అమ్మల మాసం -ఆశ్వయుజ మాసం..

వ్యాసం

సర్వ సృష్టి స్త్రీ నుంచి సంభవిస్తుంది .పురుషుడు ప్రాణ ప్రదాత. స్త్రీ శరీర ధాత్రి .సకల బ్రహ్మము లో సత్వ రజో,తమో గుణాలు ఉంటాయి సత్వము నిలువల్లా నింపుకొని,
దాని పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సు తో కూడిన దాని ని బ్రహ్మ గా, తమస్సు తో ఏర్పడిన దాని పరతత్వాన్ని , పరమ శివుడని వేదపురాణాలు అభివర్ణించాయి.
సృష్టి ,పోషణ, లయల నిర్దిష్ట కార్యాలలో వారికి తగిన సహకారం అందించే శక్తి స్వరూపాలు, సరస్వతి,లక్ష్మి,పార్వతి.
ఇలాంటి మహాలక్ష్మి మహాకాళి, మహా సరస్వతి స్వరూపిణి అయిన మహాశక్తిని ఆరాధించే ఆశ్వయుజ మాసం అత్యంత ప్రముఖమైనది.
అన్ని మాసాలు ప్రముఖమైనవి కదా ! అందులో ఆశ్వీజం విశేషం ఏమిటి ?అనుకోవచ్చు.అందరూ ముఖ్యమే . మరి అమ్మకు అంత ప్రాధాన్యత ఎందుకు? ఆమె మూలాధార శక్తి కాబట్టి.. అలాగే, ఆశ్వయుజమాసము ఆదిశక్తి, ఆరాధనకు అత్యంత ప్రాధాన్యం.కాబట్టి అంత విశిష్టత సంపాదించుకుంది.
ఈ ఆశ్వయుజమాసాన్ని స్త్రీ పర్వము, అశ్వయుజ మాసము అని కూడా అంటారు..ఎందుకంటే! చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్థభాగం పురుష రూపాత్మకం.ఆశ్వయిజం నుంచి ఫాల్గుణమాసం వరకూ గల కాలం స్త్రీ రూపత్మకం .అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ నుంచి కలిగిందే ఆశ్వయుజ మాసం. అంటే శ్రీమాత, సరస్వతి, లక్ష్మి ఆరాధన ఈ మాసం లోనే విశేషంగా జరుగుతుంది.
శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ మాసంలో వెన్నెల పుచ్చ పువ్వులా కాస్తుంది .
ఈ మాసంలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు .
సూర్యుడు శక్తి కారకుడు, చంద్రుడు మనః కారకుడు.
శరత్ కాలం లో వర్షాలు తగ్గి, ప్రకృతి వింత శోభ ను సంతరించుకునే కాలం. వెన్నెల ప్రకాశవంతంగా ఉంటుంది .మేఘాలు పింజల్లా తేలిపోతూ ఉంటాయి. అందమైన ఈ ఋతువులో వచ్చే నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కృతిలో విలక్షణమైనవి .
సర్వ సృష్టి స్త్రీ నుండి సంభవిస్తుంది అని మనకు తెలిసిన విషయమే. సమస్త జగత్తును పాలించే ఆదిపరాశక్తి. ఈ పరాశక్తి మూడు విధాలుగా రూపు దాల్చి, లోకాలకు సకల సౌభాగ్యాలను, విద్యలను ,శక్తిని ప్రసాదిస్తున్నట్లుగా చెబుతారు. వేద కాలం నుండి శక్తి ఉపాసన ఉంది .శక్తి కాలము స్త్రీ పురుషరూపాత్మక మైనది..
ఆశ్వయుజ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు దేవిని పూజిస్తారు .తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరుపుతారు.ఆంధ్రదేశంలో చాలా ప్రాంతాల్లో నుంచి కార్తీక పున్నమి వరకు గౌరమ్మ సంబరాలు జరుపుతారు. పల్లె పట్టులలో నిష్కల్మషం అయిన భక్తితో అమ్మవారిని ఆరాధిస్తూ, ఆదిపరాశక్తిని ఆటపాటలతో అలరిస్తారు…
ఏ విధంగా చూసినా ఆశ్వయుజ మాసం అంతా, అమ్మ సంబరాలు, అత్యంత వైభవంగా జరుగుతాయి.
శక్తి విస్తరణ, వైభవం , లీలలు అనంతమైనది .
ఈ శక్తి వివిధ సందర్భాల్లో విభిన్న ప్రయోజనాల కోసం, అనేక పేర్లను అనేక రూపాల ను ధరిస్తుంది .ప్రకృతిలోని శక్తులన్నీ ఆమె రూపాలు. సృష్టి పోషణ అంతా ఈ శక్తి ద్వారానే సాగుతుంది .ఈ శక్తి త్రిమూర్తులకు జనని ,అని వేదాలు పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి..
ఈమెనే ముగ్గురమ్మల మూలపుటమ్మ గా , చాల పెద్దమ్మ గా, సురారులమ్మ గా పురాణాలు వర్ణించాయి .
ఈ శరన్నవరాత్రులలో దసరా పండుగ ఉత్తరాది వారు రామలీల ఉత్సవాలు గా చేస్తారు.
మహాలయ పితృ పక్షం పూర్తికాగానే, దేవతారాధన జరపడం అనేది ,ఆ పితృదేవతలకు మనకు ప్రసాదించిన ఆదిపరాశక్తి కి కృతజ్ఞతా పూర్వకంగా భక్తితో త్రి మాతృరూపంగా పూజించడం జరుగుతుంది.
అది ఒక యోగం. సమస్త జగత్తును పాలించేది ఆదిపరాశక్తి అని ,ఆమె త్రివిధాలుగా సృష్టిని రూపొందించిన జగజ్జనని అని చెప్తారు.
శైలపుత్రి ,బ్రహ్మచారిని, చంద్రఘంటాదేవి, కూష్మాండ దేవి ,స్కందమాత, కాత్యాయని ,కాలరాత్రిదేవి, మహా గౌరీ ,సిద్ధి ధాత్రి . వీరు నవదుర్గలు..ఈ రూపంలో దేవిని శరన్నవరాత్రుల్లో కొలిచే సంప్రదాయం కొన్నిచోట్ల ఉంది.ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు చేసే వారు, రోజుకు ఒక రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు.
ఈ తరగతి సాధకులు, క్రమంగా జరిగే అభివృద్ధి 9 దశల్లో ఉంటుందని పెద్దలు చెబుతారు .ఈ తొమ్మిది దశలు దాటిన సాధకులకు దశమి నాటి విజయం సిద్ధిస్తుంది అని అంటారు .సిద్ధులవుతారు గాని ఆరోజు విజయదశమి అయింది.
అంటే విజయమును సిద్ధింప చేసేది అని అర్థం.దేవీ నవరాత్రులు
మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అందమైన అమాయకమైన బాలికా రూపంతో పూజిస్తారు .
సాధన తొలి దశలో దేవిని ఈ రూపంలో పూజించాలి దర్శించాలి. రెండవ రోజు మహాలక్ష్మి. ఈరోజు స్వాతినక్షత్రo ..పాలసముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని రెండు తెల్లని ఏనుగులు అభిషేకిస్తున్నట్లు అమ్మవారు ఘటాలతో ధనాన్ని కుమ్మరిస్తున్నట్లు అలంకారం చేస్తారు.. ఏసాధకుడు తల్లిని ఆరాధిస్తున్నాడో ,వారిని రక్షించే లక్షణం ఉన్న దేవత ..
మూడోరోజు గాయత్రీదేవి..
అత్యంత శక్తి మహిమగల తల్లి గాయత్రి ఈ మాతను పూజిస్తే సకల కార్యాలూ సిద్ధిస్తాయి అంటారు. ఈ రూపంలో మూడవరోజు పూజ అందుకుంటుంది అమ్మ .
నాలుగవరోజు అన్నపూర్ణ అలంకారం ఈమె కాశీ విశ్వేశ్వర మహాదేవుని పత్ని విశాలాక్షి దేవి. శంకరుని తో సహా అందరికీ అన్నం పెట్టే తల్లి గా నాలుగో రోజున ఆరాధిస్తారు .
ఐదవ రోజున లలితాదేవిని.
బ్రహ్మాండ పురాణం మహా త్రిపుర సుందరిగా లలితా దేవిని పేర్కొని ఉంది. చతుర్భుజాలతో ఒక చేత్తో
పాశాన్ని, మరొక చేతితో అంకుశాన్ని, ధరించి ఉంటుంది .అమ్మవారు ఒక చేత్తో అభయంయిస్తూ, మరొక చేతిలో ధనస్సు పట్టుకుని , శోభిల్లుతూ ఉంటుంది ఈ ఆదిపరాశక్తి లలితాదేవి ఆరవ రోజు శాకంబరీ దేవి..
కరువులు నెలకొని ,ప్రజలు పశుపక్షాదులను ఆహారం లేక అల్లాడిపోతున్న సమయంలో,
భూమిని సుభిక్షంగా చేసిన మాత.. శుద్ధ సప్తమి నాడు మూల నక్షత్రం తో సరస్వతి గా అమ్మవారిని అలంకరిస్తారు. ఈమెకు ఒక చేతిలో వీణ, మరొక చేతిలో ,చిలక వేరొక చేతిలో, పుస్తకం ఇంకొక చేతిలో
అక్షమాల ఉంటాయి.
ఎనిమిదో రోజు దుర్గాష్టమి అంటారు.. దుర్గ యుద్ధ మూర్తి, శత్రుభయం నుండి కాపాడే రోగ ,శోక, పాప గుణాలు నశింపజేసే రూపం..
మహానాడు మహిష్యుడనే రాక్షసుని సంహరించిన ఆ దేవి రూపం మహిషమంటే దున్నపోతు ఈ లక్షణాలను నాశనం చేసేది పదవ రోజు విజయ దశమి. సకల దేవతలు ఇచ్చిన సర్వాయుధాలతో ఉన్న అమ్మవారి ని అలంకారం చేస్తారు .
ఈరోజు శ్రీరాముడు రావణాసురుని సంహరించిన రోజని కొందరి విశ్వాసం. అర్జునుడు జమ్మి చెట్టు పై దాచిన ఆయుధాలను తీసుకొని కౌరవవీరుల ను జయించినది విజయదశమి నాడే అని పురాణాలు చెబుతున్నాయి..
ఇక ఈమాసంలో తదియ అట్లు తదియ స్త్రీల పండుగ .
త్రయోదశి ధన త్రయోదశి. లక్ష్మి పూజ చేస్తారు.
నరక చతుర్థి గాధలు సత్యభామ పాత్ర పురాణ ప్రసిద్ధము .
అమావాస్య దీపావళి .
దీపావళి బలి చక్రవర్తి గౌరవార్థం జరిగినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది .దీపావళి నాడు విక్రమార్కుడు పట్టాభిషేకంజరిగిందనే
గాధ కూడా ప్రచారంలో ఉంది .
“తమసోమా జ్యోతిర్గమయ “అనే ఉపనిషత్ వాక్యానికి ఆచరణ రూపం దీపావళి .
తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ జరుపుకునేది ఈ మాసంలోనే.దేవి నవరాత్రుల ఆరాధన ప్రత్యేకమైన సాంస్కృతిక రూపాన్ని సంతరించుకుంటుంది.
ఇక. ఆంధ్ర దేశంలో విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం పై కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా దొరుకుతాయి.
ఈ అమ్మవారి అలంకారాలు ప్రతి ఏడాది క్రమం మారుతూ అద్భుతంగా జరుగుతాయి .
తొలినాడు దుర్గమ్మ స్వర్ణ కవచ అలంకారాలతో, విదియనాడు గాయత్రీ దేవిగా, తదియనాడు అన్నపూర్ణాదేవిగా ,చవితినాడు చండీ మహాదేవిగా ,పంచమినాడు లలితా త్రిపురసుందరి దేవిగా ,షష్టినాడు మహాలక్ష్మిదేవి గా, సప్తమి నాడు సరస్వతీదేవిగా ,
అష్టమినాడు దుర్గాదేవి గా ,నవమినాడు పరాశక్తి కాళికాదేవి గా ,దశమినాడు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మ సకల జనులను చల్లగా కాపాడుతుంది. . శ్రీ ఈ ఆశ్వయుజ మాసంలోనే, ఈ మాసంలో ప్రతి ఉత్సవం , ప్రతీ పండుగ స్త్రీ ప్రాధాన్యత కలిగినవే .
అందుకే ఆశ్వీజమాసం అమ్మల మాసముగా,మహిళా మాసంగా అభివర్ణింపబడింది ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మోడై మ్రాన్పడి ఘోషిస్తున్న ఉసిరి

ఋషిక సికతా నివావరి