అమృతం కురిసిన రాత్రి…

కవిత

అమృతం కురిసిన రాత్రి…ఇది మనసుని దోచే వెన్నెల రాత్రి.
వెన్నెల మేసిన మిన్నేళుల గని రాకా చంద్రుడు అలిగిన రాత్రి.
తెల్లని వెన్నెల సోనలు త్రాగిన చకోరాలకిది విరహపు రాత్రి.
ఒక పరి చూసిన జాబిలి పువ్వు…వేరొక పరి చూసిన కలువల నవ్వు.
ఆహా !!!!!!
ఎంత అద్భుతమీ సుందర ప్రకృతి..
ధవళ కాంతి విభూతి నలుదెసల నిండి
చంద్రికల పాలసంద్రము వలె తోచె.
యామినీ లతల లావణ్యముల గని ..అచ్చర మచ్చెకంటులు కినుకబూనె
కమనీయ రమణీయ కళల ప్రోగుల రజనీకాంతుడు తారకావళి నడుమ మారుడై మెరసె.
ఆ తీయని రేయిలో.. ఆ వెన్నెల హాయిలో
ఆ అమృతం కురిసిన రాత్రిలో…
ఒక తలపు ఏకాంతాన్ని కోరింది.
కానీ…
ఎక్కడిది ఏకాంతం????
అనంతమైన శూన్యం నుండి చీకటి కొమ్మలను చీల్చుకుంటూ
అల్లరి జాబిలి రేడు కవ్వింపుగా నన్ను చూస్తుంటే..
పరవశంతో మల్లెల గంధంలా నేనాఘ్రాణిస్తూ ఉన్న నా ఏకాంత క్షణాల్ని
విడువక తప్పడంలేదు.
ఆ కమ్మని క్షణాల్లో నా హృదయ వీణ మీటిన రాగాన్ని…
ఏ రాగమో తెలుసా….
ఆగు మనసా !!!
నేనింకా పెరు పెట్టనే లేదు..
హృదయరాగమందామా..
కొత్తగా మనసున ఉదయించింది కనుక ఉదయరాగమందామా??
రేరాజు పరిష్వంగననుండి మేలుకున్న ప్రకృతికాంత
పాడే ప్రణయరాగమందామా??
రెక్కలు టపటపమంటూ స్వేచ్ఛగా ఎగిరే విహంగాల ఆనందం చూసి కలకూజిత రాగం అందామా
గగన వీధిలో దూది పింజల వలె తేలిపోయే మొయిలు చూసి మేఘ రాగమందామా
కొండాకోనల్లో వయ్యారాల వంపులు తిరిగే సెలయేరుని చూసి
జలతరంగ రాగమందామా
ఏ రాగమందాము..
ఏ తాళం వేద్దాము….
చెప్పవే చిరుగాలీ ..మనసారా ఒకసారీ…
ఎప్పుడు చెబుతావు…
పున్నమి చంద్రుని కరస్పర్శతో పులకించిన పిల్లతెమ్మెర అల్లరిగా కిటికీనుండి చొరబడి
తడియారని కురులతో,
అల్లనల్లన మెల్లగా నిదుర మబ్బులు వీడని చెలికాని మేలుకొలిపే చిన్నదాని
సిగనుండి భుజంపైకి జారిన విరజాజులను సుతారంగా ఊపుతుంటే
ఆహా ఆ అందం ఏమని వర్ణించాలి.
నిజంగా అమృతం కురిసిన రాత్రా
లేక కవి చంద్రుని లేఖిని నుండి జారిన కవన మాలికా..
కవన గగన సీమలో నినదించే జలధరార్భాటమా..
ఏమో ఏదో తెలియని ఒక వింత అనుభూతి.

Written by Shasi Bala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

” ఆలస్యం అమృతం… విషం “

సత్యభామ ద్రౌపది సంవాదం