అమ్మ

కవిత

     రాధికాసూరి

అపరూప దృశ్య చైతన్యం
కమ్మని జోలపాటలోని లాలిత్యం
నిండు పున్నమిలోని చల్లదనం

గోరుముద్దల్లోని ప్రేమామృతం
రాశిపోసిన అనురాగపు మూర్తిమత్వం

అల్లరి చేస్తే బూచిని చూపి బెదిరిస్తూనే
భయపడితే బుజ్జగించి గుండెకు
హత్తుకునే కొండంత ధైర్యం

తొలి గురువు తానై
పాఠాలతో పాటే జీవిత
పాఠాలు నేర్పే ఘనాపాటి

వంటింట్లో చమత్కారాలతో మురిపిస్తుంది
అధరువులలో చిత్రాలెన్నో చూపిస్తుంది
పిండివంటలతో అక్షరాల్ని అందంగా అల్లేస్తుంది
జంతికలకు అంకెల రూపమిచ్చి ఆశ్చర్యంలో ముంచేస్తూనే
గుణింతాలతో గారడీ చేయిస్తుంది

అప్పడాల కర్ర చేతబట్టి భూగోళపు చిత్తరువులెన్నింటినో చూపి దోబూచులాడుతూ
తానో పసిపాపలా మారిపోతుంది

పాపాయి కంటి చెమ్మలోని ఆర్తి తానౌతూ
బుజ్జాయి నవ్వుల్లో వెన్నెల పూలను కాంక్షిస్తుంది

సహనంలో తుహినపుజల్లు తాను కారు చీకటిలో ఉదయించే
వెలుగు రేఖ

ఓటమిలో వెన్నుతట్టే గెలుపుబాటై వెన్నంటిసాగే గుండె చప్పుడేఅమ్మ

గుప్పెడంత బాధనైనా పంటిబిగువున భరిస్తుంది
కన్నీటి కాసారాన్ని కనురెప్పల్లో గుట్టుగా దాచేస్తుంది

అచ్చమైన ప్రేమకు సరైన చిరునామా అమ్మ
స్వచ్ఛమైన ప్రేమలోని
మాధుర్యమే అమ్మ

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీలాకాశంలో నక్షత్రం

భక్తిగీతాలు