అరివీర భయంకరం !!

ఇన్నాళ్లు చరిత పుటల్లో
శత్రు గుండెలను నిద్ర పోనివ్వని
నా జాతి శౌర్యాన్ని
కలలనిండా నింపుకొని
భుజాలపై మోస్తూ గడిపాను

రౌద్ర నేత్రాలు వేలాడగట్టిన
జ్వాలా తోరణాలతో
విలయతాండవం చేసిన
సాహస ప్రతాపాలను
మస్తిష్కంలో కథలుగా
కూడగట్టుకుని మురిసిపోయాను

సహనమంటే
చేవ చచ్చి ఉండడం కాదని
శాంతి కాముకత్వం
నిర్వీర్యానికి ఆనవాలు కాదని
మౌనమంటే
లొంగిపోవడం కాదని
కొత్తగా లిఖిస్తున్న
పరిణామాన్ని ఇప్పుడు
కళ్లారా చూస్తున్నాను

మన జాతి స్త్రీల
జీవితాలను నలిపి
పెట్రేగిన శతృమూకల
వైపరీత్యానికి దీటుగా
జూలు విదిల్చిన భరతదేశం
కొదమసింగమై చేసిన గర్జనలు
నలుదిక్కులా ప్రకంపిస్తున్నాయి

వీడిన ప్రాణాలకు ఆత్మశాంతిగా
జీవచ్ఛవాలకు ఊరటగా
భావితరాలకు బాసటగా
రక్తాశ్రువులతో తడిసిన నేలను
‘సిందూర’వర్ణంతో రగిల్చిన
నాదేశ పౌరుషం అజరామరం
అరివీర భయంకరం !!

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శుభ ముహూర్తం-1

అయితే మీరే (భుజాలు తడుముకుంటున్నారుగా!)-2