అయితే మీరే (భుజాలు తడుముకుంటున్నారుగా!)-2

ధారావాహికం

సోంపాక సీతకవి,రచయిత.వీరుతెలంగాణాసాహితి భద్రాచలం శాఖ మరియు జీవన్ దాన్ సంస్థల ద్వారా సాహితీ,సామాజిక సేవలందిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోప్రఖ్యాతిగాంచినపద్యకవిమాల్యశ్రీగారి సహస్రాధిక పద్యకావ్యం’మన్యభారతం’ గ్రంథం పై విశ్లేషణ గావిస్తూ రూపొందించిన ఇరువది వీడియోలు పలువురు కవుల మన్ననలను అందుకున్నాయి. విమల సాహితి ఇ- వారపత్రికలో ‘విమలపదం’ (పజిల్)ను నిర్వహిస్తున్నారు.’నాన్నా మాట్లాడు’కవిత్వం;’గజల్ కౌస్తుభం’గజల్స్ సంపుటాలను వెలువరించి ఇప్పుడు’అయితే మీరే..’
(భుజాలుతడుముకుంటున్నారుగా!)అను నవలను సీరియల్ గా మీ ముందుకు తెస్తున్నారు.

కొండపల్లి నీహారిణి
పత్రికా సంపాదకురాలు

జరిగిన కథ
*******

(ఆమని వాళ్ల మనవడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మైథిలి,మాలినులు ఫంక్షన్ పూర్తికాగానే వారివద్ద సెలవు తీసుకునిఅదే ఊళ్లో వుంటున్న పద్మిని ఇంటికి వెళతారు మనవళ్లు,మనవరాళ్లతో ఆఇల్లంతా అల్లరి హరివిల్లుగా మెరుస్తుంటుంది
మైథిలి,
పద్మిని,మాలినులు తమ పాత స్నేహాన్ని ,తాము పనిచేసిన కాలేజీ విషయాలను,తమ పిల్లల పెళ్ళిళ్ళు,వంశాంకురాలను గురించిన ముచ్చట్లలో తనివితీరా మునకలేస్తూ ఆనందిస్తుంటారు. వీరొచ్చిన సంగతిని పద్మిని ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్న హాసిని తన భర్తతో కలిసి పద్మిని వాళ్లింటికి వస్తుంది పద్మిని పిల్లలు ఎంతో కలివిడిగా వుంటూ అందరూ కలిసి ఫోటోలు తీసుకుంటారు .కొంతసమయం ఆహ్లాదంగా గడిపిన తర్వాత అదే ఊళ్లో* వుంటున్న మరో నేస్తం చంద్రిక వాళ్లింటికి వెళ్లి తనను కూడా కలవాలనుకుంటారు ఈ నలుగురు స్నేహితలు.వీరితో పద్మిని భర్త ఆర్.పి,హాసిని భర్త జనార్థన్ గార్లు కూడా వెళ్తారు)

ఇక చదవండి…

అలా మేం నలుగురం కారులో బైలుదేరాం, చంద్రికను కలవటానికి, వాళ్ళింటికి. ఆర్‌.పి.గారి డ్రైవింగ్‌. ఆ సీటు ప్రక్కనే ఎడమవైపు అయినా ఆయనగారి కుడిభుజంగా వర్థిల్లుతున్న మా పద్మినమ్మ, వెనుక సీట్లో నేనూ, మాలిని, హాసిని కూర్చుని మళ్లీ కబుర్ల తోటలోనికెళ్ళి సరదాల మల్లెల్ని, సంతోషాల జాజుల్ని, ఛలోక్తుల సంపెంగల్ని మనసు గదినిండా నింపుకున్నాం. మా కారు వెనుకే తన బండిమీద మాతో కూడా వస్తున్నారు జనార్థన్‌గారు.

నెమ్మదిగా కారు దిగి మేము చంద్రికావాళ్ళుండే ఫస్ట్‌ ఫ్లోర్‌లోకి వెళ్లటానికి మెట్లు ఎక్కబోతుండగా, నలభై ఏళ్లుంటాయేమో, ఆ అమ్మాయికి పెళ్ళైందిటలేగానీ నైటీలో చిన్నగా అన్పిస్తోంది.

‘‘రండి… రండి మేడమ్‌గార్లు. మీ కోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాం’’ అంది నవ్వు ముఖంతో.

నా మోకాళ్లు మెట్లెక్కటానికి బెట్టు చేస్తాయి. మెట్లెక్కాల్సిన సందర్భం ఎదురైనప్పుడల్లా సహజంగా నా కండ్లు లిఫ్ట్‌ కోసం వెతుకుతాయి. నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. వెళ్ళిన ప్రతి భవనానికీ లిఫ్ట్‌ ఉండాలని నియమమేమీ లేదుగదా! అని నా ఆలోచనకు నేనే మనసులో నవ్వుకుంటూ కాళ్ళకి పని చెప్పటం మొదలుపెట్టాను. మా దయ్యాలు… క్షమించండి నెయ్యాలు పై మెట్టుదాకా చేరిపోయారు. నేనేమో నత్తలాగా నెమ్మది నెమ్మదిగా రెయిలింగ్‌ పట్టుకుని సగం మెట్లవరకూ చేరాను. హమ్మయ్య అనుకుంటూ మొత్తానికి మొదటి అంతస్తుకి చేరుకునేసరికి, చంద్రిక ఎదురుగా రానే వచ్చింది ‘‘వెల్‌కమ్‌ డియర్స్‌’’ అంటూ.

ఆ ఆత్మీయత నా మదిని తాకిన వెంటనే నా అలసట, కాలినొప్పి ఎటు ఎగిరిపోయాయో తెలవదు. నా మనసే గాదు, అక్కడికి చేరుకున్న మా ఫ్రెండ్సందరి మనస్సులు చిన్నపిల్లలు మాదిరిగా గంతులేస్తున్నాయి!

‘‘అబ్బా… రావేమో… అటునుంచి అటే వెళ్ళిపోతావేమో ననుకున్నా’’ అంది చంద్రిక నిష్టూరంగా మారబోతున్న స్వరాన్ని తమాయించుకుంటూ.

‘‘అలా ఎలా అనుకున్నావు చంద్రికా? ఇక్కడిదాకా వచ్చి, నిన్ను చూడటానికి రాకుండా ఎలా ఉంటానని అనుకున్నావ్‌?’’ అనేసరికి ఒక అంగలో వచ్చి, ఎంతో ఆనందంతో నన్ను హగ్‌ చేసుకుని కండ్లనీళ్ల పర్యంతమైంది చంద్రిక.

‘‘ఏంటోయ్‌! మమ్మల్నిలాగే వాకిట్లోనే ఉంచి, ఇట్నుంచి ఇటే గెంటేస్తావా ఏంటి?’’ అని నవ్వింది పద్మిని చంద్రికవైపు చూస్తూ.

‘‘అదేంలేదబ్బా! రండి…’’ రండంటూ లోపలికి తీసుకెళ్ళి, మాకు సోఫా చూపించి, కూర్చోమని చెప్పి, హడావుడిగా ఫ్రిజ్‌ దగ్గరకు పరిగెత్తబోతున్న చంద్రికతో దబాయించినట్లుగా మాట్లాడుతూ `

‘‘ఏం తల్లీ! రాకరాక మీ ఇంటికి వస్తే, మమ్మల్ని ఇంత ఇరుకులో కుదేస్తావా?’’ అంది మాలిని, తాము కూర్చున్న సోఫా చూపిస్తూ.

నిజానికి మా నల్గురుకూ సరిపోయే సోఫానే అది. కానీ ఎందుకో చంద్రికను ఉడికించాలనిపించింది మాకు.

‘‘అయ్యో! మీరొచ్చిన ఆనందంలో కన్ఫ్యూజ్‌ అయిపోయానబ్బా’’ అంటూ ఇంకో కుర్చీ చూపించి, తనూ ఎదురుగా ఉన్న ఓ కుర్చీలో కూర్చోబోయింది చంద్రిక.

‘‘ఏంటి… వచ్చి ఇంతసేపైనా కనీసం మంచినీళ్లైనా ఇచ్చేదుందా? లేదా?’’ అని గట్టిగా అడిగింది పద్మిని, చంద్రికను.

‘‘అయ్యో! సారీ అబ్బా… మిమ్మల్ని చూసిన సంతోషంలో అడగటం మర్చేపోయానని’’ నొచ్చుకుంది చంద్రిక.

ఇంతలో మెట్ల దగ్గర కనబడిన అమ్మాయి పైకి వచ్చి, చనువుగా `

‘‘మేడమ్స్‌ బాగున్నారా మీరంతా?’’ అంటూ ఎంతోకాలం పరిచయం

ఉన్న అమ్మాయిలా అడిగేసరికి మేము అవాక్కయ్యాము.

‘‘తను మా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటుంది. చాలామంచి అమ్మాయి. నాకు ఇంటిపనుల్లో సాయం చేస్తుంది, పేరు సుజాత.’’ అని చంద్రిక చెబుతుంటే…

తను ఎంత అండగా ఉంటుందో అన్ని పనులలో అనే విషయాన్ని చంద్రిక ముఖ కవళికలను పరిశీలించిన వారికెవరికయినా ఇట్టే అర్థమైపోతుందన్పించింది మాకు.

‘‘అబ్బే! అదేం లేదండీ… అక్క అలాగే చెబుతుంది వచ్చిన వాళ్ళందరికీ’’ అంటూ తను వంటగదిలోకి వెళ్లబోతుంటే, ఆపినంత యుద్ధం చేయాల్సి వచ్చింది సుజాతతో మాకు.

‘‘అద్దెకున్న వాళ్ళలో కనీసం ఒక్కళ్ళైనా ఇలాంటి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళుంటే చుట్టాలు కూడా బలాదూరే’’ అంది హాసిని.

‘‘అవునని’’ మేమంతా హాసిని మాటలకు వత్తాసు పలికాము. అంతేగదా మరి! బంధువులొస్తే వాళ్ళు సాయం చేసేమాట ఎలావున్నా, కూర్చున్న చోటునుంచి లేచేవరకూ అన్నీ అందించాలి. ఇంతటితో అయిపోతుందా అంటే ఆహా… పెట్టుపోతలు ఏమాత్రం తగ్గినా ఈసారికి సర్దుకుందామనే ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా ఉండని వారి శాతమే ఎక్కువ ఈ రోజుల్లో. పైగా ఒకరు వృద్ధిలోకి వస్తున్నారంటే, మరొకరికి అసూయా ద్వేషాలు. వీటితో బంధుత్వాలు వీగిపోతుంటాయి అప్పుడప్పుడూ. మళ్ళీ ఏ శుభకార్యానికో అతుకు పెట్టుకున్నా మళ్లీ ఎప్పుడో ఏదో ఓ సందర్భంలో పుటుక్కుమని తెగటం, దానితో కారాలు, మిరియాలు నూరటాలు… అబ్బో ఇది ఓ చేటభారతమే అవుతుందనుకుంటా.

‘‘వీళ్ళంతా మా ఫ్రెండ్సురా సుజాతా. చాలా సంవత్సరాలు విజయవాడలో కలిసి పనిచేశాం’’ అని ఆ అమ్మాయికి మమ్మల్నందరినీ పేరుపేరునా పరిచయం చేసింది చంద్రిక.

‘‘చెప్పద్దూ.. ఆ అమ్మాయి సుజాతను చూస్తుంటే మాకందరికీ చాలా ముచ్చటేసింది. ఇంతలోకి తను ‘‘కొంచెం పనుందక్కా’’ అంటూ చంద్రికకు చెపుతూ`

‘‘ఇంత మంచి ఫ్రెండ్స్‌ ఉన్నందుకు, ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా అది కంటిన్యూ అవుతున్నందుకూ ‘‘మీరంతా గ్రేట్‌’’ అంటూ మా దగ్గర బై చెప్పి, క్రిందకి వెళ్ళిపోయింది సుజాత.

వద్దంటున్నా వినకుండా దబదబా ఫ్రిజ్జు ఓపెన్‌ చేసి, అందులోంచి పెప్సీ తీసుకొచ్చి, తలా ఒక గ్లాస్‌లో పోసిచ్చింది చంద్రిక.

ప్లీజ్‌ నాకది వద్దంది మైథిలి. ఈమధ్య వాట్సాప్‌లో చెక్కర్లు కొడుతున్న కూల్‌డ్రిరక్స్‌కు సంబంధించిన మెసేజులన్నీ కండ్లముందు కదలాడుతుండగా.

‘‘అసలే నేను బయట ఫుడ్‌ గానీ, ఇలాంటి డ్రిరక్సు తీసుకునే అలవాటు చాలా తక్కువ నాకు. ఎవరైనా బలవంతం పెట్టినా వాళ్ళని నొప్పించకూడదనే

ఉద్దేశ్యంతో కొంచెమే తీసుకుంటా. నా మనసులో ఉద్దేశ్యం గ్రహించిన దానిలా స్ప్రైట్‌ ఓ చిన్న గ్లాసులో పోసి చేతికిచ్చింది తాగమని. ఇక కాదనలేక అయిష్టంగానే తాగాను, చంద్రిక ఫీలవుకూడదని.

ఏ కబుర్లలోంచి ఎటు వెళ్తున్నామో మాకే తెలవనంతగా లోకాభి రామాయణం కాదులెండి గానీ, అంత హంగామా దొర్లింది మా మాటల్లో. అంతా ఆ ఊళ్ళో ఉండేవాళ్ళే. నేనొక్కదాన్నే వేరేవూరు నుంచి వచ్చా, ఫంక్షన్‌కి అటెండవటం కోసంగా.

‘‘ఇక వెళ్ళొస్తాం చంద్రికా’’ అని చెప్పి లేచాం అంతా.

‘‘ఉండండి’’ అంటూ లోపలికి వెళ్ళి పసుపు, కుంకుమ పెట్టటం కోసంగా, చీరలు, జాకెట్‌ పీసులు తెచ్చి, బొట్టుపెట్టి అందరికీ ఇచ్చింది, వద్దన్నా వినలేదు చంద్రిక.

‘‘నీవు త్వరగా ఇల్లు కదిలిరావుగా మైథిలీ’’ అంటూ అనురాగం నిండిన కండ్లతో చూస్తూ. మర్చిపోకుండా వచ్చినందుకు కృతజ్ఞతా పూర్వకంగా నావైపు చూసింది చంద్రిక. తేలికపడిన మనసులతో, స్నేహ మాధుర్యాన్ని పదిలంగా దాచుకున్న హృదయాలతో క్రిందికొచ్చాము.

వద్దన్నా వినకుండా, చంద్రిక కూడా మాకు బై చెప్పటాన్కి మాతో పాటే వచ్చింది. రిటైర్మెంట్‌ లైఫ్‌ని కుటుంబపరంగా ఎంజాయ్‌ చేస్తున్నా, అనారోగ్యాన్ని కప్పిపుచ్చలేని చంద్రిక శరీరం ఆయాస పడుతోంది. తనని అలా చూడగానే ఎందుకో నా మనస్సు ఉస్సురనిపించింది. కష్టం, సుఖం, బాధలు, ఆటంకాలు అన్నీ అనుభవించిన మనిషి చంద్రిక. లక్కీగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న అదృష్టవంతురాలు. కాబట్టే ఇద్దరు ఆడపిల్లల్ని చదివించి, మంచి సంబంధాలు చూసి, పెండ్లిండ్లు చేసింది. కొడుకుని కూడా చదివించి ప్రయోజకుడిని చేసి, తగిన సంబంధాన్ని కలుపుకున్నది. పేరుకు అందరూ ఉన్నా, ఒకరకంగా చెప్పాలంటే తన కష్టం మీదే భర్త, ఇద్దరు తమ్ముళ్లు, తండ్రి గెటానా అవుతున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చినా, అదే చెరగని చిరునవ్వు ముఖం మీద అప్పటికీ ఇప్పటికీ తనది.

‘‘అయ్యో పాపం వాళ్లిద్దర్నీ పైకి పిలవమని చెప్తే పట్టించుకోలేదేం హాసినీ’’ అంది నొచ్చుకుంటున్నట్లుగా జనార్థన్‌, ఆర్‌.పి. గార్లను చూస్తూ చంద్రిక.

‘‘ఆ… మనమధ్యన ఉంటే మనకూ ఉండదు, వాళ్లకీ ఉండదు ప్రైవసీ’’ అంది పద్మిని వాళ్ళ వారివైపు చిలిపిగా చూస్తూ.

‘‘అవునవును పిలుస్తేనేమో ఎక్కడొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్‌ చేస్తామోనని మీ అనుమానం. అందుకే మీకు ఇబ్బంది కలిగించటం ఎందుకులే పాపం అని మేం ఇక్కడే ఆగిపోయాం’’ అన్నారు జనార్థన్‌గారు సెటైరికల్‌గా.

‘‘అబ్బో బాగానే మాట్లాడుతున్నాడే… మూగ మనిషి!’’ అన్నా హాసినివైపు చూస్తూ.

‘‘వీడు పెట్టిన టార్చర్‌కి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’’ అంది నాతో గతం గుర్తు తెచ్చుకుంటూ.

వింటే ఏం గొడవ పెడతాడో ఇంట్లోనని కొంచెం భయంగా చూశా హాసినివైపు. అతగాడు పార్క్‌ చేసిన బండివైపు వెళ్ళటం చూసి హమ్మయ్య అనుకుని గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నా. నువ్వు ధైర్యంగా ఉండాలి హాసినీ. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. చీటికీ మాటికీ ఇలా బేలగా అయిపోకూడదు. గతం ఒక గ్రహణ మనుకో. కాస్త కాస్త వదిలిపోతోందిగా. కొంచెం ఫరవాలేదు ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చిందని చెప్పావుగా అంటూ నాకు తోచిన రీతిలో హాసినిని సముదాయించాను.

‘‘నామీద మనసునిండా అనుమానం పెట్టుకుని దానికి ద్వేషాన్ని తగిలించి, మా అక్కలకు నామీద లేనిపోనివి ఎక్కించి వాళ్ళ దృష్టిలో నన్ను తప్పుగా చూపించి, వాడు మాత్రం మంచివాడుగా ముద్రవేసుకున్నాడు. ఇప్పటికీ అదంతా నటనే’’ అంది నాతో.

‘‘మరి మనం మాటల్లో పడి, చాలా లేటయింది. ఏమైనా కోపమొస్తుందేమో మీవారికి నీమీద’’ అన్నా సంశయంగా.

‘‘అదేం ఉండదు మైథిలీ… ఇలా ఫ్రెండ్స్‌ ఇళ్లకు వెళ్ళినా, వాళ్ళతో సరదాగా టైం స్పెండ్‌ చేసినా ఏమీ ఫీలవడు కాకపోతే అదో రకం సైకో మెంటాలిటీ’’ అంది  బాధగా.

అనవసరంగా హాసినిని కదిపి మానుపట్టిన గాయాన్ని రేపానేమోననే గిల్టీ ఫీలింగ్‌తో తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ `

‘‘మేమంతా నీకున్నాం. నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి కాదు. ఎప్పుడూ నువ్వు ఒంటరిగా ఫీలవ్వద్దు’’ మరీ మరీ చెప్పా.

కండ్లలోంచి ఎప్పుడెప్పుడు దూకుదామా అని ఎదురుచూస్తున్న కన్నీళ్ళు, కొద్దిసేపైతే కండ్లలోంచి దూకటానికి సిద్ధంగా ఉన్నాయి.

‘‘అవును, మిమ్మల్నంతా చూశాక నేను ఒంటిరిని కాను. నాకు ఇంతమంది ప్రాణ స్నేహితులున్నారనే ధైర్యం వచ్చింది’’ అన్నది రాబోయే కన్నీటికి అడ్డుకట్ట వేస్తూ హాసిని.

ఇంతలోకి వాళ్లాయన బైక్‌ తేవటంతో తను బైక్‌మీద, మేము కార్‌లో కూర్చున్నాము. మరొకసారి చంద్రికకు తృప్తిగా వీడ్కోలు చెప్పి, వెనుదిరిగాము మేము.

నన్నూ, మాలినిని ` మాలిని వాళ్ళింటి దగ్గర డ్రాప్‌ చేసి, పద్మిని దంపతులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.

***

మాలిని కొడుకు రమేష్‌, కోడలు రజని… వీళ్ళకి ఇద్దరు బాబులు. పెద్దవాడు అరుణ్‌, చిన్నవాడు కరణ్‌. సెలవురోజులు కావటంతో కొడుకు, కోడలు కల్సి ఏవో కిరాణా సామాను తెచ్చుకోవాలని బైటకు వెళ్తుంటే, ‘‘మేమూ వస్తాం, మాకు ఐస్‌క్రీమ్‌ కొంటామన్నారుగా మాకు. ఇప్పుడే కావాలి? మేమూ వస్తాం, తీసుకెళ్లండని పట్టు బట్టడంతో తీసుకువెళ్ళాల్సి వచ్చింది ఆంటీ…’’ రజని చెప్పింది నాతో నవ్వుతూ. రమేష్‌ చేతిలో బాగానే ఉంది కిరాణా లగేజ్‌. ఐస్‌క్రీం తిన్నారేమో ఇష్టంగా పిల్లల మొహాలు కళకళలాడుతున్నాయి.

‘‘ఏంటి రమేష్‌ చాలా బరువు బాధ్యతలు మోసేస్తున్నావ్‌?’’ అన్నా చిరునవ్వుతో.

‘‘అవును ఆంటీ!’’ చూడండి ఎన్ని సామాన్లు కొనిపించిందో నాతో’’ అంటూ రజనివైపు చిలిపిగా చూశాడు రమేష్‌.

మాలిని మురిపెంగా చూసుకుంటోంది కొడుకును, కోడలిని.

‘‘అవును ఆంటీ! ఈరోజు హాలిడే గదా! ఇప్పుడైతేనే కుదురుతుంది సామాన్లు సర్దుకోవటానికి’’ అంటూ తన హ్యాండ్‌ బాగ్‌లో ఉన్న కీ తీసుకుని తాళం తీసి, డోర్‌ తెరిచింది. లోపలికి వెళ్ళాం… నేనూ, మాలినీ వాళ్లతో పాటుగా.

‘‘ఇల్లు సూపర్‌గా ఉంది రమేష్‌’’ అన్నా.

‘‘అవునా ఆంటీ!’’ అన్నాడు చనువుగా చిరునవ్వుతో.

‘‘ఆంటీకి కాఫీ కలుపు’’ అన్నాడు భార్య రజనీతో రమేష్‌.

‘‘అమ్మా రజనీ ఇప్పుడే వద్దురా! ఇవాళ చాలాసార్లైంది ఇప్పటికే. అసలేం వద్దమ్మా. వంట కూడానూ వద్దు ఇద్దరికీ’’ అన్నాను నేను.

‘‘అవును నానీ. మధ్యాహ్నం ఫంక్షన్‌ భోజనం హెవీ అయింది. మళ్ళీ పద్మిని మేడం, చంద్రికా మేడం వాళ్ళిళ్లల్లో స్నాక్స్‌, కూల్‌ డ్రిరక్స్‌ తీసుకునే వరకూ’’ వదలలేదు మమ్మల్ని అన్నది మాలిని తన కొడుకు రమేష్‌తో.

‘‘ఐతే టిఫెనన్నా తినండి’’ అంటూ రమేష్‌ బైటికి బయలుదేరబోయాడు, వేడివేడిగా ఇడ్లీలు తెస్తానంటూ.

ఇక మరీ ఏమీ తినకపోతే బాధపడతారని సరేనన్నాను తల ఊపుతూ.

ఇంతలో ఈ మాటలు విన్న రజని, హాల్లో ఉన్న మా దగ్గరకు వచ్చి `

‘‘ఆంటీ, ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీలు వేసిస్తా వేడివేడిగా. బైటిఫుడ్‌ ఎందుకు’’ అంది రజని.

‘‘ఇప్పుడే షాపింగ్‌ చేసుకుని వచ్చారు. మళ్ళీ నీకు డబుల్‌ పని అవుతుంది గదమ్మా’’ అన్నా రజనీతో.

అబ్బే అదే లేదంటూ కిచెన్‌లోకి దారి తీసింది రజని.

మాతో చాలాసేపు ఆ ముచ్చట్లూ, ఈ ముచ్చట్లూ మాట్టాడి `

‘‘అవును ఈసారి అంకుల్‌ని కూడా తీసుకురండి మా ఇంటికి’’ అన్నాడు మాటల మధ్యలో రమేష్‌.

‘‘అయ్యో! నీకు తెలవనిదేముంది రమేష్‌. బంధువుల ఫంక్షనైతే తప్ప ఇల్లు త్వరగా కదలరు. వచ్చినా మళ్లీ రాత్రికల్లా ఇంటికి చేరుకోవ్వాల్సి వస్తోంది’’ అన్నా తనతో.

‘‘ఏం కాదులెండి! రమ్మని తీసుకురండి ఆంటీ… మీరు గట్టిగా రమ్మంటే రాకుండా ఉంటారా?’’ అన్నాడు రమేష్‌.

‘‘నీకంటే మీ మమ్మీకి తెలుసు బాగా మా ఆయన గారి సంగతి’’ అన్నా.

‘‘అవును అన్నయ్యగారు తొందరగా బైల్దేరరు ఊళ్ళంటే’’ అంటూ తల పంకించింది మాలిని.

తను పుట్టి పెరిగిన వాతావరణం, చిన్నప్పటి (ఫ్రెండ్స్‌) అదీగాక ఇంటి చుట్టూరా ఉండే బంధువులు. అంతేగాకుండా ఆయన చదువుకున్న కాలేజీలోనే రిటైర్డ్‌ అవటం. తర్వాత కూడా సర్వీస్‌ మోటివ్‌తో నడిచే వ్యక్తిత్వమే తనది. అందుకే అభిరుచికి అనుగుణంగా ఆల్‌ పెన్షనర్స్‌ ఆఫీస్‌లో బాధ్యులలో ఒకరుగా ఉండటం తన సర్వీసును అందించటం నేటివరకూ నిరాటంకంగా జరిగిపోతోంది అంటూ మాలిని, నేను మాట్లాడుకున్నాం. మావారి గురించి అన్నీ వింటూ ఊ కొడుతున్నాడు రమేష్‌.

మధ్య మధ్యలో తన కళాశాల విశేషాలు, భార్య రజని పనిచేసే కళాశాల వివరాలుÑ మా పిల్లల వివరాలు, పద్మిని, చంద్రిక పిల్లల వివరాలు అన్నీ దొర్లసాగాయి మాటల్లో. ఒక్క హాసిని పిల్లలు తప్ప మిగతా మా అందరి పిల్లలూ సీనియర్లు, జూనియర్లు ఒకరికొకరు. ఎందుకంటే దాదాపుగా మా పిల్లలంతా ఒకే ఏజ్‌ గ్రూప్‌ అవటంతో మేము, మా ఫ్రెండ్సెవరింట్లో కలిసినా దాదాపుగా ఈ కబుర్లన్నీ రిపీట్‌ అవుతూనే ఉంటాయి, మా మధ్యన, పిల్లల మధ్యన. అందరికీ ఇష్టమైన కబుర్లవటం వలన ఎన్నిసార్లు విన్నా విసుగు అన్పించదు ఎవరికీ. ఇది కదా, నిస్వార్థ పరమైన ఆప్యాయత అంటే అన్పిస్తుంది నాకు ఈ ముచ్చట్ల వనం పురివిప్పి నాట్యం చేస్తుంటే.

‘‘ఈ కబుర్లకు కామాలే తప్ప, ఫుల్‌స్టాప్‌ పడదని తెలుసు అందుకే, రమేష్‌ ఫ్రెష్‌ అవ్వు వెళ్లు’’ అన్నా నేను

సరేనన్నట్లుగా తల ఊపి లోపలికి వెళ్ళాడు రమేష్‌.

ఇంకా మా ఇద్దరి ముచ్చట్ల లింకును బలవంతంగా తెంచి, నెమ్మదిగా మాలినికి కేటాయించబడిన అనేకంటే తను ఇక్కడికి వచ్చినప్పుడల్లా అంటే కొడుకు, కోడలు దగ్గర ఉండాల్సి వచ్చినప్పుడల్లా ఉండే రూమ్‌ అంటే సబబేమో. ఆ రూమ్‌లోనికి వచ్చి ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్‌ అయ్యాము. ఇళ్లలో బాగా పంజాబీస్‌, డ్రస్సులలో, నైటీలలో ఉండే అలవాటేమో చీరలు మార్చుకుని నైటీలు వేసుకోగానే ప్రాణానికి, శరీరానికి కూడా హాయిగా అన్పించసాగింది మాకు. ఇద్దరం బాల్కనీలో వేయబడిన కుర్చీలలో కూర్చున్నాం. అపార్టుమెంటు క్రింది భాగమంతా ఇది ఫలానా, ఇది ఫలానా అని చేత్తో చూపిస్తూ వరుసగా చెప్పుకొస్తోంది మాలిని నాతో. ఇంతలో అత్తయ్యా, ఆంటీ రండి టిఫెన్‌ తిందురుగానీ అంటూ పిలుస్తూ మా దగ్గరకు వచ్చింది రజని.

బాగా పరికించి చూస్తున్నా రజనిని. పసుపు, తేనె కల్సిన వర్ణంలో ఉంది ఆమె ముఖం. తీరైన కనుబొమ్మలు. నవ్వినపుడు తళుక్కుమనే పలువరుస, నల్లగా ఉండే కురులు. కొంచెం బొద్దుగా తయారైంది. గతంలో మా ఊరు ఒక ఫంక్షన్‌కి వచ్చినప్పుడు చూసిన దానికంటే ఇప్పుడు. షాపింగ్‌కు వెళ్ళొచ్చి వెంటనే వంట డ్యూటీలోకి నేరుగా వెళ్ళిపోయిందనటాన్కి సాక్ష్యంగా తన నుదుటి మీద చిరుచెమట అలుముకుంది. దానిపై లైటు కాంతి పడటం వల్ల రంగోలీ మీద జల్లిన తళుకుల్లాగా మెరవసాగాయి. ఈ అమ్మాయి, రమేష్‌ ఇద్దరూ లెక్చరర్లే, డిగ్రీ కాలేజీలో. చాలా చిన్న వయస్సులోనే జాబ్సు కొట్టుకున్నారు. ‘ఇద్దరూ కష్టపడి సంపాదించుకుంటున్నారు. చక్కగా రెండు అపార్టుమెంట్లు కొనుకున్నారు.’ అని మాలిని చెప్పింది ఒకసారి. ఒకటేమో హైదరాబాద్‌లోనట. ఇదిగో ఇప్పుడుంటున్నది రెండవది. ఇంకా సంవత్సరం కూడా కాలేదు గృహప్రవేశం అయి. రమ్మని పిలిచారు గానీ మేము రాలేకపోయాము ఆ టైంకి. ఇంట్లో బంధువులుండటం వల్ల.

‘‘ఏంటమ్మాయి! మీ ఇంటితోపాటు, నువ్వు… మీరిద్దరూ తెగ పోటీపడిపోతున్నారు తళుక్కుమంటూ’’ అన్నా చిరునవ్వుతో.

తను నవ్వేసింది చిరు సిగ్గుతో. ‘‘మీరలాగే అంటారాంటీ ఎప్పుడూ… ముందు మీరు రండి టిఫిన్‌కు అని మరోసారి చెప్పి తను డైైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్ళి, హాట్‌ ప్యాక్‌ ఓపెన్‌ చేసి, మా ఇద్దరికీ ఇడ్లీలను ప్లేట్లు నిండుగా పెట్టి, పల్లీ చట్నీ, కారప్పొడితో వడ్డించింది. వాటర్‌ బాటిల్స్‌ని సిద్ధం చేశాడు రమేష్‌.

‘‘నేనేమన్నా కొత్త చుట్టాన్నా ఏంటి రమేష్‌? మేము తెచ్చుకుంటాంగా కావలసినవి’’ అన్నా నవ్వుతూ.

తను కూడా ప్రతిస్పందనగా నవ్వుతూ ‘‘చల్లారిపోతాయి ఆంటీ త్వరగా తినేయండి’’ అంటూ తనకు ఏదో సిస్టమ్‌ వర్క్‌ ఉందని చెప్తూ తన బెడ్‌రూంలోకి వెళ్ళిపోయాడు రమేష్‌.

అసలు మజ్జిగో లేకపోతే ఇద్దరం చెరో గ్లాసుడు పాలో తాగి పడుకుందాం, పొట్ట లైట్‌గా ఉంటుందనుకున్నాం, ఆటోలో వచ్చేటప్పుడు మాలినీ, నేను. ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది మా ప్లానంతా. ఇడ్లీలు తెల్లగా, మృదువుగా నోట్లో వేసుకుంటుంటే ఇట్టే కరిగిపోతున్నాయి. ప్లేట్లు ఖాళీ అయిపోయాయి. మాలిని, నేను ఒకళ్ల మొహం ఒకళ్లు చూసుకుని ఒకటే పగలబడి నవ్వుకున్నాం, మా తిండిని మేమే చూసుకుంటూ.

రజనీని పిలిచి ‘‘చాలా థాంక్సమ్మా. మళ్లీ నా బొజ్జ ఫుల్‌ అయిపోయిందని’’ చెప్పా తనతో.

‘‘అసలు భోజనం చేస్తే మాకూ తృప్తిగా ఉండేది’’ అంది తను.

‘‘కాదమ్మా… అంకులు, నేనూ రోజూ నైట్‌ ఓట్స్‌గానీ, టిఫిన్‌గానీ ఇలా’’ అని ఖాళీ ప్లేటును చేత్తో చూపిస్తూ, ‘‘ఇలా తింటాం’’ అన్న నా మాటలకు చిరునవ్వులు చిందిస్తూ చూసింది రజని.

‘‘ఆంటీ రెస్ట్‌ తీసుకోండి. పడుకోండి’’ అనటంతో మాలినీ, నేను ఇద్దరం రూమ్‌లో బెడ్‌పై చేరిపోయాం.

అప్పుడు లింకు తెగిన కబుర్ల ప్రవాహానికి మళ్లీ లాకులు తెరిచాం. ముందు టిపినీలు తినటం, ఆ వెనుక మందులు తినటం మామూలే ననుకుంటూ ఎవరు వేసుకోవాల్సిన టాబ్లెట్లను వాళ్ళం మింగాము, తీసిన లాకులకు బ్రేకులు వేస్తూ.

ఫ్రెండ్సుతో కలిసినప్పుడల్లా మాటల్లో సాధక బాధకాలు దొర్లటం అతి సహజం. ఇప్పుడెలా ఉంది తను? ఫరవాలేదు ఫ్రీగా మాట్లాడుతోందా? అని అడిగా మాలినిని. తన కోడలిని ఉద్దేశ్యించి.

‘‘ఆ… అంతేనండీ… అన్నీ చేసి పెడుతుంది. డైనింగ్‌ టేబుల్‌ మీద తినమని. వాడు రమేష్‌ కూడా అంటాడు రోజూ. ‘మమ్మీ నువ్వు మాత్రలు వేసుకోవలసిన దానివి మాతోపాటు లేకపోతే అందరం తినటం అయ్యేవరకు ఆగటం దేనికి, తినేయ్యెచ్చుగా టైముకని ఒక్కోసారి కోప్పడుతుంటాడని’’ కూడా చెప్పింది మాలిని.

‘‘వాళ్ళిద్దరూ తినకుండా, ముఖ్యంగా పిల్లలు తినకుండా, నాకేమీ తినబుద్ధి కాదు’’ అంది మాలిని.

అందులో వాళ్ళకంటే నేను ముందుగా తింటే బాగోదనే సంకోచం వినపడిరది స్వరంలో.

మాలిని భర్త కాలం చేశారు. ఇప్పుడు తను ఒంటరి. భర్త రిటైర్మెంట్‌ అనంతరం వచ్చిన బెనిఫిట్స్‌ను కొడుకుకే ఇచ్చేశామని చెప్పింది గతంలో. ఇప్పుడు ఆర్థికంగా కొడుకు మీదే ఆధారం. అన్ని అవసరాలు, మెడికల్‌కు సంబంధించినవి సైతం సమకూరుస్తాడు. కానీ కొడుకు ముందు చేయి చాచలేని, నోరు తెరిచి అడగలేని సందర్భాలు, అవసరాలూ ఉంటాయి గదా! ఏమని అడుగుతా? నాకేమో అభిమానంగా ఉంటుంది అడగలేను అని తన ఇబ్బందిని తెలియజేసింది మాలిని.

నిజమే కొడుకులని అనే కాదు, కట్టుకున్న భర్తను కూడా అడగలేని పరిస్థితులుంటాయి కుటుంబాల్లో అదే సంపాదిస్తూ ఉంటే, ఉద్యోగంలో ఉంటే ఒకప్పుడు కాకుంటే మరోసారైనా కాస్త అడిగే ఆస్కారం ఉంటుంది. అదీ లేకపోతే నిజంగా కష్టమే. ఎందుకంటే ఇలాంటి ఒడిదుడుకులకు అతీతమేం కాదు నా పరిస్థితి కూడా.

Written by Sompaka Seetha

సోంపాక సీతకవి,రచయిత.వీరుతెలంగాణాసాహితి భద్రాచలం శాఖ మరియు జీవన్ దాన్ సంస్థల ద్వారా సాహితీ,సామాజిక సేవలందిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోప్రఖ్యాతిగాంచినపద్యకవిమాల్యశ్రీగారి సహస్రాధిక పద్యకావ్యం'మన్యభారతం' గ్రంథం పై విశ్లేషణ గావిస్తూ రూపొందించిన ఇరువది వీడియోలు పలువురు కవుల మన్ననలను అందుకున్నాయి. విమల సాహితి ఇ- వారపత్రికలో 'విమలపదం' (పజిల్)ను నిర్వహిస్తున్నారు.'నాన్నా మాట్లాడు'కవిత్వం;(నేషనల్ బెస్ట్ పొయెట్రీ అవార్డు..2023)'గజల్ కౌస్తుభం'గజల్స్ సంపుటాలను(వి.జి.ఎఫ్ నేషనల్ గజల్ అవార్డు 2025, గిడుగు జాతీయ పురస్కారం..2025)వెలువరించి ఇప్పుడు'అయితే మీరే..'
(భుజాలుతడుముకుంటున్నారుగా!)అను నవలను సీరియల్ గా మీ ముందుకు తెస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అరివీర భయంకరం !!

విషయసూచిక