ఒకసారి సత్యభామ ద్రౌపది దగ్గరకు వచ్చి కొద్దిరోజులుండి, పంచపాండవులు ద్రౌపది మీద చూపించే ప్రేమ, అనురాగం,తాము ఏవైనా కార్యక్రమాలను చేయాలనుకున్నప్పుడు ఆమె చేసిన సూచనలను తూ-చ తప్పకుండా పాటించడం, ఆమెను ఎంతో మర్యాదగా చూడడం,
పాండవులే కాకుండా కుంతి కూడా కోడలికి గౌరవమర్యాదలతోపాటు, ప్రేమాభిమానాలను చూపడం…ఇవన్నీ చూసిన సత్యభామకు ఆశ్చర్యంతోపాటు అసూయకూడా కలిగింది. ఇక ఆపుకోలేక ద్రౌపదితో
“వదినా! నువ్వు నీ భర్తల ప్రేమానురాగాలు ఇంతగా పొందేందుకు ఏమైనా భర్తలవశీకరణ మంత్ర తంత్ర విద్యలు పాటిస్తావా? లేదా ఏదైనా దేవత ఉపాసనలు చేస్తావా, లేక ఏమైనా మరుగు వాడతావా? లేదా శృంగారపరమైన చతురత, సరసల్లాపాలతో నీ భర్తలను నీవు వినేటట్టుగా చేసుకుంటావా? నీ భర్తలు ఒకరిని మించి ఇంకొకరు నీ మీద ఇంత ప్రేమగా ఉంటున్నారు కదా! దాని రహస్యం ఏమిటో చెప్తే,నేను కూడా కృష్ణునికి నా మీద ఎక్కువ ప్రేమ కలిగేందుకు నేను కూడా అదే పద్ధతి ఆచరిస్తాను! అని అందిసత్యభామ!
ద్రౌపది సత్యభామ మాటలు విని కొంచెం మనసులో బాధపడుతుంది… పైకి కనిపించకుండా నవ్వు ముఖంతో ఇవన్నీ నీచజాతిస్త్రీలు చేస్తారేమో? అలా నన్ను చెడు స్త్రీల కింద జమ కట్టావా? నేను అవన్నీ పాటించే దానిలాగా నీకు కనపడుతున్నానా?అంత మహానుభావుడు కృష్ణుని భార్యగా నువ్వు ఉండ తగవు అని అన్నది.
నువ్వు ఎవరో చెప్పగా విన్నావేమో కొందరు స్త్రీలు మంత్రాలు వేయించి, మరుగు మందులు పెట్టి, మగవాళ్ళను తనమీద ప్రేమ ఉండేటట్టు చేసుకుంటారేమో? కానీ మగవాడు అట్లా చేసిన స్త్రీలపై ఎన్నడు ప్రేమగా ఉండడు! అదిగాక అంతకు ముందు ఉన్న ప్రేమ కూడా తగ్గుతుంది.అతనికి భార్య భార్య లాగా కాకుండా ఆడ నాగు పాములాగా కనపడుతుందే కానీ నాతి లాగ కనపడదు!
ఆమెను భయంతో చూస్తాడు… తప్ప ప్రేమను పంచి ఇవ్వడు! అదిగాక ఎవరైనా భర్తలకు మందులో మాకులో వాడితే భర్త ఆరోగ్యం పాడై వాడు జడుడై, అది సమాజంలో అందరికీ తెలిసి అందరిలో అవమానం పొంది తుదకు చనిపోయిన తర్వాత నరక లోకానికి వెళ్తారే తప్ప దాంతో సాధించేది ఏమీ లేదు!
కాబట్టి భర్తలకు మోసపూరిత కుట్రలతో ఆకట్టుకునేదాన్ని కన్నా ప్రేమతో, సుశ్రూశతో( సీవలతో) కంటికి రెప్పవలె చూసు కునే కన్నతల్లికి కాస్త దూరమౌతాడు కనుక ఆ తల్లి వాత్సల్యాన్ని అందిస్తూ, తండ్రి జాగ్రత్త గా బాగోగులు చూసుకున్నట్టు భర్త బాగోగులు చూస్తే చాలు! వారూ మనని అంతే ఇదిగా చూస్తారు.అంతే తప్ప వారిని వశం చేసుకోవాలి అనే ఆలోచనే రాకూడదు! పైగా అది పెద్ద తప్పు! కూడా!
ఇక విను నీ సందేహం అలాగే ఉందికదా! నేను పాండవుల ప్రేమను ఎలా చూరగొన్నానో… నా భర్తలు వేరే భార్యల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వారి విషయాలేమీ అడగను! నా సవతులు కలిసినప్పుడు నా స్వంత చెల్లెలు వలె పలకరిస్తానే కానీ ఈర్ష్య పడను! వారితో ఎప్పటి వలెనెనడుచుకుంటాను.
ఎవరైనా నన్ను పరుషపు మాటలతో బాధిస్తే..అప్పుడు మాట్లాడక వారిని పోనిచ్చి, జరిగిన విషయాలు నా భర్తలందరి సమక్షంలో చెప్తాను! వారికి అన్ని సౌకర్యాలమరాయా లేదా వాకబు చేస్తాను.
ఇక దేవతలైనా గానీ గంధర్వులైనా గాని నా భర్తల ముందు గడ్డిపరకగా భావిస్తాను !నా భర్తల మీద ప్రేమ చూపేటప్పుడు కానీ పరిచర్యలు చేసేటప్పుడు గాని నేను మనసా- వాచా- కర్మణా అన్నట్టు త్రికరణ శుద్ధిగా చేస్తాను. కానీ ఏదో విధిలేక ఈ పనులన్నీ చేస్తున్నాను అని మనసులోఅనుకోను! మనస్పూర్తిగానే చేస్తాను.
నా భర్తల స్నానం విషయంలో కానీ, భోజన విషయంలో గాని నేను పని వారినో, సహాయకులనో పంపను! స్వయంగా వారి వారి అవసరాలకు తగ్గట్టుగా నేనే స్వయంగా వెళ్లి వారికి తగిన ఏర్పాట్లు చేస్తాను.
ఇక భోజన విషయం సమయంలో ఎవరికి ఏవిధమైన వంటలుఇష్టమో వారి వారి రుచులకు తగినట్టు అవి వండి- వడ్డించే టప్పుడు, వంట చేసేవాడు తప్పనిసరిగా ఒక క్రమశిక్షణ పాటించేలా చూస్తాను. సక్రమంగా జలుగుతున్నాయా లేదా అని అన్ని దగ్గరుండి చూసుకుంటాను.రుచికరంగా వండేందుకు దానికి ఎంత ఖర్చయినా వెనకాడను. ఇక నా వంటింటి సామానుకు ఎప్పుడు కొరతారానీయను. ఏ వేళ ఏ అతిధి వచ్చినా సరే లేదనుకుండా వారికి తగిన మర్యాదలు చేస్తాను.
నా భర్తలు ఇంట్లో ఉన్నప్పుడే నేను చాలా చక్కగా అలంకరించుకుంటాను తప్ప వారు ఇంట్లో లేని సమయంలో అలంకరించుకొని ఆ ఇల్లు ఈ ఇల్లు తిరగను! వృధా సంభాషణలు చేయను! నా పతుల కొరకు ఎదురు చూస్తూ ఇంట్లోనే గడుపుతాను.
మా అత్తగారు చెప్పిన విధంగా నడుచుకుంటాను. గురువులు, బ్రాహ్మణులు,అతిథి అభ్యర్థుల సత్కారాలు చాలా చక్కగా చేస్తాను. అన్నివేళలా మృదుస్వభావం కలిగి ఉంటాను.
నా భర్తలు నామీద విసుకున్నా, కోపపడినా వారిని క్రూరులు అని అనుకోక, వారిని ఎప్పటివలె వదలకుండా ఉంటాను.
ఇక మా అత్త కుంతీదేవికి నామీద ఎంతో అభిమానం!
ఆమెగారి స్నాన విషయంలోకానీ, భోజన విషయంలో కానీ నేనే స్వయంగా దగ్గర ఉండి ఆ పనులు చేయిస్తాను.
భోజనాల వేళ ధర్మరాజు తో సహా పంక్తిగా బంగారు పళ్ళాలలో తినే అతిధులు, బ్రాహ్మణులు; యతులు పదివేల మంది దాకా ఉంటారు. వారికి రోజూ భోజన- వస్త్రాలు నేనే సమకూర్చుతాను.
ధర్మరాజు యొక్క పరిచారకులు రోజు వచ్చే అతిథి అభ్యర్థులకు వండి వడ్డించేవారు వారి పనులు సక్రమంగా చేస్తున్నారా లేదా అని స్వయంగా నేను అవన్నీ చూసుకుంటాను.
నా భర్తల దగ్గర నూరు వేలకొద్దీ ఏనుగులు,
వేనవేల గుర్రాలుంటాయి.వాటికోసం నౌకర్లున్నా వాటికి కావలసిన ఆహార పదార్థాలు నా పర్యవేక్షణలోనే జరుగుతాయి. వాటిని జాగ్రత్త గా చూసుకోవడానికి కావలసిన మనుషులను నేనే ఎంపిక చేసి నియమిస్తాను.
ఇక ఆదాయం ఎంత వస్తున్నది? ఖర్చు ఎంత అవుతున్నది? రోజువారి ఖర్చు ఎంత ? అన్నీ చూసి ఏరోజుకు ఎంత అవసరమో ఇస్తాను. ఇంట్లో చిన్అంవారిని నేనే స్వయంగా చూసుకుంటాను. తప్ప వేరొకరి మీద ఆధారపడను!
ఆవులను సంరక్షించే వారిని నేనే నియమించి వారి జీతభత్యాలు నేనే సమయానికి ఇస్తాను. మిగతా పరిచారకులు ఎందరు అవసరము అని ఎప్పటికప్పుడు స్వయంగా తెలుసుకొని, తాత్కాలికంగా పనిలోకి తీసుకొని,వారికి కావలసిన జీతభత్యాలు ఇచ్చి వారిని నియమించుకుంటాను. ఉద్యోగుల- సేవకుల ఆరోగ్యము వారి కుటుంబ సంక్షేమం కూడా నేనే చూసుకుంటాను. వీటన్నిటికీ కావలసిన ధనం కుటుంబ భారము మొత్తము నాకు ఒప్ప చెప్పి పాండవులు నిశ్చింతగా వారు వారి యొక్క పనుల మీద వెళ్తారు . నేను వారి వెంట ఉంటూ వారికి సలహా- సహాయ- సహకారాలు అందిస్తాను.
ఇన్ని పనులు చేయడానికి నాకు 24 గంటల సమయం సరిపోదు ఏ అర్ధరాత్రోనిద్రకు పూనుకుంటాను. మళ్ళీ తెల్లవారుజామునే లేస్తాను! నాకు ఆహారం తీసుకునే సమయం గానీ విశ్రాంతి తీసుకుని సమయంగానీ చాలా తక్కువ.
ఈ విధంగా అన్ని పనులు సక్రమంగా చేయడంతో నా భర్తలు నామీద గౌరవం ప్రేమతో ఉంటారే తప్ప నువ్వు చెప్పిన మరుగు మందులు గాని,మంత్ర తంత్రాలతో గానీ, హొయలు చూపిగానీ కానీ నా వశంచేసుకోను! అలా చేస్తే నాకు విధేయతగా ఉండరు సరికదా!నాపై వారికున్న నమ్మకం కోల్పోతాను.అని అన్నది ద్రౌపది.
ఇదంతా విని సత్యభామ కొంచెం సిగ్గుపడి నాకు తెలియక ఇట్లా మాట్లాడినాను! నువ్వు ఏమీ అనుకోకు! ఏదో చమత్కారంగా మాట్లాడిందని అనుకో! కానీ నీ యొక్క కార్యదక్షత చూసి నాకు నీ మీద గౌరవం చాలా పెరిగింది. నువ్వు చాలా గొప్ప దానివి సుమా! అని అన్నది సత్యభామ.
అది విని ద్రౌపతి నవ్వుతూ ఇంకా చెప్తాను విను భర్త మనసు తెలుసుకొని నడిచిన భార్యలకు ఎంతో గౌరవం లభిస్తుంది భర్తలకు సేవ చేయడం వలన భార్యలకు సంతృప్తి ఏర్పడుతుంది కాబట్టి రోజు నీ భర్త మీద ప్రేమ చూపు మంచి భావంతో ఉండు గౌరవించు అప్పుడు నీ భర్త నీక కనుసన్నల్లోనే ఉంటాడు. నీ భర్త నీ అంతః పురానికి వచ్చినప్పుడు నీవే స్వయంగా ఎదురు వెళ్లి మర్యాదగా తగిన ఆసనం ఏర్పాటు చేయి! నేను వెళ్ళడం ఎందుకు? పరిచారికలను ఏర్పాటు చేసాను కదా! అని అనుకోకు!
నీకు కృష్ణుడు ప్రేమతో ఏ విషయమైనా చెప్పితే అది వేరే నీ సవతులకు చెప్పకు!వారికే కాదు! ఎవరికీ చెప్పకు! ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆ విషయంలో నిన్ను తెప్పి పొడుస్తారు. నీ భర్తకు కావలసిన వారికి భోజనాలు ఇతర అవసరాలు నీవే స్వయంగా చేయి! ఇంక నీ సొంత కుమారుడైన సరే ఒకే ఆసనం మీద కూర్చోకు! అది కూడా తప్పే! నువ్వు మంచి వారితో సహవాసం చేయి చెడ్డవారితో చేస్తే వారేదైనా చెడుపనులు చేస్తేలోకంలో నీకు అపవాదు కలుగుతుందని ఇంకా ఎన్నో రీతులు చెప్తుంది.
వీరిద్దరి సంభాషణ ద్వాపర యుగానికే పరిమితై పోలేదు నేటికి కూడా దీన్ని ఆచరించి సుఖపడే వారు ఎందరో ఉన్నారు. ఈ విధమైన జీవిత గమనం నేటికీ సఖులకు శిరోధార్యమే!! మంచి జీవితం గడపాలని అనుకుంటే ఎక్కడ మంచి ఉన్నా మనం స్వీకరించి మనకు తగినట్టుగా మలచుకొని, ఆచరణ చేసుకుంటే మంచి ఎక్కడైనా మంచే కదా! నాటి సపత్నుల వలనే మనమూ జీవిద్దాము!