్‌ ఇచ్చాడు రోహిత్‌.

రోజులు వేగంగా దొర్లిపోతున్నాయి. ఓ ఆదివారం సుష్మిత మధురిమ కలిసి మ్యాట్నీ షోకి బయలుదేరారు. అసలే ఆదివారం ఆపైన ఆ సినిమా వచ్చి కూడా వారమే అవడంతో టికెట్స్‌ దొరకడం లేదు. హవుస్‌ ఫుల్‌ అవడంతో అంతా బ్లాక్‌ లో ట్రై చేస్తున్నారు. ఎవరి దగ్గర బ్లాక్‌ టికెట్స్‌ ఉన్నాయో తెలీక స్నేహితురాలిద్దరూ ఏం చేయాలో తోచక అవస్థ పడుతుండగా వెనుక నుంచి ఎవరో ”హలో మధురిమ గారూ టికెట్స్‌ దొరక లేదా?” అనడిగారు. ఎవరా అని తిరిగి చూస్తే చిరునవ్వుతో నిలుచుని ఉన్నాడు రోహిత్‌ తన ఇద్దరి రూంమేట్స్‌తో పాటు. మధురిమ ముందు ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుని ”అవునండీ టికెట్స్‌ బ్లాక్‌ లో కొందామని చూస్తున్నాము. ఇంతలో మీరు కనపడ్డారు” అన్నది.

అందుకు రోహిత్‌ ”మీరేం వర్రీ కాకండి. నా దగ్గర రెండు ఎక్స్‌ ట్రా టికెట్స్‌ ఉన్నాయి. మేమనుకున్న ఇద్దరు ఫ్రెండ్స్‌ రాలేదు. కాబట్టి మనమంతా కలిసి మూవీ చూద్దాము రండి” అన్నాడు ఎంతో హుందాగా.

”చాలా థాంక్స్‌ రోహిత్‌ గారూ కానీ మేము ఊరికే తీసుకోము. అలా అయితేనే వస్తాము” అన్నది మధురిమ కచ్చితంగా.

”ఓకే ఓకే అలాగే, రండి త్వరగా” అన్నాడు తొందర చేస్తూ. ఐదు సీట్లలోనూ వరుసగా ఐదుగురూ కూర్చున్నారు. కాకతాళీయంగా మధురిమకి రోహిత్‌ పక్క సీటు వచ్చింది. ఆమె కొద్దిగా ఇబ్బందిగానే అతని పక్క సీట్లో కూర్చుంది. కానీ ఆమె భయపడ్డట్లు ఏమీ జరగలేదు. రోహిత్‌ ఎంతో జాగ్రత్తగా ఆమెకు తన చేతులు కానీ భుజాలు కానీ తగలకుండా కూర్చున్నాడు. అతని సంస్కారానికి మధురిమ ఎంతో ముగ్ధురాలైంది. ఇంటర్‌ వెల్‌ లో రోహిత్‌ అడిగాడు మధురిమనీ సుష్మితనీ ఉద్దేశించి ”కాలేజీ ఎలా ఉందండీ? క్లాసెస్‌ బాగా జరుగుతున్నాయా? ఇంకెవరైనా మిమ్మల్ని ర్యాగింగ్‌ చేస్తే చెప్పండి వాళ్ల సంగతి నేను చూస్తాను” అన్నాడు చిరునవ్వుతో తన రూంమేట్స్‌ వంక చూస్తూ.

”అబ్బే అలాంటిదేమీ లేదండీ… ఎవరూ ఏమీ చేయటం లేదు. మేము కూడ బాగా అలవాటు పడిపోయాము కొత్త వాతావరణానికి” అన్నది మధురిమ.

సినిమా అయిపోయాక బయటికి వచ్చేసరికి మధురిమ స్నేహితురాలు సౌమ్య కనపడింది. ఇద్దరూ ”హాయ్‌ వాటె సర్‌ ప్రైజ్‌” అని విష్‌ చేసుకున్నాక రోహిత్‌ నీ అతని సహచరులనీ, సుష్మితనీ పరిచయం చేసింది మధురిమ. ”ఈమె ఇంటర్‌లో నా బెస్ట్‌ ఫ్రెండ్‌, కానీ తను మెడిసిన్‌ ఆఫ్ట్‌ చేసుకుంది. అందుకని మేమిలా విడిపోవలసి వచ్చింది” అంటూ సౌమ్యని ఆ నలుగురికీ పరిచయం చేసింది.

ఆ తరువాత వారి దగ్గర సెలవు తీసుకుని, సుష్మితతో బయలు దేరుతుండగా సౌమ్య రావే నేను మిమ్మల్ని నా కారులో మీ ఇళ్ళ దగ్గర డ్రాప్‌ చేస్తాను” అన్నది.

సరే కానీ ఒక్క నిమిషం ఉండవే నేను రోహిత్‌ గారికి సినిమా టికెట్లకు డబ్బు ఇచ్చేసి వస్తాను అని వెళ్ళి రోహిత్‌ కి డబ్బిచ్చేసి కారులో వచ్చి కూర్చుంది.

కారు డ్రైవ్‌ చేస్తూ సౌమ్య అన్నది మధురిమతో ”నువ్వు పరిచయం చేసిన ఆ రోహిత్‌ అందగాడేనేవ్‌, చూస్తుంటే నీకు సరైన జోడి అనిపిస్తున్నాడే.. ఏంటి ఏదైనా…?” అని కన్ను గీటింది మధురిమ వైపు కొంటెగా చూస్తూ..

”నోర్ముయ్యవే నీకెప్పుడూ అటువంటి ఆలోచనలే! మనం కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికే లేక అబ్బాయిలకు లైన్‌ వేయడానికా?” అన్నది చిరుకోపంతో.

”అబ్బ అంత కోపమెందుకు బాలా నువ్వు వెయ్యకపోతే నేను వేద్దామనీ…” అంటూ దీర్ఘం తీసింది. మళ్ళీ తనే ”పోనీ మీరు వెయ్యరాదూ సుష్మితగారూ?” అన్నది.

”ఒసేయ్‌ ఆ ఛాన్స్‌ లేదే, దానికి వాళ్ళ బావ ఎప్పుడో బుక్‌ అయిపోయాడు కాబట్టి అది కుదరదు” అన్నది మధురిమ.

”అయితే పోటీ లేకుండా చూసుకున్నానన్నమాట…!”

”ఏడిశావులే..” అని చిన్న దెబ్బ వేసింది స్నేహితురాలి మీద.

సౌమ్య నవ్వేసింది.

ఏడాది గడిచింది. మధురిమ, సుష్మితలు సెకండ్‌ ఇయర్‌ లోకీ, రోహిత్‌ అండ్‌ కో థర్డ్‌ ఇయర్‌లోకీ వచ్చారు. ఈ ఏడాదికాలంలో వారి స్నేహం ఎంతో వృద్ధి చెందిందనే చెప్పవచ్చు. ఈ మధ్య రోహిత్‌ రూంమేట్స్‌ సురేష్‌, రఘులు, రోహిత్‌ మధురిమను ఇష్టపడుతున్నట్లుగా పసిగట్టారు. అప్పట్నుంచీ వాళ్ళు ఆమెతో కేవలం స్నేహమే కాకుండా మరో అడుగు ముందుకు వేయమని అతన్ని ఎంతో ప్రోత్సహించినా వారి మాటలను లెక్క చేయకుండా తన లిమిట్స్‌ లో తనుండేవాడు రోహిత్‌.

అయినా వాళ్ళు వదిలి పెట్టకుండా ”ఒరేయి నువ్వు ఏదో ఒకటి చెయ్యకపోతే మధురిమని మరెవరైనా ఎగరేసుకు పోలేరురా! త్వరగా ‘ఐ లవ్‌ యు’ చెప్పెయ్యరా, మధురిమ లాంటి అందగత్తె, మంచి స్వభావం కలమ్మాయి మళ్ళీ నీకు దొరకదురా.. ఆ తరువాత మేము చెప్పలేదని మమ్మల్ని ఆక్షేపిస్తే మాత్రం ఫలితం ఉండదు” అని ఒకటే పోరసాగారు.

వాళ్ళావిధంగా పోరుతుంటే ఓరోజు రోహిత్‌ తనలోతానే సింహావలోకనం చేసుకున్నాడు. ‘ఏమిటి వీళ్ళిలా నా వెంట పడ్డారు.. నాకు మధురిమంటే ఇష్టమున్నమాట నిజమే కానీ వీళ్ళు చెప్పినట్లు చేయకపోతే ఆ అమ్మాయి నాకు దక్కకుండా పోతుందా? కానీ నా చదువే ఇంకా పూర్తికాలేదు… లైఫలో ఇంకా ఏమీ సాధించలేదు, ఇప్పుడు నేను ప్రేమా దోమా అంటూ ఆ అమ్మాయి వెంట తిరగడ మన్నది నా ప్రిన్సిపల్‌ కే విరుద్ధం… అమ్మా నాన్న నాకు నేర్పించిన విలువలను త్రోసిరాజని మనలేము. ముందు నా కెరీర్‌ ముఖ్యం. అయినా నా గురించి ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోకుండా గాలిలో మేడలు కట్టడం వివేకం అనిపించుకోదు. అందుకే ఏదో ఓ రోజు చూసుకుని ఆమె అభిప్రాయం తెలుసుకోవాలి. ఆ తరువాతే ఏదైనా!” అని దృఢంగా నిశ్చయించుకున్నాక రోహిత్‌ మనస్సు ప్రశాంత నిలయమైంది.

ఓరోజు రోహిత్‌ కాలేజీ అయిపోయాక తన హాస్టల్‌ రూంకి రాగానే కంటబడ్డ దృశ్యం చూసి అవాక్కయ్యాడు.

”ఇదెప్పటి నుండి మొదలు పెట్టార్రా” అన్నాడు మందు పుచ్చుకుంటున్న సురేష్‌ రఘులని చూసి.

”ఒరేయి ఇందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసురా… రారా నువ్వు కూడా ఓ పెగ్గు వేయి అప్పుడు తెలుస్తుంది ఇందులో ఉన్న మజా !”

”ఛీ ఛీ మిమ్మల్ని నా రూంమేట్స్‌ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా!” అన్నాడు ఏవగింపుగా.

”ఇంకా ఏం చూసావు… మందు తరువాత మగువ కూడ ఉందిరోయ్‌. ఈ రాత్రికే బుక్‌ చేసాము. కావాలంటే నువ్వు కూడ రావచ్చు మాతో” అన్నారు ఏకకంఠంతో.

ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు రోహిత్‌. ”ఛీ ఛీ సిగ్గు లేదట్రా మీకు, ఇవేం అప్రాచ్యపు పనులురా? పైగా నన్ను కూడా ఈ పాపపంకిలంలోకి లాగాలని చూస్తారా?” అన్నాడు చీత్కారంగా.

”ఇందులో తప్పేముందిరా. ఎక్స్పీరియన్స్‌… ఎక్స్పీరియన్స్‌, ఏ అనుభం లేకుండా రేపు పెళ్ళైతే ఎలా మ్యానేజ్‌ చేస్తావు? ఇంత చేతకాని దద్దమ్మను అని నీ పెళ్ళాం నిన్ను నిలదీస్తే ఏం సమాధానం చెప్తావు?”

”ఓహో అయితే మీలాగానే మీ కాబోయే భార్యకు కూడ పెళ్ళికి ముందే అనుభవం ఉంటే ఒప్పుకుంటారా?” అడిగాడు.

”ఒరేయి మగవాళ్ళ అనుభవానికీ ఆడవాళ్ళ అనుభవానికీ తేడా లేదురా. ఆడవాళ్ళెప్పుడూ పెళ్ళైనాకే ఇందులో పాల్గొన్నాలి”.

”అదెందుకో…. ” అన్నాడు రోహిత్‌ వెటకారంగా!

”అదంతేరా నీకర్థం కాదు. వస్తే మాతోపాటు రా. లేకపోతే పో! నువ్వు అపర శ్రీరామచంద్రుడివని తెలీక అడిగాము. పొరపాటైపోయింది” అన్నారిద్దరు లెంపలు వాయించుకుంటూ.

”ఒరేయి ఎందుకురా ఇలాంటి పాడుపనులు చేస్తూ, మీ ఫ్యూచర్‌ పాడు చేసుకుంటారు? మీకు చదువులో ఇంట్రస్ట్‌ లేదు, స్పోర్ట్స్‌ లో ఇంట్రస్ట్‌ లేదు, ఇంకే యాక్టివిటీస్‌ లోనూ ఆశక్తి లేదు. అసలు ఏ వ్యాపకమూ లేకపోబట్టే మీరిలాంటి చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు. పదండి రేపే ఏదైనా ఒక స్పోర్ట్స్‌ లో జాయిన్‌ కండి. నేనెలాగూ ఫుట్‌ బాల్‌ టీమ్‌ కెప్టెన్‌ కాబట్టి మీకు ఈజీగానే కోచింగ్‌ లో జాయిన్‌ చేయించగలను. చదువులో కూడా శ్రద్ధ పెట్టండి, ఇక చూస్కోండి మీ లైఫే మారిపోతుంది. మీరు చేసే ఈ పిచ్చి పనులకు అసలు టైమే ఉండదు” అన్నాడు రోహిత్‌.

దానికి సురేష్‌, రఘులు ”పోరా లైఫ్‌ ఎంజాయ్‌ చేయటం చేతకాని నీతో మాకేంటి?” అన్నారు నిర్లక్ష్యంగా.

”అయితే వినండి ఈరోజు నుంచీ మీకూ నాకూ ఏ సంబంధమూ లేదు. మీ ఏడుపేదో మీరు ఏడవండి… నేను మాత్రం ఈ ఊబిలో దిగను” అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

మరో ఏడాది గడిచింది. ఇప్పుడు రోహిత్‌ ఫైనలియర్‌ లో ఉన్నాడు. మధు, సుష్మిత థర్డ్‌ ఇయర్‌ లోకొచ్చారు. సురేష్‌, రఘులు మాత్రం థర్డ్‌ ఇయర్‌ ఫెయిల్‌ అయి రిపీట్‌ చేస్తున్నారు.

ఆరోజు కాలేజీలో ఎలొక్యూషన్‌ కాంపిటీషన్‌ జరుగుతోంది. అందులో రోహిత్‌ కూడా పాల్గొంటున్నాడు. ‘పురుషులకు శీలం అక్కరలేదు’ అన్నది టాపిక్‌. కాంపిటీషన్‌ కాలేజీ ఆడిటోరియంలో జరిగేందుకు కావలసిన అన్ని ఏర్పాటు చేసారు. విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్‌ లో మధురిమ సుష్మితలు కూడ ఉన్నారు.

ప్రోగ్రామ్‌ కండక్ట్‌ చేసే ఆయన సమయం కాగానే మైకు ముందు నిలబడి ఒక్కొక్క అభ్యర్థినీ, పేరు పేరునా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు.

కొంతమంది శీలమనేది ఆడవారికి ఉండాలికానీ పురుషులకు ఎందుకు మగవాడు ఏం చేసినా చెల్లుతుంది. ఎందుకంటే అతడు మగాడు కాబట్టి. కానీ ఆడవాళ్ళకి కొన్ని అవరోధాలు ఉన్నాయి. అందుకే స్త్రీలు పవిత్రంగానే ఉండాలి. కానీ మగవాడికి అవేవీ లేనందున అతడు ఎలా ప్రవర్తించినా ఫరవాలేదు, అతడికి శీలం ఉండక్కరలేదని మరికొంతమందీ వాదించారు.

ఆఖరున రోహిత్‌ ని వేదిక మీదకు ఆహ్వానించారు. రోహిత్‌ వేదికెక్కి తన స్పీచ్‌ ప్రారంభించాడు.

”సభాసదులకు, నా ప్రియమిత్రులకు నా అభివందనాలు. ఈరోజు టాపిక్‌ మీద ఇప్పటికే నా తోటి అభ్యర్థులు చాలా విలువైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ వాటితో నేను ఏకీభవించనందుకు క్షంతవ్యుణ్ణి. యుగాల క్రితమే శ్రీరాములవారు జన్మించిన మన దేశంలో పురుషులకు శీలం అవసరమా అన్న ప్రశ్న ఇప్పుడుదయించడం ఎంతో విచారకరం.

అసలు శీలం అంటే ఏంటి? మనలో చాలామందికి శీలం అంటే శారీరకమేనన్న అభిప్రాయం వుంది. కానీ నా దృష్టిలో శీలం అన్నది కేవలం శారీరకమైనదే కాదు మానసికమైనది కూడ. మనసా వాచా కర్మణా అనైతికంగా పురుషుడు పరస్త్రీతో కానీ, స్త్రీ పరపురుషునితో కానీ లైంగిక సంపర్కర పెట్టుకోకుండా ఉండడమే శీలం అన్న పదానికి సరైన నిర్వచనం.

కానీ మన పురుషాధిక్య సమాజంలో పురుషుడిదే పైచేయి కావడం మూలాన శీలాన్ని కేవలం స్త్రీలకే పరిమితం చేసి తాను మాత్రం విశృంఖలంగా ప్రవర్తిస్తున్నాడు పురుషుడు.

అంతే కాదు. మగవాడు అనాదిగా విశృంఖలంగా ప్రవర్తించడానికి సగం కారణం అతనిని పెంచిన తల్లిదండ్రులే! చిన్నప్పటినుంచే తల్లితండ్రులు మగపిల్లవాణ్ణి ప్రత్యేకంగా చూడడం, అతడు ఏం చేసినా చెల్లుతుంది. వాడికేం వాడు మగవాడు అంటూ అతనికొక ఆధిక్యతను ఆపాదించి పెంచడం చేస్తూ, కూతుళ్ళను మాత్రం తగిన కట్టుదిట్టాలతో పెంచటం జరుగుతోంది. నా వాదన ఏంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి తమ కొడుకులకు వివాహం అయ్యేదాకా పవిత్రంగా ఉండాలని ఎందుకు చెప్పరు? తమ అక్క చెల్లెళ్ళతోనూ, కన్నతల్లితోనూ ఎటువంటి వికారాలూ లేకుండా ఎలా అయితే వ్యవహరిస్తారో అలానే పరాయి ఆడపిల్లలని కూడా చూడాలని ఎందుకు బుద్ధి చెప్పరు? నైతిక విలువలు కలిగి ఉండడం స్త్రీ పురుషులిరువురికీ ఆవశ్యకమేనని తల్లిదండ్రులు ఎప్పుడైతే మగపిల్లలకు కూడా ఉగ్గుపాలతో నూరిపోసి పెంచుతారో అప్పుడే కనీసం ముందుతరం పురుషులైనా తమ శీలాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

అంతేకాదు అనాది నుండీ పురుషులు విశృంఖలంగా ప్రవర్తించడానికి కొంత మన పురాణాలు, కొంత నేటి మన మీడియా అంటే సినిమాలూ, బుల్లితెర వగైరాలు దోహదం చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే స్త్రీని ఓ విలాస వస్తువుగానూ, భోగవస్తువుగానూ చిత్రీకరించే ప్రకటనలూ, సినిమాలు రాకుండా ప్రభుత్వం తగిన కట్టుదిట్టం చేయాలి. పురుషులకూ శీలం ఉండాలని ప్రబోధించే చలనచిత్రాలూ, రచనలూ పుంఖాను పుంఖాలుగా రావాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభించగలదని నేను అభిప్రాయపడుతున్నాను” అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు రోహిత్‌.

వెంటనే ఆడిటోరియమంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. వెల్‌ సెడ్‌ వెల్‌ సెడ్‌ అంటూ విద్యార్థులంతా కలిసి పోడియం దగ్గరికి వెళ్ళి రోహిత్‌ ని అభినందించారు.

రోహిత్‌ వేదిక మీద నుంచి దిగి వచ్చాక మధురిమ, సుష్మితలు కూడా అతని వద్దకు వెళ్ళి ”హార్టీ కంగ్రాచ్యులేషన్స్‌ రోహిత్‌ గారూ, మొత్తానికి అదరగొట్టేసారు” అని అభినందించారు. ఆ రోజునుంచీ మధురిమ మనస్సులో రోహిత్‌ కి ఓ ప్రత్యేక స్థానం ఏర్పడింది. స్త్రీల పట్ల అతనికున్న గౌరవానికి ఆమె చాలా ఇంప్రెస్‌ అయిందన్నమాట వాస్తవం.

చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఆరోజు స్వాతీ ఇంజనీరింగ్‌ కాలేజీలో సాయంకాలం ఆరుగంటలకు కాలేజీ ఆడిటోరియంలో ఫైనలియర్‌ స్టూడెంట్స్‌ కు ఫేర్‌ వెల్‌ పార్టీ జరుగుతోంది. అక్కడక్కడ టేబిల్స్‌, ఒక్కొక్క టేబిల్‌ చుట్టూరా నాలుగేసి కుర్చీలు వేసి ఉన్నాయి. స్టూడెంట్సంతా ఎంతో ఉత్సాహంగా సాఫ్ట్‌ డ్రింక్స్‌ తీసుకుంటూ, తమ తమ ఫ్రెండ్స్‌ తో కబుర్లాడుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

రోహిత్‌ కూడ తన మిత్రులతో మాట్లాడుతున్నాడన్నమాటే కానీ అతని మనస్సంతా మధురిమే నిండి ఉంది. మధురిమతో ఇన్నాళ్ళుగా తన మనస్సులో మెదులుతున్న భావాలను వ్యక్తపరచటానికి ఇదే సరైన సమయమనిపించి కూల్‌ డ్రింక్‌ తీసుకుంటూనే మధురిమ కోసం చుట్టూరా కలయచూసాడు. అలా కాసేపు చూసాక మధురిమ దూరంగా ఎవరితోనో కబుర్లు చెప్తూ కనిపించింది. అతని మనస్సు వినీలాకాశంలో ఎగిరే విహంగమే అయింది.

చేతిలో కూల్‌ డ్రింక్‌ గ్లాసు పట్టుకునే మెల్లిగా మధురిమ వైపు అడుగులేసాడు. మధురిమ కూడా అతనిని గమనించి దగ్గరకు రాగానే హలో అని విష్‌ చేసింది. రోహిత్‌ ను చూసిన మధురిమతో మాట్లాడుతున్న అమ్మాయి ”ఓకేనే యూ కేరీ ఆన్‌” అనేసి అక్కడినుంచి తప్పుకుంది.

అప్పుడు రోహిత్‌ ”మధురిమ గారూ.. మీరు కూడా కూల్‌ డ్రింక్‌ తీసుకోండి” అన్నాడు. ”అబ్బే నాకు ఈ కూల్‌ డ్రింక్స్‌ అంతిష్టముండవండీ” అన్నది.

”లేదండీ ఈ మజా ఉందే చాలా బావుంటుందండీ.. ఓసారి త్రాగి చూడండి. మీకే తెలుస్తుంది” అంటూ వెళ్ళి మధురిమకు కూడా ఓ గ్లాసు మాజా తెచ్చి ఆమె చేతికిస్తూ ఇలా అన్నాడు ”చూడండి మధురిమ గారూ నేను చాలా రోజుల నుంచీ మీతో కొంచెం పర్సనల్‌ గా మాట్లాడాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే అలా వెళ్ళి కూర్చుందామా?” అన్నాడు ఓ మారుమూల టేబిల్‌ చూపిస్తూ.

మధురిమ కూడా అందుకు ఒప్పుకుని అతనితో పాటు ఆ టేబిల్‌ వైపు అడుగులేసింది.

రోహిత్‌ ఓ కుర్చీలో కూర్చుంటూ మధురిమ కూడా కూర్చున్నాక డ్రింక్‌ సిప్‌ చేస్తూ తన మనస్సలో మాటను ఇలా వెల్లడించాడు.

”మధురిమ గారు నాకు ఉపోద్ఘాతాలూ, డొంగ తిరుగుడు వ్యవహారం అంత చేతకాదు. అందుకే నేనెప్పుడూ ఫ్రాంక్‌ గా మాట్లాడతాను. విషయమేమిటంటే నేను బి.టెక్‌ తరువాత ఎం.టెక్‌ చేద్దామను కుంటున్నాను. అదయ్యాక మంచి జాబ్‌ చూసుకుని నా కాళ్ళ మీద నేను నిలబబడ్డాక, పెళ్ళి చేసుకుని లైఫ్‌ లో సెటిలవుదామనుకుంటున్నాను. ఇకపోతే ఇన్నేళ్ళ మన పరిచయంలో నాకు మీరూ, మీ స్వభావం ఎంతో నచ్చాయి. మీకు కూడా నేను నచ్చితే మిమ్మల్ని నా జీవిత భాగస్వామిని  చేసుకుందా మనుకుంటున్నాను. కాకపోతే మీరు నాకోసం రెండు మూడేళ్ళు వెయిట్‌ చేయవలసి వస్తుంది. మరి దీనికి మీరేమంటారు? మీరు మీ అభిప్రాయం ఇప్పుడే చెప్పనక్కరలేదు. మీరు బాగా ఆలోచించుకునే మీ నిర్ణయం నాకు చెప్పండి. తొందర లేదు. టేక్‌ యువర్‌ ఓన్‌ టైమ్‌” అన్నాడు ఎంతో డిగ్నిఫైడ్‌ గా.

ఈ మాటలకు మధురిమ కొద్దిగా సిగ్గు పడింది. ఆమె బుగ్గలు కెంపులైనాయి. కానీ వెంటనే తనను తాను కంట్రోల్‌ చేసుకుంటూ ఇలా అన్నది. ”రోహిత్‌ గారూ నేను మిమ్మల్ని ఫస్ట్‌ టైమ్‌ కలిసినప్పుడే ఎంతో ఇంప్రెస్‌ అయ్యాను. అప్పటినుంచీ నేను మిమ్మల్ని గమనిస్తూ వస్తున్నాను. మీ సంస్కారం, మీరు ఆడవాళ్ళకిచ్చే గౌరవం, హుందాగా ప్రవర్తించే మీ తీరు నాకెంతో నచ్చాయి. అప్పటినుంచీ నేను మీ సీక్రెట్‌ ఎడ్మైరర్‌ ని అయిపోయానంటే నమ్మండి! కాబట్టి నాకు కూడా మీ ప్రపోజల్‌ అంగీకారమే. ఎలాగూ నా ఇంజినీరింగ్‌ పూర్తి కావడానికి మరో సంవత్సరం ఉంది. అదయ్యాక నేను కూడా పిజి చేద్దామనుకుంటున్నాను. సో ఇట్‌ సూట్స్‌ మి టూ!” అన్నది. అప్పుడు రోహిత్‌ ”మధురిమ గారూ ఇప్పుడు నాకేమనిపిస్తోందో చెప్పనా? జంగ్లీ సినిమాలో షమ్మీకపూర్‌ లా యాహూ అనాలనిపిస్తోందండీ అన్నాడు కొంటెగా నవ్వుతూ. అతనితో పాటు తాను కూడా శృతి కలిపింది మధురిమ.

మూడేళ్ళ అనంతరం రోహిత్‌ ఓ మంచి జాబ్‌ లో చేరాక మధురిమకీ అతనికీ ఓ శుభ ముహూర్తాన వివాహం జరిగింది. హనీమూన్‌ నుంచి తిరిగొచ్చాక మధురిమ కూడా ఓ కంపెనీలో ఉద్యోగం కోసం అప్లై చేసింది. రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి.

ఆ రోజు మధురిమ పుట్టినరోజు. దంపతులిద్దరూ దైవ దర్శనం చేసుకుందామని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారు. అర్చన చేయించి ప్రసాదం తీసుకుని గర్భగుడి బయటకు వచ్చిన వారిద్దరికీ, దూరంగా ఓ స్థంభానికి ఆనుకుని కూర్చుని ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు. అతన్ని ఎక్కడో చూసినట్లుందేనని అనుకుంటూ అతని దగ్గరకు వెళ్ళారు రోహిత్‌ మధురిమలు. చూస్తే అతను ఎవరో కాదు ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు రోహిత్‌ రూంమేట్‌ సురేష్‌. అతన్ని గుర్తుపట్టి దంపతులిద్దరూ కుశల ప్రశ్నలు వేసారు.

సురేష్‌ కూడా రోహిత్‌ మధురిమలిద్దరూ పెళ్ళి చేసుకున్నారని తెలిసి ఎంతగానో సంతోషించి వారిని మనస్పూర్తిగా అభినందించాడు.

”మరి నువ్వెప్పుడిస్తావురా నీ వెడ్డింగ్‌ కార్డ్‌ మాకు?” అడిగాడు రోహిత్‌.

”ఒరేయి నేనూ రఘూ జీవితంలో ఇక పెళ్ళి చేసుకునే అర్హతనే కోల్పోయామురా… ఎందుకంటే మాకు హెచ్‌. ఐ.వి. వచ్చింది. మా శ్రేయోభిలాషివైన నీ మాటలు పెడచెవిన పెట్టినందుకు, మాకు తగిన శాస్తే జరిగింది” అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. ఆ మాటలు విన్న రోహిత్‌ నిశ్చేష్డుడై శిలాప్రతిమలా నిలుచుండిపోయాడు.

ఇదంతా కళ్లముందు సినిమా రీల్ లా కదులుతుంటే , తను ఆనాడెప్పుడో  తన మనసు లో పెట్టుకున్న నికెనేమ్ గుర్తు కు వచ్చి , ఆనందభాష్పాలు రాలుతున్నాయి .  ‘అభివన రాముడు‘ అని తన మనసులో అనుకున్న ఆ కాంప్లిమెంట్స్ జీవితంలో నిజమయ్యాయయని అనుకుంటూ తన భర్త రోహిత్ ను చూసి మనసులో అనుకున్న మధురిమ గుడి మెట్ల దారి పై నిలబడి గోపురానికి నమస్కరించి అడుగులేస్తోంది.

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆర్ట్ గ్యాలరీల నగరం – మైసూరు

అందం